దీపావళికి రెండు రోజుల ముందరే, అత్తవారింటికి కొత్తల్లుడు వచ్చాడు.
ఆ రోజుల్లో -- ఇప్పట్లా కాదు -- కొత్తల్లుడు ఏదేనా పండగకి అత్తవారింటికి వస్తే, తక్కువలో పదిహేను రోజులేనా ఉండేవాడు.
కొత్తల్లుడొచ్చిన సంబరంలో దీపావళి నవ్వులతో చక్కగా గడిచింది.
నాలుగు రోజులు తరువాత నాగులచవితి వచ్చింది. ఉదయం కాఫీ ఇచ్చేటప్పుడు అత్తగారు అల్లుడుతో : "ఏం నాయనా ఈ రోజు నాగులచవితి కదా నేను, మామగారు, అమ్మాయి అంతా ఉపవాసం. నీ కోసం వండేసేదా లేక నువ్వు కూడా ఉపవాసం ఉంటావా," అని అడిగారు.
అల్లుడు : "ఉపవాసం చేయడం నాకు అలవాటు లేదండి. అయినా, ఉపవాసంతో మీకెందుకు శ్రమ. నేను ఈ ఒక్క రోజుకి హోటల్ లో తినేస్తానులెండి," అన్నాడు.
అది విన్న అత్తగారు, "ఎంత మాట నాయనా. అత్తింటికొచ్చిన అల్లుడు తిండి కోసం హోటల్ కి వెళ్ళాడు అంటే నలుగురిలో ఎంత అప్రదిష్ట. ఒక్క మనిషికి వండడానికి ఎంత శ్రమ పడిపోవాలి ? ఈ రోజు మరి టిఫినీలు అవి ఏమి చేయను, పదో గంటకి విస్తట్లో వేడి వేడిగా అన్నం వడ్డించేస్తాను, లక్షణంగా తిందువుగాని", అని హడావిడిగా కూరలు తరగడానికి వంటిట్లోనికి వెళ్లిపోయారు.
-2-
'ఈ ఊరిలో ‘అబ్బాయి’ హోటల్ లో టిఫిన్స్, భోజనాలు బాగుంటాయి అంటారు కదా, పోనీ నాగులచవితి నెపంతో తిని వద్దాం అనుకుంటే, కుదరలేదు' అని మనసులో వాపోయాడు, కొత్త అల్లుడు.
అన్నట్లుగానే పదో గంటకి, అత్తగారు కొసరి కొసరి వడ్డిస్తూంటే తృప్తిగా తిన్న కొత్త అల్లుడు, పెళ్ళాం ఇచ్చిన తాంబూలం వేసుకొని సోఫాలో విశ్రాంతిగా కూర్చొని టీవీ చూస్తున్న ఒక గంటకి మగతగా కళ్ళు మూతలు పడ్డాయి.
అలా ఒక అరగంట గడిచిందో లేదో -- ఏలకులు పచ్చకర్పూరం కలిపిన గుబాళింపుతో ఘాటైన సువాసన ముక్కు అదిరేటట్టుగా తగిలేసరికి, నిద్ర మత్తు వదిలిపోయింది.
‘ఏమిటి ఇంత కమ్మటి వాసన, ఏమిటి చేస్తున్నారు’ అని ఆలోచిస్తూంటే మరో అర్ధగంటకి అత్తగారు వచ్చి - “ఇంద నాయనా నాగేశ్వర ప్రసాదం" అని, చిన్న చలిమిడి ఉండ, చిన్న చిమ్మిలి ఉండ అల్లుడు చేతిలో వేసి, "ఈ రోజు ఉపవాసం కదా, మేమంతా ఈ ప్రసాదం మాత్రమే తింటాం. అయినా వదినగారు కూడా ఈరోజు ఇలాగే చలిమిడి, చిమ్మిలి చేస్తూ ఉంటారు కదా. నీకు తెలియదా ఏమిటి, నా చాదస్తం కాకపొతే." అని వాళ్ళ అమ్మాయికి కేకవేసారు, అల్లుడుకి మంచి నీళ్లు తెచ్చి ఇమ్మని.
మంచి నీళ్లు తెచ్చిన పెళ్ళాం చేయి పట్టుకోబోతుంటే, " ఈ రోజు నాగులచవితి కదా ఇవేమీ పనికిరావు. ఈ రోజు మీకు ఉపవాసమే" అని చిలిపిగా నవ్వుతూ, వెనక్కి తిరిగి చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
-3-
దాంతో హతాశుడైన కొత్త అల్లుడు 'ఆ ఉపవాసం తప్పినా, ఈ ఉపవాసం తప్పదన్నమాట' అని విరహంతో విచారించాడు.
మరో వారం రోజుల తరువాత, ఉదయం కొత్త అల్లుడికి కాఫీ ఇస్తూ అత్తగారు "ఈ రోజు పెద్ద ఏకాదశి నాయనా, మేమంతా ఉపవాసం. చవితినాడు లాగే నీకోసం పెందరాళే వండేసేదా" అనగానే –
అల్లుడు "ఎంత మాట అత్తయ్యగారు. పెద్ద ఏకాదశి కదా, నేను మాత్రం ఉపవాసం ఎందుకు చేయను. మీరేమీ గాభరా పడొద్దు నా గురించి." అన్నాడు.
అల్లుడి మీద జాలితో అత్తగారు: " నీకు ఉపవాసం చేయడం అలవాటు లేదన్నావు కదా. అలాంటప్పుడు, ఉపవాసం ఉండడం కష్టమవుతుందేమో. పోనీ ఉప్పిడి పిండి చేస్తాను తిందువుగాని ” అన్నారు.
దాంతో అల్లుడు, " మీరవేమి ఆలోచించకండి. నా గురించి మీరేమీ ప్రత్యేకంగా చేయక్కరలేదు. పెద్ద ఏకాదశి అంటున్నారు కదా, నేను కూడా మీ అందరితో పాటూ ఈ రోజు ఉపవాసముంటున్నాను." అని నొక్కి చెప్పేడు.
అక్కడ నుంచి గంటలు గడుస్తున్నా -- చక్కగా చవితినాడు లాగే, ఈ రోజు చలిమిడి చిమ్మిలి తినొచ్చు అని ఎదురు చూస్తున్న కొత్త అల్లుడికి -- కటిక ఉపవాసంతో, పట్ట పగలే చుక్కలు కనిపించేయి.