మనసుకే మంచి తోస్తే - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Manasuke manchi toste

రామయ్య, రాఘవయ్య ఇద్దరూ ఇరుగు పొరుగు వారు. వాళ్ళ ఇళ్లే కాదు, తోటలు కూడా పక్కపక్కనే ఉండేవి. రామయ్య తోట లోని జీడి పళ్ళను తెచ్చుకుని రాఘవయ్య తోటలోని విప్పచెట్టు మీద కూర్చుని తినేవి పక్షులు. పండు తినగానే దానితో పాటు ఉన్న పిక్కలు కిందకి పడిపోయేవి. తెల్లారేసరికి మూడో కంటికి తెలియకుండా విప్పచెట్టు దగ్గరకి వెళ్లి కిందపడిన జీడిపిక్కలన్నీ ఏరుకుని పట్నం లో అమ్ముకునే వాడు రాఘవయ్య. ఇలా ఉండగా రామయ్య తన ఇంటి ఆవరణలో ఒక మామిడి మొక్కను నాటి దానికి నీళ్లుపోసి ఎంతో ప్రేమగా పెంచాడు. కొన్నేళ్లకు ఆ మొక్క పెరిగి పెద్దదైంది. బాగా విస్తరించడంతో కొన్ని కొమ్మలు రాఘవయ్య ఇంటి వైపుకు కూడా వెళ్లాయి. వేసవి వచ్చింది చెట్టంతా మామిడి కాయలతో కళకళ లాడింది. ఆ కాయలను కోయకుండా పక్షులకోసం విడిచిపెట్టాడు రామయ్య. కాయలు పళ్ళు అయ్యాయి. రామచిలుకలతో పాటు అనేక పక్షులు ఎక్కడెక్కడి నుంచో ఆ చెట్టు మీదకు వచ్చి మధురమైన ఆ మామిడి పళ్ళను తిని సందడి చేసేవి. చెట్టును పండిన పండు ఎంతో తియ్యగా ఉండటం తో ఆ దారంట పోయేవాళ్ళు నేల రాలిన పళ్ళను ఏరుకొని తినేవారు. కొన్ని పక్షులు ఆ చెట్టుమీదే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండేవి. సాయంత్రం వేళల్లో ఆ పక్షుల పిల్లలు చేసే అల్లరి వింటూ రామయ్య అతని భార్య ఎంతో ఆనందించేవారు. రాఘవయ్య అతని భార్య మాత్రం తమ వాకిలి అంతా చెత్త తో నిండిపోతోందని, చాకిరీ చెయ్యలేక పోతున్నామని రామయ్య కుటుంబంతో రోజూ గొడవకి దిగేవారు. చేసేదేమీలేక మిన్నకుండేవారు రామయ్య దంపతులు. ఒకరోజు రాఘవయ్య భార్యతో "ఈ చెట్టుకు దాదాపు వెయ్యకు పైగా మామిడి కాయలు ఉండొచ్చు అమ్ముకుంటే బోలెడు సొమ్ము వచ్చేది కదా!. నేను చూడు మనకి జీడి చెట్టు లేకపోయినా రోజూ జీడిపిక్కలు అమ్మి డబ్బులు ఎలా సంపాదిస్తున్నానో బతకడమే చేత కాదు ఈ రామయ్యకి." అన్నాడు బడాయిగా. తలెత్తి చెట్టునే చూస్తున్న రాఘవయ్య ముఖం మీదకి ఒక పక్షి ఈక, దానితో పాటే గూటిలో చెత్త ఎగిరి పడ్డాయి. "ఛీఛీ చెత్త .. చెత్త.. పళ్ళు తిని పోకుండా గూళ్ళు పెట్టి మరి కుటుంబాలు నడుపుతున్నాయి. వీటి పని చెప్తాను ఉండు" అని ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి కొమ్మను నరకబోయాడు. ప్రమాదాన్ని గ్రహించిన తల్లి పక్షులు పైకెగిరి రెక్కలు టప టప లాడిస్తూ అక్కడే తిరగసాగాయి. రెక్కలు రాని చిన్న పిట్టలు ఎర్రటి నోళ్ళతో అరుస్తూ ప్రాధేయపడినట్లు కనిపించేయి. వాటిని చూడగానే రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. " మూగ జీవాలైనా వీటికి పరోపకార బుద్ధి ఉంది. వీటి సాయం పొందానన్న విషయం మరిచి వాటికి ఆశ్రయమైన చెట్టుకొమ్మలు నరకాలనుకున్నాను. వాటికి ఆశ్రయమిచ్చిన రామయ్యను తప్పుగా అర్ధం చేసుకున్నాను. చెట్టుకొమ్మలు నరికితే గూళ్ళు నేల రాలి ఈ పక్షులు నిరాశ్రయులవుతాయి. ఎగిరే శక్తి లేక ఆ పిల్లలు ప్రాణాలొదులుతాయి " అని బాధపడి ఎత్తిన చేయి దించేశాడు. ఒక గిన్నెతో నీళ్లు తెచ్చి చెట్టుకింద పెట్టాడు. అంత వరకు పైన తపతపలాడుతూ తిరిగిన తల్లి పక్షులు రివ్వున ఎగిరి రెండు మధురమైన పళ్ళను నోటకరచుకొచ్చి రాఘవయ్య ముందు పడేసాయి. పిట్టలు గూటిలోకి చేరి పిల్లలతో కువకువలాడాయి. రాఘవయ్యలో మార్పుకు సంతోషించారు రామయ్య దంతులు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు