దరిద్రుడు - mahesh amaraneni

Daridrudu

"ఒరేయ్, ఒక దెబ్బతో మన దరిద్రం పోవాలి. ఈ సారి దొంగతనం చేస్తే పెద్దగా చేసి నాలుగు డబ్బులు వెనుక వేసుకోవాలి."
***

సోము,వెంకు,సీను,వీరు నలుగురు ప్రక్క ప్రక్కనే పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

వృత్తి కూలి పని, ప్రవృత్తి దొంగతనం చేయటం.

అందరికి పెళ్లిలు అయి, ఇద్దరెసి బిడ్డలు కూడా ఉన్నారు. కూలి పని చేసి వచ్చే డబ్బులు వీళ్ల తాగుడికి, ఇంట్లో పెళ్ళాం బిడ్డలకి, ఇంటి ఖర్చులకి సరిపోవడం లేదు. అందుకే అందరూ కలసి ఒక పెద్ద దొంగతనము చేసి అప్పులు తీర్చి ,నాలుగు డబ్బులు వెనుకేసి జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకున్నారు.

సీను గాడు : ఒరేయ్, పక్క ఊళ్ళో పెద్ద జమీందారు ఉన్నాడు, పెద్ద బంగ్లా, ఇంటి నిండా పన్నోళ్లు.
మనం ఆ బంగ్లాలోకి వెళ్లి, వీలైనంత దోచుకు రావటమే... ఏమంటారు?

సోము గాడు: ఒరేయ్, ఈ మధ్య అందరూ కార్డులు వాడతన్నారు. ఎవరు డబ్బులు ఇంట్లో ఉంచటం లేదు.

వీరి గాడు: సరేలే రా, డబ్బు లేకపోతే ఏమి, బంగారం,వెండి ఉంటది కదా, అది దొబ్బకొద్దాము.

వెంకు గాడు: ఒరేయ్, ముందు మనం ఆ బంగ్లాలోకి వెళ్లి, ఒక మూడు రోజులు అంతా గమనించి అప్పుడు ప్లాన్ వేసి దొరికినంతా దోచుకుందాం.

సోము గాడు : సరే రా, మనం ఆ బంగ్లాలోకి ఎలా వెళ్ళటం?

సీను గాడు: ఏముంది రా, మనం కూడా అక్కడి పని వాళ్ళతో కలసిపోవటమే. ఎవడు గురుతు పట్టరు.ఒకవేళ ఎవరైనా అడిగినా కొత్తగా పనిలోకి చేరాం అని చెప్పటమే.

***

పక్క ఊళ్ళో పనికి వెళుతున్నాము, మూడు రోజులు తరువాత వచ్చేది అని నలుగురు, పెళ్లాలకి చెప్పి బయలు దేరారు.

నలుగురు మొత్తానికి కొత్త పనోళ్ళలా బంగ్లాలోకి చేరారు. ఎవరికి అనుమానం రాకుండా నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి పని చేస్తున్నట్టు నటించి పరిసరాలు గమనిస్తున్నారు.

సీను గాడు: ఒరేయ్ భోజనం టైం అయింది కదా.ఈ పెద్దోళ్ళు ఏమి ఏమి తింటారో చూడాలని ఉందిరా.

వీరి గాడు: ఒరేయ్, వాళ్ళు ఎం తింటారో మనకెందురా?.వచ్చిన పని చూడకుండా.

సీను గాడు : ఒరేయ్ బావ, ఇది కూడా మన పనిలో భాగమేరా.వాడు పెద్ద పెద్ద వెండి పళ్ళెంలో భోజనం చేస్తాడు. వెండి గ్లాసులో తాగుతాడు. పదరా, వెళ్లి అవి ఎక్కడ పెడతారో చూసి లేపేద్దాం. నువ్వే అన్నావ్ కదరా బంగారం, వెండి దొబ్బకొద్దాము అని.

వీరిగాడు : ఒరేయ్ , నీ బుర్ర కూడా బాగానే పని చేస్తుంది. పద, వెళ్లి చూసి వెండితో మొదలు పెడదాం మన దొంగతనం.

***

జమీందారు భోజనానికి కూర్చున్నారు.
నర్సు పెద్ద పెట్టలో నుంచి ఏవో టాబ్లెట్స్ తీసి అందిస్తుంది. అవి వేసుకున్నాడు.

వంట వాడు,పెద్ద ప్లేట్ లో కొంచం అంటే, కొంచం అన్నం పెట్టాడు.
అది తిన్న తరువాత, నర్సు మరి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది. వేసుకొని నీళ్లు తాగాడు.

సీను, వీరి గాళ్లు వాళ్ళకి కనిపించకుండా ప్రక్క నుంచి అంతా గమనిస్తున్నారు.

సీను గాడు: ఇదేందీ రా! భోజనం అంటే నేను చాలా ఉహించుకున్నాను. చికెన్,మటన్,చేపల పులుసు,బిర్యానీ,స్వీట్స్... వాడు తిన్న అన్నం కనీసం మనకి ఒక ముద్దకి కూడా రాదు కదరా. ఏవో మందులు మింగిండు. వాడు తిన్న అన్నం కంటే ఏసుకున్న మందులే ఎక్కువ ఉన్నాయి. పైగా వెండి ప్లేట్,గ్లాస్ కూడా కాదు.

వీరి గాడు: పెద్దోళ్ళు అంతేరా,కొంచమే తింటారు. ఎదో జబ్బు అనుకుంటా, అదే డాక్టరలు భోజనానికి ముందు, భోజనం తరువాత అని మందులు ఇస్తారు కదరా. వెండి ప్లేట్స్, గ్లాస్లు బీరువాలో దాచిపెడతారు.

సరే పద మన వాళ్ళు ఎక్కడున్నారో అని వెంకు, సోము దెగ్గరికి వెళ్లారు.

సీను గాడు, వీరి గాడు : ఒరేయ్, అంత గమనించారా?

వెంకు గాడు, సోము గాడు: ఏమొరా, ఇక్కడ అంత దొబ్బకపోయేవి కనపడలేదు. మనం ఇంకొంచం ధైర్యం చేసి జమీందారు గదిలోకి వెళ్లి చూడాలి. నాకు తెలిసి అతని గదిలో బీరువాలో మనకి కావలసినవి ఉండచ్చు.

సరే కానీ...సీను గాడు,వీరి గాడు వాళ్ళు చూసిన జమీందారు భోజనం గురించి చెప్పారు.

వెంకు గాడు,సోము గాడు పెద్దగా నవ్వి, ఈ ఆలోచన మీకంటే ముందు మాకు వచ్చింది. మేము పొద్దున్న టిఫిన్ చేసేటపుడు చూసాము. మరి గోరంగా ఒక ఇడ్లి తిని లేచాడురా.అప్పుడు కూడా ఏవో మందులు మిగిండు.

వెంకు గాడు : సరే రా...ఇంత పెద్ద బంగ్లాలో విడు ఒక్కడే ఉన్నాడా...? పెళ్ళాం, పిల్లలు కనిపించటం లేదు.?

సోము గాడు : ఏమోరా... ! పని వాళ్ళు ,వీడు తప్ప ఎవరూ లేనట్టు ఉంది.

సీను గాడు : సరే రా, వచ్చి రెండు రోజులు ఐపోయినాయి. ఈరోజు రాత్రి వాడి గదిలోకి వెళ్లి వాడు పొడుకున్నాక మన పని కానిద్దాం. సామగ్రి రెడీ చేయండి.

వీరి గాడు : ఒకవేళ వాడు లెగిస్తే రా...?
సీను గాడు : ఇద్దరు వాడిని చుట్టుముట్టి నోట్లో గుడ్డలు కుక్కి, కత్తి పీక మీద పెట్టి అరవకుండా చూడాలి, మిగిలిన ఇద్దరు బిరువా తాళాలు పగల గొట్టి,దొరికినంతా దోచుకుందాం.

సరే రా...

***

నలుగురు జమీందారు గదిలో దూరారు. నైట్ పన్నెండు అవుతుంది. జమీందారు కి నిద్ర రావటం లేదు. కాసేపు బెడ్ పైన అటు ఇటు తిరిగి అప్పుడే నిదానంగా నిద్రలోకి జారుకున్నాడు.

నలుగురు నిదానంగా బయటికి వచ్చి గది అంతా పరిశీలించారు. పెద్ద గది, పెద్ద పెద్ద కబ్బోర్డ్స్ (బిరువాలు లాంటివి) ఉన్నాయి.

జమీందారు బెడ్ ప్రక్కనే పెద్ద్ సెల్ ఫోన్స్ రెండు, లాప్ టాప్లు ఉన్నాయి. జమీందారు ఒంటి మీద చాలా బంగారం ఉంది. వేళ్ళకి బంగారు రింగులు ఉన్నాయి.

అనుకున్నట్టే ఇద్దరు జమీందారు దెగ్గరికి వెళ్లి నుంచున్నారు. ఒక వేళ లెగిస్తే నోట్లో గుడ్డులు కుక్కి బెదిరించి అరవకుండా చూడాలని.
ఇంకొక ఇద్దరు నిదానంగా బిరువాల దెగ్గరికి వెళ్లి, అవి ఓపెన్ చేయటానికి ప్రయతిస్తున్నారు.

బిరువాలు ఓపెన్ చేసే క్రమంలో చిన్న శబ్దం రావటం, జమీందారు లెవటం, ఒకడు చేతులు వెన్నకి మెలి పెట్టి, ఇంకొకడు నోట్లో గుడ్డలు కుక్కి బెదిరించటం జరిగిపోయినాయి.

నలుగురు, జమీందారుని చుట్టుముట్టి, నా కొడకా... అరిస్తే పొడిచిపారదొబ్బుతాము అని బెదిరించి మర్యాదగా బంగారం, వెండి, డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు. అలాగే నీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసి ఇవ్వు అన్నారు.

నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నందున ఏమి చెప్పలేక తల ఉపుతున్నాడు.

వెంకు గాడు : ఒరేయ్, నోట్లో గుడ్డలు ఉన్నాయి అని చెప్పలేక తల ఉపుతున్నాడు. నోట్లో గుడ్డలు తీయండి. అరిస్తే, పొడిచి వంటి మీద ఉన్న బంగారం తీసుకొని,పారిపోదాము అని బెదిరించి నట్టు చెప్పి ,కత్తి పీక మీద ఉంచి జమీందారు నోట్లో గుడ్డలు తీసాడు.

నోట్లో గుడ్డలు తీయగానే ప్రక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి, జమీందారు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు.

సీను గాడు : ఎరా... నలుగురం నిన్ను చుట్టుముట్టినo, అవసరమైతే చంపడానికి కూడా రెడీగా ఉన్నాము. నీకు నవ్వు ఎందుకు వస్తోంది రా? అని అడిగాడు.

జమీందారు : ఒరేయ్ ,మీరు నన్ను చంపకపోయిన నేను కొన్ని నెలల్లో చనిపోతాను. నాకు ప్రాణాలు మీద ఆశ లేదు, అది పోయి చాలా రోజులు అవుతున్నాయి.

ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు, మీకు ఏమి కావాలి...?

నలుగురు జమీందారి ప్రవర్తన చూసి ఖంగుతున్నారు.

నలుగురిలో ఒకడు చెప్పాడు, "వాళ్ళు పరిస్థితీ,వాళ్ళ ఫ్యామిలిస్ గురించి, ఇలా ఒక పెద్ద దొంతనము చేసి దరిద్రాని పొగుట్టుకోవాలని..."

జమీందారు పెద్దగా నవ్వి, దీనికే మీరు దరిద్రులు అయితే, నేను ఏమిటి...?

నలుగురు ముఖాలు చూసుకున్నారు. వీడేంటి పెద్దగా నవ్వి ఇలా అంటున్నాడు.?

జమీందారు: నలుగురుకేసి చూసి,ఖంగారు పడొద్దు.చూడండిరా, నేను ఇంత ఆస్తి ఎలా సంపాదించినో చెబుతా, నా పరిస్థితి చెబుతా, అప్పుడు తెలుస్తుంది.

"మొదట్లో నేను మీకు లాగానే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికాను. అమ్మ, నాన్న, చెల్లి దెగ్గర నుండి బయటకి వచ్చాను. మనకి వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నడపలేము అని. ఎందుకో వాళ్ళని చూస్తే అసహ్యం వేసేది.వీళ్ళతో ఉంటే ఎదుగు బొదుగు ఉండదని ఆనిపించింది. ఎవరైనా కార్లో వెళుతున్న, పెద్ద బంగ్లా చూసినా, నాకు అలాగే బ్రతకాలి అని ఉండేది. ఎంత కాలం ఈ చిన్న పనులు, చిన్న సంపాదన అనిపించింది. ఒక రోజు గుళ్లో అమ్మవారి నగలు దొంగతనం చేసి పారిపోయి అవి అమ్మి సొమ్ము చేసుకున్నాను. ఈ ఉరికి వచ్చి పొలాలు, స్థలాలు కొన్నాను. "

***

"మొదట్లో కొంచెము భయం వేసింది. అమ్మవారు
నగలు కొట్టేసాను, అమ్మవారు శపిస్తదేమో...? అని."

"ఈ స్థలంలో నాకు నచ్చినట్లు, ఈ ఇల్లు కట్టించాను.
మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను.
అమ్మవారు కరుణించిందేమో? లేక నా భార్య వచ్చిన వేళో, రెండు స్థలాలు అమ్మేసి, ఆ డబ్బుతో వ్యాపారాలు చేసి అంచెలంచెలుగా ఎదిగాను."

"నా భార్య అంటూ ఉండేది, మనకి కావలసిన డబ్బు ఉంది.చాలు, ఇంకా పరుగులు పెట్టకండి అని. నా కడుపున ఒక పిల్లో, పిల్లాడో పుడితే మనకి చాలు అని."

"కానీ నాకు సంపాదన మీద యావ ఎక్కవ అయి, డబ్బు మీద, డబ్బు సంపాదించడం మొదలు పెట్టాను."

"ఎంతలా అంటే, కట్టుకున్న పెళ్ళాంతో కలసి భోజనం చేయలేని అంతగా. పెళ్ళనికి డబ్బు, నగలు, చీరలు ఏమి కావాలంటే అవి ఇస్తున్నాను ఎక్కడికి పోతుందిలే అని ధీమా. "

"ఒక రోజు నా భార్య, మా బెడ్ రూంలో ,నా ఇంటి పాలేరుతో కనిపించింది. కోపంతో ఒకటి పీకి, ఏమిటి ఇది అని గట్టిగా అడిగాను..?
నువ్వు సంపాదన మీద ఆశతో నన్ను పట్టించుకోకుండా ఊళ్ళు తిరుగుతుంటే నేను ఏమి చెయ్యాలి...? అని నా మీద రివర్స్ అయింది. వాడితోనే వెళ్ళిపోయింది."

"పెళ్ళాం పోతే ,ఇంకొక దానిని చేసుకోవచ్చు అని సంపాదన మీద ఆశతో ఎంత తిoట్టున్నాను, ఎప్పుడు తిoట్టున్నాను అని కూడా చూసుకోలేదు."

"తర్వాత ,తర్వాత నాకు ఆరోగ్యం పాడైంది. అన్ని తినాలని ఉంటాయి.... పెద్ద అరటి ఆకులో వేడి వేడి అన్నం పెట్టుకొని,ఇంత ముద్ద పప్పు, ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే,అబ్బా...నోరు ఉరుతోంది. బిర్యానీ తినాలని ఉంట్టుంది, స్వీట్ తినాలని ఉంది. గోంగూర పచ్చడి వేసుకొని తినాలని ఇలా చాలా...అవి అన్ని కొన్నుకొనే డబ్బులు ఉన్నాయి. కానీ ఏమీ తినటానికి కుదరదు. సంపాదన మీద యావతో టైం కి నిద్ర పోలేదు, టైంకి తినలేదు. వంట్లోకి రావలసిన రోగాలన్ని వచ్చి చేరాయి."

"పెళ్ళాం లేదు , సంసారం చేయాల్సిన టైం లో చేయలేదు , బిడ్డలు లేరు. కడుపు నిండా తినలేను, కంటి నిండా నిద్ర పోలేను. డబ్బులతో టాబ్లెట్స్ కొని తింట్టున్నాను. చుట్టాలు ఉన్న, డబ్బుకోసం వచ్చి కబురులు చెప్పేవాళ్లే కానీ, ప్రేమతో చూసే వాళ్ళు లేరు."

"అప్పుడు అర్థం అయింది.ఆ అన్నపూర్ణ అమ్మవారు నన్ను ఇలా శపించింది అని."

"ఇప్పుడు చెప్పండి, ఎవరు దరిద్రుడు...?
మీరా...?,నేనా...?"

"దరిద్రుడు దొడ్డికి వెళితే సముద్రమే ఎండి పోయింది అని సామెత. ఈ దరిద్రుడికి , దొడ్డికే రాదు. నాకు మలబద్దకం.దానికి కూడా టాబ్లెట్స్ వేసుకుంటాను."

నలుగురు ఒకళ్ళ ముఖాలు, ఒక్కళ్ళు చూసుకొని,

"ఒరేయ్, వీడు మన కన్నా పెద్ద దరిద్రుడిలా ఉన్నాడు."

"పదండిరా పోదాం... ఈ పాపపు సొమ్ము ముట్టుకుంటే వాడి దరిద్రం మనకి చుట్టుకుoట్టది."


"అదేదో సినిమాలో వెంకటేష్ బాబు కోటన్నతో చెప్పినట్టు, తీపి తింటే షుగర్, ఉప్పు తింటే బ్లెడ్ ప్రెషర్ , కారం తింటే అల్సర్."సర్రిగా భోజనం చేస్తే చచ్చిపోతావ్ రా నువ్వు" అంటే అన్ని రోగాలు ఉన్నాయి ఒంట్లో మరి వీడికి."

"ఇంతకన్నా దరిద్రడు ఇంకొకడు ఉండడు.ఇలాంటి దరిద్రం మనకొద్దు."

"మీ దరిద్రపు బతుకు గురించి చెప్పి మాకు బుద్ది వచ్చేలా చేశారు. మీకు దండాలు సారు. ఇక నుంచి మేము దొంగతనం చేయం సారు."

"పదండి రా... కూలో, నాలొ చేసుకొని వచ్చిన డబ్బుతో పెళ్ళాం ,బిడ్డలతో తృప్తిగా బతుకుదాం."

***
సీను గాడు: అవును రా... ఎటుదిరిగి వాడు కొన్ని నెల్లలో చనిపోతాడు. ప్రాణాలు మీద ఆశ కూడా లెద్దన్నాడు.ఇప్పటికైనా ఆ మందులు మానేసి వాడికి ఇష్టమైన భోజనం చేయచ్చు కదా...?,మహా అయితే కొన్నీ నెలలు కాస్త ,కొన్ని రోజులలో పోతాడు.

వీరి గాడు: నీకు ఎప్పుడూ తిండి గోలే...

మిగిలిన ఇద్దరు: చూత ఉంటే, వాడికి ఇంకా డబ్బు మీద, బతుకు మీద యావ పోలేదురా. ఆ రోజు ఎదో మన దెగ్గర కొంచెo దైర్యంతో వాడు గోడు చెప్పిండు కానీ...బహుశా! ఇది కూడా ఆ అమ్మవారి శాపమేమో...?

" అబ్బో...ఆ దరిద్రుడు గురించి ఆలోచన కూడా వద్దురా నాయనా, పదండి మన పని చుసుకుందాం."

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి