"ఈ పెళ్ళి రోజుకైనా నెక్లెస్ పట్టు చీర కొనేది ఉందా! లేదా?".గత ఐదారు సంవత్సరాలుగా ఎదో ఒక సాకు చెప్పి దాటవేస్తూనే ఉన్నారుగా!, ఇంకెంత కాలం చెపుతారిలా?". ఉదయం ఆఫీసుకు బయలుదేరే ముందు శ్రీమతి మాటలు. భార్య నోటినుండి వెలువడిన భరిసెల్లాంటి మాటలు వెంటాడుతుంటే,తల వంచుకుని బాస్ రూమ్ డోర్ దగ్గర అర్ధగంట నుండి ఎదురుచూస్తూనే ఉన్నాడు వర్ధన్. లోపల నుండి తన బాస్ ఏక్షణమైనా! పిలుస్తాడనే ఆశతో!పిలుపు కోసం. "వర్ధన్ గారు! సార్ పిలుస్తున్నారు రండి" అంటున్న ఎకౌంటెంట్ గుర్నాధం గారి వైపుకు కృతజ్ఞతలు నిండిన చూపుల్తో చూస్తూ, బాస్ గదిలోనికి అడుగుపెట్టాడు వర్ధన్. "మిష్టర్ వర్ధన్!మరోసారి లోన్ కొసం అప్లై చేసారు! ఎందుకిలా?" "గతంలోనే మీకు ఒకసారి గుర్తు చేసాను,మర్చిపోయారా?" "మీ జీతం లోన్ కటింగులకు ఎక్కువగా పోతుంది.చాలిచాలని జీతంతో ఎలా కుటుంబం సర్దుకుంటున్నారో అర్దం కావడంలేదని" "అయినా!తిరిగి లోన్ కోసం దరఖాస్తు చేసారు" "ఇలా అయితే ఎలా వర్ధన్ చెప్పండి?" బాస్ మాటల్లో ఎక్కడా అధికార స్వరం వినిపించలేదు. వర్ధన్ పరిస్థితులను అర్దం చేసుకునే ఒక ఆత్మీయ స్వరం మాత్రమే వినిపించింది వర్ధన్ కు. "మీరు చెప్పారు సార్!కానీ?" అంటూ బాస్ వైపు కనులెత్తి చూడలేక పోయాడు వర్ధన్. వర్ధన్ కు తెలుసు బాస్ తనని ఎంత గౌరవంగా చూసుకుంటాడో. అందుకే మరేమీ మాట్లాడలేక పోయాడు. "మీ ఆత్మాభిమానం అర్దం చేసుకోగలను వర్ధన్" చేబదులుగా ఇస్తానంటే తీసుకోరు" "అప్పుగా ఇస్తానంటే తీసుకోరు" "లోన్ ఇస్తే చాలంటారు..." "అందుకే నీకు లోన్ మంజూరు చేసాను." "ఈ సంవత్సరం హెచ్ ఆర్ సీ.పెరగడంతో నీకు లోన్ ఇవ్వడం సులువైంది లేకుంటే ,అవకాశం లేకపోయేది" "లంచ్ తరువాత గుర్నాధం గారి దగ్గర లోన్ ఎమౌంట్ కలెక్ట్ చేసుకొండి" అంటున్న బాస్ కు చెతులెత్తి నమస్కరించి "అలాగే సర్!" అనేసి బాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసాడు వర్ధన్. మనసు కాస్త ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపించడంతో ఆఫీసుకు ప్రక్కనే ఉన్న ఇరానీ కేఫ్ లో టీ త్రాగేసి తిరిగి తన సీటులో రిలాక్స్ గా పనిలోకి పరకాయ ప్రవేశం చేసాడు వర్ధన్. ****** "పనిలో లీనమైతే చుట్టూవున్న ప్రపంచాన్నే మీరు మరిచిపోతే ఎలా !" "చూడండి! ఆఫీసు స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు," "మీరు నేను మాత్రమే మిగిలిపోయాం" అంటున్న గుర్నాధం మాటల్తో వాస్తవంలోకి వచ్చాడు వర్ధన్. "ఓ!సారీ గుర్నాధం గారు గమనించలేదు ,అంటూ చూట్టు చూసాడు వర్ధన్. నిజమే తన సహ ఉద్యోగులు అందరూ వెళ్ళిపోయారనేందుకు నిదర్శనంగా ఖాళీ కుర్చీలు నవ్వుతూ కనిపిస్తున్నాయ్ . టైం చూసుకున్నాడు 6:15ని చూపిస్తుంది గోడ గడియారం. చకచకా టేబుల్ పైన ఉన్నవి సర్దేసి.తన టేబుల్ కు లాక్ వేసి .తన బ్యాగ్ తీసుకొని ఆఫీసు బయటకు వచ్చేసాడు వర్ధన్. ఆకాశం మబ్బులు పట్టింది.ఏక్షణమైనా వర్షం రావచ్చు అనేలా ఉరుములతో గుర్జిస్తుంది. తన స్కూటర్ తీసి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసాడు.కానీ ఫలితం లేదు. ఇంటర్ చదివే రోజుల్లో తన తండ్రిగారు కొనిపెట్టిన స్కూటర్ అది. అందుకే ఆస్కూటర్ అంటే వర్ధన్ కు చెప్పలేనంత ఇష్టం. చేసేది ఏమీ లేదు దగ్గర్లో ఉన్న మెకానిక్ షాపు దాకా నడిపించుకు వెళ్ళి. "ఇదిగో పాషా!కాస్త నా స్కూటర్ చూడు. ఎందుకో స్టార్ట్ కావడం లేదు"అనేస్తూ దగ్గర్లో ఉన్న స్టూల్ దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు వర్ధన్. మెకానిక్ బండి వంక చూస్తూ! "ఎన్నో సార్లు రిపేర్ చేసినా,ఈ సమస్య మాత్రం మొదటికే వస్తుంది." "స్పేర్ పార్క్స్ దొరకడం లేదు సార్,ఇది మార్చి కొత్తది తీసుకొండి." "కావాలంటే లోన్ నే ఇప్పిస్తా" బండి మార్చేయండి సర్." అనే మెకానిక్ మాటలు వినలేక . "చూడు పాషా!" "నీ వయసు సుమారుగా 40దాకా ఉంటుంది." "అంటే మీ నాన్నగారి వయస్సు 60దాకా ఉండవచ్చు." "అంత వయస్సు వచ్చిన నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు అనే మంచి పేరుంది.నీకు" "మంచంకే పరిమితమైన మీ నాన్న గారిని ఎవ్వరైనా చులకనగా మాట్లాడితే నీకు ఎంత బాధకలుగుతుందొ? నా బండి విషయంలో కూడా అంతే." "తల్లిదండ్రులు జ్ఞాపకాల్లో కాదు గుండెల్లో ఉండాలి మరోసారి ఎప్పుడూ బండి మార్చుకోండి అనే సలహా మాత్రం ఇవ్వకు." "ఎంత ఖర్చు అయినా పర్వాలేదు రిపేర్ చేస్తూనే ఉండు." "బండి నాతో ఉంటే !మా నాన్న నాతో ఉండి నన్ను నడిపిస్తున్నంత మనోధైర్యం కలుగుతుంది." మరో సారి ఎప్పుడూ ఇలా అనకు వర్ధన్ మాటలు వింటూ,రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు పాషా. మీకు మీ నాన్నగారి పట్ల ఉన్న గౌరవానికి ఇవి అని మనసులో అనుకుంటూ.✍️