రామవరం గ్రామానికి చెందిన రంగారావు, పార్వతమ్మ దంపతులకు ఈశ్వర్ లేక లేక పుట్టాడు. ఉన్న పది ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు రంగారావు. ఉన్నంతలో ఈశ్వర్ ని లోటు లేకుండా పెంచసాగారు.
లేక లేక పుట్టిన కొడుకు కావడం వాళ్ళ పార్వతమ్మ కొడుకును గారం చేసేది బాగా. దాంతో కోరిందల్లా కావాలనుకునే పెంకి మనస్తత్వం అలవడింది ఈశ్వర్ కి. అతని పెంకితనం చూసి చుట్టుపక్కల వాళ్ళు రంగారావుకి మగపిల్లవాడికి తండ్రి భయం, ఆడపిల్లకు తల్లి భయం ఉండాలని లేకపోతె పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా ఇబ్బంది పడతారని సలహా ఇచ్చారు.
అప్పటినుంచి తనలో కొడుకు పట్ల ప్రేమను పైకి కనపడనీయకుండా తప్పు చేసినప్పుడు కోప్పడుతూ, బాగా చదివినప్పుడు అభినందించడం చేయసాగాడు రంగారావు.
భర్త చూడకుండా కొడుక్కి పాలు అమ్మిన డబ్బులు ఇవ్వడం అలవాటు చేసింది పార్వతమ్మ.వాటితో ఖరీదైన పెన్నులు. పుస్తకాలు...అన్నీ ఖరీదైనవి కొనడం అలవాటు చేసుకున్నాడు ఈశ్వర్.
వూళ్ళో పదవ తరగతి పూర్తీ చేసుకుని ఇంటర్, డిగ్రీ లు పట్నం రోజూ సైకిల్ మీద వెళ్లి చదివి వచ్చేవాడు ఈశ్వర్.
డిగ్రీ పాసయ్యాకా పట్నంలో వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. అతనికి రెండు గ్రామాల అవతల ఉన్న రాయవరం గ్రామానికి చెందిన చంద్రికను చూసి అన్ని విధాలా వారి కుటుంబ సాంప్రదాయాలు పద్ధతులు నచ్చిన మీదట పిల్లలు ఒకరికొకరు నచ్చడంతో వివాహం జరిపించాడు రంగారావు. చంద్రిక కూడా డిగ్రీ పాసైంది.
చంద్రిక తండ్రి రామారావుది పాల వ్యాపారం. అతని భార్య సుబ్భలక్ష్మి అతనికి అనుకూలమైన భార్య.
ఈశ్వర్ చంద్రికలు పట్నం లో కాపురం పెట్టారు. నాలుగేళ్లలో ఇద్దరు పిల్లలు పుట్టారు.అద్దె ఇల్లుఅయినా కూడా ఖరీదైన సామాను, తమందరికీ ఖరీదైన బట్టలుకొనేయడం, సినిమాలకు వెళ్ళిపోవడంవంటి పనులు చేసి నెల మధ్య లోనే జీతం ఖర్చు పెట్టేసి ‘’నాన్న.. ఒక అత్యవసర పని వచ్చింది. ఒక అయిదువేలు సర్ధవా..’’ అని అడగడం భార్య సతాయింపు పడలేక ఈశ్వర్ కి ఎంత అడిగితే అంతా ఇవ్వడం తప్పనిసరి అయిపొయింది రామారావుకు.
దాంతో ఆస్తి ఒక్కొక్క ఎకరం తగ్గసాగింది.ఇది చూసి రామారావుకు భయం వేసింది. ఎవరినా ఆస్తిని నిలబెట్టుకుని, అవసరమైతే ఇంకా కృషి చేసి ఒక్కొక్క ఎకరాన్ని జోడిస్తారు. ఇలాగే వాడి అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటె తానూ బతికి ఉండగానే ఆస్తి హారతి కర్పూరం అయిపోతుందన్న ఆలోచనతో మధన పడసాగాడు రామారావు. భార్యకు చెప్పినా ‘’పిల్లవాడికి మనం సాయం చేయకపోతే ఎలాగండీ? ఎప్పుడో పోయాకా వాడికి ఆడబ్భు ఉపయోగపడే కంటే ఇపుడు ఉపయోగ పడటం మంచిది కదా’’ అని కొడుకునే సమర్ధించింది. దాంతో మనో వేదనతో కుంగి పోసాగాడు.
సరిగ్గా అలాంటి సమయం లో చిన్ననాటి స్నేహితుడు నారాయణరావు రంగారావుని చూడటానికి వచ్చి అతని మనోవేదన తెలుసుకున్నాడు.’’కావాలంటే నాలుగు రోజులు నీ కొడుకు ఇంట్లో ఉండి మనవలకు పళ్ళు స్వీట్లు కొని పట్టుకు వెళ్ళు. అంతే గానీ పొరపాటున కూడా ఒక్క పైసా సాయం చేసి చేజేతులా అతని జీవితం పాడు చెయ్యకు.ఇది నీకు కాదు. ముఖ్యంగా నీకు చెబుతున్నాను చెల్లెమ్మా.అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.జాగ్రత్త.’’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ వెంటనే తన తదనంతరం తన ఆస్థి తన మనవలకు చెందాలని, కొడుకు కోడలు దానిని కేవలం అనుభవించడానికి మాత్రమె అర్హులని వీలునామా రాసి రిజిస్టర్ చేయించాడు రంగారావు.ఇది తెలిసిన ఈశ్వర్ తండ్రితో మాట్లాడటం మానేసాడు.
‘’మనకు మా నాన్న వల్ల అందే సహాయం ఆగిపోయింది. మన ఖర్చులు మనం మానుకో లేకపోతున్నాం.ఇక నుంచి ప్రతీ నెల మీ నాన్నని ఆ ఐదువేలు పంపమని అడుగు ‘’ అన్నాడు ఈశ్వర్ భార్యతో.
‘’ఇప్పటికే బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేసాం. ఆ అప్పులు మాకు తీరలేదు. డబ్బు అడిగే పక్షం లో మా ఇళ్ళకు కూడా రానవసరం లేదు ‘’ అని నిష్కర్షగా చెప్పాడు రామారావు కబురు మోసుకొచ్చిన కూతురితో.
‘’అయితే ఏంచేద్దాం?’’ ఈశ్వర్ భార్యని అడిగాడు.
‘’పెళ్లి చేసుకున్నావ్ గా. నన్ను పిల్లల్ని పోషించే బాధ్యతా నీదే.’’ అంది చంద్రిక.
‘’అలాగా.సరే నేను ఏ తిండి తెస్తే అదే తినాలి. ఏ బట్ట కొంటే అదే కట్టుకోవాలి. ఇక ఈ ఖరీదైన ఖర్చులు నేను భరించలేను.నువ్వు చదువుకున్నదానివేగా.నువ్వు ఉద్యోగం చెయ్యి.అన్ని పనులు సమానంగా పంచుకుని సంసారం చేసుకుందాం.’’అన్నాడు కోపంగా ఈశ్వర్.
‘’ఒక్కసారిగా మానుకోలేం.అలాగే. ఇంతకాలం ఒకరిచ్సిన డబ్బుతో బాధ్యత తెలియకుండా బద్దకంతో బతికాం.ఇక మన కష్టార్జితం తో మనకు ఉన్నంతలో సుఖంగా బతుకుదాం.నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను.’’అంది చంద్రిక పశ్చాత్తాపపడుతూ.
ఆతరువాత భార్యాభర్తలిద్దరూ సంపాదించుకుంటూ ఉన్నంతలో సుఖంగా బతకడం నేర్చుకున్నారు ఈశ్వర్ దంపతులు.
కొడుకులో వచ్చిన మార్పుకు రంగారావు దంపతులు ఎంతో ఆనందించారు.
సమాప్తం