మా ఆయనకు కడుపొచ్చింది - కందర్ప మూర్తి

Maa aayanaku kadupochchindi

పల్లెటూళ్లో సుబ్బయ్య శెట్టి దంపతుల ఏకైక గారాల పట్టి గజలక్ష్మి పేరుకు తగ్గట్టు భారీ శరీరం నిగనిగ నల్లని చాయతో లోకజ్ఞానం తెలియకుండా అతి గారాభంగా పెరిగి పెళ్లీడు కొచ్చింది. ఎన్ని పెళ్లి సంబంధాలు వెతికినా గజలక్ష్మి ఆకారానికీ , ఇల్లరికం రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి పాత సినీ కామెడియన్ రమణారెడ్డి లా సన్నగా బక్కగా రివట లాంటి యువకుడు ఆంజనేయులు గయ్యాళి గజలక్ష్మి కబంధ హస్తాల్లో చిక్కుకుని పెళ్లి అనే బంధంతో ఇల్లరికపు ఇంటి అల్లుడి కన్న నౌకరు హోదాలోనే ఇంటి పనులు వంట పనులకు అంకితమై పోయాడు. పెళ్లయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా మనవరాలినో , మనవడినో కని ఇస్తుందన్న కూతురి జాప్యానికి సుబ్బయ్య శెట్టి దంపతుల ఆశ నెరవేరడం లేదు. కాల గమనంలో రోజులు గడుస్తున్నాయి. "ఏమండోయ్! " అని భార్య అరిచేసరికి మంచి గాఢ నిద్రలో గురక పెడ్తున్న ఆంజనేయులుకి ఎవరో చెళ్ న కొరడాతో కొట్టినట్లు మంచం పైనుంచి ఎగిరి తిన్నగా భార్య గజలక్ష్మి కాళ్ల ముందు పడ్డాడు. " ఏం కాంతం!" అనేసి నాలుక కరిచేసుకుని, దీని వల్ల ఏం ఉపద్రవం వస్తుందోనని ఎండుటాకులా వణికి పోసాగాడు బక్కప్రాణి. " ఓహో, నాకు మీరు పెట్టిన ముద్దు పేరు సూర్యకాంత మన్న మాట , ఎంత దైర్యం?" అంది నడుం మీద చేతులేసు కుని తీక్షణంగా చూస్తూ. " నిన్ను కాదే ! " భయంతో బిక్క చచ్చిపోతు జవాబిచ్చాడు " మరెవర్ని? " హుంకరించింది గజం. " నా అపరాధం ఏం లేదు. నిద్రలో ఏదో పాత సినేమా కల వస్తుంటే...అలా నోరు జారింది. నువ్వు ఏ శిక్ష విధించినా సరే." ప్రాధేయ పడుతు అన్నాడు పత్నీ విధేయుడు ఆంజనేయులు. " దీనికి శిక్షేమిటో తెల్సా?"తీక్షణంగా చూస్తూ అడిగింది నిజమైన సూర్యకాంతంలా. " నీ దయ ,నా ప్రాప్తం!" చేసుకున్న వారికి చేసుకున్నంత సణుగుతున్నాడు. " ఏమిటా వ్యర్థ ప్రసంగం! లేటుగా లేవడమే కాకుండా కాలయాపన. అందుకు శిక్షగా ఇల్లు తుడవాలి , అంట్లు తోమాలి, నీళ్లు తోడాలి. తర్వాత వంట పూర్తి చేసి నాకు గాలి విసరాలి. అవుసరమైతే నా కాళ్లు...అనబోతుంటే " కూడా పట్టాలా?" ఏడ్పు మొహంతో అన్నాడు పతిదేవుడు. " ఆ , అప్పుడే మీరు నిజమైన భర్త అనిపించుకుంటారు" హుంకరించింది. " చిత్తం , అలాగే. తమరి ఆజ్ఞ" " ఉ , కదలండి. ముందు ఇల్లు తుడవండి" అంటు మూలనున్న చీపురు పడేసి పెరట్లో ఏదో పనున్నట్టు జారుకుంది సూరేకాంతం లాంటి గజలక్ష్మి. " జై సీతారాం ! ఏంటయ్యా ఇది రామా! నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావో కదా! నీకు ఐదు కొబ్బరికాయలు కొడతాను. "మొక్కుకుని చీపురు చేత పట్టాడా మగధీరుడు. ఈసారి తుఫానులా వచ్చి పడింది గజం. ఆమె వచ్చిన విసురుకి మూలకి జారి పడ్డాడు చీపురుతో సహా అమాయక బక్క ప్రాణి. " విన్నారా ఈ విషయం?" విసురుగా అంది. " ఏమిటి ?" విషయం అర్థం కాక బిక్క మొహంతో అడిగాడు. " పక్కింటి పార్వతీశం గారికి ఆడపిల్లట.ఎదురింటి ఏడు కొండలు గారికి మగపిల్లాడట."అంది గోముగా భార్యలో ఇంతమార్పుకి ఖంగు తిన్నాడు రాంభక్తుడు. " ఐతే ,నన్నేం చేయమంటావ్?"సుతి మెత్తగా అడిగాడు. " ఎందుకు మీరూ ఉన్నారు, ముప్పొద్దులా మింగడానికి తప్ప ఎందుకూ పనికిరారు.మీరూ ఒక పాపని కనండీ" " ఏంటీ ... నేనా? పాపని కనాలా?" "ఔను...మీరే? ఏం తప్పా! ఆడాళ్లే కాని మగాళ్లు కనకూడదా?" "తప్పని కాదు, ఎలా కనడం?" తెల్ల మొహంతో అడిగాడు. " వాళ్లు తీర్థ యాత్రల కెళ్లారట. అందుకే వాళ్లకి పిల్లలు పుడుతున్నారు." " అందుకని...?" " మనమూ యాత్రలు చేద్దామండీ! మనకీ ఆ పుణ్యఫలం దక్కి పిల్లలు పుడతారండి."మాట మెత్తబడింది. " అందుకని...?"మరొక విన్నపం " మనం వెల్దాం!" "పరలోక యాత్రా?" కొంచం వ్యగ్యం కనబరిచాడు కంఠంలో " శుభమా అంటూ అవేం మాటలు? తిరుపతి యాత్రకండీ!" "అలాగే , నీ మాట కాదంటే ఊరుకుంటావా?" "మా ఆయన బంగారం, నా మాట కాదనరు. వేగిరం ఇల్లు ఊడ్వండి. అంట్లు ఎదురు చూస్తున్నాయి." మిగిలిన పనులు జ్ఞాపకం చేసింది గజలక్ష్మి. అక్కడే ఉన్న సీతారాముల ఫోటో వైపు తిరిగి " రామా , కలికాలం కాకపోతే, మగవాళ్లు పిల్లల్ని కనడం విన్నామా?" గోడు మొర పెట్టుకున్నాడు ఆంజనేయులు. తన భక్తుడి గోడు విని సీతారాములు చిరునవ్వులు చిందించారు. ఏదెలా జరగాలో అలా జరక్కమానదు. మనసుని ఓదార్చాడు ఆంజనేయులు. ఒక మంచి రోజు చూసి భార్యాభర్తలు తిరుపతి యాత్రకు బయలు దేరారు. పద్మావతి, అలివేలు మంగ సహిత శ్రీనివాసుణ్ణి దర్సనం చేసుకుని తిరుగు ప్రయాణయారు. ప్రయాణంలో హోటల్ తిండి పడక కడుపు ఉబ్బరంతో బాధ పడసాగాడు ఆంజనేయులు. ఎప్పటిలా ఇంటి పనుల్లో నిమగ్నమైన భర్త ఆంజనేయుల్ని పరిశీలనగా చూస్తూ "ఏమండీ, కనబడ్తున్నాయండి" అంది ఆనందంగా. " ఏమిటే?"అర్థం కాక అడిగాడు బక్క శిరోమణి. " అవేనండీ ,సూచనలు" " దేనికి ?" "మన యాత్రా ఫలితం కానొస్తోంది. నేను తల్లిని మీరు తండ్రి కాబోతున్నారు." "ఎవరికి?" " ఎవరి కేమిటి? పుట్టబోయే మన పిల్లలకి"అంది ఆనందంగా " ఇంకా పుట్టలేదు కదే!" " నెలలు నిండిన తర్వాత పుడతారండీ" "ఆలూ లేదు చూలూ లేదు" "రెండూ ఉన్నాయండీ!" "ఎవరికే ?" "మీకేనండీ!"అంది ఆనందంగా "నాకా ?" కంగారు పడుతున్నాడు. " అవునండీ , కడుపు ఉబ్బింది. వాంతులు చేసుకుంటు న్నారు.మీరు కడుపుతో ఉన్నారండీ" అంది సంతోషంతో. " ఆ , నేనా ? ఇదెక్కడి విడ్డూరమే" హడలిపోయాడు. " ఔనండీ , మీరు తండ్రి కాబోతున్నారు.మీకు పూర్తి విశ్రాంతి అవుసరం.ఏ పనీ చెయ్యొద్దు.ఏమైనా తినాలనుంటే భయపడకుండా చెప్పండి. నోరు కట్టుకోకండీ. మీకు ఏ స్వీటంటే ఇష్టం." ఒకటే ఆనందం కనబరుస్తోంది గజలక్ష్మి. ఆంజనేయులికి అంతా అయోమయంగా ఉంది. నేను పిల్లల్ని కనడమేమిటి?విడ్డూరం కాకపోతేను. ఏమైతేనేం , ఈ విధంగానైన ఇంటి చాకిరి నుంచి తప్పించుకో వచ్చు. ఎన్నాళ్లైంది కమ్మని కాఫీ తాగి. అబ్బ , ఇన్నాళ్లకు విశ్రాంతితో పాటు నాకు తినాలనుకున్నవి తినొచ్చు. నా రాముడు మొర విన్నాడు అనుకున్నాడు మనసులో. నాన్నా మీరు తాత కాబోతున్నారన్న కూతురు గజలక్ష్మి చేరవేసిన శుభవార్త విన్న సుబ్బయ్య శెట్టి దంపతులు సంతోషం పట్టలేక పిండి వంటలతో వచ్చి అల్లుడిని అభినందించారు. ఈ మధ్య టీ.వీ.లో మగాళ్లు కూడా గర్భం దాల్చి ఆపరేషను చేసి పిల్లల్ని పైకి తీస్తున్నారని విన్నారట.ఇదీ అటువంటి కేసేమో అనుకున్నారు. ఇంక ఆ నాటి నుంచి ఇల్లరికపు అల్లుడు ఆంజనేయులికి రాజభోగాలే జరుగుతున్నాయి. వద్దంటుంటే నేతివంటకాలు , పాలు పెరుగు యాపిల్స్ వంటి రకరకాల ఫలాలు కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. చాలా కాలానికి సుబ్బయ్య దంపతులు తాత , తాతమ్మ కాబోతున్నారని చుట్టు పక్కల వారి అభినందనలు మొద లయాయి.ఆలశ్యంగానైనా గజలక్ష్మి నీళ్లోసుకుందని చెవులు కొరుక్కున్నారు. ఏమైతేనేం , తనకి అనుకోని అదృష్టం పట్టిందని పొంగి పోతున్నాడు ఆంజనేయులు.ఒళ్లుతో పాటు పొట్ట కూడా బయటకు కనబడుతోంది. ఇలా కొన్ని నెలలుగా కాలు కదపకుండా అత్తమామలు, పెళ్లాం పెట్టిన కొవ్వు తిండితో హాయిగా రోజులు గడుస్తుంటే సడన్ గా ఒక రాత్రి కడుపు నొప్పి ప్రారంభమైంది ఆంజనేయులికి. గజలక్ష్మి , సుబ్బయ్య దంపతులు అల్లుడికి నెలలు నిండి పురిటి నొప్పులు ఆరంభ మయా యనుకుని ఆనంద పడుతూ రిక్షాలో పరాంకుశం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. " డాక్టరు గారూ , మా అల్లుడికి మొదటి కాన్పు ఇది. కాస్త జాగ్రత్తగా కాన్పు చెయ్యండి" ఆతృత వెలిబుచ్చారు. " ఆ , ఏంటీ ! " డాక్టర్ పరాంకుశం ఆశ్చర్యం కనబరిచారు. " కవల పిల్లలేమో ? " ఇద్దర్ని ఎత్తుకోవచ్చనే ఆనందంలో ఉన్నారు సుబ్బయ్య దంపతులు. " ఉండండి , నన్ను పరీక్ష చెయ్య నివ్వండి. నా సర్వీసులో ఇటువంటి విచిత్రమైన కేసు చూడటం ఇదే ప్రధమం." అంటూ ఎగ్జామ్ రూముకి తీసుకెళ్లారు ఆంజనేయుల్ని. అరగంట తర్వాత చేతులు తుడుచుకుంటు బయటకు వచ్చిన డాక్టర్ పరాంకుశం " మీరను కున్నట్టు మీ అల్లుడికి గర్భం కాదు. కాలు కదపకుండా కూర్చొని తినడం వల్ల కడుపులో కొవ్వు గేసులు పెరిగి ఉబ్బరం వచ్చి లీవరు గట్టి పడిందని , వెంటనే నేను రాసిన మందులు వాడి వ్యాయామం చేయిస్తే మామూలు మనిషి కావచ్చని " దైర్యం చెప్పారు. పాపం , పిల్లల కోసం ఎన్నో కలలు కన్న సుబ్బయ్య శెట్టి దంపతులు , గజలక్ష్మి హతాశులయారు. * * *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు