మర్కటపుర - యు.విజయశేఖర రెడ్డి

Markatapuram-Story picture

ఒకప్పటి సీతాపురం గ్రామానికి రాను రాను మర్కటపురం అనే పేరు వచ్చింది. అందుకు కారణం అక్కడ ఒక రావి చెట్టు పైన కోతులు ఎక్కువగా చేరడం.కానీ ఆ కోతులు మనుషులను ఏమీ అనేవి కావు.చెట్టు పక్కనే మంచి నీటి బావి కూడా ఉంది.

రామయ్య తోపుడు బండి మీద సంత నుండి అనేక రకాల పండ్లను తెచ్చి ఆ రావి చెట్టు నీడలో పెట్టుకుని అమ్ముతుంటాడు. బాటసారులు రామయ్య దగ్గర పండ్లు కొని, తిని, బావి నీటితో దాహం తీర్చుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు. రామయ్య ఇంటికి వెళ్ళేప్పుడు మిగిలిన అరటి పండ్లను కోతులకు ఆహారంగా ఇచ్చేవాడు.

ఒక సారి కొన్ని కోతులు రహదారికి అటూ ఇటు తిరుగుతుండగా ఒక గుర్రపు బండి కింద మూడు కోతులకు గాయాలయ్యాయి. రామయ్య వెంటనే వాటి గాయాలకు తడి గుడ్డతో తుడిచి.. వేపాకులను తెచ్చి ముద్దగా చేసి కట్టు కట్టాడు. వారం రోజుల్లో ఆ మూడు కోతులూ కోలుకున్నాయి. అప్పటి నుండి అవే కాక మిగతా కోతులు కూడా రామయ్యతో బాగా స్నేహంతో మెలిగేవి.

ఒక సారి, ఒక ముత్యాల వ్యాపారి, గుర్రపు బండిలో వచ్చి ఆ రావి చెట్టు కింద చేరి.. తెచ్చుకున్న ఆహారం, అతను,బండి వాడు తిని,నీళ్లు తాగాక... వ్యాపారి చెట్టు కింద ముత్యాల సంచిని తలగడలా పెట్టుకుని పడుకున్నాడు.వ్యాపారిని గమనించిన ఒక దొంగ తలకింద పెట్టుకున్న సంచిని ఎత్తుకుని పారిపోయాడు.వ్యాపారి “దొంగ..దొంగ” అని అరిచాడు.

ఇది చూసిన రామయ్య దొంగను వెంబడించమని కోతులకు చెప్పాడు. కొన్ని కోతులు ఆ దొంగ వెంటపడి వాడిని బాగా రక్కి గాయాలు చేశాయి. వాడు సంచిని వదిలి పెట్టి పారి పోయాడు. ఒక కోతి సంచిని తెచ్చి రామయ్యకు ఇచ్చింది. రామయ్య ఆ సంచిని వ్యాపారికి ఇచ్చాడు.”ఎంతో విలువైన ముత్యాల మూటను తెచ్చి ఇచ్చాయి నీ నేస్తాలు” అని కొంత డబ్బు ఇవ్వబోయాడు వ్యాపారి.”నేను చేసిందేమీ లేదు... మీకు సహాయం చేసింది కోతులు” అన్నాడు రామయ్య. పోనీ ఆ కోతుల కోసం,నీ వ్యాపారం కోసం డబ్బు తీసుకో” అన్నాడు.

ప్రతిరోజూ ఊరిలో ఆకుకూరలు అమ్మి, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే ఒక అవ్వ,రామయ్యను మనవడా అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. ఇదంతా గమనించిన ఆ అవ్వ “ఒరే రామయ్య! ఆ డబ్బును ఊరికే తీసుకో వద్దు... అప్పుగా తీసుకో పండ్ల వ్యాపారం పెద్దదిగా చేసి,నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఆ వ్యాపారికి ఇవ్వు” అని సలహా ఇచ్చింది.

“అవును.. అవ్వ చెప్పినట్టు అప్పుగా తీసుకో... నీకు కుదిరి నప్పుడు ఇవ్వు నేను వ్యాపారం నిమిత్తం ఈ గ్రామం తరుచూ వస్తుంటాను” అన్నాడు వ్యాపారి.

సరే అని కొంత సొమ్ము తీసుకుని దగ్గరలో ఉన్న పంట భూమిని కొన్నాడు. అందులో అరటి,జామ,కలింగర పండ్ల పంటల సాగు చేశాడు. కొన్ని నెలల తరువాత ఒకొక్క పంట చేతికి రాసాగింది. మూడు వంతుల పంటను సంతకు పంపి తన వ్యాపారానికి కారణమైన కోతుల కోసం ఒక వంతు పంటను కేటాయించసాగాడు.అవ్వ ఆకుకూరలు అమ్మి ఇంటికి వెళ్ళేప్పుడు రామయ్య కొన్ని పండ్లను ఉచితంగా ఇచ్చేవాడు.

క్రమ క్రమంగా వ్యాపారం బాగా పుంజుకుంది.వ్యాపారి ఇచ్చిన సొమ్మును మొత్తం తీర్చేశాడు.

రామయ్య పట్ల కోతులు ఎంతో స్నేహంగా ఉండ సాగాయి. వ్యాపారం వృద్ది చెంది నట్టే కోతుల సంఖ్య కూడా పెరిగింది. రామయ్య అన్ని కోతులను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. వ్యాపారి వచ్చినప్పుడల్లా రామయ్యను కలిసి పండ్లను తిని ఆ రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని వెళ్ళేవాడు.

****

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు