అభిమాని - రాము కోలా.దెందుకూరు

Abhimani

సూర్యుడు తన ప్రతాపాన్ని 45డిగ్రీల ఉష్ణోగ్రత రూపంలో చూపుతూ,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.. వాయు దేవుడు కూడా తాళలేక విశ్రాంతి తీసుకున్నాడేమో,ఎక్కడా ఒక్క ఆకుకూడా కదలడం లేదు. ఇంటి నుండి బయటకు రావడానికి ఏ ఒక్కరూ ఇష్టపడని సమయంలో, సుమారుగా ముప్ఫై అడుగులు ఎత్తులో,ఎండను లెక్క చేయక తన పని తాను చేసుకు పోతున్నాడో యువకుడు. "ఏరా! "ఈపూటైనా నాలుగైదు ముద్దలు బువ్వ తినేది ఉందా?లేదా?" పెద్దయ్య మాటలకు ఓ చిరునవ్వు ఆడి సమాధానం అయ్యింది. అప్పటికే సమయం రెండున్నర కావస్తుంది.. సూర్య భగవానుడి ప్రకోపం 43డిగ్రీలు ఉంది. గత రెండున్నర రోజులుగా ఒకటే పని ఈడికి.. సమయంకు తిండి తినడు,, నిద్దరోడు, "ఏటిరా! ఇది "అంటే.. "పెద్దయ్య! ఆయమ్మకు సన్మానం కదే.! మనం పని చేయకుంటే ఎట్టాగే!", అంటూ పనిలో మునిగిపోతాడు. అలుపు అనేది లేదు పాపం రంగడికి. " ఏరా! ఆయమ్మకు చూసావా? ఎప్పుడైనా…"అంటే.. " పెద్దయ్య! సరస్వతి దేవిని ఆరాధించాలే కానీ, తనే కరుణించి ఎదుట నిలవదా? " "వస్తుందిలే పెద్దయ్య ! తప్పకుండా వస్తుంది.. ఆరోజు." అంటూ ముసిముసిగా నవ్వుతాడు అదేంటో... మనిషిని చూడకుండానే ఇంతోటి అభిమానం నిలుపుకోవడం సాధ్యమేనా !అంటే సాధ్యమే అంటాడు ఈడు... తింగరి వెధవా. " పెద్దయ్య! నాకు ఏదో రాయాలని ఉంటది, కానీ ఏదీ రాయలేను.. " "మరి ఆయమ్మ రాసే అక్షరాలను ఆస్వాదించడం కంటే అదృష్టం మరింకేటుంటది చెప్పు." "మరుజన్మ లోనైనా నాలుగు అక్షరాలు రాయగల అదృష్టం కలగాలని ఆయమ్మ దీవిస్తే అంతే చాలు" అంటాడు.. ఎంటో ఈడి ఎర్రి,ఈడూనూ...! రెండు రోజులుగా ఎండకు ఏమాత్రం ఆరోగ్యం లెక్క చేయక పనిచేస్తున్నాడాయో! చెమట చుక్కచుక్కగా నేల రాలుతుంది, ఆవిరౌతూ. ఆడి ఆయుష్షు తరిగి పోతుందనేందుకు సాక్షిగా ***** "ఒక మహారచయిత్రి. అభిసారిక గారికి సన్మానం.. ఈరోజే ఎంత శుభదినం.. " "కళామతల్లి ముద్దు బిడ్డగా, తన రచనల్తో ఎందరో అభిమానులను, సంపాదించుకున్న సరస్వతీ పుత్రిక ఈ స్త్రీ మూర్తి. అక్షరాలను.. ఆస్వాదించే ఎందరో మహానుభావులు మధ్య, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నిలుపుకున్న ఒక స్త్రీ మూర్తికి జరుగుతున్న సన్మానం.. ఎక్కడ విన్నా! ఇదే మాట. "గత నాలుగు రోజులనుండి రంగడికి ఒకటే సంతోషం". ఆయమ్మకు సన్మానమంటే ఎంత మురిసిపోతున్నాడో.. వీడు. " పెద్దయ్య! మరీ ఈడికి ఇంత పిచ్చి ఎంటి? ఉండబట్టలేక ఆడిగేసాడు పరమేశం.. " ఈడి అమ్మా నాన్నా ఏదో వానాకాలం చదువు చదివిత్తే. నాలుగైదు అక్షరాలు నేర్చించి, ఈడిని వంటరోడిని చేసి ఎల్లిపోతే.. చిన్న చిన్న సంతోషాలను ఆక్షరాలు రాసుకుంటూ.. ఆ అక్షరాలనే ఆరాధించే ఓపిచ్చి సన్నాసి ఈడు. " ఎక్కడ నాలుగు అక్షరాల ముక్కదొరికినా కన్నులకద్దుకుని.. దైవప్రసాదంలా వాటిని మనసున నింపుకునే.. పసితనం ఈ రంగడిది. అటువంటోడికి ఆయమ్మ అక్షరమన్నా. కవితన్నా ప్యానం... సరస్వతీదేవి కటాక్షం లేదుకానీ సరస్వతీ దేవిని ఈయమ్మలో చూసుకుని ఆరాధించడంలో మాత్రం పరవశం పొందే. ఓ వెర్రిబాగులోడు ఈడు... కాయకష్టం చేయడం తప్ప, మరోపని చేయడం తెలియని బండోడు ఈ రంగడు.. మనిషిని మనిషిని కలపలేకున్నా మనసును దగ్గరచేస్తుందేమో.. ఈమొబైల్. "ఎలా తెలిసిందో.. ఏటో.. మొబైల్ పుణ్యమాని , చిన్న చిన్న కవితలు అక్కడ రాసుకోవడం..అవి చదువుకుని మురిసిపోవడం ఈడి పని అలా ఒకరోజు ఈయమ్మ ఈడి కవిత చదివి ఎదో కామెంట్ యెట్టిందంట. అది ఆడి జీవితంలో ఒక పెనుమార్పు తెచ్చిందనే చెప్పాలి. ఉదయం లేవగానే ముందుగా ఆయమ్మ కవిత చదవనిదే. మనసు మనసులో ఉండదంటాడు. ఆయమ్మే ధైవం.. ఆయమ్మే సర్వస్వం ఈడికి. మరి ఆయమ్మకు సన్మానమంటే.. ఈడు సంతోషానికి అవది ఉంటుందా.....!!!. అంటు మురిపంగా రంగడి వైపు చూశాడు పెద్దయ్య.. అభిసారిక 3వభాగం.. "ఒరేయ్ రంగా! "ఒక్క నిముషం ఇలా కూచ్చోరా"! ఆ ఉరుకులు పరుగులేంటిరా? వాళ్ళు చూసుకుంటారు గందా" అన్న నూకాలమ్మ మాటలకు అదోలా చూశాడు రంగడు . "అన్నీ సమయానికి అమరాలా!, అలా కూచుంటే సరిపోద్దేటి.?." అంటునే మైక్ ఎక్వీఫ్ మెంట్ వారి దగ్గరకు పరుగెత్తి, వారికేదో చెప్పి, ఇటుగా ఉన్న టెంట్ వారికి మరేటో చెప్పి,దూరంగా వెహికిల్ పార్కింగ్ ప్లేస్ వారికి మరేదో చెప్పి.. వచ్చి నూకాలు దగ్గర ఒక్క నిముషం అలా కూర్చుని కదిలిపోతూ.. "చూసావా ఎన్ని పనులో, కుకుంటే ఎట్టాగే బామ్మ", అంటు గట్టిగా కౌగిలించుకుని ముసిముసిగా నవ్వుతూనే.. మిగిలిన పనులను చూసుకోవడం లో మునిపోయాడు.రంగడు ****** సమయం దగ్గర పడుతుంది. సభాప్రాంగణం నిండిపోయింది.. ముందు వరుసలో ఒక కుర్చి చూసుకు కూర్చోవాలి, ఆయమ్మని తనివితీరా చూడాలి.. అనుకున్న వాడి ఆశ అడిఆశలు చేస్తూ.. "బాబా ఇది కవులు కూర్చోవడానికి కేటాయించినవి, రెండవ వరస ఉర్లో కాస్త కూస్తో పలుకుబడితో ఉన్న వారు కూర్చోవడానికి.. మూడవ విభాగంలో అమెబందువులకు.. తనకు తెలిసిన. వారికోసం కేటాయించింది కాస్త వెనుక కుర్చీ చూసుకో, తరువాత అదికూడా దొరకదు, అని వాలంటీర్లు చెప్పడంతో చేసేది లేక మరికాస్త వెనక్కి వచ్చెసాడు రంగడు..... అప్పటికే బాగా అలసిపోయాడేమో? నిలబడే ఓపికలేక కాళ్లు లాగేస్తున్నాయనిపిస్తుంది. కన్నులు మసక బారుతున్నాయ్... అంతా బూదరగా కనిపిస్తుంది.. కాస్త ఎదైనా ఆసరా దొరికితే బాగు అనుకునే స్థితి రంగడిది ఆక్షణం. "పెద్దయ్యా!" "ఎదోలా ఉందే, గుండెల్లో నెప్పిగా ఉందే! కాస్త తోడుగా పక్కన నిలబడే. ఆయమ్మ రాగానే ఒక్కసారి చూసేసి యెల్లిపోదామే. ఈ చిన్నకోరిక కాదనకే" అంటూ పెద్దయ్య చేతులు పట్టుకున్న రంగడిని చూస్తే మనసు ద్రవించింది పెద్దయ్యకి. కాసిని నీళ్ళతో శుభ్రంగా ముఖం కడిగి, తూడ్చి నీళ్ళు తాపి గుండె సర్ది పక్కన రాతిపై తోడుగా కూకోబెట్టుకున్నాడు పెద్దయ్య. **** మైకులో ఆయమ్మ కవితలు చదువుతున్నారు! ఎంత మధురంగా లిఖించింది, రాధాకృష్ణుల ప్రణయం.. వెంటనే మరో కవిత కన్నయ్య అల్లరంతా రంగరించి.. మరో కవిత ఆత్మసారూప్యతపైన.. మరొకటి తన మావకోసం ఎదురు చూసే రంగి కవిత "ఎంత బాగా లిఖించిందో ఇన్నావా పెద్దయ్య.. అసలు ఆయమ్మకు తెలియనిదే లేదేమో?.. జననం.. మరణం.. విధి విలాసం.. ధాంపత్య మధురిమలు... ప్రకృతి సోయగాలు.. అనుబంధాలు ఆప్యాతలు.. ఎన్ని ఎన్ని కవితలో," "పెద్దయ్య!ఒకసారి ప్రశ్నించ! ఆత్మ అంటే ఎంటి! ఆత్మను ధైవంలో లీనం చేయాలంటే ఎలా? అని." " ఎంత బాగా సమాధానం ఇచ్చిందనుకున్నావ్," " మరోసారి! రాముడు గొప్పా? కృష్ణుడు గొప్పా! అని," " ఏటి ఇంటున్నావా! ఎంత బాగా చెప్పిందనుకున్నావు! నాకే ఇంతగా అర్దమౌతే ఇక చదువుకున్నోలకి ఎంత బాగా నచ్చి ఉండాలో కదా?" అందుకే ఆయమ్మ కవిత్వం అందరికీ నచ్చుతుంది అలా చెబుతున్న ఆడి కన్నుల్లో మెరుపు, ఆయమ్మపై అభిమానంకు సాచ్చికమేమో అనేలా. సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమ్రోగుతుంది... జయ జయ ధ్వానాల్తో సభాప్రాంగణం మారు మ్రోగుతుంది, ఆమె రాకకు స్వాగతంలా" "బంగారు మేని ఛాయకు, నుదుట విభూతి రేఖలు, పాపిట కాశ్మీర్ కుంకుమ,, అధరాలపై చిరునవ్వుతో, మెడలో రుధ్రాక్షమాల, హిందూ వివాహ వ్యవస్థపై గౌరవంగా నిలిచే నల్లపూసలతో ధరించిన మంగళసూత్రాల హారంతో.. వెన్నెలమ్మకు ప్రకృతే దగ్గరగా ఉండి ముస్తాబు చేసినంత అందంగా ఉందా స్త్రీ మూర్తి." కన్నుల పండుగే సభావేదిక. ఎందరు వేదిక పైనున్నా! ఆమె రూపమే ప్రత్యేకతను సంతరించుకుంది.. ఎందరో గొప్ప గొప్ప రచయితలు, రచయిత్రులు వేదిక పైన.. "నింగి లోని తారలన్నీ వేదికపై నిలచెనేమో అనేలా". మంగళహారతులు.. ఆహ్వాన గీతికలు, సన్మాన కార్యక్రమం.. స్వర్గంలో జరుగుతున్నంత వైభవంగా జరుగుతుంది. అందరూ.. ఆమె రచనలు గురించి వివరిస్తుంటే, ఇక్కడ రంగడి మనసు ఆనందబాష్పాలుతో వర్షిస్తూంది.. పెద్దయ్యా! ఇన్నావా,ఎంత గొప్పగా చెపుతున్నారో! ఆయమ్మ గురించి.. ఎన్ని జన్మల పూజాఫలమో కదా! ఆయమ్మ కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసినారో... తల్లిదండ్రులకు ఇంతకు మించి మరేటి కావాల? అంటూ ఆనందంతో పులకించే మనసును అదుపు చేయాలి అకున్నదేమో, మరోసారి గుండెలు పిండేసేలా నెప్పి రంగడి ఛాతిలో. "ఉరుములు మెరుపుల్తో భీభత్సం సృష్టించిన ప్రకృతి," సడెన్ గా నెమ్మదిస్తే ఎలా ఉంటుందో, "అలా ప్రశాంతంగా... నిశబ్దం గా మారిపోయింది సభా ప్రాంగణం." కారణం !ఆయమ్మ మైకు ముందుకు రావడమే " అని చెప్పనవసరం లేదేమో. " గళం... సరిగమలు పలుకుతుంది" అక్కడ ఉన్న ప్రతి హృదయం కవితా పరవశంతో పులకిస్తుంది.. అక్షరం మయురమై నర్తిస్తుంది.. ఎన్నో ఎన్నో రమణీయ దృశ్యకావ్యాలు... ఎన్నో సమ్మోహన మధురిమలు... ఎన్నో దాంపత్య మాధుర్యాలు.. ఎన్నో రాధాకృష్ణుల ప్రణయ కవితలు... ఆయమ్మ నోట.. మురిసింది.. పరశించింది రంగడి మనసు.. అక్షరంలో ఓలలాడిన మనసు... అదే అక్షరం తన అభిమాన కవయిత్రి గళంలో వింటూ... వింటూ... వింటూ.. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది... కరతాళ ధ్వనులు మధ్య సభ ముగింపు పలకడం... రంగడి ప్రాణం.. అనంత విశ్వం వైపు సాగడం... ఒకే సారి... సభా ప్రాంగణం జనసందోహంతో.. ఆనంద పరవంశంతో పెద్దయ్య చేతుల మధ్య రంగడు......... సభా వేదిక వైపే చూస్తున్న కన్నులు.. బలవంతంగా మూసేసాడు పెద్దయ్య... తనకు తోడుగా ఉండమని పలికిన రంగడు ఇక లేడని తెలిసి. . *సమాప్తం*

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు