నాన్న ! మెడపట్టుకు గెంటేసాడు! అమ్మ ముఖం చాటేసుకుంది. అక్క "ఏంటిరా! మాకీ కర్మ "అంటూ తల బాదుకుంది. విధి వ్రాసిన నుదుటిపై రాతను నేనుగా మార్చలేను కదా! . ఆయినా! ప్రయత్నించి చూసాను! ఫలితం అందనంటూ వెక్కిరిస్తూనే దూరంగా జరిగింది. అనుమానాలు . ఛీత్కారాలు.. అడుగడుగునా అవహేళనలు, చుట్టూ కీచకులు,తట్టుకుంటూ, నేను నేనుగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ, ఉండలేకపోయాను. చివరకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న పిరికి వాడిని(దాన్ని). అందరి ముందుకూ ఇలా ఈ రోజున సగర్వంగా నిలబడగలిగా నంటే.. ఒక్కరే దానికి కారణం అని చెప్పుకోవాలి అమ్మకాదు,నాన్న కాదు,బందువులు కాదు, నన్ను నన్నుగా అర్దం చేసుకుని, నన్ను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన ఒక "హిజ్రా" చేతి చలువే.. ! అందుకేనేమో! నాది కథ కాదు వ్యధ..! జాలి చూపే ప్రయత్నం చేయకండి, నా లాంటివారు కనిపిస్తే వారుకూడా మనుషులే! అని గుర్తించండి చాలు. సామాజంలో కొందరు చిన్న చూపు చూస్తున్న ఒక వర్గంలోని బాధితుల నుండి, వికసించిన చిరు కుసుమాన్ని నేను. "నా గురించి మీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా! కుదర్లేదు ." "ఈ రోజున అవకాశం కల్గింది. అందుకే! మీ అందరికి హృదయపూర్వక సుమాంజలి. " ***** "నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది?" అనుకోవడానికి వీల్లేని సమస్యనాది.. అందులో నేను ఒకడిని(దాన్ని) . "మాది చాలా ఉన్నతమైన అగ్రవర్ణ కుటుంబం. డబ్బుకు కొదవ లేనప్పటికీ,నాలో ఏదో చిన్న అసహనం, నాన్నగారికి RTO జాబ్... అందుకేనేమో డబ్బు ఇబ్బందులను ఎప్పుడూ మా దృష్టికి తీసుకురాలేదు మా కుటుంబ సభ్యులు. అమ్మ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్. ఇంట్లో నేను రెండవ సంతానం. మొదటి సంతానం అక్కయ్యా. ఇద్దరం ఎంత సరదాగా గడిపే వారేమో.. కాలమే మమ్మల్ని చూసి ఈర్షపడేది. అటు వంటి సమయంలోనే నాలోనే ఏదో చిన్న మార్పు, నాకు తెలిసీ తెలియనంతగా... నాన్నతో షాపింగ్ కు వెళ్ళిన ప్రతి సారి.. ఎన్నో రకాల గాజులు, మేకప్ కిట్స్.. బొట్టు బిళ్లలు కొనిపించే వాడిని.. నాన్న ముచ్చటపడే వాడు. "పిచ్చి వెధవ! తనకోసం ఏమీ తీసుకోకుండా, అన్నీ తన అక్క కోసమే తీసుకుంటాడు,వీడికి అక్కంటే ఎంతో ప్రేమో?"అనుకునే వాడు.. అసలు విషయం తెలిస్తే నాన్న ఎంతగా బాధపడతారో అనిపించేది.,నాన్న అలా అన్ని ప్రతిసారి. నా మనస్సులో. రాను రాను నాలోనూ, నా ఆలోచనా విధానంలో ను, నడకలోను ఎదో మార్పు బాగా కనిపిస్తుంది. బయటకు చెప్పలేను.. కానీ!ఎంతగా సర్దుకుందా మనుకున్నా.. మనసు మాట వినకపోయేది. ఒక రోజున అక్కను అడగలేక అడిగాను. "అక్కా !ఒక్కసారి నన్ను నీలా అలంకరించుకోవాలి అనిపిస్తుంది..! నీలా పట్టులంగా జాకెట్ వేసుకోవాలి అనిపిస్తుంది. నీలా పాపిట బిళ్ల జడ గంటలు వేసుకోవాలని ఉంది ప్లీజ్ అక్కా,". అంటుంటే "ఇదేమి సరదారా..! అమ్మాయిలా ! అలంకరించుకోవాలి అనుకోవడం " అంటూ ముసిముసిగా నవ్వుకునేది.. అక్క కాదంటున్నా !అడగడం మానుకోలేదు నేనుగా.. తను లేని సమయంలోను అక్క బట్టలు వేసుకుని మురిసిపోయే వాడిని. జుట్టు కూడా బాగా పెంచేసాను. .. ఎంతగా అంటే చిన్న జడ వేసుకునేందుకు సరిపడేలా . చూసే వారు మొక్కుబడి అనుకునేలా . కానీ! నా మనస్సులోని కోరిక అలా పెంచి జడలా అల్లుకోవాలని.. వారికి తెలియదు కదా. నాలో మార్పులతో.. కాలేజిలో, ప్రేండ్స్ కూడా లేడీస్ నే ఎక్కువగానే సెలక్ట్ చేసుకున్నా.. ఎక్కువ సమయం వారితోనే ఉండే వాడిని.. బోయిస్స్ పిలిచిన వారితో కలవలేక పోయేవాడిని. ***** ఒక రోజున... అక్క ఎగ్జామ్ ఉందని రూమ్ కు రావడం వీలవ్వదని ఫోన్ చేయడంతో, నాలో దాచుకున్న కోరికలను మొదటిసారి తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది అని పించింది. అక్క పట్టు లంగాజాకెట్, ఓనీ జడగంటలు అన్నీ తీసి బయటపెట్టి అలంకరించుకోవడం మొదలు పెట్టా... చెవికి జూకాలు... బొట్టు బిళ్ళ వరకు..ప్రతిదీ . నన్ను నేను అద్దంలో అలా తొలిసారిగా చూసుకోవడం ఎంత సంతోష మనిపించిందో? కానీ !మూతి మీద మీసం ఏదో ఒకరకంగా అనిపించింది.. వెంటనే అవి కూడా తీసి మరళా చూసుకున్నా.. .. అక్కకంటే నేనే బాగున్నాను అనిపించింది. బయట తలుపు తట్టిన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చి.. అక్క వచ్చేవుంటుంది .డోర్ తెరచి, తనని సర్ప్రైజ్ చేయాలని చూసా.! కానీ! ఎదురుగానే నాన్నా.. ! మొదటి సారి నాకు ఊహ వచ్చిన తరువాత నాన్న నా చెంప పగలగొట్టడం మొదటిసారి . "నీకు ఇదేమి సరదారా !"అంటూ. ఎం చెప్పాలో అర్దం కాలేదు.. తలవంచుకున్నాను నేల చూపులు చూస్తూ.. తరువాత విషయం అక్కకు తెలియడంతో.. చివాట్లు పెట్టింది.. చూడు చూడూ మంటూ కార్తీక మాసం మొదలైంది... కాలేజీ నుండి వస్తూవస్తూ పూలు కొనితెచ్చుకునే వాడిని. కాళ్ళకు పసుపు పూసుకునే వాడిని చేతులనిండుగా గోరింట పెట్టుకునే వాడిని.. నా రూమ్ లోనే.. కానీ !ఎంత జాగ్రత్త తీసుకున్నా! కాళ్లకు ముఖంకు పూసుకున్న పసుపు.. మా ఇంట్లో అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టింది. నాన్న అక్క మీద కోపడ్డాడు.. "నీ అలంకరణలు చూసే వాడు ఇలా! తయారయ్యాడు.. తీసుకు పోయి ఎక్కడైనా దూరంగా హాస్టల్లో వేస్తే బెటర్ "అని.. "అక్కడైనా ఇలాంటి తింగిరి వేషాలు వేయకుండా చదువుకో" అంటూ చెప్పి వెళ్ళిపోయారు. "అప్పుడు తెలియదు నాకు నేను ఆత్మహత్య చేసుకునే స్థితి ఎదురౌతుందని" *** అన్నట్లుగానే చేశాడు నాన్న! సిటీకి కాస్త దూరంగానే ఉన్న రెసిడెన్షియల్ కాలేజీలోనే జాయిన్ చేయించారు నాన్న. ప్రాంతం మారినంత మాత్రాన నా మనస్సులోని అలోచనలు మారవు అనే విషయం తరువాతనే తెలిసింది. పగలు కాలేజీ సమయంలో ఆలోచనలు బలవంతంగానైనా అణచుకున్నా.. సాయంత్రం రూమ్ చేరిన తరువాత, వాటిని నియంత్రించుకోలేక నరకం అనుభవించేవాడిని. నాతో పాటుగా రూమ్ లో నలుగురు ఉండేవారు. వారి ముందు ఎక్కడైనా నా ప్రవర్తన బయట పడుతుందేమో అని చాలా జాగ్రత్తగా నడచుకునే వాన్ని. అటువంటి సమయంలోనే స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ లకు బయటకు వెళ్ళవలసి రావడం నా అదృష్టం లా కలసి వొచ్చింది. వారంలో ఒక్కరోజు క్లాస్ డుమ్మాకొట్టి అక్కలా అలంకరించుకుని, అలా అలా బయట కాస్త తిరిగి రావడం అలవాటు చేసుకున్నాఇ.. కొందరి చూపులు సూదుళ్ళా గుచ్చుకుంటుంటే అదో పరవశం అనిపించేది. ఎన్నో స్వప్నాల్లో విహరించేవాడిని. నా కోసం ఓ రాకుమారుడు.. రెక్కల గుర్రం పై వస్తాడని.. నన్ను పెళ్లి చేసుకుంటాడని. కానీ ఒక రోజు కాలేజిలోకి అడుగు పెట్టిన మరుక్షణం.. అందరి చూపులు అదోలా ఉన్నాయ్. గోడలపైన తన అలంకరణ రూపం చిత్రాలతోనే పిచ్చిపిచ్చి రాతలు.. ఇన్ని రోజులు మన మధ్యనే ఓ ట్రాన్స్‌జెండర్ అంటూ! (ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్‌కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు. మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాన్స్‌జెండర్స్ మనసులో ఉండే ఆలోచనలు వాళ్లు ధరించే దుస్తుల రూపంలో కనిపిస్తుంది.) ****** క్లాసులోకి నడుస్తుంటే వెంటపడి అల్లరి అల్లరిగా.. మాటలు అవమానాలు.. కొందరు పూలుతెచ్చి మీద పోస్తూ.. మరి కొందరు గాజులు చెతిలో పెడుతూ, .. మరి కొందరు పసుపూ కుంకుమలతో హారతి పడుతూ.. ఎంతగానో హేళన చేస్తూ,నా చుట్టూ తిరుగుతూ ఎన్నో పేర్లు పెట్టి ఎంజాయ్ చేసేవారు. అందరికి నేనో టైంపాస్ టాపిక్ గా మారిపోయాను. గట్టిగా అరవాలి ఆనిపించేది. ఇది నా తప్పా? అంటూ. "దైవం నాలో కలిగించిన లోపంకు నాకేందుకు ఇంతటి శిక్ష" అని.. ఎవ్వరూ వినేవాలేరు అని తెలుస్తూనే ఉంది. అందుకే అదే రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని కృష్ణా నదిలో దూకేసా.. ******* ప్రవాహంలో.. ఎక్కడి వరకు కొట్టుకు పోయానో తెలియదు.. కన్నులు తెరచి చూస్తే నాచుట్టూ జాలర్లు. అర్దమైంది వీరే నన్ను కాపాడి ఒడ్డుకు చేర్చి ఉంటారని. పాపం ఏమనుకుంటున్నారో, కడుపునిండుగా భోజనం పెట్టి చేతిలో డబ్బులు పెట్టి జాగ్రత్తగా ఇళ్లు చేరమని ట్రైన్ ఎక్కించారు. ఎక్కడకు వెళ్ళాలో తెలియదు. దూరంగా బొంబాయి వెళ్ళె ట్రైన్ కనిపిస్తుంది. వెళ్ళి ఎక్కి కూర్చున్నాను.అక్కడకు చేరి ఏమి చేయాలో మాత్రం తెలియదు. ******* బొంబాయి చేరుకుని రెండు రోజులౌతుంది. ఏది తినాలన్నా, డబ్బు విపరీతంగా ఖర్చు చేయక తప్పలేదు.. మూడవ రోజు పస్తు ఉండవలసిన పరిస్థితి. కడుపులో ఆకలి. పైన సూర్యుని ప్రతాపంతో. అడుగు తడబడుతుంది, నాన్న దగ్గర సుకుమారంగా గారాభంగా పెరిగిన శరీరం, అలసి రోడ్డు పైన పడిపోవడం తెలుస్తుంది. దగ్గరగా మరికాస్త దగ్గరగా కారు వస్తున్నట్లు తెలుస్తుంది అంతే తరువాత జరిగింది తెలుసుకుని కాస్త, దెబ్బలు నుండి కోలుకోవడానికి వారం పట్టింది నాకు. నేను జీజీ అనే ఒక సెక్స్ వర్కర్ దగ్గర ఉన్నానన్న విషయం కొద్ది కొద్దిగా అర్థం అయింది. అనుకున్నా! చివరకు నా జీవితం ఇలా ముగింపు లిఖితమా.! అని. జీజీ దగ్గరకు తీసుకుంటే తిరిగి అమ్మ స్పర్శ గుర్తువచ్చేది. గట్టిగా కౌగిలించుకు ఏడ్చాను. నన్ను ఓదార్చి, నా గురించి అడిగి తెలుసుకుంది. నా మనసులో కోరికతో సహా.. వెంటనే కొత్త బట్టలు తెప్పించింది . నన్ను అలంకరించి ఎంతగా మురిసి పోయిందో. తనకు ఒక కూతురు ఉంటే ఇలాగే ఉండేదని. కానీ బలవంతాన తన భర్త ఇక్కడకు తీసుకు వచ్చి అమ్మేసాడని. తన జీవితం ఇలా అయిందంటూ.. నాకు నచ్చి నట్లుగా ఇక్కడ ఉండిపోవచ్చు అనే ధైర్యం కల్పించింది జీజీ. ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యం లేదని తెలియడంతో... "ఇక్కడ ఉండి చదువుకుంటావా? చదివిస్తాను, నాకూతురులా చూసుకుకుంటాను.. నాతోనే ఉండి పో, నా వలన నీకు ఏ ఇబ్బంది రాదు," అనడంతో ఇదే మంచిది అనిపించింది.. "సరే "అన్నాను. నా సర్టిఫికెట్స్ కోసం తిరిగి వెళితే నాన్న కనీసం పలకరించలేదు. కాలేజి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని బొంబాయి లోనో కాలేజీ చదువు ప్రారంభించా... మొదటి రోజు నన్ను అక్కలాగే అలంకరించి తీసుకు వెళ్లింది. కాలేజీలో అందరికి పరిచయం చేసింది జీజీ. అందరు కలసిపోయారు. అలా నాచదువు.. కొనసాగుతు ఉండగానే సివిల్స్, రాసాన్.. టాఫర్ గా నిలచాను.. కానీ ఎందుకో అది తృప్తి అనిపించలేదు. ఒక రోజు జీజీని అడిగాను.. అమెరికా వెళ్ళి కొత్త సాప్ట్ వేర్ టెక్నాలజీ నేర్చుకోవాలనుందని. తను మరో మాట లేకుండా నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. ******** కాలం నా సమస్యలకు పరిష్కారం చూపిందనుకుంటూ.. ఐదు సంవత్సరాలు తరువాత ఇండియా తిరిగి వచ్చేశాను.. నా కోసం జీజీ బొంబాయి లోని తన ఆస్తులన్నీ అమ్మేసింది. ట్యాలెంట్ ఉన్న సాప్ట్ వేరు నిపుణులను సమీకరించాను .. వారిలో ఏదో సాధించాలనే పట్టుదల కనిపించింది.. "ఏదైనా కొత్తగా క్రీయెట్ చేసి మనకంటు ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చెద్దాం. మీ వెనక నేను మా జీజీ ఉంటామనే నమ్మకం కల్పించాను.. యువత తల్చుకుంటే, సాధించలేనిది ఏదీ లేదు? అనేలా! అతి తక్కువ కాలంలోనే ఎన్నో కొత్త కొత్త యాఫ్స్.. యాంటీ వైరస్ ఫార్మెట్స్ఇ... సైబర్ క్రైం జరిగితే వెంటనే, పసిగట్టే "అలారం సాఫ్ట్ వేర్" సిస్టమ్స్ . "మార్కెట్ లో ఏదైనా కొత్త రకం రావాలంటే! అది మననుండే రావాలి " అనేలా తయారైన నా టీమ్ వర్క్ తో అంచె లంచెలుగా ఎదుగుతూ, సుమారుగా రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మన సంస్థ "జీజీ గ్లోబులైజేషన్" ప్రారంభించడం జరిగింది. సంస్థ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి కావడంతో. మీ అందరిని ఇలా కలుసుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. ఇది నాఒక్కరి వలన సాధ్యమైందని చెప్పాను . అందరి సమిష్టి కృషి ఫలితమే ఇది. అందుకే మీ అందరికి ఈ వార్షిక ఆదాయంలో 25% అందరికి పంచుతున్నాను. అలాగే అర్హతలు ఉన్నవారు వస్తే.. వారి లింగనిర్దారణతో సంబంధం లేకుండా ఉద్యోగాలను కూడా కల్పించాలని ఒక తీర్మానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకు తెలుసు ఇక్కడ మనం కులం మతం అనేది నియామకంలో ఎక్కడా ఉపయోగించని... అ మనకు కావాల్సింది వ్యక్తిలో ని ట్యాలెంట్ మాత్రమే.. మీరేమంటారు... ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంటూ సంస్థలోని సభ్యులు వంక చూసాను. మరుక్షణం కరతాళ ధ్వనులతో, సభా ప్రాంగణం మారు మ్రోగింది.. జీజీ కన్నుల్లో ఆనందాశ్రువులు నిండుతున్న వేళ... ఆమె పాదాల దగ్గర శిరసు ఉంచాను.. "మీరు నన్ను చేరదీయకుంటే నాకు ఈ గుర్తింపు ఎక్కడా? అని ప్రశ్నించు కుంటూ.. ******* నెల రోజులు తరువాత ఇంటర్వ్యూలు జరుగు తున్నాయ్.... ఎందుకో నా చూపు నేను కూర్చున్న క్యాబిన్ కు ఎదురుగా ఉన్న తల్లీ కొడుకులు దగ్గర ఆగింది. జాగ్రత్తగా చూశాను. తను మా అక్క.. పక్కన ఉన్నది బహుషా నా మోనల్లుడు అనుకుంటా.. అచ్చు నాలానే ఉన్నాడు. అమ్మాయి పోలికలతో... చిన్న చిరు నవ్వు నా అధరాలపై! గతం గుర్తు చేసుకున్నా! **శుభం**