అమ్మ దాచిన డైరీ - రాము కోలా.దెందుకూరు.

Amma daachina diary

అమ్మకు డైరీ వ్రాసేటటువంటి అలవాటు ఒకటుందని తెలిసిన క్షణం. ఇన్ని రోజులుగా అమ్మ డైరీ వ్రాస్తుందనే విషయం ,తన దృష్టికి చేరలేనంతగా! దాచవలసిన అవసరం అమ్మకేంటి?. డైరీలో అమ్మ ఏమి వ్రాసుకుని ఉంటుందనే బేతాళ ప్రశ్నలు వెంటాడుతుంటే, అమ్మ పదిలంగా వ్రాసి దాచుకున్న డైరీ ఓపెన్ చేసి! చదివేందుకు సిద్ధమయ్యాను. నాలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ. అమ్మ నా చేతిలో డైరీ ఉంచుతూ, చివరి సారిగా! నా వైపుకు చూసిన చూపులు, ఏదో చెప్పాలని చెప్పలేక? తనలో తానే మధన పడుతూనే కనురెప్పలు వాల్చిన క్షణం. అమ్మ నా చేతిలో డైరీ ఉంచుతూ, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను నన్ను శోధించుకోమనేలా అనిపించడంతో... గుండె దిటవు చేసుకుంటూనే .. అమ్మ వ్రాసుకున్న డైరీలోని అక్షరాన్ని ప్రేమగా చూపుల్తో స్పృశిస్తున్నా!. "చేయి తిరిగిన శిల్పి ,అక్షరాలను చెక్కినట్లు! ఎంత ముద్దుగా ఉన్నాయో అమ్మ చేవ్రాలు అక్షరాలు. "ఏమండి!" "ఈ రోజైనా! కాస్త గుర్తుపెట్టుకుని, కళ్ళజోడు గ్లాసులు మార్పించుకొండి..!" "చీకట్లోనే తడుముకుంటూ నడవడం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని నేను గ్రహించాను లెండి.," "ఎన్నాళ్ళు ఇలా నాకు తెలియకుండానే దాస్తారు" అంటుంటే నావైపు చూసి తను నవ్విన నవ్వు! నాకు ఇంకా బాగా గుర్తు. పసితనం తొలగిపోలేదు తనలో! అనిపించేలా ఉంది ఆనవ్వు. "దీనికి పెట్టే ఖర్చుతోనే నీకోసం మంచి కాటన్ చీర కొనాలనుందోయ్..!" "కానీ! అబ్బాయికి అదేదో పుస్తకం కావాలంటేను! నా మతిమరుపును మరోసారి వేడుకున్నా! నా వెంటే ఉండి పొమ్మని, విషయంను గుర్తు రానీయకుండా కాపలాగా ఉండమని." అని సమయస్ఫూర్తితో మీరు నాకు చెప్పిన మాట,గృహస్తుని బాధ్యతలను తెలియజేసింది ఆనాడు. "నాకు బాగా గుర్తుంది! సంవత్సరమంతా శ్రమించి,పండించిన పంటలు పట్నంలో అమ్మకానికి పెట్టలేక,మనసు రాయిగా చేసుకుని అమ్మేసి, వస్తూ వస్తూనే నాకోసం ఓ కాటన్ చీర తెచ్చి, వెనుక వెనుక దాచుకుంటూ ఉంటే!" "ఆట పట్టించడానికి అనుకున్నా!" "కానీ! చిరిగిపోయిన మీ పంచె నాకు కనిపించనియక దాస్తున్నారని, మరుసటిరోజు మీ పంచె ఉతికే వరకు నాకు తెలియలేదు." "ఎంత స్వార్థం మీది.!" "చూడండి అల్లుడు గారు, పిల్లల్ని చదివించారు సరే!మరి విదేశాలకు పంపించేందుకు ప్రయత్నంగా ఏదైనా చేస్తాన్నారా లేదా? "వాడితో కలిసి చదువుకున్న వాళ్ళు అందరూ విదేశాలకు వెళ్ళి పోతున్నారు." "పిచ్చి సన్నాసి! మిమ్ముల్ని అడగలేక మోహమాట పడుతున్నాడు" "తను చదివిన చదువుకు ,మంచి ఉద్యోగమే వస్తుందంటున్నారు అందరూనూ అక్కడ" "వాడి చిన్న కోరిక తీర్చేయండి అల్లుడు గారు." "నా కోరిక కూడా అదే అనుకోకండి." ఓ పెద్ద గుదిబండి మీ నెత్తిపై మా అమ్మగారు వేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతుంటే,ఒక చిన్న చిరునవ్వుతో తల ఊపిన మీ అమాయకత్వం!" వాడిని విదేశాలకు పంపేందుకు మీరు కిడ్నీ ఒకటి.. తండ్రిగా మీ బాధ్యతను నెరవేర్చడం కోసం ఆ వయస్సులోనే... ఎంత స్వార్థ రహితంగా నిర్ణయం తీసుకున్నారో? "మనిషి దేవుడుగా మారడమంటే ఇదేనని.. నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేవరకు తెలియలేదండి. "మా మధ్యన సంచరించే దైవం మీరేనని." "తొలిసూరు కాన్పుకు,డిలివరీ కష్టంగా ఉంది,ఆపరేషన్ చేయాలి, తప్పదు, తనకేమో రక్తం సరిపడేలా లేదు,మీరు బ్లడ్ డొనేట్ చేసే వారిని విలైనంత త్వరగానే ఏర్పాటు చేసుకోవాలి" అని డాక్టర్ చెప్పారని తెలిసి ,మీ స్నేహితులతో కలిసి మీరూ హాస్పిటల్ లో రక్తం అందించిన విషయం , ఎవ్వరికీ తెలియనీయకుండా దాచిన మీ దొంగ బుద్దిని ఏమనాలో తెలియక,చేతులేత్తి నమస్కరించిన వియ్యపురాలిని,ఈ విషయం వాడికి చెప్పకండి"అని వేడుకున్నా మీ రూపం నా కన్నుల్లో చెరగని చిత్రమే.. "విదేశాలకు ఎగిరి పోతున్న తన బిడ్డ,ఎదగాలని మనసారా కోరుకున్న ఒకప్పటి పది ఎకరాల భూస్వామి,నేడు రోజువారి కూలిగా తన భూమి లోనే పని చేస్తున్నాడనే విషయం బిడ్డకు తెలియనియక మీలోనే దాచుకుని,ఎదబారమై దివికేగిన మీకోసం .. నేను మాత్రం ఇక్కడ ఒంటిరిగా ఎలా ఉండగలను! అనుకున్నారు? మీరు దాచినట్లే నేనూ కొన్నింటిని దాచాను నా శరీరంలో,నన్ను క్షమించండి. ,అవే నన్ను మీ దగ్గరకు చేర్చే మృత్యువుకు స్వాగతం పలుకుతున్నాయ్. వస్తున్నా!మీకోసం... కొన్ని నిజాలు మనం కలిసి మాట్లాడుకుందాం! తరువాత ఏం వ్రాసి ఉంటుంది అమ్మ,అనుకుంటూ పేజీలు గబగబా తిప్పేసాను . తరువాత .. పేజీ ఖాళీగా కనిపిస్తుంది. అమ్మా నాన్నల స్వచ్చమైన త్యాగాలను లిఖించేందుకు అక్షరమే లేదంటూ.. 🙏 శుభం🙏

మరిన్ని కథలు

Aseerwada mahima
ఆశీర్వాద మహిమ
- ambadipudi syamasundar rao.
Okati tliste marokataindi
ఒకటి తలుస్తే మరొకటైంది
- మద్దూరి నరసింహమూర్తి
Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు