అమాయకుడు కాదు - ఆణిముత్యం - కందర్ప మూర్తి

Amayakudukaadu aanimutyam

అగ్రహారం గొల్లపేటలో ఉండే రాములమ్మ భర్త చనిపోవడంతో దివాణం గారింట్లో పాచిపనులు చేసుకుంటు ఎనిమిదేళ్ల కొడుకు సాంబయ్యను పెంచి పోషిస్తోంది. రాములమ్మ ఊళ్లో పనిలోకి పోయేటప్పుడు సాంబడికి చల్ది బువ్వ పెట్టి గుడిసె తడికకు తాళం పెట్టి పోయేది. మధ్యాహ్నం రాములమ్మ తిరిగొచ్చే వరకు బయట తోటి పిల్లలతో ఆడుకుంటూ సమయం గడుపుతూంటాడు. సాంబయ్య చదువు లోకజ్ఞానం తెలియని అమాయకుడైనా మనసున్న మారాజు. ఎవరైన అడిగితే సాయంలో ముందుంటాడు. ఎవరు ఏది చెబితే అదే నిజమని నమ్మేస్తాడు. అందువల్ల సాటి కుర్రాళ్లు వాడిని ఆట పట్టిస్తుంటారు. ఒకసారి గొల్లపేటలో ఉండే ముసలి తాత తన మోకాలి చిప్పలకు తైలం మర్ధన చెయ్యమని పిలిచాడు. సాంబయ్య తాత కాళ్ల మోకాలి చిప్పలకు తైలం మర్ధన చేస్తూ ఎందుకు అలా తైలం రాయమంటున్నాడో కారణం అడిగాడు. మనిషికి వయసొచ్చి ముసలోళ్లయితే వాతం వచ్చి కాళ్ల కీళ్లు బిగుసుకు పోయి నడవలేరని , తైలం రాస్తే ఉపశమనం కలిగి బాధ తగ్గుతుందని చెప్పాడు ముసలి తాత. ఒకసారి గుడిసె ప్రాంతంలో ఒక ముసలికుక్క నడవలేక బాధ పడుతోంది. అది చూసిన సాంబయ్య తాత దగ్గరున్న తైలం సీసా పట్టుకెళ్లి ముసలికుక్క కాళ్లకి రాద్దామని దగ్గరకెళితే కొట్టడానికి వస్తున్నాడేమోనని కరవబోయింది కుక్క. ఆ విషయం సాంబయ్య తాతకి చెబితే వాడి అమాయకత్వానికి ముసలితాత నవ్వుకున్నాడు. మరోసారి ఒక కుక్కకి తోక వంకరగా నడుం మీదకు వంగి ఉండటం చూసాడు సాంబయ్య. చాలా కుక్కలకు తోక కిందకు వేలాడుతు కనిపించింది. తోక వంకరగా ఉన్న వీధికుక్కకు సాంబయ్య ఒక సమయంలో గంజి మెతుకులు పెట్టినందున విశ్వాసం కనబరిచేది. అందువల్ల సాంబయ్యను చూసి తోక ఆడించేది. కుక్కకు జబ్బు చేసినందునే తోక వంకర తిరిగిందని తాడు తెచ్చి రాయితో కుక్క తోకకి వేలాడదీసాడు. అది చూసిన ఊరి గుడి పూజారి గారు నవ్వుకుంటు వాడి బోలాతనానికి బాధ పడ్డారు. వీధిలో ఆడుకుంటు మొక్కల మీద ఎగిరే తూనీగల్ని పట్టుకుని వాటి తోకలకు దారంతో కాగితం ముక్కలు కట్టేవాడు. పువ్వుల మీద ఎగిరే సీతాకోక చిలుకలకి దాహం వేస్తోందేమోనని వాటిని పట్టుకుని నీటి గోలెంలో వదిలేవాడు. మరొకసారి రాములమ్మకు జ్వరం వచ్చి ఒళ్లంతా వేడితో కాగిపోతోంది.ఎవరికో జ్వరం వచ్చి ఒళ్లు వేడిగా ఉంటే చన్నీళ్లతో ఊరి ఆచారి డాక్టరు గారు తుడవమన్నారట. అది తెల్సిన సాంబయ్య గుడిసెలో కుండలో ఉన్న చన్నీళ్లు రాములమ్మ శరీరం మీద కుమ్మరించాడు. మూలుగుతు మంచం మీద పడుకున్న రాములమ్మ గబుక్కున లేచి కూర్చుంది. రాములమ్మ ఎందుకు పనిలోకి రాలేదోనని తెలుసు కోడానికి దివాణం గారు పాలేరును పంపగా,అప్పుడే సాంబయ్య అమాయకంగా రాములమ్మ వంటిమీద కుండలో నీళ్లు పొయ్యడం చూసి విషయం దివాణం గారికి చేరవేసాడు. వెంటనే దివాణం గారు రాములమ్మకు ఇంగ్లీషు మందుబిళ్ల , బన్ను రొట్టె పాలేరు ద్వారా పంపేరు. సాంబయ్య లోకజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తు అమాయకంగా పెరగడం చూసిన రాములమ్మకు కొడుకు గురించి బెంగ పట్టుకుంది. ఇదే విషయం రాములమ్మ దివాణం గారికి చెబితే వయసు పెరిగితే వాడే బాగుపడ్తాడని చెప్పి వారి దగ్గర పనిలో ఉంచుకున్నారు. పెరిగి పెద్దైన సాంబయ్య దివాణం గారి దొడ్లో పశువులకు మేత వేస్తు , వాటిని కొండకి మేత తినడానికి తీసుకెళ్లి తీసుకు వస్తూంటాడు. ఒకసారి కొండకి పసువుల్ని మేతకు తీసుకెళ్లి అవి మేత మేస్తుంటే ఎండ వల్ల తను పెద్ద చెట్టు ఎక్కి వెంట తెచ్చుకున్న తేగల్ని తింటున్నాడు. ఇంతలో కొందరు మనుషుల మాటలు వినబడ్డాయి. ఎప్పుడు ఆ ప్రాంతంలో మనుషుల చడి వినని సాంబయ్య ఆశ్చర్యంగా చెట్టు కిందకు చూసాడు. ముగ్గురు మనుషులు మూటగా తెచ్చిన గుడ్డ మూటను గొయ్యి తీసి అందులో ఉంచి మట్టి నింపి గుర్తుగా పైన సున్నం జల్లి వెళిపోయారు. ఇదంతా చెట్టు పైనుంచి గమనించిన సాంబయ్య, వారు వెళిపోయిన తర్వాత కిందకు దిగి సున్నం గుర్తు ఉన్న చోట మట్టి తవ్వితే బట్టతో కట్టిన మూట కనబడింది. అది విప్పి చూస్తే బంగారు ఆభరణాలు బయట పడ్డాయి. వాటి విలువ తెలియని సాంబయ్య పసువులతో పాటు భద్రంగా బంగారు మూటను తెచ్చి దివాణం గారికి ఇచ్చి జరిగిన విషయం చెప్పాడు. అవి దొంగతనం జరిగిన బంగారు వస్తువులని తెలిసి దివాణం గారు టౌను పోలీసు స్టేషన్లో అప్పగించారు. వాస్తవానికి ఆ బంగారు వస్తువులు జిల్లా కలెక్టరు గారింట్లో దొంగతనం జరిగినవి , దొంగలు పోలీసుల సందడి తగ్గిన తర్వాత పంచుకోవచ్చని భద్రంగా ఉంటాయని కొండప్రాంతంలో దాచిపెట్టారు. టౌన్లో ఎంత వెతికినా నగల ఆచూకీ తెలియని పోలీసు సిబ్బందికి పెద్ద సవాల్ గా మారింది. అటువంటి సమయంలో అగ్రహారం దివాణం గారు, కలెక్టర్ గారింట్లో దొంగతనం జరిగిన విలువైన బంగారు వస్తువులు దొరకడం ఆనంద దాయకమై దివాణం గారికి సన్మాన ఏర్పాట్లు చేసారు. ఈ ప్రశంస తనది కాదని , తమ ఇంట్లో పనిచేసే సాంబయ్య నిజాయితీ అని తెలియచేస్తు అతనికి పోలీసు డిపార్టుమెంట్లో ఏదైనా ఉధ్యోగం ఇప్పిస్తే బ్రతుకుతెరువు ఉంటుందని దివాణం గారు అబ్యర్దించగా జిల్లా కలెక్టరు సిఫారసు మేరకు పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా తీసుకున్నారు. ఎందుకూ పనికిరాడనుకున్న కొడుక్కి ప్రభుత్వ కొలువు దొరికిందని రాములమ్మ సంబర పడింది. . ..* .* ..... .... *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు