తరంమారింది - శింగరాజు శ్రీనివాసరావు

Taram maarindi

ఇరవై సంవత్సరాలుగా సర్పంచిగా ఉంటూ గ్రామాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు రామయ్యచౌదరి. తాను ఏంచేసినా ఎదురునిలబడి మాట చెప్పే దమ్ము ఎవరికీ లేకుండా, అందరినీ కాలికింద తొక్కిపెట్టాడు. అటువంటి వాడికి ఈ రోజ గడ్డుకాలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రూపంలో వచ్చింది. ఇప్పటిదాక జనరల్ కేటగిరీలో ఉన్న స్థానాన్ని కొత్త ప్రభుత్వం తీసుకున్న సమాన హక్కుల వర్గీకరణలో దళిత మహిళకు కేటాయించింది. ఆ నిర్ణయం మింగుడుపడక నిన్నటి నుంచి పిచ్చికుక్కలా తయారయ్యాడు చౌదరి. ఎవరు కదిలించినా కస్సుమని తోక తొక్కిన తాచులా బుసలు కొడుతున్నాడు. చౌదరికి నమ్మినబంటులా వుండే గన్నయ్య కూడ ఆయన ఎదుట పడలేక, చౌదరికి ప్రాణస్నేహితుడైన రాజారాం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయనను వెంటబెట్టుకు వచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి ముఖంమీద కండువా కప్పుకుని పడకకుర్చీలో పడుకుని ఉన్నాడు చౌదరి. తను వచ్చినందుకు గుర్తుగా సకిలించాడు రాజారాం. ముఖం మీద కండువా తీసి చూశాడు. అతడి కళ్ళు సింధూరం పెట్టినట్టుగా ఉన్నాయి. అసలే మిడిగుడ్లు, దానికితోడు ఎర్రజీరలు, గుబురు మీసాలు. రామాయణంలో రావణాసురుడిలా కనిపించాడు గన్నయ్య కళ్ళకు చౌదరి. " ఏరా చౌదరి. కుంపటిలో వేసిన ఎండు మిరపకాయలా చిటపటలాడి పోతున్నావట. ఏమయిందిరా" ప్రశాంతంగా అడిగాడు రాజారాం. " ఒరేయ్ రాజిగా వెటకారాలు చాలు. ఇక్కడ వళ్ళంతా కారం పూసుకున్నట్టగా వుంది" అని కుర్చీలో నుంచి విసురుగా లేచాడు. " విషయం చెప్పకుండా చిందులేమిటి?" "గన్నిగాడు చెప్పలేదా?" "వాడు నాకేమి చెప్పలేదు. అయ్యగారు కాకమీదున్నాడని మాత్రం చెప్పాడు" "ఊరంతా తెలిసినా నీకు తెలియలేదా" "తెలియకనే కదురా అడగడం. ముందు ఆ బుసలు తగ్గించి అసలు విషయం చెప్పు" " ఏంచెప్పాలిరా. ఏమని చెప్పాలి. అడుక్కునే వాడికి అందలమెక్కే రోజు వచ్చిందని చెప్పనా! నా పెత్తనానికి సమాధి కట్టబోతున్నారని చెప్పనా! నా ఏలుబడికి చివరి రోజులు వచ్చాయని చెప్పనా!" "వెధవ పోలికలు ఆపి అర్ధమయ్యేలా చెప్పు" "చెప్పడానికేముంది. ఈ సర్పంచి సీటును దళిత మహిళకు కేటాయించారు. నా పెద్దరికానికి ఉరి వేశారు" "ఒరేయ్ చౌదరి. ఆవేశపడితే ఆలోచనలు రావు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. అందుకని నీ తైతక్కలాపి, తరువాత కథ ఎలా నడపాలో ఆలోచించు. ముందు కుర్చీలో కూలబడు" రాజయ్య గదమాయింపుతో కాస్త మెత్తబడ్డాడు చౌదరి. అవును కోపంలో కొత్త ఆలోచనలు రాకపోగా, ఉన్నవి ఊడిపోయే ప్రమాదముంది. అందుకే మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. " అయితే ఇప్పుడేం చేద్దామంటావు" అడిగాడు చౌదరి. " చట్టాన్ని మార్చలేనప్పుడు మన చుట్టాన్ని గద్దెనెక్కిస్తే సరి" "అంటే" "అదేరా. మనకు నమ్మకస్తుడైన వాడి భార్యనో, కూతురినో నిలబెడితే సరి. కాస్తో కూస్తో చదువుకున్నదయితే మనకు మరీ మంచిది. ఆ నరసింహం గాడికి ఎదురుపోటి గట్టిగా ఇచ్చినట్టవుతుంది" సలహా పారేశాడు రాజయ్య. " అవునురా నిజమే. చదువుకున్న పిల్లయితే ఆ పిల్ల మీద నమ్మకంతో ఆ కులపోళ్ళ ఓట్లన్నీ పడతాయి. మనకు సంబంధించినవి ఎలాగూ పడతాయి కనుక మన గెలుపు నల్లేరు మీద బండి అవుతుంది" కోపం తగ్గి బండి పట్టాల మీదకు వచ్చింది. ఎవరా అని దృష్టి సారించాడు చౌదరి. ఎదురుగా ఉన్న గన్నిగాడిని చూడగానే ఏదో స్ఫురించింది చౌదరికి. " ఒరేయ్ గన్నిగా నీ కూతురు పట్నంలో నీ తమ్ముడి కాడ చదువుతుందని చెప్పావుగా. ఏం చదువుతోందిరా?" " తెలవదయ్యా. అదేదో మూడేల్ల సదువయి పోనాది. ఉద్దేగానికి సదువుకుంటున్నానన్నదయ్యా. మరదేదో తెలవదు. నా కొడుక్కి తెలసద్ది. ఆడు కూడ కాలేజీల రెండేల్లు సదివినాడు గదా" చెప్పాడు గన్నయ్య. " అయితే అది డిగ్రీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు చదువుతుండి ఉంటుంది చౌదరి. ఇకనేం 'వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు', ఆ పిల్లను పిలిపించి మన తరఫున నిలబెట్టు, పదవి పోయినా పట్టు నీదే ఉంటుంది" కర్తవ్యాన్ని బోధించాడు రాజయ్య. చౌదరి పెదవులపై చిరునవ్వు విరిసింది. ******* అనుకున్నట్టుగానే చౌదరి అండదండలతో, దళితుల సంపూర్ణ సహకారంతో సర్పంచిగా అఖండ మెజారిటీతో గెలిచింది గన్నయ్య కూతురు వాసంతి. తన అక్కను బలవంతంగా ఒప్పించి ఎన్నికలలో నిలబడి గెలిచేదాకా నిద్రపోకుండా తిరిగిన గన్నయ్య కొడుకు మల్లయ్యకు ఏనుగును ఎక్కినంత సంబరంగా ఉంది. ఈరోజే తన అక్క సర్పంచిగా ప్రమాణం చేసే రోజు. బూజు పట్టిన పంచాయతీ కార్యాలయపు గోడలు దులిపి, పూలతోరణాలతో అలంకరించాడు. తన వాళ్ళనందరినీ ఆహ్వానించాడు. చౌదరిని కూడ సభకు రమ్మని పిలిచాడు. ఒక వెకిలినవ్వు నవ్వి చౌదరి అన్నమాట ఒకపక్క గుండెను పిండుతున్నా సభ్యత తెలిసి ప్రవర్తిస్తున్నాడు. అయినా పదేపదే అదేమాట గుర్తుకు వస్తున్నది. " ఒరేయ్. మీరు రెక్కల పురుగులురా. మా చుట్టూ తిరిగే ఊరకుక్కలు. ఇయాల మీకేమీ కొత్తరెక్కలు పుట్టుకురాలేదు. మా కంటి వెలుతురులో రెక్కలు కొట్టుకుంటూ మా చుట్టూతా తిరగాల్సిందే. మీ అక్క పేరుకేరా సర్పంచి. అది నా కాలికింద చెప్పులా బతకాల్సిందే. కాస్త ఎగస్ట్రాలు తగ్గించి కుక్కిన పేనుల్లా పడుండండి మీ అయ్యలాగ" ఆవేశం సెగలు కక్కుతున్నా అదను కాదని మౌనం వహించి వచ్చాడు. " ఏందిరో బెమ్మాండంగా అలంకరణ చేసినావు. ఇలా మీ అక్కను చేసి తీసుకురాకూడదా, కాస్త కంటికి నదురుగా కనిపించేది" వస్తూనే వెటకారం చేశాడు చౌదరి. పక్కనే మనసు మండిపోతున్నా మాట పెగలక మౌనంగా ఉండిపోయాడు గన్నయ్య. సర్పంచి కూర్చునే కుర్చీలాగి కూర్చోబోయాడు చౌదరి. " ఆగండి సర్. అక్కడ కూర్చోవలసింది మీరు కాదు. కొత్తగా ఎన్నికైన సర్పంచి గారు" చౌదరి చేతిని విసరికొట్టి కుర్చీని యధాస్థానంలో పెట్టాడు. " ఏంకూశావురా.. నన్నే." అని కొట్టబోయిన చౌదరిని ఆపి, బ్రతిమాలుకుని ముందు వరుసలోని కుర్చీలో కూర్చోబెట్టాడు గన్నయ్య. ఇంతలో బిలబిలమంటూ జనం పోగయ్యారు, వారిలో వాసంతి కూడ ఉంది. అందరూ సర్దుకుని కూర్చున్న తరువాత మల్లయ్య లేచి అందరికీ నమస్కారం చేశాడు. " ఈ రోజు మనందరికీ కొత్త మార్పును తెచ్చిన రోజు. ఇంతవరకు వచ్చిన అందరు సర్పంచులు అధికారాన్ని అనుభవిస్తూ, మనందరినీ తన చెప్పు చేతలలో పెట్టుకుని గ్రామాన్ని నిర్వీర్యం చేశారు. ఊరి చివర ఒంటరివాడలో మన బతుకులను తమ ఎదుగుదలకు నిచ్చెనగా వేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ఓటుకు తప్ప సీటుకు పనికిరామన్న మన బతుకులకు, ఊరిని బాగుచేసుకొమ్మని, అందుకు మీరూ సమర్థులేనని గుర్తిస్తూ, ప్రభుత్వం మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరమూ ఒక్కటై మన ఊరిని మనమే తీర్చిదిద్దకుందాం. ఈరోజు వాసంతి గారు ప్రజల సహకారంతో మన ఊరికి సర్పంచి అయ్యారు. ఆమెను సగౌరవంగా వచ్చి తమ ఆసనాన్ని అలంకరించవలసినదిగా కోరుతున్నాను" అని తన అక్క వాసంతిని ఆహ్వానించాడు మల్లయ్య. అందరి కరతాళధ్వనుల మధ్య వాసంతి వేదిక మీదకు వచ్చారు. కానీ కుర్చీలో కూర్చోలేదు. మల్లయ్య మరల అందుకున్నాడు " ఈ ఊరిలో పుట్టి, ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో పనిచేసి మాలాంటి ఎందరినో చెరదీసి చదువు చెప్పి, మంచి భాషను, సంస్కారాన్ని మాకు నేర్పించిన మన గురువు శ్రీయుతులు రామనాథశర్మ గారిని సర్పంచి గారికి ఈ బొకే ఇవ్వవలసినదిగా కోరుచున్నాను" ఎనభై సంవత్సరాల వయసు పైబడినా తన వంట్లో ఓపిక ఉన్నంత వరకు పిల్లలకు చదువు చెప్పాలని ఇప్పటికి కూడ కృషి చేస్తున్న శర్మ గారు వేదిక పైకి వచ్చి వాసంతికి బొకె అందించారు. " అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న అందరూ నాకు బిడ్డల లాంటి వారు. వాసంతి కూడ నా శిష్యురాలే. ఏనాటికైనా బాగా చదువుకుని, పేదల మరియు రైతుల కష్టాలు తెలిసిన వారు సర్పంచిగా రావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. నేను పోయేలోపే ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో వాసంతికి ఒక చిరు సలహా ఇస్తున్నాను. భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టమే తప్ప సరియైన దిగుబడిని కళ్ళచూడని రైతన్నలను, కాయకష్టం మీద ఆధారపడే రైతు కూలీలను కనిపెట్టి ఉండాలని, పూడిపోయిన చెరువును తవ్వించి వాననీటిని ఒడిసిపట్టి పంటకు నీరు అందేలా చేయాలని కోరుతున్నాను. అలాగే ఎన్ని అవరోధాలు వచ్చినా నీతిని, న్యాయాన్ని విడువక ధర్మంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సభాముఖంగా కోరుతున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా అందరి సహకారం ఉంటుదని అందరి తరఫున నీకు హామీ ఇస్తున్నాను" అంటూ వాసంతిని అభినందించి వెళ్ళిపోయారు శర్మ గారు. అందరి కోరికమేరకు వాసంతి మాట్లాడడం మొదలుపెట్టింది. " నన్ను ఇంత పెద్ద పదవికి ఎన్నుకుని నా మీద మోయలేనంత బాధ్యత పెట్టిన మీ అందరికీ ధన్యవాదములు. నా దృష్టిలో ఇది పదవి కాదు, మీరు నాకు అప్పగించిన బాధ్యత. నేను ప్రత్యేకమైన మనిషిని కాదు, మీలో ఒకరిని. అందుకే నేను ఈ కుర్చీలో కూర్చోలేను. మీతో పాటే కూర్చుంటాను. నేను ఈ వ్యవహారాలకు కొత్త. అందుకే చౌదరిగారిని నాకు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంతవరకు ఎలా వ్యవహరించాడో మనకు అక్కరలేదు. కానీ ఇకనుంచి గురువు గారు చెప్పినట్లు నీతిగా, నిజాయితీగా మెలగాలని కోరుతూ, నాకు చక్కని సలహాలిచ్చి మన ఊరికి మంచి జరిగేలా చూడాలని ఆశిస్తున్నాను. అలాగే సార్ చెప్పినట్లు చెరువును తవ్వించాలి. అంతేగాక వృధాగా పడివున్న భూమిని పొలంలేని పేదలకు ఇచ్చి, దానిలో అనువైన పంటలు పండించాలని నా ఆకాంక్ష. అలాగే ఆలయ భూములకు అతి తక్కువ ఈనాము ఇచ్చి ఎక్కువ లాభం పొందుతున్న వారసత్వపు కౌలుదారులను రద్దుచేసి, వేలంపాట నిర్వహించి అధిక ఆదాయం దేవాలయానికి వచ్చేలా చెయ్యాలి. మనందరమూ కులమత బేధాలను వదలి ఐకమత్యంగా నడిచి మన ఊరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఊరిలో బెల్టుషాపులను ఎత్తివేయాలని వాటి నిర్వాహకులను కోరుతున్నాను. మన సంపాదన కుటుంబపోషణకు ఉపయోగించాలి తప్ప, మన నాశనానికి బాటలు వేసే మందుకు వినియోగించకూడదు. ఇందుకు అందరి సహకారం నాకు కావాలి. ఇప్పటిదాక వాటి నిర్వాహకులు కావాలనుకుంటే కౌలు తీసుకుని వ్యవసాయం చేసుకోవచ్చు. నాతో చదువుకుని విదేశాలలో స్థిరపడిన మన ఊరి వారు మన గ్రామ పురోభివృద్ధికి ఆర్థికసాయం అందిస్తామన్నారు. అందులో మన చౌదరి గారి కుమారుడు కూడ ఉన్నారు. కాబట్టి ఇది ఉమ్మడి బాధ్యతగా తలచి అందరూ పట్టుదలతో కృషిచేసి మన గ్రామానికి గత వైభవాన్ని తీసుకురావాలని, ఊరు వదలి పట్టణాలకు వెళ్ళిన వారు తిరిగి వచ్చేలా మనం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను" అని ముగించి అందరికీ నమస్కారం చేసి వచ్చి వాళ్ళ మధ్య కూర్చున్నది వాసంతి. ఆమె వాగ్ధాటికి, తెలివిగా తనను ఇరికించిన విధానానికి నోట మాటరాలేదు చౌదరికి. తనకు తెలియకుండా తన కొడుకును సంప్రదించి డబ్బులు కూడ తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఆ మల్లయ్య గాడి పనే. ఆడు ఎదిగినప్పటి నుంచి నాకు ఎదురు తిరుగుతూనే ఉన్నాడు. చుట్టూ చూశాడు, రాజయ్య కనిపిస్తాడేమోనని. వాడు వాసంతి పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే పార్టీ మార్చేశాడు వీడు అనుకుని, విసురుగా లేచి బయలుదేరాడు. ముందు కొడుకుతో మాట్లాడాలి. ఒక్క పైసా రాకుండా చూడాలి. " ఒరేయ్ గన్నిగా. రారా వెళదాం" అని అరిచాడు. ఆ అరుపుకు అదిరిపడి లేచి పరిగెత్తబోయాడు గన్నయ్య. " అయ్యా ఆగు. నువ్వు పంచాయితీలో పనివాడివే గానీ, చౌదరికి కాదు ఇప్పుడు నువ్వు సర్పంచి చెప్పినట్లు చెయ్యాలి. ఎక్కడికీ వెళ్ళకు" అని తండ్రిని ఆపాడు మల్లయ్య. చేసేదిలేక తలవంచుకుని నిలుచున్నాడు గన్నయ్య. ఇప్పటిదాకా వీళ్ళను రెక్కపురుగులని, తమ చుట్టూ తిరిగే తేలిక మనుషులు అనుకున్నాడు. వీళ్ళు పురుగులు కాదు పులులు. అవకాశాలు లేక అణిగిమణిగి ఉన్నారు అంతే. ఇక అదనప్రసంగంగా మాట్లాడితే ఉన్న పరువు పోయేలా ఉందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చౌదరి. ****** " అయితే ఇప్పుడేమంటావు నాన్నా" " ఒక్క పైసా కూడ ఇవ్వవద్దు" " నేను మల్లిగాడికి మాటిచ్చాను. అయినా ఇదేమీ వాడి ఖర్చులకు కాదుగా. ఊరిని బాగుచేయడానికి. ఇన్నాళ్ళూ ఊరిని, ఊరి జనాలను మనం వాడుకున్నామే గానీ, మనం ఊరికి ఏరకంగాను సహాయపడలేదు. ఇప్పుడు వాసంతి వచ్చి ఊరికి ఏదో చేయాలనే తపన పడుతున్నది. కూటికి లేకపోయినా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నది. ఇంతకాలం మీరు వదిలేసిన పనులన్నీ చేయాలని కంకణం కట్టుకున్నది. మంచిని, మానవత్వాన్ని గుర్తించండి నాన్నా. నన్ను ఇంతవాడిని చేయడంలో మీతో పాటు నేను పుట్టిన గడ్డకూ భాగస్వామ్యం ఉంది. తరం మారింది నాన్నా. వాళ్ళ ఆలోచనలు మారాయి. మీ తరం వారిలా స్వార్ధం చూసుకోవడం లేదు. కులం, మతం అంటూ ఎవరినీ తొక్కిపెట్టడం లేదు. అందరినీ కలుపుకు పోవాలని పట్టుదలతో ఉన్నారు. మీరు సహకరించక పోయినా అడ్డుచెప్పకండి. మీరు ఎంత చెప్పినా నా ఆలోచన మారదు. నాకు మీకన్నా, మనకు జన్మనిచ్చిన మా గ్రామమే ముఖ్యం. అది మాకు తల్లి తరువాత తల్లిలాంటిది. మీరు కూడా మారండి. కుటిలత్వాన్ని వీడి కలసికట్టుగా కదలండి. మారిన తరానికి అండగా నిలిచి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి" అని ఫోను పెట్టేశాడు చౌదరి కొడుకు నవీన్. 'గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని, వీడు నాకు నీతులు చెబుతున్నాడు' అని ఫోను సోఫాలోకి విసిరికొట్టాడు. "ఇంకా ఆవేశం తగ్గలేదట్రా చౌదరి" అంటూ వచ్చాడు రాజయ్య. ఉరిమి చూశాడు చౌదరి. "ఇంక ఉరిమినా, గర్జించినా నీ మాట వినేవాడు ఎవరూ లేరిక్కడ. నీ రాచరికపు పాలనకు చరమగీతం పాడారు జనం. పెద్దల నుంచి వచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుని జనం దృష్టిలో చెడ్డగా మిగిలిపోయావు. వాసంతి మాటలకు ప్రతిపక్షం అనుకున్న నరసింహం గాడే చేతులెత్తేసి ఆమెకు మద్దతు ఇస్తున్నాడు. 'ఇదేం పనిరా' అంటే 'రాజయ్య మావా, నా ఊరికంటే నాకేది ఎక్కువ కాదు. వాసంతితో కలిసి ఊరిని బాగుచేసుకుంటానని' చెప్పాడు. ఎటొచ్చీ చెడిపోయింది నువ్వే. తరం మారిందిరా. వాళ్ళ ఆలోచనలూ మారాయి. నువ్వన్నట్టు అవి రెక్కల పురుగులేరా. అందుకే ఊరంతా చుట్టి అందరి ఆలోచనలను చెవిలో వేసుకుని, అందరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. మనమే ఎద్దుమొద్దులంరా. అహంకారం నిండి కళ్ళు మూసుకుపోయి ఉన్న పరువు పోగొట్టుకున్నాం. ఇకనైనా మేలుకుని, పొగరు తగ్గించుకుని, వాళ్ళతో కలిసిమెలిసి ఉండి, పోయిన పరువును కాపాడుకుందాం" అన్న రాజయ్య హితబోధలు కంపరం కలిగిస్తున్నా ఎదురు పలకలేక మౌనంగా ఉండిపోయాడు చౌదరి. 'అవును. తరం మారింది. మంచివైపు నడుస్తున్నది. జన్మభూమి మీద మక్కువ పెరుగుతున్నది. ఇది మంచి పరిణామం. రాజయ్య మాటల్లో నిజం ఉంది. కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తున్నది. చివరకు కడుపున పుట్టినవాడు కూడ తనను వేలెత్తి చూపుతుంటే లోపం తనలోనే ఉన్నది. దేన్నైనా తెగేదాక లాగితే చెడిపోయేది తన పెద్దరికమే. విలువ ఇచ్చినపుడు ఉపయోగించుకోక పోతే ఉనికే లేకుండా పోతుంది. చిన్నగా వారి దారిలోకి అడుగుపెట్టాలి' అని అనుకుని వాసంతికి ఫోను చేయడానికి చేతిలోకి సెల్ తీసుకున్నాడు చౌదరి. ****** అయిపోయింది *******

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు