తెలివి ఒక్కటే చాలదు - శింగరాజు శ్రీనివాసరావు

Telivi okkate chaladu

నిఖిల్ చాలా తెలివిగలవాడు. ఎంత పెద్ద పాఠాన్నైనా రెండు సార్లు చదివితే చాలు, పొల్లుపోకుండా తిరిగి చెప్పగలడు. అతడిని చూస్తే తండ్రి రామచంద్రయ్యకు ఒకింత గర్వంగా ఉండేది. కాకపోతే నిఖిల్ కు ఉన్న బలహీనత ఏమిటంటే, పట్టుమని పది నిముషాలు కూడ కుదురుగా కూర్చుని చదవడు. అదీకాకుండా అతనికి సంవత్సరాంతపు పరీక్షలంటే తప్ప మిగిలిన వార, త్రైమాసిక, అర్థ సంవత్సర పరీక్షలంటే లెక్కలేదు. అతను చదివే పాఠశాలకు క్రొత్తగా లెక్కల టీచరు వచ్చాడు. అతని పేరు శంకరం. వచ్చిన కొద్ధిరోజులలోనే మంచి ఉపాధ్యాయుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు నిఖిల్ చదివే పదవ తరగతికి క్లాస్ టీచర్ గా ఎంపికచేశారు. క్లాస్ టీచరుగా అతని బాధ్యత ఆ తరగతిలో ఎవరూ ఏ పరీక్షలోనూ తక్కువ మార్కులు తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే దానికి కారణం తెలుసుకుని, అతడిని సానబట్టి తరువాతి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలి. పది రోజులలో జరుగబోయే అర్థ సంవత్సరపు పరీక్షలకు ముందు చూపుగా, గతంలో నిర్వహించిన పరీక్షలలో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో పరిశీలన చేశాడు శంకరం. ఒక పదిమంది బొటాబొటి పాసు మార్కులు తెచ్చుకున్నారు. వారిలో నిఖిల్ కూడ ఉన్నాడు. కానీ శంకరానికి ఆశ్చర్యమేసిన విషయమేమిటంటే, నిఖిల్ తొమ్మిదవ తరగతి సంవత్సరాంత పరీక్షలో తొంభై అయిదు శాతం మార్కులు తెచ్చుకోవడం. ఒకరోజు అందరినీ సమావేశ పరిచి అడిగాడు శంకరం. "చూడండి. అందరికంటే మీకు తక్కువ మార్కులు వస్తున్నాయి. కారణమేమిటి? నాకు చెబితే దానికి తగినట్టు మిమ్మల్ని సరిచేస్తాను" పాఠాలు సరిగా బుర్రకెక్కడం లేదని కొందరు, చదివినా జ్ఞాపకం ఉండడం లేదని కొందరు చెప్పారు. కానీ నిఖిల్ మాత్రం నేను సంవత్సరాంతపు పరీక్షలకు తప్ప మిగిలిన పరీక్షలకు చదవను అన్నాడు. ఆ సమాధానం శంకరానికి కోపాన్ని కలిగించింది. " అదేమిటి నిఖిల్ అలా అంటావు. పరీక్ష అంటే ఏదైనా పరీక్షే. ప్రతి పరీక్షను ఛాలెంజింగ్ గా తీసుకుని వ్రాసి అందరికంటే ముందుండాలి. మరి నువ్వేమిటిలా..." " ప్రతి పరీక్షకు కష్టపడి ఎవరు చదువుతారు సర్. ఒకవేళ చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా ఉపయోగం ఏమిటి సార్. రేపు చేరబోయే తరగతిలో సంవత్సరాంత పరీక్ష మార్కుల ఆధారంతోనే కదా సీటు ఇచ్చేది. మరప్పుడు ఈ మార్కులన్నీ వృథానే కదా. అందుకే నేను పెద్దగా ఈ పరీక్షలపై ఆసక్తి చూపను" అతని సమాధానానికి ఆశ్చర్యపోయాడు శంకరం. "మరి పరీక్షల ముందు దాకా పుస్తకాలు తీయవా" "ఎందుకు సర్ దండగ. మీరు చెప్పే పాఠాలు వింటే సగం వచ్చేస్తుంది. మిగతా సగం సంవత్సరాంత పరీక్షల ముందు ఒక నెల చదివితే చాలు. అయినా రోజూ పుస్తకాలు తీయాలంటే నాకు బద్ధకం సార్" అఖిల్ మాటలకు వళ్ళు మండింది శంకరానికి. లేచి నాలుగు పీకుదామనుకున్నాడు. కానీ ఆ పని చెయ్యలేక పోయాడు. కారణం నిఖిల్ ఆ పాఠశాల కరస్పాండెంట్ మనవడు. అదీగాక అతను చెప్పిన దానిలో కూడ నిజం ఉండడంతో మాట్లాడలేక పోయాడు. తిన్నగా అఖిల్ గురించి వాకబు చేశాడు. అతనికి బాగా బద్ధకమని, తెలివిగలవాడినని గర్వమని కూడ తెలిసింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సరిగ్గా పదవ తరగతి పరీక్షలు పదిహేను రోజులు ఉన్నాయనగా కరోనా తీవ్రత పెరగడంతో పబ్లిక్ పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ***** కరోనా మరీ తీవ్రం కావడంతో పదవ తరగతి పరీక్షలు రద్దుచేసి, అంతకు ముందు పాఠశాలలో జరిగిన పరీక్షలలో వచ్చిన మార్కుల సరాసరిని తీసుకుని ఫలితాలను నిర్ణయించారు. నిఖిల్ కు నలభై శాతం మార్కులు వచ్చాయి. తలకొట్టేసినట్టయింది అతనికి. తన బద్దకం వలన, చేసిన నిర్లక్ష్యం వలన మొదటి స్థానంలో ఉండవలసిన వాడు అట్టడుగుకు దిగజారిపోయాడు. తలవంచుకుని పాఠశాల గేటు వద్దకు వచ్చిన నిఖిల్ కు ఎదురుపడ్డాడు శంకరం. "ఫలితాలు చూసుకున్నావా. ఏం జరిగిందో అర్థమయిందిగా. మనిషికి తెలివితేటలతో పాటు అవకాశాలను వినియోగించుకోగలిగే నేర్పు ఉండాలిరా. బద్ధకం ఎప్పటికీ పనికిరాదు. జాబితాలో మొదట ఉండవలసిన వాడివి అహంకారం, బద్దకం, నిర్లక్ష్యం అనే మూడు వినాశకారులను నెత్తికెత్తుకుని అగాధంలోకి పడిపోయావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకనైనా బద్ధకాన్ని వదిలించుకుని ప్రతి పరీక్షను ఒక యజ్ఞంలా తలచి చదువు. నీమీద కోపం లేదురా నాకు, జాలి తప్ప" శంకరం మాటలు పూర్తి కాకుండానే అతని పాదాల మీద వాలిపోయాడు నిఖిల్. తప్పు చేశానన్న పశ్చాత్తాపం కనిపించింది. మెల్లిగా పైకిలేపి "తప్పు తెలుసుకున్నావురా. ఇక నిన్నెవరూ ఆపలేరు. మంచి కాలేజిలో సీటు ఇప్పిస్తాను. నిన్ను నువ్వు నిరూపించుకో" అని భుజం తట్టి ధైర్యం చెప్పాడు శంకరం. గురువుకు నమస్కరించి అతని వెంట నడిచాడు నిఖిల్. **********

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు