ఉపాయంతో తప్పిన అపాయం - యు.విజయశేఖర రెడ్డి

Vupayam tho tappina apaayam

అది ఒక అడవి అక్కడ అనేక సాధుజంతువులు ఎంతో సంతోషంతో ఉంటున్నాయి.ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక పులి దానితో పాటు నక్క ఆ ప్రాంతానికి వచ్చాయి. సాధుజంతువులన్నీ భయపడసాగాయి. “ఇన్నాళ్లు మీరు ఎంతో స్వేచ్చగా ఉన్నారు..ఇక మీదట మీ ఆటలు సాగవు...ఈ అడవికి మా పులి,రాజుగా ఉంటుంది” అంది నక్క.

“అంతలా భయపెట్టకు వాటిని,నాకు ఆహారంగా రోజుకు ఒక జంతువు కావాలి..,ఎవరిని పంపుతారో మీ ఇష్టం అంది పులి”

“మా సాధుజంతువులన్నిటికీ అంజి అనే కోతి పెద్దగా వ్యవహరిస్తోంది” అంది ఒక జింక.

“అలాగే పులిరాజా!” అన్నీ జంతువులపై దాడి చేయకుండా మీరు తీసుకున్న నిర్ణయం బాగుంది” అంది అంజి.

“చాలా సంతోషం” అంది పులి. “పులిరాజా! మాకు కొన్ని నియమాలు ఉన్నాయి దాని ప్రకారం మీరు నడుచుకుంటే ఎంతో గౌరవంగా ఉంటుంది” అంది అంజి.

“ఓ అలాగే అదంతా సాయంత్రం చూసుకుందాము.. నేను బాగా అలసిపోయాను పడుకుంటాను..నాకు గుహలంటిది చూపించు” అంది పులి.

అంజి రాళ్లతో ఉన్న ఒక గుహను చూపించింది.

సాయత్రం అయ్యింది. అంజి కింద పడ్డ పచ్చి రావి ఆకులను,ఎండిన ముల్లును సిద్ధం చేసి తను ఏం చేయబోతున్నానో తన వాళ్లకు చెప్పింది.

పులి,నక్క బయటకు వచ్చాయి.”ఆ..ఇప్పుడు చెప్పు మీ నియమాలు ఏంటో?” అంది పులి,అంజితో.

“పులిరాజా! నీకు ఆహారంగా రోజుకో జంతువు కావాలి కదా..వాటి పేర్లను ఈ రావి ఆకుల మీద వరుసగా వ్రాసాను..మీరు ఒకసారి చూడండి,మరొక విషయం ఏ జంతువుకైనా ఆరోగ్యం బాగులేక పోతే ఆ జంతువు స్థానంలో తరువాత రోజు వచ్చే జంతువు ఆహారంగా వస్తుంది” అంది అంజి. “ఓ అలాగే.. ఆకులు చూడడానికి నక్క వస్తుంది” అని పులి,నక్కను పంపింది.

నక్క అంజి వద్దకు వచ్చి కొన్ని ఆకులను నోటితో అటూ ఇటూ లాగి “ఇప్పుడు వరుస క్రమంలో పెట్టుకో” అని పులి వద్దకు వెళ్లింది.

“పులిరాజా! రేపు నీకు ఆహారంగా ఒక గుర్రం వస్తుంది” అని చెప్పింది అంజి. “సరే” అంది పులి.

మరుసటి రోజు ఉదయం ఒక గాడిద పులి ఉండే గుహ వద్దకు వెళ్లి ఓండ్ర పెట్టింది. ముందు నక్క తరువాత పులి బయటకు వచ్చాయి. నక్కను చూడగానే పులికి చిర్రెత్తుకొచ్చింది “అదేంటి గుర్రం కదా రావాల్సింది... నువ్వు వచ్చావేంటి?” అంది పులి.

“ఆ గుర్రం నిన్న మిమ్ములను చూసి జడుసుకుంది రాత్రంతా ఒకటే జ్వరం ఇప్పటికీ తగ్గలేదు..అడుగు తీసి అడుగు వేయలేదు..పైగా జ్వరం వచ్చిన గుర్రాన్ని తింటే మీకూ జ్వరం వస్తుంది..దాని తరువాత నా వంతు ఉంది, అందుకే నేను వచ్చాను..రేపు ఎలాగూ పోయే ప్రాణం నాది,ఈ రోజు పోతుంది అంతేకాదా!” అంది గాడిద.

“ఛీ..ఛీ..నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది..నిన్ను ఎలా తింటాను” అంది పులి ముఖమంతా మాడ్చుకుని.

“పులిరాజా! అందరూ నన్ను అసహ్యించుకుంటే ఎలా? మీ లాంటి రాజు నన్ను ఆహారంగా తింటే నాకూ ఎంతో పేరు వస్తుంది..దానితో నాకు మోక్షం కూడా వస్తుంది” అంది గాడిద.

“నన్ను విసిగించకు,గడ్డి అయినా తింటాను గాని,నిన్ను మాత్రం తినను” అంది పులి. “మా పులి రాజు గాడిదను తినదు... నువ్వు వెళ్లి వేరే జంతువును పంపించు” అంది నక్క.

గాడిద వెళ్లి విషయం చెప్పగానే అంజి వచ్చి “రాజా! మా నియమాలు ముందే చెప్పాను..గురాన్ని పంపిద్దామంటే దానికి జ్వరం వచ్చింది,దాని స్థానంలో గాడిద వచ్చింది.మీరు గాడిదను తినకుంటే తరువాత మరే జంతువును కూడా తినడానికి వీలు లేదు” అంది అంజి.

“గాడిదలు ఉంటాయని తెలియక పొరపాటున మీ అడవికి వచ్చాను..నీకు మీ అడవికి ఒక దండం” అని పులి తోక ముడిచి నక్కతో పాటు అడవి నుండి వెళ్లిపోయింది.

ఆ పులి పక్క అడవి నుంచి వచ్చిందని,దానికి గాడిదలు అంటే అయిష్టమని తెలిసిన అంజి,ఎంతో తెలివిగా పన్నిన ఉపాయంతో పెద్ద అపాయం తప్పిందని అన్ని సాధుజంతువులు ఎంతో సంతోషించాయి.

****

మరిన్ని కథలు

Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు