అమర్యాద రామన్న - పద్మావతి దివాకర్ల

Amaryada Ramanna

ఆదివారం సాయంకాలం బిగ్‌బజార్‌కి వెళ్ళినప్పుడు చాలారోజుల తర్వాత నాకు చిన్నప్పటి స్నేహితుడు రాజారావు కనిపించాడు. కొద్దిసేపు నిలబడి మాట్లాడుకున్న తర్వాత, "పద!...అలా కాఫీ తాగుతూ మాట్లాడుదాం!" అన్నాడు రాజారావు. ఇద్దరం దగ్గరలోనే ఉన్న హోటల్లోకి దారితీసాం.

కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మా సంభాషణ స్నేహితుడు రామారావు మీదకు మళ్ళింది.

"ఒరేయ్! ఈ మధ్య మన రామారావు చాలా మారిపోయాడురా! బొత్తిగా అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? వాడు ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తాడని నేను ఊహించనైనా లేదు." చెప్పాడు రాజారావు.

రాజారావు మాటలు విన్న నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మా మిత్రుల్లోనేకాక మా ఊళ్ళోనే అత్యంత మర్యాదస్తుడిగా పేరుపొందాడు రామారావు. ఎంత మర్యాదస్తుడంటే, వాడి అసలుపేరు ఎవరికీ గుర్తురాదుకాని, 'మర్యాద రామన్న ' అంటే ఠక్కున గుర్తుపడతారందరూ. రామారావు మర్యాద, మన్నన, సంస్కారం కారణంగా అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆఫీసులో కూడా అందరితో చాలా స్నేహంగా ఉంటాడు. తన పైఅధికారులతో ఉన్న మంచి సంబంధాలకారణంగా అతి త్వరలోనే ఉద్యోగంలో పదోన్నతులు సాధించగలిగాడు కూడా. అతను మర్యాదస్థుడు మాత్రమే కాదు, నిజాయితీపరుడు, మొహమ్మాటస్తుడు కూడా. ఎంతటి మొహమ్మాటస్తుడంటే, తనవద్ద అప్పు తీసుకున్న వాళ్ళని తిరిగి తీర్చమని అడగడానికి కూడా మొహమ్మాటం అతనికి. ఎవరైనా తమ కష్టాలు ఏకరవు పెడితే కరిగిపోయే స్వభావం రామారావుది.

అతని బంధువర్గంలో కూడా అతన్ని'మర్యాద రామన్న ' అనే పిలుస్తారు. అతని బంధువర్గంలో వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అతనింటికి వెళ్తే అతను చేసే మర్యాదలకి, ఆతిథ్యానికి ఎవరైనాసరే తబ్బిబ్బవాల్సిందే! అతను ముంబైలో ఉండగా ఒకసారి అక్కడికి వెళ్ళడం తటస్థించింది. నేను అక్కడున్నన్ని రోజులూ తను ఆఫీసుకి సెలవు పెట్టుకొని నా వెంట తిరిగిమరీ ముంబై అంతా చూపించాడు. అతని భార్య సుమతి కూడా అతనికి తగ్గ ఇల్లాలే. ఆమె కూడా చాలా మర్యాదస్తురాలు. టాక్సీ ఖర్చులు కూడా తనే భరించాడు నేనెంత వారిస్తున్నా వినకుండా. నేను ఖర్చు పెట్టడానికి డబ్బులు తీయబోయినప్పుడల్లా సున్నితంగా వారించేవాడు. స్నేహితులతోనేకాక, ఇరుగుపొరుగువాళ్ళతో కూడా చాలా సఖ్యంగా ఉండేవాడు. అంత మర్యాదస్థుడని పేరుపొందిన రామారావుపై రాజారావు ఇలాంటి అభాండం మోపడం నన్ను ఆశ్చర్యపరచింది. రాజారావు నోట రామారావు అమర్యాదకర ప్రవర్తన గురించి విన్న నేను నోరెళ్ళబెట్టాను. చాలా విస్మయానికి గురైయ్యాను. ఆ విషయం నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది.

అలాగే ఈ నెలరోజుల్లో కలసిన స్నేహితులు చాలామంది రామారావు ప్రవర్తనపై నా వద్ద తమ అసహనం ప్రకటించారు. ఆఖరికి సొంత బంధవులుకూడా నిరసన వ్యక్తం చేసారు. ఉన్నట్టుండి రామారావు ఇలా అమర్యాద రామన్నగా మార్పు చెందడం నాకు ఏ మాత్రం మింగుడుపడలేదు.

ఆ రోజు ఆఫీసునుండి ఇంటికి వచ్చిన నాకు కాఫీ ఇచ్చి మా ఆవిడ, "ఇది చూసారా! మీ స్నేహితుడి భార్య ఎంత అనాగరికంగా తయారైందో?" అంది.

పరధ్యానంగా ఉన్న నేను, "ఎవరూ...ఎవరిగురించి మాట్లాడుతున్నావు?" అని అడిగాను.

"అదేనండీ!...మీరు మర్యాదరామన్న అని ముద్దుగా పిలుచుకుంటారే రామారావు, అతని భార్య సుమతి గురించే నేను చెప్పేది! ఈ మధ్య ఎంత అమర్యాద చేస్తున్నాదనుకున్నారూ!" సాగదీసిందామె.

శ్రీమతి నోట కూడా అదేమాట విని నిర్ఘాంతపోయాను.

"ఏమిందిప్పుడు? నీకు ఏమి అమర్యాద చేసిందామె? మనం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఎంతో ఆదరంగా చూసుకున్నారు కదా వాళ్ళిద్దరూనూ." అన్నాను ఆశ్చర్యపోయి.

"ఆ మర్యాద సరే! ఆవిడ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లనంటికీ నేను క్రమం తప్పకుండా ప్రతీదానికీ లైకులు కొడుతూనే ఉన్నాను కదా! నేను పెట్టిన ఒక్కదానికీ ఆమె లైకులు కొట్టదే! అలాచేస్తే ఆమె ఆస్తేమైనా తరిగిపోతుందా, కరిగిపోతుందా? ప్రతీరోజూ నేను వాట్సప్‌లో సందేశాలు పంపినా ఏమాత్రం స్పందించదామె! ఇప్పటివరకూ ఒక్కసారికూడా 'శుభోదయం' అని మెసేజ్ పెట్టదే! అలాంటివాళ్ళని అమర్యాదస్తులని అనక ఇంకేమంటామండీ? మర్యాదంటే ఇచ్చిపుచ్చుకోవాలిగానీ, ఎప్పుడూ ఒకసైడే అవకూడదు కదా!" అందామె.

అవును! అందరిదీ ఒకటే మాట! రాజారావు, నా ఇతర స్నేహితులుకూడా ఇదే మాట అన్నారు. మర్యాదకి నిర్వచనం చాలా మారిపోయింది. రామారావు ఎంత మంచివాడైనా, మర్యాదరామన్న ఐనా తమ ఫేస్‌బుక్ పోస్టులకి లైక్ కొట్టకపోతే అమర్యాదస్తుడే మరి! వాట్సప్‌లో మెసేజ్ పెట్టకపోతే ఘోరమైన అపరాధం చేసినట్లే మరి! ఈ సామాజిక మధ్యమాల మత్తులో పడి మునిగితేలే వాళ్ళకి అవన్నీ అమర్యాదలే! రామారావు, అతని భార్య పరిస్థితి అంతే! వాడి మర్యాద, మంచితనం అన్నీ గంగలో కలిసినట్లే ప్రస్తుత పరిస్థితుల్లో! మనిషి ఎంత మర్యాదుస్థుడైనా ఇలా ప్రవర్తిస్తే అనాగరికుడికింద, అమర్యాదస్తుడి కిందే లెక్క కడతారు జనం!

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు