ప్రక్రుతి మలిచిన శిల్పాలు - వెంకట రమణ శర్మ పోడూరి

Prakruthi malachina shilpalu

ఆదిత్య ఎన్క్లేవ్ లో మూడో బ్లాక్ లో లిఫ్ట్ ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాడు చక్రవర్తి . లిఫ్ట్ పనిచేయటం లేదని వాచ్ మాన్ వచ్చి చెబితే మెల్లిగా మూడో ఫ్లోర్ కి ఎక్కి ఆరో నంబెర్ ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కాడు. ఆఫీసు టయిమ్ అయితే ఇంట్లో ఉండడెమో నని, ఉదయం ఎనిమిదింటికే వచ్చాడు చిన్ననాటి మిత్రుడు 'చెరుకూరి' ని కలవడానికి. చిన్నప్పుడు, మూడు నాలుగు ఇనీషియల్స్ తో పేర్లు ఉన్నా ఇంటిపేరు పెట్టి పిలుచుకోవడమె జరిగేది . "ఒరేయి చెరుకూరి అంటే ఒరేయి కొండూరి" అనితలుపు తీసి " ఎవరు కావాలండి? " అంది రాజ్య లక్ష్మి. చెరుకూరి భార్య కాబోలు అనుకున్నాడు చక్రవర్తి." చెరుకూరి, సారీ నారాయణ లేడాండీ?" అన్నాడు"లేరండి. ఆఫీసు లో ముఖ్యమయిన పని ఉందని ఏడింటికే వెళ్లి పోయారు" అంది రాజ్యలక్ష్మి" వాడూ నేను చిన్నప్పుడు చదువుకున్నాం. పని ఉండి ఈ ఊరు వచ్చాను. ఒక మాటు కలిసి వెడదామని వచ్చాను" అన్నాడు నవ్వుతూ" అలాగా. లోపలికి రండి" అంది తలుపు పూర్తిగా తెరిచిలోపలికి నడిచి ఒక పెద్ద సోఫా ఉంటె అందులో కూర్చున్నాడు చక్రవర్తి . ఆమె మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "కూర్చోండి. ఆయన కి ఫోన్ చేస్తాను". అంది లోపలికి వెడుతూ"సీతమ్మగారూ! సార్ కి కాఫీ ఇయ్యండి' అంది కిచెన్ కేసి చూసిచక్రవర్తి ఎదురుగా ఉన్న పేపర్ తీసి హెడ్ లైన్లు చూశాడు. దృష్టి నిలవలేదు చిన్నతనం మీదకి పోయింది మనసు.

చక్రవర్తి వాళ్ళు నరసాపురం లో టైలర్ హైస్కూల్ వెనకాల రోడ్డు లో ఉండేవాళ్ళు.వాళ్ళ నాన్న, రామచంద్రం ఆంధ్రా బ్యాంకు లో పనిచేసే వాడు. ఫస్ట్ ఫాం లో 'ఇంటూ ఫస్ట్ ఫాం" అని పరీక్ష గురించి తెలియడం లేట్ అవడం వల్ల టైలర్ హైస్కూల్ లో సీటు రాలేదు. వాళ్ళ నాన్నపనిచేసే బ్యాంకు లోనే ఖాతా ఉన్న కృష్ణయ్య గారు, బ్యాంకు కు వచినప్పుడు తన కొడుకు గురించి రామచంద్రం చెప్పడంతో, తాను హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న మునిసిపల్ స్కూల్ లో చేర్చమని చెబితే చక్రవర్తి ని అక్కడ చేర్చారు. కాని ఆ స్కూల్, చక్రవర్తి వాళ్ళ ఇంటికి కొంచం దూరం. అయినా రోజూ నడిచి వెళ్ళేవాడు.మొదటి రోజు, తన పక్కన కూర్చున్న' చెరుకూరి నారాయణ' హెడ్ మాస్టారి అబ్బాయి అని ఇంటర్వెల్ లో మిగతా వాళ్ళు చెప్పారు. హెడ్ మాస్టారి అబ్బాయి అనగానే, వాడితో స్నేహంచేయాలని చాలా మందికి లాగే అతనకీ అనిపించింది. హిందీ క్లాసు జరుగుతూ ఉండగా, అమ్మ ఇచ్చిన రెండు బెల్లం ఉండలలో ఒకటి వాడి చేతిలో పెట్టాడు, బెంచీ కిందనించి. ఆతర్వాత అది వాడికి బాగా నచ్చడం, అలా అమ్మ ఇచ్చినవి వాడికిస్తూ ఉండడం పరిపాటి అయ్యేది. దానితో ప్రారంభమయి ఇద్దరి స్నేహం పెరిగింది. హెడ్మాస్టారు కృష్ణయ్య గారి ఇల్లు కూడా వీళ్ళ వీధిలోనే ఉన్నా, చెరుకూరి, వాళ్ళ నాన్నతో సైకిల్ మీద వచ్చేవాడు. స్కూలు అయిన తరువాత మాత్రం చాలా మాట్లు ఇద్దరూ నడిచి వచ్చేవారు.మెయిన్ రోడ్డు లోంచి వీళ్ళ వీధి లోకి మళ్ళగానే ఒక లాండ్రీ షాపు ఉండేది. గురవయ్య అని పెద్ద మీసాలుతో కొంచం భయపడేలా ఉండేవాడు. ఎప్పుడు జరిగిందో తెలీదు, చెరుకూరివాణ్ని చూసి భయపడేవాడు. వాడి షాపు దగ్గరికి రాగానే " ఒరేయి కొండూరి నా పుస్తకాలు పట్టుకోరా మళ్ళీ తీసుకుంటాను" అని పుస్తకాలు వీడి చేతిలో పెట్టి పరిగెత్తి కెళ్ళి గురవయ్య షాపు దాటిన తరువాత మళ్ళీ తీసుకునే వాడు. థర్డ్ ఫాం లో కి వచ్చిన తరువాత ఆ భయం పోయి, అక్కడికి వచ్చినప్పుడు గతం తలుచుకుని ఇద్దరూ నవ్వుకునేవాళ్ళు.చక్రవర్తి ఎక్కువసేపు చెరుకూరి ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరూ కలిసి, తల తుడుచుకోవడానికి తువ్వాలు రహస్యంగా పట్టుకెళ్ళి పిల్ల కాలవ దగ్గర స్నానాలు చేస్తూ ఉండేవారు. చెరుకూరి కి హిందీ వచ్చేది కాదు. చక్రవర్తి కి హిందీ చాలా బాగా వచ్చు. చెరుకూరి కి హిందీ లో సహాయం చేసేవాడు. అప్పట్లో స్వస్తిక్ గైడ్లు చాలా ఖరీదు ఉండేవి. స్ఖూల్ లైబ్రరీకి కొనడానికి చలాకంపెనీ వాళ్ళు, పుస్తకాలు హెడ్మాస్టర్ గారికి ఇచ్చేవాళ్ళు. అటువంటివన్నీ చెరుకూరి ఇంట్లో చక్రవర్తి చదువుకునేవాడు. దానికి బదులు అన్నట్లు చెరుకూరి నోట్స్ చక్రవర్తి రాసిపెడుతూ ఉండేవాడు. శ్రీరామ నవమి పందిట్లో ప్రోగ్రాములకి ఇద్దరూ కలిసి వెళ్లి, ఎవరో ఒకళ్ళ ఇంట్లోనే పడుకునేవారు.

******" కాఫీ తీసుకోండి" అంటూ సీతమ్మగారు కాబోలు తెచ్చి ఇచ్చింది. ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిన రాజ్యలక్ష్మి ఇంకా రాలేదు

కాఫీ తాగుతూ మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు చక్రవర్తిరోజూ స్ఖూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ వీధిలోనే ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకు దాటి వెళ్ళేవాళ్ళు. ఆ బ్యాంకు ఒక పెద్ద కాంపౌండ్ లో చుట్టూ చెట్ల మధ్య ఉండేది. బ్యాంకురెండు రోడ్ల మధ్య ఉండడం వల్ల ఒక రోడ్ లోంచి ఇంకో రోడ్ కి వెళ్ళడానికి బ్యాంకు కాంపౌండ్ లో రెండువైపులా గేట్లు ఉండేవి. వీళ్ళ వీధిలోంచి అవతలి రోడ్డు లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడానికి స్నేహితు లిద్దరూ బ్యాంకు కాంపౌండ్ లో ఉన్న ప్రైవేట్ రోడ్ లోంచి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడల్లా బ్యాంకు కాంపౌండ్ లో ఉన్న మామిడి చెట్లు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక మామిడి చెట్టు మాత్రం చిన్నగా ఉండి కాయలు చాలా వ్రేల్లాడుతూ ఉండేవి. అవి తోతాపురి అని, కొన్ని చోట్ల కలెక్టరీ అని అంటారు. కోలగా ఉండేవి. పచ్చికాయలు కూడా తినడానికి బాగుండేవి. కాని అవి ముట్టుకోవడానికి అందరికీ భయమే. ఎందుకంటే, పెద్ద తలపాగా చుట్టుకుని, ఒక బంట్రోతు ఎప్పుడూ అక్కడ ఉండేవాడు. ఎప్పుడు అటుకేసి వెళ్ళినా వాటిని చూస్తూ వెళ్ళడంతప్ప కోసే ప్రయత్నం చేయలేదు.ఒక రోజు సాయంత్రం, మామూలు గానే ఆంజనేయ స్వామి గుడికి బ్యాంకు లో రోడ్డు ద్వార ఇద్దరూ నడిచి వెడుతూ, క్రిందకి వ్రేల్లాడుతూ ఉన్న కాయలని మళ్ళీచూశారు. దగ్గరగా ఎప్పుడూ ఉండే బంట్రోతు కనపడ లేదు . " ఒరేయి కొండూరి రా రా ఎవడూ లేడు" అని ఆ చెట్టు కిందకి వెళ్ళాడు చెరుకూరి . " వద్దురా బాబూ, వాడు వచ్చేస్తాడెమో రా " అంటూ భయపడుతూనే వాడి వెనకాల వెళ్ళాడు చక్రవర్తి. చెరుకూరి రెండు కాయలు కోశాడు, చక్రవర్తి కూడా ఒకటి కోసి, ఇంకోటి కోయబోతోంటే " ఎవడురా అది ? అంటూ ఎక్కడి నుంచివచ్చాడో సడన్ గా వీళ్ళ వైపు వచ్చాడు బంట్రోతు. వాడిని చూడగానే. తెలియకుండానే చక్రవర్తి నిక్కర్ తడిసిపోయింది. అప్పటికే చెరుకూరి కాయలు వదిలేసి పరుగేత్తాడు. వాడి వెనకే చక్రవర్తి కూడా పరిగెత్తాడు. ఇద్ద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చి చక్రవర్తి ఇంట్లో పడ్డారు. భయపడితే అసంకల్పితంగా 'పాస్' అయిపోతుందన్నవిషయం ఆవేళ చక్రవర్తి అలా తెలుసుకున్నాడు.విషయం అక్కడితో ఆగలేదు. ఓ అరగంట తరువాత, చేతిలో కాయలు పట్టుకుని రామచంద్రం గారి ఇంటికి వచ్చాడు ఆ బంట్రోతు. వాడు వచ్చి, వీళ్ళిద్దరూ మొత్తం కాయలన్నీ దులిపేసినట్టు వర్ణించి చెప్పాడు. ఆయన ఒక్క అరుపుతో" చక్రీ " అని అరవడంతో లోపల దాక్కున్న వీళ్ళిద్దరూ భయపడుతూ బయటికి వచ్చారు. అప్పటికే రామచంద్రం గారు ఓ బెత్తం తో సిద్ధంగా ఉన్నారు. " ఎరా కాయలు కోశారా?" అన్నాడు. " వాడు కోయలేదు అంకుల్, నేను కూడా కోయలేదు, కింద పడి ఉంటె నేను తీసి వాడికిస్తే, వాడు పట్టుకున్నాడు అంతే" అని చెరుకూరి చెప్పాడు. “హెడ్ మాస్టారి అబ్బాయిని కాబట్టి నన్ను కొట్టరుకదురా, నీకు దెబ్బలు తప్పించడానికి అలా చెప్పాను" అని తరవాత చెరుకూరి వివరించాడు. " ఇంకెప్పుడూ వీళ్ళు అటు రారులే" అని ఆయన బంట్రోతు కి సద్ది చెప్పి పంపేశారు. ఆ వేళ దెబ్బలు తప్పవు అనుక్కున్న పరిస్థితి నుంచి చెరుకూరి బయట పడేయడం మనసులో నిలిచి పోయింది చక్రవర్తికి.

ఫోర్త్ ఫామ్ అవగానే క్రిష్ణయ్యగారు కాకినాడ వెళ్ళిపోయారు. చాలాకాలం మునిసిపల్ స్కూళ్ళలో బదలీలు ఉండేవి కావు. గవర్నమెంట్ బదలీలు పెట్టగానే క్రిష్ణయ్యగారిని బదలీ చేశారు. ఎప్పుడయినా వేసవి శలవలకి కాకినాడలో ఉన్న పింతల్లిగారి ఇంటికి వెళ్ళినప్పుడు, రామారావు పేటలో కృష్ణయ్య గారింటికి వెళ్ళేవాడు చక్రవర్తి . ఒకటి రెండు మాట్లు దొరికినా చాలామాట్లు ఎవళ్లో స్నేహితుల ఇంటికి వెళ్లి దొరికేవాడు కాదు చెరుకూరి . దొరికినపుడు మాత్రం సరదాగా కాసేపు గడిపేవాళ్లు. వాళ్ళ పిన్ని వాళ్ళు కాకినాడనుంచి వెళ్ళిపోయిన తరువాత చక్రవర్తి కాకినాడ వెళ్లడం ఆగిపోవడం తో ఎవరి జీవితాలు వాళ్ళవి అయిపోయాయి. ఆ మధ్యన నరసాపురం వెళ్ళినప్పుడు, చిన్ననాటి స్నేహితులు, అక్కడే స్థిర పడిన వాళ్ళు , చెరుకూరి గురించి చెప్పారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాడిని కలిశామని, వాడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడనీ చెప్పారు

*****ఆ వేళ మధ్యాహ్నం పన్నెండింటికి ఒక జర్మన్ కంపెనీ ప్రోడక్ట్ ని ఇండియా అంతా మార్కెట్ చేయడాన్ని ఫైనలైజ్ చేయడానికి జెర్మనీ నుంచి వచ్చిన ఆ కంపెనీ సౌత్ ఈస్ట్ ఏషియా చీఫ్, మీటింగ్ ఫిక్స్ చేశాడు. నారాయణ పని చేసే కంపెనీ తో సహా, ఏజన్సీ కి రెండు కంపనీలు పొటీ పడుతున్నాయి. వచ్చేవాడు కె. మురుగన్ . క్రితం రోజే అవతలి కంపనీ తో చర్చలు పూర్తి చేశాడు . ప్రత్యర్ధి కంపెనీ లో నారాయణ కౌంటర్ పార్ట్ కూడా తమిళియన్. ఇవ్వాళ నారాయణ కంపెనీ తో కూడా చర్చలు జరిపి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వెడతాడు. అయిదేళ్ళ కాంట్రాక్ట్ కాబట్టి రెండు కంపెనీలకీ చాలా ముఖ్యం. నారాయణకి ఈ కాంట్రాక్ట్ చాలా ముఖ్యం. దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ రిపోర్ట్స్ అవీ తయారు చేసినవి ఫైనలైజ్ చేయడానికి స్టాఫ్ ని ఎర్లీ గా రమ్మని, తాను కూడా ప్రొద్దుటే ఎనిమిదింటికి ఆఫీసుకి వచ్చాడు. నారాయణ. మీటింగ్ గురించి స్టాఫ్ తో చర్చిస్తూ ఉండగా భార్య రాజ్య లక్ష్మి ఫోన్ చేసింది." ఎవరో చక్రవర్తి మీ చిన్నప్పటి స్నేహితుడట" ఇంటికి వచ్చారు. ఏమి చెప్ప మంటారు?చక్రవర్తా ? అని ఒక్క క్షణం ఆలోచించాడు " కొండూరిట" అని భార్య చెప్పగానే " ఓహో వాడా? " అన్నాడు గుర్తుకు వచ్చి. ఈ మధ్యన కొంత మంది చిన్న నాటి స్నేహితులు వెతుక్కుంటూ రావడం, వాళ్ళ దగ్గర తన ఎదుగుదల చూపించి కొంచం గర్వం ఫీల్ అవడం జరుగుతూనే ఉంది. వాళ్ళల్లో కొంతమంది చిన్న చిన్న సహాయాలు అడిగితే, అవి చేశాడు కాని, కొంచం చిరాకు గానే ఉంటోంది. ఇప్పుడు వీడు వచ్చాడు. నరసాపురం లో ఉండగా మంచి స్నేహితుడే, కాని అక్కడినుంచి వచ్చేసిన తరువాత, కాకినాడలో అప్పుడప్పుడు కలిసినా, కాకినాడ స్నేహితులు ఎక్కువయిన తరువాత కొండూరి మరుగున పడిపోయాడు." సార్! జర్మన్ కంపనీ వాళ్ళు ఫోన్ చేశారు. ప్రేసేన్టేషన్ పేపర్లు ముందు పంపే యమన్నారు. ప్రేసేన్టేషన్ మీటింగ్ సాయంత్రానికి మార్చారు. " అని సెక్రెటరి వచ్చి చెప్పింది.చిన్నప్పటి స్నేహితులు కలిసినపుడు , తన ఔన్నత్యాన్నిపొగడటం బాగానే ఉంటుంది కాని ఇప్పుడు దానికోసం వాడిని కలవడానికి వెళ్ళడానికి మనసు ఒప్ప లేదు నారాయణ కి . పోనీ కారు పంపి ఇక్కడికి రప్పిస్తే బాగానే ఉంటుంది , ఆఫీసూ అదీ చూపిస్తే బాగానే ఇంప్రెస్ చేయవచ్చు కానీ. ఈవాళ ఈ అగ్రిమెంట్ గొడవతో అది కుదిరేలా లేదు." భార్య కి ఫోన్ చేసి అడిగాడు " ఇంకా ఉన్నాడా ?" అని"కూర్చునే ఉన్నారు. నరసాపురం లో మీ స్నేహం గురించి చెప్పి నాకు బోరు కొట్టాడు" అంది" నా మీటింగ్ సాయంత్రానికి మార్చారు. అయినా వచ్చే మూడ్ లేదు. ఫోన్ iఇచ్చి ఒక మాటు మాట్లాడించు" అన్నాడుఆవిడ ఫోన్ ఇవ్వగానే చక్రవర్తి మాట్లాడాడు “ఎరా చెరుకూరి ఎలా ఉన్నావు? చాలా రోజులయింది. నిన్ను కలుద్దామని వచ్చాను. మొన్న నరసాపురం వెళ్ళినప్పుడు దేవరకొండాడు చెప్పాడు నీవిషయం. వాడు గుర్తు ఉన్నాడు కదా ? ఇనప కొట్టు. వాళ్ళ నాన్న వ్యాపారమే చేస్తున్నాడు"" అవును. ఆమధ్యన వచ్చాడు, వాడి షాపుకి ఒఎన్జిసి నుంచి ఎదో ఆర్డర్ కావాలంటే సహాయం చేశాను. ఈ మధ్యన చాలా బిజీ గా ఉందిరా” అంటూ ఒక అయిదు నిమిషాలు మాట్లాడి, తనఎదుగుదల అంతా వివరించాడు నారాయణ. " ఈ మాటు వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామురా" అన్నాడు ఫోన్ పెట్టేస్తూఫోన్ పెట్టేసిన తరువాత గుర్తు వచ్చింది నారాయణ కి. కొండూరి గురించి ఏమీ అడగ లేదని. మళ్ళీ చేద్దామనుకుంటూ ఉండగా ఎదో ఫోన్ వస్తే అందులో పడిపోయాడు

****

చక్రవర్తి ఫోన్ పెట్టేసిన తరువాత, రాజ్యలక్ష్మి" భోజనం చేసి వెళ్ళండి, అరగంటలో సీతమ్మగారు వంటచేసేస్తారు" అంది“లేదండి పని ఉంది వెళ్ళాలి. ఇంకో మాటు చేస్తాను” అని వచ్చేశాడు. చిన్ననాటి స్నేహం తనలో లేపిన భావాలు, నారాయణ లో కూడా అంతే మోతాదు లో ఉంటాయని ఆశించాడు. ఆశించిన ఆప్యాయత కనపడ లేదని అనిపించినా అతనికి నారాయణ మీద కోపం ఏమీ రాలేదు. చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలు అన్నీ ఒక్క లాగే ఉన్నా, ఎదిగిన కొద్దీ ప్రక్రుతి అందించిన సహజ లక్షణాలు తరువాత వాటిని అనేకరకాలు గా మారుస్తాయి. దానికి ఎవరినీ బాధ్యులుగా చెప్ప లేము అనుకున్నాడు ఎన్క్లేవ్ నుంచి బయటికి వస్తూ.****నాలుగింటికి హైటెక్ సిటీ లో జర్మన్ కంపెనీ హైదరాబాద్ ఆఫీసు కి నారాయణ తన స్టాఫ్ తో చేరుకున్నాడు. జర్మన్ కంపెనీ హైదరాబాద్ హెడ్ జనార్ధన్, నారాయణ ప్రేసేన్టేషన్ విన్నాడు. అంతా అయిన తరువాత “మీరు పంపిన బ్రీఫ్ మురుగన్ సార్ చూశారు. అర్జెంటుగా సింగపూర్ వెళ్ళవలిసి వస్తే వెళ్లి పోయారు. ఎవరిని సెలెక్ట్ చేసినదీ ఒక రోజులో తెలుపుతానన్నారు. అని చెప్పాడు.ఇంకా సస్పెన్స్ వీడక పోవడం నారాయణ ని నిరుత్సాహ పరిచినా చేసేది లేక వచ్చేశాడు.**సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి సోఫా లో కూర్చిని భార్యని కాఫీ తెమ్మన్నాడు నారాయణ.కాఫీ తో పాటు ఒక ఎన్వెలప్ తెచ్చి “ ఎవరో ఈ కవర్ కింద సెక్యురిటీ వాళ్లకి ఇచ్చి మీకు ఇమ్మన్నారట” అని ఇచ్చింది రాజ్య లక్ష్మి .ఏమిటబ్బా ఇది అనుకుంటూ ఎన్వెలప్ ఓపెన్ చేశాడు నారాయణజర్మన్ కంపేనే ఏజెన్సీ నారాయణ కంపనీకి ఇస్తున్నట్టు ఒక లెటర్ ఉంది అందులో. దానికి చిన్న స్లిప్ పిన్ చేసి ఉంటె అది చూశాడు “చిన్ననాటి మిత్రుడు చెరుకూరి కి చిన్న కానుక ఈ అగ్రిమెంట్” “ కొండూరి మురుగన్ చక్రవర్తి”. పేరు పక్కనే పెన్నుతో గీసిన చిన్న కలక్టరి మామిడి కాయ బొమ్మ పక్కన ఉంది.ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు నారాయణ . ఒక కన్నీటి బొట్టు చేతిలో ఉన్న కాగితంలో మామిడికాయ బొమ్మ మీద పడింది

సమాప్తం

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు