“నువ్వేం సాధించావు?mపెద్ద సంపాదించినట్టు ఆ ఫోజోకటి” అనే భార్యామణి మాట.. ఎంతటి మగాణ్ణి అయినా వెర్రి వెంగళప్పను చేసే క్షిపణి. మొగుణ్ణి అతి హీనత సంక్లిష్ట పరిస్థితిలోకి తోసేసే షాక్ ట్రీట్ మెంట్.
‘గడియ రికాం లేదు.. గవ్వ రాకడ లేదు’ అనే నానుడికి ప్రతీకగా సంసారం నెట్టుకొస్తూ.. పిచ్చిడాక్టర్ గా వాసికెక్కిన సర్వేశం మీద ఓపిక నశించిన అతని సతీమణి ఆ బాణం సంధించింది. పిచ్చాసుపత్రిలో ఎందరికో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చే సర్వేశం రివర్స్ గేర్ లో షాక్ తిన్నాడు. ఇక లాభం లేదు.. తన తడాఖా చూపించాలనుకున్నాడు. అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించి తన మొగతనమేంటో.. ప్రకటనలు లేకుండా సింగిల్ ఎపిసోడ్ లో ప్రదర్శించాలనుకున్నాడు.
తాను ఈమధ్యనే పిచ్చి కుదిర్చిన వీసాల బ్రోకర్ మీసాల స్వామి చటుక్కున గుర్తుకు వచ్చాడు. మీనమేషాలు లెక్కించకుండా వాయువేగంతో వెళ్లి..
“ఇవి చేతులు కావనుకో స్వామి” అని మీసాల స్వామి మీసాలు పట్టుకుని అర్థించాడు.. అతడిచ్చిన వాగ్ధానాన్ని గుర్తుకు చేశాడు సర్వేశం. మీసాల స్వామి బుర్రకు పదును పెట్టాడు ఉన్నఫళంగా పిచ్చిడాక్టరును అమెరికా పంపడమెలాగా అని.. మీసాలను మెలేసి బ్యుజినెస్ వీసా ఇప్పించాడు.
“న్యూయార్క్ లో దిగగానే నా స్నేహితుడు రిషికుమార్ రిసీవ్ చేసుకుంటాడు. అతను ప్రవాసాంధ్రుడు.. ఇల్లీగల్ నివాసి. అతని గదిలోనే ఉండవచ్చు. ‘స్క్రాంటన్’ సీటీ లోని ఒక క్యాండీ స్టోర్ లో పనిచేస్తున్నాడు. అందులో మీరూ తాత్కాలికంగా పని చేయవచ్చు” అని మరికొన్ని వివరాలు చెప్పి సర్వేశంను విమానం ఎక్కించాడు మీసాల స్వామి.
న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగి లగేజ్ కలెక్ట్ చేసుకొని విజిటింగ్ లాంజ్ లో ఉన్న రిషి కోసం ఒక్కొక్కరి చేతులలో ఉన్న ‘ప్లకార్డ్’ లు చదువుకుంటూ వెళ్తూ ఠక్కున ఆగిపోయాడు సర్వేశం. కనుగుడ్లు తేలేసి కొయ్యబారి పోయాడు. నిశ్చేష్టుడై నిల్చున్న సర్వేశంను చూసి తేలిగ్గా పసిగట్టాడు రిషి. అతని చేతిలోని ప్లకార్డు
‘సుస్వాగతం.. పిచ్చిడాక్టర్’ను చటుక్కున తిరగేసి..
”సార్.. నేను రిషిని. మీరే కదూ..” అనగానే ఇక చాలు.. ఎక్కడ పిచ్చిడాక్టర్ అంటాడేమోనే అనుమానంతో నోరుమూసుకోమన్నట్టు సైగ జేసి.. “యా.. అయాం డాక్టర్ సర్వేశం” అని పరిచయం చేసుకున్నాడు.
“వెల్ కం సార్.. వెరీ గ్లాడ్ టూ మీట్ యు” అని షేక్ హాండిచ్చాడు రిషి. “సారీ సర్.. ఈ సలహా మీసాల స్వామిదే” అని ప్లకార్డు డస్ట్ బిన్ లో జార విడిచాడు.
ఇద్దరు కలిసి అద్దెకారులో బయలుదేరారు. కారు వేగం పుంజుకుంది. న్యూయార్క్ సిటీ వీధుల్లో ఆకాశాన్నంటే సౌధాలు చూస్తూ.. కుతూహలంగా ..“స్క్రాంటన్ సీటీ ఎంతదూరం..” అడిగాడు సర్వేశం.
“దాదాపు రెండు వందల కిలో మీటర్లు డాక్టర్ సాబ్.. రెండు గంటల ప్రయాణం” అన్నాడు రిషి. కారు అత్యంత వేగంగా దూసుకు వెళ్తోంది. అంతే వేగంగా సర్వేశం కడుపుబ్బుతోంది. ఎక్కడైనా కారు ఆగితే కడుపు ఖాళీ చేసుకోవాలనుకున్నాడు. అదృష్టం కొద్ది గంట తరువాత కారు తన కడుపు నింపుకోవడం కోసం ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఆగింది.
“రిషీ అర్జంట్..” యూరిన్ పాస్ చెయ్యాలి.. అన్నట్టు చిటికెన వేలు చూపించి కారు దిగి పరుగు తీశాడు సర్వేశం.
సర్వేశం వచ్చాక కారు మళ్ళీ బయలుదేరింది. మరో అరగంట గడిచింది. విశాలమైన మైదానం.. దూరంగా కొండలు.. ప్రకృతి మనోహరంగా ఉంది. సర్వేశం మళ్ళీ చిటికెన వేలు చూపించాడు. డాక్టర్ సాబ్ కు అతిమూత్ర వ్యాధి ఏమైనా ఉందేమోనని సంశయిస్తూ..
“డాక్టర్ సాబ్ మన ఇండియాలో మాదిరిగా మైదానంలో యూరిన్ చేసే ఎంజాయ్ మెంట్ ఇక్కడ దొరకదు. పోలీసులు చూస్తే పెనాల్టీ వేస్తారు. పైగా కారు ఆపితే క్రిమినల్స్ అటాక్ చేసే ప్రమాదముంది. కాస్త ఉగ్గ పట్టుకొండి డాక్టర్ సాబ్. మరో అరగంటలో సీటీ వచ్చేస్తుంది” అంటూ.. సర్వేశం ధ్యాస మరల్చాలని మాట మార్చాడు రిషి.
“డాక్టర్ సాబ్ మా స్టోర్ లో జాబ్ ఖాళీ లేదు. అయితే మీరు నిరాశ పడకుండా ఒక ప్రముఖ హోటల్లో ‘బజ్ బాయ్’ జాబ్ మాట్లాడి పెట్టాను. అంత తొందరగా జాబ్ దొరకడం మీ అదృష్టమే. మీరు రేపే జాయిన్ కావచ్చు”
“బజ్ బాయ్ అంటే..” అమాయకంగా అడిగాడు సర్వేశం.
“మనం ముందుగా క్యాండీ స్టోర్ కు వెళ్ళాక మాట్లాడుకుందాం. స్టోర్ చూసుకొని ఆ తరువాత రెసిడెన్సీకి తీసుకు వెళ్తాను” అంటూ మన మాటలు డ్రైవర్ వింటున్నాడు అన్నట్టు రిషి ఇషారా చేశాడు.
కారు క్యాండీ స్టోర్ ముందాగింది. కారు దిగగానే మళ్ళీ చిటికెన వేలు చూపించాడు సర్వేశం.
“సారీ డాక్టర్ సాబ్. స్టోర్ లో ఆ సౌకర్యం లేదు” నింపాదిగా అన్నాడు రిషి.
“మరి మీరో..!” వెటకరిస్తూ అడిగాడు సర్వేశం.
“మరీ అర్జెంట్ అయితే మేము మూడు రకాల పద్ధతులు వాడుతాం డాక్టర్ సాబ్. ఒకటి ఏదైనా హోటల్ కు వెళ్లి అక్కడి రెస్ట్ రూమ్స్ వాడుకుంటాం. అది వీలుగాకుంటే.. రద్దీ లేని ప్రదేశంలో పార్క్ చేసిన రెండు కార్ల మధ్యకు వెళ్లి కారు తుడుస్తున్నట్టు నటిస్తూ కార్చేసుకుంటాం. అదీ వీలు గాకుంటే.. అటు చూడండి ముచ్చటగా మూడో రకం.. మూలకు ప్లాస్టిక్ కవర్లలో ద్రవం.. అది అదే.. అందులో పట్టి పెడతాం. వెళ్ళేటప్పుడు గార్బెజీలో పడేస్తాం”
“రెస్ట్ రూమ్స్ లో యూరిన్ పాస్ చేయడ మేంటి?” అమాయకంగా అడిగాడు సర్వేశం.
“టాయిలెట్స్ ను ఇక్కడ రెస్ట్ రూమ్స్ అంటారు డాక్టర్ సాబ్”
“అలాగా నేను గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రెస్ట్ రూమ్స్ చూసి.. అవి విశ్రాంతి గదులనుకొని యూరిన్ పాస్ చెయ్యకుండా కారెక్కాను. అందుకే ఈ అవస్థ” అంటూ తనకు ఒక పాలిథిన్ కవరు కావాలని సైగ జేసి..
“ఇంతకు ముందు బజ్ బాయ్ జాబ్ అన్నావు. అంటే ఏమిటి? ” అడిగాడు సర్వేశం. రిషి నవ్వుకుంటూ వెళ్లి కవరు తెచ్చి సర్వేశానికి అందిస్తూ..
“మన దగ్గర హోటల్లో పనిచేసే వారిని ‘సర్వర్’ అంటాం. ఇక్కడ బాజ్ బాయ్” అంటూ నవ్వును కొనసాగించాడు.. నిజంగా పిచ్చి డాక్టరు అన్నట్టు.
సర్వేశం కళ్ళు తేలేశాడు.. అప్రయత్నంగా కింద తడువకుండా చేతితో కింద పట్టుకున్న కవరు నిండిపోయింది.*