కొత్త జీవితం - చచెన్నూరి సుదర్శన్

Kotta jeevitam

సెల్ ఫోన్ రింగవుతోంది..

అది ల్యాండ్ లైన్ ఫోన్.. కాల్. తన కాంటాక్ట్ నంబర్లలో లేనిది. కాస్త తటపటాయిస్తూ..

“హలో.. సర్. నేను మాధవరావును మాట్లాడుతున్నాను” అన్నాడు.

“నేను డాక్టర్ దామోదరం.. దీర్ఘాయుష్మానుభవ పిల్లల దవాఖాన నుండి. దీపిక మీ పాపే కదూ..!”

“అవును సర్.. ఏమయ్యింది?” మాధవరావు గుండె గుభేలుమంది.

“కంగారేమీ లేదు.. చిన్న ఆక్సిడెంట్. సకాలంలో తీసుకు రావడం.. ప్రమాదం తప్పింది..” అంటూండగానే.. “సర్.. నేను వస్తున్నాను” అంటూ ఫోన్ కట్ చేశాడు.

ఆఫీసులో ఒక పూట సెలవు పెట్టి ఆటో పట్టుకుని.. ఆఘమేఘాలలో బయలుదేరాడు మాధవరావు. సమయం మధ్యాహ్నం దాదాపు రెండు కావస్తోంది. మాధవికి ఈవిషయం తెలిస్తే తట్టుకోలేదని.. నెమ్మదిగా చెప్పొచ్చని మదిలో తట్టగానే.. ఈ రోజు దీపికను తనే తీసుకుని వస్తానని ఫోన్ చేసి చెప్పాడు మార్గ మధ్యమంలో.

మాధవి, మాధవరావు దంపతులకు ఒక్కగానొక్క గారాల పట్టి దీపిక. ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. ఉదయం తను బళ్ళో దించేసి ఆఫీసుకు వెళ్తాడు. సాయంతం మాధవి తీసుకుని వస్తుంది. ఆక్సిడెంట్ జరగడానికి అవకాశం లేదు. మరి ఎలా జరిగింది?. బహుశః లఘుశంక విరామ సమయంలో పిల్లలంతా బయటకు రావడం కద్దు. టిఫిన్ చేశాక.. తినుబండారాలేమైనా కొనుక్కుని తింటూంటారు. సమయం నిర్థారించుకుందామనుకుని చేతి గడియారం వంక చూసే సరికి కన్నీళ్ళు అడ్డుకుంటున్నాయి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. కర్చీఫ్ తో కళ్ళు ఒత్తుకున్నాడు..

హాస్పిటల్ చేరువ అవుతుండడం గమనించి పర్సు నుండి డబ్బులు తీశాడు. ఆటో అలా ఆగిందో లేదో..! దూకినంత పనిచేశాడు మాధవరావు. డబ్బులు ఆటో అబ్బాయి చేతిలో పెట్టి రిసిప్షనిస్ట్ వద్దకు పరుగు తీశాడు. దీపిక ఏ గదిలో ఉందో కనుక్కుని.. వడి, వడిగా అడుగులు వేశాడు.

గది తలుపు నెమ్మదిగా తట్టి.. లోనికి అడుగు పెట్టేసరికి దీపికకు రక్తం ఎక్కిస్తున్న దృశ్యం కనబడింది. గొల్లుమన్నాడు మాధవరావు. నర్స్ చిరుకోపంతో అడ్డుకుని గది బయటకు పంపించింది. ఆ అలికిడికి, మరో గదిలో ఉన్న డాక్టర్ దామోదరం పరుగులాంటి నడకతో వచ్చాడు. డాక్టర్ ను చూడగానే వణకుతున్న రెండు చేతులతో నమస్కరించాడు మాధవరావు.

“దీపిక ఫాదరా.. రండి” అంటూ తన ఛాంబర్ లోకి తీసుకు వెళ్ళాడు.

“మాధవరావు గారూ. మీ పాప చాల అదృష్టవంతురాలండీ.. గండం గడిచింది. మనం వస్తుంటే వరండాలో ఒకతను అభినాదం చేస్తున్నాడే.. అతను నారాయణ. ఆకతాయి పిల్లలు ఎవరో టూ వీలర్ నడుపుతూ.. అదుపు తప్పి తన వద్ద నిల్చున్న దీపికను ఢీకొట్టి పారి పోయారట. నారాయణ తన చేతుల మీదుగా దీపికను తీసుకు వచ్చాడు. కాళ్ళూ, చేతులకు మామూలు గాయాలయ్యాయి. కాని తలకు కాస్త బలంగా దెబ్బ తగిలింది. ఎక్స్ రే తీశాం.. ప్రమాదమేమీ లేదు. కాని రక్తం అవసరమయ్యింది.. ఎక్కిస్తున్నాం. దీపిక ఐడి కార్డులో మీ నంబర్ చూసి ఫోన్ చేశాను. భయమేమీ లేదు.. దీపిక మగతగా ఉంది. మీ ఏడుపుతో ఆమెకు మెలకువ వచ్చి బెంబేలు పడిపోతుందని నర్స్ వారించింది. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఈ రాత్రి మా అబ్జర్వేషన్ లో ఉంటుంది. రెండు, మూడు రొజుల్లో.. దీపికను ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు” అంటూ ధైర్యం నూరి పోశాడు దామోదరం.

మాధవరావు మది కాస్త నెమ్మదించింది. “సర్.. నేను ఉన్నఫళంగా ఆఫీసు నుండి వచ్చాను. డబ్బుతేలేదు. మీ ఫీజు వివరాలు చెబితే.. చెక్ ఇస్తాను” అంటూ ప్రాధేయపూర్వకంగా చూశాడు.

“మీకు తెలియందేముంది.. మాధవరావు గారు.. ఈ కార్పోరేట్ హాస్పిటల్స్ కు దయాదాక్షిణ్యాలుండవు. ముందు డబ్బు కట్టందే.. రోగి చెయ్యి పట్టరు. నారాయాణ డబ్బు కట్టాడు. మేము వైద్యం మొదలు పెట్టాం. మీరు అతనితో మాట్లాడండి. అతణ్ణి లోనికి రమ్మన్నా రావడం లేదు.. ఫరవా లేదు ఇక్కడే కూర్చుంటానని అంటున్నాడు” అని చెబుతూ.. వాపోయాడు దామోదరం.

“డాక్టర్ గారూ.. ముందుగా వెళ్ళి పాపను చూస్తాను. తరువాత నారాయణగారితో మాట్లాడుతాను” అంటూ వెళ్ళబోతుంటే.. ముందు ఏడపు మానాలి మీరు” అని మరీ, మరీ చెప్పాడు దామోదరం. హృదయంలో ఆవేదనను అణచుకుంటూ.. తలూపి, దీపిక గదికి వెళ్ళాడు మాధవరావు. వరండాలో గోడకొరిగి కూర్చున్న నారాయణను చూసి రెండు చేతులూ జోడించి మొక్కాడు. నారాయణ వద్దు, వద్దు అన్నట్టుగా అరచేతులాడించాడు. ఇరువురి కళ్ళూ చెమ్మగిల్లాయి. నేను ఇప్పుడే వస్తానన్నట్టుగా దీపిక గదిలోకి వెళ్ళాడు.

కాసేపు తనివితీరా దీపికను చూశాడు. నెమ్మదిగా నర్స్ ను అడిగి.. పాపకేమీ ప్రమాదం లేదు కదా..! అనే తన సందేహాన్ని నివృతి చేసుకున్నాడు.. తిరిగి గది బయటకు వచ్చాడు.

మాధవరావు తన వద్దకు వస్తున్నట్టు గమనించి.. నారాయణ లేవబోయాడు. కాని ఒంట్లో నీరసంతో కాస్త తూలడం.. చూసి. కూర్చోండి ఫరవాలేదు అన్నట్టు మాధవరావు చేతులతో చెబుతూ.. నమస్కరించాడు.

“బాబుగారూ.. అలా దండం పెట్టకండి. మీరు భాగ్యవంతులు” అంటూ రెండు చేతులు జోడించాడు నారాయణ.

“అలా అనకు నారాయణగారూ.. మా భాగ్యమంతా మా బిడ్డలోనే ఉంది. అలాంటి బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవునివి. నీఋణం జన్మలో తీర్చుకోలేను” అంటుంటే అతని కళ్ళు జలపాతాలయ్యాయి. కర్చీఫ్ తో కళ్ళు తుడ్చుకుంటూ.. “మా పాప ఎలా తెలుసు? నారాయణగారూ..” అంటూ ఆరా తీశాడు మనోహర్.

“నన్ను నారాయణా. లేదా నారిగా అనిపిలిస్తే చాలు బాబుగారూ.. మీరు, గారూ అనకండి” అని వేడుకోలుగా చూశాడు. “పాప, మీరూ.. ఇంకా అమ్మగారు గూడ తెలుసు. రోజూ మీరు పాపను బడికి తీసుకురావడం... అమ్మగారు పాపను తీసుకెళ్ళడం సూస్తూనే ఉంటాను. పాప నాకు దినాం ఒక రూపాయ దానం చేసస్తుంది. వద్దమ్మా.. అని ఎంత బతిమాలినా వినదు. మేమంతా దానం చేస్తేనే కదా అంకుల్.. మీరు కడుపు నిండా భోజనం చేస్తారు అంటుంది” అతని కళ్ళు కన్నీటి చెలిమలయ్యాయి.

“ఏంటీ.. నువ్వు భిక్షం అడుక్కుంటావా!” విస్మయంగా అడిగాడు మాధవరావు

“నేను యాచక వృత్తిలో పుట్టి పెరిగిన వాణ్ణి. నాకీ వారసత్వ సంపద అంటగట్టి నా తల్లిదండ్రులు కాలం చేశారు. అటు దవాఖానా, ఇటు బడి.. మధ్యలో చెట్టు కింద కూర్చోని బిచ్చమడుక్కుంటానయ్యా.

ఈరోజు నాకళ్ళు తెరిపించింది మీ పాప. కాళ్ళూ, చేతులు బాగానే ఉన్నాయి కదా.. పని చేసుకోవాలి గాని ఇలా అడుక్కోవడం.. బాగూ లేదు అంకుల్ అంది. ఆలోచనలో పడిపోయాను. ఇంతలో ఈ ఘోరం జరిగగింది” అంటూంటే అతని కళ్ళు జలపాతాలయ్యాయి.

మాధవరావు నిర్ఘాంత పోయాడు. ఇద్దరి మధ్య లిప్తకాలం మౌనం ఆవహించింది.

“పాపకు డబ్బు ఎంత కట్టావు నారాయణా.. దానికి రెట్టింపిస్తాను” అంటూ తన ఆర్ధిక వ్యవస్థకు అద్దం పట్టాడు మాధవరావు.

“బాబు గారూ.. పాప మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. నేను ఇన్నాళ్ళు అడుక్కున్న డబ్బులు సాంతం పాప కోసం కట్టాను. అందులో పాప వాటా ఉంది.. నాకు ఉచితంగా వచ్చిన డబ్బులు వద్దు. ప్రభుత్వ ఉచిత పథకాలూ వద్దు. కూలీ, నాలీ చేసుకుంటూ కష్టపడి సంపాదించుకుని బతుకుతాను” అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చాడు నారాయణ.

“భేష్..నారాయణా.. నీ నిర్ణయం శ్లాఘనీయం. అయితే నాదొక విన్నపం.. కాదనొద్దు” అంటూ వేడుకున్నాడు మాధవరావు. “నువ్వు కోరుకునే పని నేనిస్తాను. మా ఇంటికి తీసుకు వెళ్తాను. మా తోటలో ఆశ్రయం కల్పిస్తాను. దీపికను రోజూ బడికి తీసుకు వెళ్ళడం.. తీసుకు రావడం.. తోట బాగోగులు చూసుకోవడం నీ పని. ప్రతీ నెలా వేతనమిస్తాను”

వెనుకాలే నిలబడి వారి మాటలు వింటున్న డాక్టర్ దామోదరం హర్షిస్తూ.. వచ్చాడు.

“నారాయణా.. ఇక పాత జీవితం మర్చిపో.. మాధవరావుగారు చెప్పినట్టు కొత్త జీవితం ఆరంభించు” అంటూ మాధవరావును చూస్తూ.. ” మాధవరావుగారూ.. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి నారాయణ అర్హుడనడానికి ఏమాత్రమూ సందేహం లేదు. మరో విషయం.. దీపికకు రక్త దానం చేసిందీ తనే.. ఒక బిచ్చగాని రక్తమని మీకు తెలిస్తే బాగుండదని భయపడ్డాడు. నన్ను చెప్పనివ్వలేదు. కాని దీపిక రక్తం అత్యంత అరుదైనది. అత్యవసరం కూడా.. నారాయణ రక్తం దీపికకు ఎక్కించక తప్పలేదు”

మాధవరావు ఉద్వేగంతో.. నారాయణను తన హృదయానికి హత్తుకున్నాడు. *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు