నిరంజనరావు.. అప్పారావు గురుశిష్యులు. ఆదివారం.. అమావాస్య.. రాత్రి 10 గంటలు! నిరంజనరావు పేపర్ విలేఖరి... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు స్మశానం లో ప్రవేశించి పరిశోధించ డానికి అక్కడికి దగ్గరలో ఉన్న బ్రిడ్జి కింద పాడు పడిన బల్ల మీద కూర్చుని వెయిట్ చేస్తున్నాడు ..తన శిష్యునితో సహా. " ఒరేయ్ అప్పారావు.. రావద్దు అంటే వచ్చావు.నాకంటే చిన్నప్పటినుండి ఈ రాత్రి పరిశోధనలు అలవాటు.. నువ్వు తట్టుకోలేవు. ఎందుకన్నా మంచిదని నీ కోసం ఈ సీసాలో ors కలిపి తెచ్చానులే... పోనీ.. నేను సరిగ్గా 12 గంటలకు స్మశానంలోకి వెళ్తాను. మళ్లీ 4గంటలకు తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే కూర్చో నువ్వు. నాతో పాటు లోపలకు వచ్చి కళ్ళు తిరిగి పడ్డా... రక్తం కక్కుకున్నా.. నేను సమాధానం చెప్పాలి మీ వాళ్లకి. మీ తాత అసలే మంచోడు కాదు రా... నా తలమీద వెంట్రుకలు అన్ని లాగేసి ఊరంతా అల్లరి చేస్తాడు." అంటూ తన శిష్యుడు అప్పారావుని ఒప్పించబోయాడు.. అప్పారావు ఒప్పుకోలేదు. "గురువుగారు.. ఇంకెప్పుడు నేర్చుకొంటాను. కాస్త భయంగా ఉందిగాని పర్వాలేదు... పోయిన నెల అమావాస్య ఆదివారం అర్థరాత్రి కూడా మీతో తిరిగాను కదా" అంటూ ధైర్యంగా మాట్లాడేడు. రాత్రి 12 గంటలకు అవుతుంది...ఇద్దరూ స్మశానం లోపలికి ప్రవేశించారు.. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది ఈ వేళా ఖచ్చితంగా తేల్చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. " అరేయ్ అప్పారావు.. చెప్పేది జాగ్రత్తగా విను.. ఈ దెయ్యాలు మనకి తెలిసిన మనిషిలాగే వచ్చి మన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతాయి. తెల్లవారి వరకూ మనతో గడుపుతాయి... తెల్ల వారితే కానీ మనకు తెలియదు మనం తెల్ల వార్లుఓ దెయ్యంతో గడిపామని... ఇలాంటి సంఘటనలు నాకు రెండు సార్లు జరిగాయి.. బీ కేర్ ఫుల్....జాగ్రత్త.. "అదిగో.. ఆ మూలన చూడు మంటలు...... అవి నిజం మంటలు కాదురా దెయ్యాలు చేసే మ్యాజిక్ అన్నమాట..!!! అప్పారావు కొంచెం భయపడుతూనే తన గురువు వెనుక అనుసరిస్తున్నాడు. మనం చేయవలసింది ఇక్కడ జరిగేవి అన్ని గుర్తు పెట్టుకుని... రేపు నోట్స్ తయారుచేసి.. ఫోటోలతో సహా.. "భయంకరం" వెబ్ పత్రికకు మెయిల్ చేయాలి... నచ్చిన ఆర్టికల్ కి లక్ష రూపాయలు ఇస్తాడట.. ఇస్తాడో చస్తాడో ముందు మనం చచ్చేలా ఉన్నాం."... నిరంజన రావు అంటుండగానే పెద్ద శబ్దం రావ డంతో గుండె గుభేల్ మంది.. నిరంజనరావు కు. పక్కనే ఉన్న మర్రిచెట్టు ఊడలు మీద పడిపో యాడు.. చాలాసేపు లెగలేదు.. అసిస్టెంట్ అప్పారావు గురువు గారికి ధైర్యం చెప్పి సీసా లోని ors కొంచెం పట్టించాడు. " ఒరేయ్ అప్పారావు.. ఈ పక్కన చూడు.వీళ్లు మంత్రగాళ్ళు.. ఈ నిమ్మకాయలు, మిరప కాయలు పసుపు కుంకుమ తో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు... వాళ్ల నమ్మకం వాళ్ళది. బ్రతకాలి కదా.. వాళ్లను పట్టించుకోవద్దు.. అసలు మనం దెయ్యాల పరిశోధన చేయడానికి ఇక్కడికి వచ్చాము..అని తెలిస్తే వాళ్లు మనల్ని కొట్టి చంపేస్తారు.. జర జాగ్రత్త... సౌండ్ ఏ మాత్రం చేయకుండా ఈ చెట్లు మూల నుండి మనం అంతా కనిపెట్టాలి అన్నమాట...ఆ మూలన సమాధి మీద దెయ్యం కూర్చున్న ట్టుంది చూడు... అది దెయ్యం కాదురా బాబు.. మన ఊరిలో తిరిగే పిచ్చిప్రకాశంగాడు.. ఇక్క డైతే చల్లని గాలిలో పడుకోడానికి హాయిగా ఉంటుందని రాత్రి అయ్యేసరికి ఇక్కడకు వచ్చేస్తాడు అన్నమాట. సరే ఆ మూలకి వెళ్దాం పద... వీడియో ఆఫ్ అవ్వకుండా చూడు.. నీదే బాధ్యత... ఆ తర్వాత చూడలేదు గురువుగారు అంటే కుదరదు..." అప్పారావు వణుకుతూ, భయపడుతూ గురువుగారు ని అనుసరిస్తున్నాడు. "గురువుగారు నాదొక చిన్న సందేహం.." " దెయ్యాల విషయంలో అసలు సందేహాలు ఉండకూడదు రా. చిన్నదైనా పెద్దదైనా సందేహం సందేహమే!... నెమ్మదిగా అడుగు." "అదే సార్ దెయ్యాల లోఎన్ని రకాలు ఉంటాయి సార్..?" " నువ్వు సినిమాలు చూడవా... చాలారకాలు.. భయపెట్టే దెయ్యం... కామెడీ చేసే దెయ్యం.. శృంగారం చేసే దెయ్యం... చంపేసే దెయ్యం... స్నేహం చేసే దెయ్యం.... ఇంకా కనపడకుండా ఏడిపించే దెయ్యం........" " వద్దండి..గురువుగారు.. వద్దండి...... వద్దు బాబోయి వద్దు...బాగా అర్థమైంది . ఒక్క మాట లో ఈ మనుషుల్లో ఎన్నిరకాలు ఉన్నారో అన్ని రకాల దెయ్యాలు ఉన్నాయని చెప్తే సరిపోతుంది కదా..! నా శ్రాద్ధం నా పిండాకూడు... మీరే నన్ను ఇలా బయట పెడితే ఎలాగండి గురువు గారు..." కాళ్ల మధ్య తడి ప్రవహిస్తున్నట్టుగా ......అన్నాడు అప్పారావు. " ఒరే అప్పారావు నువ్వు భయపడకుండా ఉంటా నంటే.. ఓ చిత్రం చూపిస్తాను రా.. పర్వాలేదా??" ప్రశ్నించాడు నిరంజనరావు. పర్వాలేదన్నట్టు తల ఊపాడు అప్పారావు. "ఇదిగో మన వెనకాల చూడు.. ఈవేళ చచ్చి పోయిన ఒక మనిషి తలలోని మెదడు తినడం కోసం ..నక్కలు గొయ్యి తవ్వేస్తున్నాయి.. భయ పడుతున్నావా... ఆ ors నువ్వు కూడా కొంచెం తాగరా." " గురువుగారు.. గేటు తోసుకుని లోపలికి ఎవరో వస్తున్నారు అది దెయ్యం ఏమో అని నా అను మానం.." "చూద్దాం ఇంత అర్థరాత్రి మనుషులు రారు కదా అది దెయ్యమే అయి ఉంటుంది.. అదిగో ..... దగ్గరకు వచ్చేస్తుంది... నా భుజం పట్టుకో.. నిన్ను అసలు 'రావద్దు' అన్నాను.. ప్యాంటు కూడా తడుపు కొన్నట్టున్నావు... నీ దగ్గర వెధవ కంపు వస్తుంది." "గురువుగారు.. అది దెయ్యం కాదండీ.. అంగర వారి వీధిలో తిరిగే.. పిచ్చి పెంచలమ్మ." " అవునా.. నేను అలాగే.. అనుకున్నాను." "గురుగారు... నాకు దెయ్యాల మంత్రాలు నేర్చు కోవాలనుంది గురువు గారూ..." " నోర్ముయ్... ఇంకా నయం.. దెయ్యాన్ని పెళ్లా డతా ననలేదు.... అయినా ఈ భయంకర సమయంలో, ఇంత అర్థరాత్రి.. ఇదేమి కోరిక రా బడుద్దాయి." " గురువుగారు నాకు కాళ్ళు పీకేస్తున్నాయి.. ఎంతసేపు తిరిగిన దెయ్యం కనిపించడం లేదు. ఇక ఆపేద్దాం గురువుగారు.. మళ్లీ నెల ఆది వారం అమావాస్య అర్ధరాత్రి వద్దాము..... కోడి కూసింది.. తెల్లవార బోతుంది... అదిగో మనుషుల అలజడి...ఇంకా ఇక్కడ ఈ పరిశోధన చేయడం బాగుండదేమో... ఇంటికి వెళ్ళిపోదాం గురువుగారూ." " సరే అలాగే చేద్దాం రా... ముందు కిందకు వంగి నీ పాదాలు చూసుకో...." " అదేమిటి గురువుగారు... చిత్రంగా ఉంది... నా రెండు పాదాలు కూడా వెనక్కి తిరిగే ఉన్నాయి......... అబ్బో....... మీ రెండు పాదాలు కూడా వెనక్కే తిరిగి ఉన్నాయి.... ఇంత విచిత్రమా..." " ఏడిచావ్.... యాక్సిడెంట్లో మనిద్దరం చచ్చి..... వారం అయింది.... మనం వెళ్ళేది ఇంటికి కాదురా...ఇదిగో.... ఈ మర్రి చెట్టు మీదకే..." " ఈ హి కి ...ఈ హి కి ...ఈ హి కి ...ఈ హి కి " " ఎ హే హే..ఈ హి కి ...ఈ హి కి ...ఈ హి కి " " ఎ హే హే..ఈ హి కి ...ఈ హి కి ...ఈ హికి .." 👽👽👽👽👽👽👽👽👽👽👽👽👽 🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯 🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚