ఆత్మ విశ్వాసమే విజయసూత్రం ! (బాలల కధ) - kottapalli udayababu

Atmaviswasame vijaya sutram

చాలాకాలం క్రితం విజయనగర రాజ్యాన్ని జితేంద్రుడు అనే రాజు పాలించేవాడు.అతని పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా జీవించేవారు. పరిపాలనా దక్షతతో పాటుగా ఆయన మంచి సాహిత్యాభిలాషి. ఆయన సంస్థానంలో 'ప్రజల సమస్యలు- పరిష్కారాలు' కార్యక్రమం పూర్తి అయ్యాకా దాదాపు రోజూ సాహితీ గోష్టులు జరిగేవి.

ఆయన ఆస్థానంలో భోగేంద్రుడు అనే పండితుడు ఉండేవాడు.భోగేంద్రుడు మహా పండితుడు కావడం చేత ఆయనను తన ఆస్థాన పండితునిగా నియమించుకున్నాడు రాజు భోగేంద్రుడు. తన సాటి కవులను పండితులను రాజుగారికి పరిచయం చేసి వారందరికీ రాజ సభలో సత్కారం పొందేలా చేసి రాజుగారి చేత వారందరికీ మంచి మంచి ఈనాములు ఇప్పించేవాడు. వారందరూ తనను గురువు గారూ అని సంభోదించినా ఆయన మాత్రం వారందరూ తన సమకాలికులే అని చెప్పేవాడు. ఆయన విశాల దృక్పధం జితేంద్రునికి ఎంతగానో నచ్ఛేది.

అలాంటి ఉత్తముడైన భోగేంద్రునకు ఒకే ఒక పుత్రుడు స్వర్గసుఖుడు. పండిత పుత్ర పరమ శుంఠ అన్న చందాన అతనికి భోగేంద్రుడు ఎంత వివరంగా బోధించినా స్వర్గసుఖునికి అక్షరం ముక్క అబ్బేది కాదు. అందుచేత నగర శివార్లలో ఉన్న ధనముకుందుని గురుకులంలో చేర్పించాడు.

కొడుకు సెలవులకు వచ్చినప్పుడు అతనిలో మార్పు తీసుకురావాలంటే అతనికి సజ్జన సాంగత్యం రుచి చూపించాలి అని నిర్ణయించుకుని కొడుకును పట్టు పట్టి రాజుగారిని ప్రశంసించే ఒక పద్యం నేర్పాడు.

ఒక నాడు సభకు కొడుకును తనతో తీసుకువెళ్లాడు భోగీంద్రుడు.
ఆనాటి సాహితీ సభకు తనపుత్రుని పరిచయం చేసాడు.రాజుగారికి ప్రణామం చేసి తండ్రి తనకు ముందే నేర్పిన పద్యాన్ని రాజుగారిని ప్రశంసిస్తూ బాగానే చెప్పాడు స్వర్గసుఖుడు..

రాజు అంత చిన్నవయసులో తనను ప్రస్తుతించిన స్వర్గసుఖుడిని అడిగాడు.
"ఈ పద్యం నీవు రచించినదా?లేక ఎవరైనా నేర్పారా?"

"నాన్నగారు నేర్పారు మహారాజా."

"ఈసారి నువు సభకు వచ్చినప్పుడు నీవు ఆశువుగా పద్యం చెప్పే స్థాయికి ఎదగాలి.అందుకు ప్రోత్సాహంగా నీకు ఈ బహుమతి." అంటూ పది వరహాలను బహుమతిగా ఇచ్చాడు జితేంద్రుడు.

******

ఆ పది వరహాలను కొడుకుతో సహా మళ్లీ గురుకులంలో ధనముకుందునికి అప్పగించి ఇంటికి తిరిగి వచ్చాడు భోగీంద్రుడు.

అయితే స్వర్గసుఖుడు తమముందు ఎంతో గర్వం ప్రదర్శిస్తూ తమను అవమానిస్తున్నాడని గురుకుల విద్యార్థులు గురువుగారికి పిర్యాదు చేసారు.

దానికి స్వర్గసుఖుని తన దగ్గరగా పిలిచి "నీ తండ్రి నేర్పిన పద్యంతో సంపాదించిన పదివరహాలు నీలో గర్వం పెరగడానికి మాత్రమే ఉపయోగపడ్డాయన్నమాట. నీ స్వశక్తి తో నువు రాజుగారి మనసు గెలిచి నూరు వరాహాలు బహుమతిగా పొంది నీవు తోటి విద్యార్థుల ముందు గర్వంగా నిలబడు. అలా సాధించగలవా?"అని ప్రశ్నించాడు ధనముకుందుడు.

స్వర్గసుఖుడు రోషంతో "సాధిస్తాను గురుదేవా. అందుకు నన్ను ఏంచేయమంటారో సెలవీయండి."అన్నాడు.

"ఆ సొమ్ము నీ దగ్గరున్నంతకాలం నీలో గర్వాన్ని ప్రకోపించేలా చేస్తుంది.కనుక అవి నాకు గురుదక్షిణగా సమర్పించు. నాకు అమ్మవారి అనుగ్రహం వలన లభించిన ఒక కలాన్ని నీకు బహుమతి గా ఇస్తాను.నేను నా స్వంతంగా రాయగలను అనుకున్ననాడు మాత్రమే ఆ కలంతో రాయి. అలా ఒక శతకాన్ని రాసి రాజుగారికి బహూకరించు.ఆనాడు నువు నిజమైన శిష్యుడవని గర్విస్తాను.
అయితే ఒక నియమం నువు పాటించాలి.నువు నీ సహవిద్యార్థులముందు ఏనాడూ గర్వం ప్రదర్శించకూడదు.అలా ప్రదర్శిస్తే ఆ కలానికి ఉన్న మహత్తు నశిస్తుంది.అర్ధమైందా? "అని చెప్పాడు.స్వర్గసుఖుడు అందుకు అంగీకరించాడు.

తన పూజ గదిలో అమ్మవారి ఎదురుగా స్వర్గసుఖుని దగ్గరనుంచి పది వరహాలు గురుదక్షిణగా స్వీకరించి పూజలో ఉన్న కలాన్ని స్వర్గసుఖునికి బహుమతిగా ఇచ్చాడు ధనముకుందుడు.

దాన్ని అందుకోగానే తనలో ఏదో అద్భుతమైన శక్తి ప్రవేశించినట్టు ఏదో అనుభూతికి లోనయ్యాడు స్వర్గసుఖుడు.

చదువుపై పూర్తి దృష్టి నిలిపి విద్యను అభ్యసిస్తూ, తోటివిద్యార్థులతో సఖ్యంగా మెలుగుతూ ఆశువుగా తాను తొలి పద్యం రాసి గురువుగారికి చూపించాడు స్వర్గసుఖుడు.అతనిలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందించాడు.

అనతి కాలంలోనే రాజుగారి పై శతకాన్ని పూర్తిచేసి గురువుగారి ఆశీసులతో తండ్రి సమక్షంలో రాజుగారికి సమర్పించాడు.అంతే కాదు.ఆశువుగా శతకంలోని పద్యాలన్నింటిని నిండుసభలో ఆలపించాడు స్వర్గసుఖుడు.

రాజు అతని ప్రతిభకు సంతోషించి స్వర్గసుఖునికాలికి గండపెండేరం తొడిగాడు.వేయి వరహాలు బహుమతిగా ఇచ్చాడు.

తన కొడుకులో ధనముకుందుడు తీసుకువచ్చిన మార్పుకు ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలిపాడు భోగీంద్రుడు.

ఆ తరువాత గురుకులం చేరి తన బహుమతులన్నీ గురువుగారికి సమర్పించి,సాష్టాంగపడి ఇలా అన్నాడు స్వర్గసుఖుడు.
"ఇది అంతా మీరిచ్చిన కలం మహిమ గురుదేవా.దాని ప్రభావం వల్లనే ఇంత మంచి విజయం సాధించాను "

దానికి సమాధానంగా ధనముకుందుడు పకపకా నవ్వాడు.

"అమాయకుడా.ఆకాశంలో ఉన్న చందమామ కావాలని బిడ్డ మారాం చేసినపుడు అద్దంలో దాన్ని చూపించి గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి
దిద్దేందుకు మేము చేసే పని అదే.

నీకిచ్చిన కలంలో ఎటువంటి మహత్తు లేదు.నిజానికి నీలో అత్యుత్తమ క్రియాత్మకశక్తి దాగుంది.అది ఈ గురుకులంలోని విద్యార్థులందరిలోను ఉంది.దానిని వెలికి తీసి మిమ్మల్ని మీరు నిరూపించుకునేలా చేయడం కోసం మేము మీకు బహుమతులు ఇస్తాము.
నిజానికి నీలో గురువు పట్ల ఉన్న విశ్వాసం,స్వశక్తితో సాధించగలను అనే నే ఆత్మవిశ్వాసమే నీకు రాజుగారు గండపెండేరం తొడిగే స్థాయికి తీసుకు వెళ్లాయి. అదే పద్ధతి ఆచరించిననాడు ప్రతీ విద్యార్థి కృతకృత్యుడవుతాడు.నువు నాకు గురుదక్షిణగా సమర్చిన నీ మొదటి కష్టార్జితం కూడా నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను.తండ్రిని మించిన తనయుడవై వృద్ధిలోకి రా నాయనా"అంటూ అక్కున చేర్చుకుని ఆశీర్వదించాడు.

ఆయన దీవించినట్టుగానే తన తండ్రి తరువాత తాను ఆస్థాన పండితుడై రాజుకు,వృద్ధులైన తల్లితండ్రులకు ఎంతో సంతోషం కలిగించాడు స్వర్గసుఖుడు.

సమాప్తం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.