మీ నిర్ణయం ఏమిటి? - చింతపెంట వెంకట సత్య సాయి పుల్లంరాజు

Mee nirnayam emiti

ఇంటి పనులతో అలసిపోయి,రెండు మెతుకులు నోట్లో వేసుకొని మధ్యాహ్నం. ఒంటి గంటకు పడక గదిలోకి దూరింది సౌజన్య, వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకు.

కాలింగ్ బెల్ మ్రోగుతుంటే, మెళుకువ వచ్చి, వీధి తలుపు తీసింది సౌజన్య. ఎదురుగా విమలమ్మ. పెళ్ళిసంబందాలు కుదర్చడంలో ఆవిడ దిట్ట. చక్కని మాట తీరు, కలుపుగోలుతనంతో మనుషులను ఇట్టే ఆకట్టు కోగలదు. సౌజన్య, ఆవిడ కబుర్లుకి చెవి కోసుకుంటుంది. బలహీనతని విమలమ్మ పసిగట్టింది. "పిన్నీ, మధ్య ఇలా రావడమే మానేశావ్.ఇప్పుడు గుర్తుకు వచ్చనా?" అంది సౌజన్య.

మాట ఎత్తుగడ లోనే విమలమ్మ గడుసుతనం గోచరిస్తుంది.

"అమ్మాయ్! నీకు వినడానికి నవ్వుగా,విచిత్రంగా వుంటుంది కానీ, ఇది సత్యం." పెళ్ళిళ్ళ విమలమ్మ ,ఒక క్షణం ఆగింది. సౌజన్యకి చాలా కుతూహాలంగా వుంది, విమలమ్మ ఏమి చెబుతుందానని. అందుకే, " పిన్నీ!చాలా కాలమయ్యింది మాఇంటికి వచ్చి, కాస్త కాఫీ కలుపుతా పిన్నీ, తాగి వెళ్లు," అని కుర్చీ చూపించింది.

విమలమ్మకి కావాల్సినది అదే, కానీ, పైకి మాత్రం ప్రేమ ఒలకబోస్తూ ,"ఎందుకే అమ్మాయి, ఎప్పుడు వచ్చినా, వూరుకోవే, మొహమాట పెట్టేస్తావు...."అంది లేని ప్రేమని ఒలకబోస్తూ. సౌజన్య ముఖం తళతళ లాడింది.

విమలమ్మ చెప్పడం ప్రారంభించింది.

🌸 🌸 🌸

ఎక్కడో,విజయనగరం జిల్లాలో జరిగిన విషయం. రాజకుటుంబీకుల ఇంటి వ్యవహారం, పాతతరం పద్దతులు, గౌరవాలు, మర్యాదలు.తమ పిల్లను చూడటానికి రావలసిందిగా మధ్యవర్తిచే కబురు చేశారు రామరాజు గారు. మంచిరోజు చూసుకొనిపిల్లని చూడటానికి నాలుగు కార్లలో దిగారు విజయ రాఘవ రాజుగారి కుటుంబం.

సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో, విరగ కాసిన పళ్ళతో వున్న , వివిధ జాతి మామిడి వృక్షాల మధ్య, ఒక మహాయోధుడు,ఠీవిగా, తల ఎత్తి నిలబడి నట్టుగా వుంది వారి భవంతి.

భవంతిలో సువిశాల మైన హాలు,సినిమా సెట్టింగులని తలదన్నేలా వుంది. అందంగా అలంకరించిన రకరకాల సోఫాలు ,దివాన్లు, కుర్చీలు ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పాటు చేశారు. హోదాకి తగ్గట్టుగా. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు మాత్రమే కూర్చోవాలి. హాల్లో గోడలికి ఇరుప్రక్కలా, రాజవంశీకుల చిత్తరువులు, రవివర్మ పెయింటింగులు, కొన్ని చోట్ల, పులి చర్మా లు ,దుప్పి కొమ్మలు, వారి పూర్వికులు వాడిన పొడవాటి కత్తులు,కటార్లు, కవచాలు వంటి వాటితో శోభాయమానంగా అలంకరించారు.

వేదిక మీద, నటరాజు,వీణావాణితో బాటు, విభిన్న సంగీత వాయిద్యాలు కనువిందు చేస్తున్నాయి. అతిథిలకు స్వాగత సత్కారం, పరస్పర పరిచయ కార్యక్రమం, తర్వాత వారి పూర్వీకుల చరిత్రతో ప్రారంభమై, వర్తమాన రాజకీయాలకి వచ్చాయి వారి సంభాషణలు.

పెళ్ళి చూపులుకి పిలుపునిచ్చారు.

నిజంగా, రాజకుమారిలా వుంది పెళ్ళికూతురు. చదువు, అందం,ఐశ్వర్యం ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి ఆమె కళ్ళల్లో. మెరుపుతీగ తళుక్కు మన్నట్లుoది ఆమె అందం.

పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకొన్నారు. మధ్య మధ్యలో తినడానికి, తాగడానికి పలురకాల పదార్థాలు, పానీయాలు ఏర్పాటు చేయబడ్డాయి. పెళ్లి చూపుల కార్యక్రమమంతా ఎంతో దివ్యంగా, పకడ్బందీగా, పద్దతిగా,జరిగింది.

అంతలోనే సాయంత్రం కావచ్చింది.

ఇరు వర్గీయులు ఒకరికొకరు గౌరవంగా నమస్కారాలు చెప్పుకొంటూ, వీడ్కోలు పలికారు.ముఖ్యమైన తతంగం విజయవంతంగా ముగిసింది కాబట్టి, ముహుర్తాలు, ఆపై వివాహ వేడుకలని భావించారందరూ. కానీ, విధి నిర్ణయమే మరోలా వుంది.

రాత్రి , ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, తెల్లవారేసరికి, సంచలన వార్తగా మారింది రాజప్రసాదంలో.సన్నని తుంపరలతో నెమ్మదిగా మొదలైన వాన, కొన్ని గంటల లోనే పెను తుఫానుగా మారినట్లు. రోజు రాత్రి ….

కూతురు మనసులో మాట తెలుసుకొందామని, తల్లి, కూతురు గదికి వెళ్ళి,"అదృష్టవంతురాలవమ్మా!, కుర్రాడు శ్రీరామచంద్రుడిలా వున్నాడు. మంచి చదువు, ఉద్యోగం, పొడగరి, నడకలో హుందాతనం, మాటల్లో శాంతం, చూపుల్లో చక్కదనం,." అంటూ కాబోయే అల్లుడి గుణగణాలను ఏకరువు పెట్టింది సంతోషంగా.

అప్పటిదాక తలవంచుకొని, తల్లిమాటలు వింటున్న కూతురంది," నిజమే ...నీవన్నది, కానీఅతడు సూర్యవంశ శ్రీరాముడు కాదు... నా కంటికి.....,"కూతురి మాటలకి తల్లి అవాక్కయింది. అంతలోనే తేరుకొని,"చెప్పమ్మా! చిట్టితల్లీ! నీ మనసులో..."

తల్లి మాట పూర్తి కాకుండానే, " సంబంధం నాకు వద్దు, అంతే!" అంది కూతురు.

మరకత్తిపీటలో బలంగా నొక్కిన మామిడి కాయ, ఫట్ మంటూ ముక్కలయినట్టుగా వుంది కూతురి మాట. కత్తిపీటలో తన వ్రేలు తెగి ముక్కలయినట్టుగా విలవిల లాడింది తల్లి, వూహించని కూతురు నిర్ణయం విని.

కొంచెం తెప్పరిల్లి, తల్లి అడిగింది," కారణం తెలుసు కోవచ్చా?" ఒకింత అసహనంగా.

." పెళ్ళి కొడుకు గారు, కాఫీ త్రాగిన వైనం గమనించారా?

వేడి వేడి కాఫీని, కప్పుతోనే త్రాగుతూ, మధ్యలో సాసర్లో పెడుతూ , త్రాగాలి, అదే రాజకుటుంబీకుల లక్షణం.

మర్యాద తెలియకపోతే, మగతనానికే మచ్చ." రాచ మర్యాదలు తెలియని కుటుంబానికి నన్ను అంట గడతారా? అన్నట్లుగా తల్లి కేసి చూసింది. కూతురు సంగతి తల్లికి బాగా తెలుసు.

సమాధానం విని, నిశ్శబ్దంగా నిష్క్రమించింది తల్లి. నీరసంగా నడుస్తూ, తన గదిలోకి వెళుతున్న తల్లికి, హాల్లో జరుగుతున్న సంగీత కచేరీలో ఏదో తెలియని అపశ్రుతి చెవులకు స్పష్టం గా తాకింది. ప్రశాంతంగా నిదురపోయిన రాజకుమారి కలలో,వారి రాజ వంశీయుల చిత్తరువుల దర్శనమిచ్చాయి

🌸🌸🌸

హావభావాలతో,చక్కని కధనంతో, విమలమ్మ, సౌజన్యని కట్టి పడవేసింది.

సౌజన్య ఎంతో భావోద్రేకానికి లోనయ్యింది."కాఫీ తాగటానికి కూడా ప్రత్యేక పద్ధతా? చా...లా చోద్యంగా వుందే?...పోనీలే, పిల్లాడు అదృష్టం..... లేకపోతే, పెళ్లయితే,కాపురం చేయడానికి ఏం పద్దతులు పెడుతుందో ఏమో!"అంది మొటికలు విరుచుకొంటూ." ఐనా పిన్నీ! తల్లయినా, కూతురికి ఇంత గడ్డిపెట్టి, మొహం తగలియొద్దు?" అంది సౌజన్య ఆవేశంగా.

విమలమ్మ మౌనంగానే విని, "ఈరోజుల్లో, పిల్లలు ఇలాగే వుంటున్నారనుకో, పెళ్లి సంబంధాలు కుదర్చడమంటే, కత్తి మీద సాములా వుందనుకో,"అంది నిట్టూరుస్తూ. కొంచెం నీళ్లు తాగి విమలమ్మ మళ్లీ అందుకొంది."

, "అమ్మాయి! అసలు నేను వచ్చిన విషయమే మర్చిపోయాననుకో....మాటల్లో పడి.......ఒక వెయ్యి రూపాయలు సర్దుబాటు చేస్తే, యీ నెలాఖరుకి, పువ్వులలో పెట్టి తిరిగి ఇచ్చేస్తాను. ఏమి అనుకోకు ఆడిగానని. ఇబ్బందే మీ లేదుగా నీకు?" కాస్త సిగ్గు నటిస్తూ.'దానిదేముంది పిన్నీ! నువ్వు అంత సిగ్గు పడాలా!" అంటూ గదిలోకి వెళ్లి, డబ్బు తెచ్చి, విమలమ్మ చేతిలో పెట్టింది సౌజన్య.

"నేనంటే, ఎంత పిచ్చి అభిమానమే తల్లీ! నన్ను ఒడ్డున పడేసావు. ఇదుగో, ఇది మన ఇద్దరి మధ్యే వుండాలి సుమా!" అంది విమలమ్మ,, తన తెలివికి మనసులో మురిసిపోతూ." విజయవంతంగా పని పూర్తిచేసుకొన్న విమలమ్మ ఇంటి దారి పట్టింది.

🌸🌸🌸🌸

విమలమ్మకి, సౌజన్య వాదనలో తర్కం లేదనిపించింది. అలాగని, తప్పని, ఖండించి సౌజన్యని దూరం చేసుకోదు.

మరి, ప్రియమైన పాఠకులారా! కధ ఇంతేనా! రాజకుమారి నిర్ణయం సమర్ధనీయమేనా? చిన్న పాటి విషయానికి అంత రాద్ధాంతం అవసరమా? రాజ కుటుంబానికి మీ సలహా ఏమిటి? ఆలోచించి చెప్పండి.

🌸🌸🌸🌸

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు