శ్రీమంతుల సంబంధం అయిందని సంతోషపడి గాయత్రిని అదిత్యా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ MD వారసుడు అయిన ఆదిత్య వర్ధన్ కిచ్చి పెళ్లిచేశారు రాఘవరావు గారు.. తన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంతోషాలకు క్రమంగా హద్దులు ఏర్పడటంతో, బంగారు పంజరంలో చిలుకలా మారిపోయింది గాయత్రి జీవితం.. దేనికీ కొదవలేదు. అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, ఆధునాతనమైన గృహ సదుపాయాలు, ఏ బాధరబందీ లేని జీవితం ఖరీదైన నగలు, లేటెస్ట్ ట్రెండ్, బ్రాండెడ్ సారీస్ డ్రెస్సెస్ తో నిండి పోయిన వార్డ్ రోబ్స్. కోరితే కొండమీద కోతినైనా క్షణాల్లో కాళ్ళముందు పెట్టే భర్త ఆదిత్య...అయినా ఏదో వెలితి మనసు స్తబ్దత తో రోజులు గడిచిపోతున్నాయి. భర్తతో కలిసి ముచ్చట్లాడుతూ కొసరి కొసరి వడ్డిస్తూ తినాలని, వెన్నెల్లో హాయిగా కబుర్లాడుతూ రాత్రిని ఎంజాయ్ చేయాలని, సరదాగా అలా అదిత్యతో ఎక్కడికైనా తిరిగి రావాలని...చాలా చిన్న కోరికలే కానీ గాయత్రికవి తీరని కోరికల్లా రోజురోజుకీ బాధని పెంచేస్తున్నాయి.కారణం కంపెనీ డెవలప్మెంట్ ధ్యాసలో తలమునకల పనులతో క్షణం తీరిక లేక బిజీ గా ఆదిత్య ఉండటమే. ఇలా ఎదురుచుస్తూనే జీవితం నిస్సారంగా గడపాలా అని బేడ్రూమ్ లో పడకపై ఆలోచిస్తున్న గాయత్రికి లీలగా కిటికీలోంచి దూరంగా ముసిముసి నవ్వులు గుసగుసలు వినిపించి లేచి కిటికీ దగ్గరికెళ్లి చూసింది. దూరంగా తమ గార్డెన్లో చిన్న ఔట్ హౌస్ లో తోటమాలి రంగయ్య, భార్య సీతాలు ఏవో సరసాలాడుకుంటున్నారు.. ఎంత ఆనందంగా ఉన్నారు అనుకుంది. చెవిలో గుసగుసగా ఏమన్నాడో తెగ సిగ్గుపడుతుంది సీతాలు. వెన్నెల్లో ఆ పొన్నచెట్టు కింద ఆనందం మాసొత్తు అన్నట్టు లోకాన్ని మరచి ముచ్చటగా ఉన్న వారిద్దరినీ చూసి..'చా.. ఇలా చూడటం తప్పుకదూ' అనుకుంటూనే చూస్తోంది ఏదో జారవిడుచుకున్న అద్భుతాన్ని చూస్తున్నట్లు ... చిన్నగా అయినా ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగా వినిపిస్తున్న వారి మాటల కోటలోకి కనిపిస్తున్న దృశ్యం వెంబడి మనసు వద్దన్నా వినక వెళ్ళింది. "ఒసేయ్ సీతాలు! ఈపచ్చకోకలో సిలకలా ఉన్నావే..అంటూ బుగ్గలు చిక్కుతున్నాడు.. ఆమాటలకు బహుశా ఎరుపెక్కిందేమో సీతాలు మొహం..."ఏంది మావా! నీ అల్లరెక్కువైపోతుంది రోజురోజుకీ...మొన్న కూడా ఇంతే అమ్మగారు సూసేసినారు నీ వేషాలు నడుం గిల్లినావు"అంటూ బుంగమూతి పెట్టి సిగ్గుపడిపోతుంది.. "ఆయమ్మ ఏతంటారే! నాముద్దుల పెళ్ళాం నాయిష్టం. సర్లేగానీ ఆకూడేదో ఇక్కడికే అట్టుకురా ఎంచక్కా ఎన్నెల్లో ఇద్దరమూ ఒకే కంచంలో కలిపి చెరోముద్ద తినిపించుకుందాం". అంటున్నాడు మురిపెంగా.. తను తెచ్చిన మల్లెమాలను, వెనకమాటుగా సీతాలను చుట్టేసి తన పొడవైన వాలుజడలో తురిమేస్తూ మెడఒంపుల్లో ఓముద్దు కూడా పెట్టాడు.. 'సరసుడే రంగడు' అనుకుంది మనసులో గాయత్రి... ఇద్దరూ ముచ్చట్లతో నవ్వులతో ఒకరికొకరు తినిపించుకుంటూ ..ఆనంద పారవశ్యంలో మునిగున్నారు. ఇంకా చూడటం సబబు కాదని వచ్చి మంచంపై వాలిపోయింది గాయత్రి. అన్యోన్య దాంపత్యానికి జీవితం సంతోషంగా ఉండటానికి డబ్బు అవసరం లేదనిపిస్తుంది ఇలాంటి వారిని చూసినప్పుడు. మనసు కోరుకున్న చిన్ని ముచ్చట కనులముందు సజీవ చిత్రమై నిలిచాక..ఇప్పుడేదో ప్రశాంతత.. సన్నజాజుల పరిమళం నాసికకు తాకగానే ఈలోకంలోకి వచ్చింది గాయత్రి. పక్కనే ఎప్పుడొచ్చి ఫ్రెష్ అయ్యాడో తెల్లని లాల్చీ పైజమాతో మెరిసిపోతున్నాడు చందమామలా ఆదిత్య.. గాయత్రి జడలో అమాలను తురుముతూ కొంటెగా నవ్వాడు.. ఇంకా ఆశ్చర్యం లో నుండి తేరుకోక ముందే....."ఈరోజు ఈజాబిలితో వెన్నెల విందు మేడ పై" అంటున్న ఆదిత్య మాటలకు చెంపలు కెంపులయ్యాయి.. తదేకంగా కిటికీలోంచి చూస్తున్న గాయత్రిని, అవతల వారిద్దరి అన్యోన్యత ను గాయత్రి తో పాటు ఆదిత్య కూడా చూడటం , ఇన్నాళ్లు తననుండి గాయత్రి పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందివ్వాలని, ఆస్తికన్నా తన సాన్నిహిత్యం గాయత్రి కోరుకుంటుందని ఆదిత్య గ్రహించి, నిర్ణయించుకున్నాడని తెలియని గాయత్రి ఇంకా అబ్బురంగా నే ఆదిత్యను చూస్తోంది...కళ్ళార్పితే ఎక్కడ చెదిరిపోతుందో ఈ ఆనందం అనుకొని.. ..✍️✍️