అతి ఆలోచనలు - గంగాధర్ వడ్లమన్నాటి

Ati aalochanalu

“ఏవిటిది! ,ఈ రైలు బోగీలో ఏసీ మరీ ఎక్కువున్నట్టుందే. యువకుడ్ని నాకే ఇలా ఉంటే ,వయసైన వాళ్ళు బొంతలు కప్పుకోవాలి కాబోలు” అనుకుంటూ మరో దుప్పటి తీసి కప్పుకున్నాడు. తరువాత కొద్దిసేపటికి “అబ్బా ఏవిటిది రెండు దుప్పట్లు కప్పుకుంటే ఉక్క పెడుతోందే, సరే ఇలా చేద్దాం”.అని ఆ దుప్పటి బాగ్ లో పెట్టేసి ఒక టవల్ తీసి కప్పుకున్నాడు.తరువాత కొద్దిసేపటికి వాష్ రూమ్ కి వెళ్దామని లేచాడు.అటు నడుస్తుండగా , టాయిలెట్ దగ్గర ఒకడు,మధు పక్క బెర్త్ అమ్మాయిని అడ్డగించి, ఆమెను బెదిరిస్తున్నట్లుగా అర్థo చేసుకున్నాడు . కారణం, అతని చేతిలో చిన్న కత్తి కూడా ఉంది. దాంతో వెంటనే ఓ గంతు గెంతి , “రేయ్” అని గట్టిగా అరవడంతో, అతను ఆమెని పక్కకి తోసేసి , వేరే బోగీలోకి పారిపోయాడు.అయినా “ఆగు ,ఇందాకే బోంచేసాను ,పరిగెత్తలేను” అంటూ వెంబడించాడు. కానీ ,ప్రయోజనం లేదు. సరే అని వెనుదిరిగాడు. ఆమె ముఖంలో కాస్త ప్రశాంతత చోటుచేసుకుంది. “థాంక్యూ అండి” అందామె.

వారి వారి బెర్తుల దగ్గరికి చేరారు ఇద్దరూ .

“మీ రుణం తీర్చుకోలేను” చెప్పిందామె

“పర్వాలేదు కానీ, ఇలా పాత డైలాగులు మాత్రం చెప్పకండి.మీకు వీలైన చిన్న సాయం చేస్తే చాలు” నవ్వాడు మధు.

“పర్వాలేదు నన్ను మీ సోదరి అనుకునే చెప్పండి”. చెప్పిందామె .

“అయితే సరే ,రేపు ఉదయం అడుగుతాను.తప్పకుండా చేయాలి మరి” అన్నాడు చిరునవ్వుతో .

“సరే” అందామె.

మరుసటి రోజు ఉదయం లేచి వాచీ చూసుకున్నాడు. అప్పటికే టైం 7:30 అయింది. “టి.టి.చాయ్” అంటూ కంపార్ట్మెంట్లో ఒకడు గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు.

“గుడ్ మార్నింగ్” చిన్నగా నవ్వి “ఇప్పుడు చెప్పండి నేను ఏ సాయం చేయగలనో” అడిగిందామె.

“అదీ ,మరీ” నసిగాడు.

“పర్వాలేదు చెప్పండి” అందామె.

“అయితే మీరు నిన్న సాయంత్రం, మీ పక్కన కూర్చున్న అమ్మాయితో, మీరు హెచ్ఆర్ రిక్రూట్మెంట్ మేనేజర్ అని చెప్పారు కదా ,అది నేను విన్నాను. కాబట్టి మీ కంపెనీలో ఏదైనా ఒక ఉద్యోగం” అడిగాడు.

ఆమె ఆశ్చర్యపోయింది. “వెరీ సారీ, ఆ కంపెనీ కోవిడ్ కారణంగా ఇప్పుడు మూసేశారు. నిన్న కాస్త గొప్పకి పోయి ఎక్కువ వాగేసాను” చెప్పిందామె చిన్న స్వరంతో.

“అలాగా” అని బిక్కమొహం వేసాడు మధు. “అనవసరంగా ఈమె ఆ కంపెనీలో ఎంప్లాయూస్ ని రిక్రూట్ చేసే మేనేజర్ గా పనిచేస్తుందనీ, నాకు కూడా ఓ జాబ్ ఇప్పిస్తుందని అతి ఆలోచనలు చేశాను . దానికి ఓ పథకం ప్రకారం, ఆమె వాష్ రూమ్ కి వెళ్లడం గమనించి,పక్క బోగీలో ఉన్న నా ఫ్రెండ్ ని దొంగలా యాక్ట్ చేయమని చెప్పాను కూడా .అంతా వేస్ట్” అనుకున్నాడు మనసులో.

ఇంతలో ఏదో నెంబర్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసాడు. “నీ ఫ్రెండ్ బీ వన్ బోగీలో అటూ ఇటూ అనుమానంగా తిరుగుతున్నాడని మాకు సమాచారం వస్తే అతన్ని పట్టుకున్నాo. ఇదంతా నీ పథకం అని చెప్తున్నాడు. ఓసారి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కి రా” చెప్పాడు ఎస్సై.

బిత్తరపోయాడు మధు. జీవితంలో ఏదైనా కష్టపడే సాధించాలి .షార్ట్ కట్స్ వేతక్కూడదు.అవి ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పిన అతని తండ్రి మాటలు గుర్తొచ్చాయి కానీ అప్పటికే ఆలస్యం అయిందని గ్రహించాడు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు