సమయం: ఉదయం 7 గంటలు..
ఒక్క సారిగా మోగిన ఫోన్ వల్ల ఉలిక్కిపడి లేచింది స్వాతి. ఇంత పొద్దున్నే ఎవరా అని చూస్తే అమ్మ అని ఉంది..
ఒక్కసారి ఎగిరి గంతేసింది.. తన పాతికేళ్ళ జీవితం లో ఒక ఫోన్ కాల్ కి అంత అనందపడటం ఇదే మొదటిసారి.
"హల్లో అమ్మా..!" అంది ఆనందం నిండిన గొంతుతో
"నేను నీతో మాట్లాడాలి, కానీ ఇలా ఫోన్ లో కాదు, ఆఫీసుకి సెలవు పెట్టుకొని, వీలు కుదిరినప్పుడు ఇంటికి రా " అంది శారద.
"అలాగే అమ్మా ! దాదాపు 10 యేళ్ళు అయ్యింది నువ్వు నాతో మాట్లాడి.. ఈ రోజు కోసం సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న, మధ్యాహ్నానికి ఇంట్లో ఉంటాను" అని ఫోన్ పెట్టేసింది..
పట్టలేనంత ఆనందంగా ఉంది స్వాతి.. కానీ ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే అమ్మ తనతో మాట్లాడటం లేదు అని స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ ఎప్పుడూ ఎవరితోను పంచుకోలేదు. అనుకొన్నదే తడవుగా ఇంటికి బయలుదేరింది స్వాతి..
హైదరాబాదు నుండి దాదాపు 5 గంటలు ప్రయాణం విజయవాడ చేరడానికి, ఆ 5 గంటలు స్వాతి మనసులో ఒకటే ఆలోచన, అమ్మ ను చూడగానే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే.
రెండేళ్ళ క్రితం మొదటి సంపాదన తో కొని, తనతోనే భద్రం గా దాచుకొన్న చీర ని ఈ రోజు ఇవ్వాలని తీసుకొని వచ్చింది స్వాతి.
సాయంత్రం 5 అయ్యేసరికి ఇల్లు చేరింది స్వాతి.. ఏదో తెలీని అనుభూతి, కొత్తగా ఉంది మనసంతా..
లోపలికి అడుగు పెట్టగానే, ఓ వైపు శారద, మరో వైపు మేనమామ శివరాం దర్శనమిచ్చాడు.
అమ్మా అని అడుగు వేసేలోపు, "రావే పెళ్ళి కూతురా ! ఇక నీ ఉద్యోగం, పెత్తనాలు పక్కన పెట్టి, ఓ ఇంటికి యజమానిని చేసే సమయం వచ్చింది" అంది బామ్మ.
జరుగుతున్న విషయం అర్థమయ్యింది స్వాతి కి.. అమ్మ కి స్వయాన తమ్ముడు ఈ శివరాం మావయ్య. మృదు స్వభావి, ఏ అలవాట్లు లేవు అని ఇంట్లో అందరూ అంటూ ఉంటారు..
ఇంతలో శారద స్వాతి చేతులు పట్టుకొని, మీ మావయ్య నిన్ను పెళ్ళి చేస్కొంటా అని పట్టుబట్టి, నన్ను ఒప్పించటమే కాదు, నీకు దగ్గరుండి ఫోన్ చేయించింది కూడా వాడే..
"మీ అమ్మ పంతం పక్కన పెట్టి మట్లా డే లా చేసాడు అంటే అర్థం చేస్కో, వాడు నిన్ను ఎంత ఇష్ట పడుతున్నాడో" అన్నాడూ నాన్న సూర్యం..
"అలా ఆడపిల్ల ని గుమ్మం లోనే పెళ్ళి సంగతులు చెప్తే సిగ్గు పడుతుంది, కాస్త విశ్రాంతి తీస్కొనివ్వండి" అన్నాడు శివరాం నవ్వుతూ
"అవసరం లేదు, ఈయనతో పెళ్ళి విషయం గురించే అమ్మ నాతో మాట్లా డింది అని తెలిస్తే ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు.. నాకు ఈ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేదు" అని మొహం మీదే చెప్పేసింది స్వాతి..
పట్టలేనంత కోపం వచ్చింది శారద కి
"మనస్ఫర్ధలు పక్కన పెట్టి మాట్లాడితే, ఎంత పొగరుగా చెప్తున్నావ్ సమాధానం. వాడి స్థాయి కి నిన్ను మించిన సంబంధాలు వచ్చినా కాదని, నీ కోసం వస్తే ఇలా అవమానిస్తావా.. అయినా నీ గురించి పూర్తిగా తెలిసి ఎవరైనా సంబంధం అంటూ వస్తారా, అది వాడి మంచితనం" అంది శారద..
"సరిగ్గా నాకు 17 సంవత్సరాలు ఉండగా, నాతో చాలా అసభ్యం గా ప్రవర్తించిన ఈ శివరాం ఇప్పుడూ మీకు చాలా మంచి వాడు అయ్యి ఉండచ్చు.. నాకు మాత్రం ఆయన లైంగిక వేధింపులు, మనసుపైన చెరగని ముద్రలు అంటూ ముగించింది" స్వాతి..
ఆ మాట కు దిగ్భ్రాంతి చెంది అక్కడి నుండి వెళ్ళి పోయాడు శివరాం
గతం లో ఇలాంటి బరితెగించిన మాటలు మాట్లాడావు అనే ఇన్నేళ్ళు దూరం గా పెట్టను అంది శారద. ఎవరినో ఇష్ట పడితే నీ పెళ్ళి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ.. అంతే కానీ ఇలా నోటికొచ్చింది మాట్లాడితే, నా ఇంట్లో స్థానం లేదు అంది శారద.
"నా మాటల్లోని బాధ అర్థం చేసుకొనే దాకా, ఈ నిజాలు బరి తెగించిన మాటల్లాగానే అనిపిస్తాయి" అంది స్వాతి
నీకు సరిగ్గా ఒక్క రోజు సమయం ఇస్తాను, నువ్వు చెప్పిన మాట నిజం అని నిరూపించు లేదా మావయ్య కాళ్ళమీద పడి క్షమపణ అడుగు లేదంటే ఇక జీవితం లో నీ మొహం చూడను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇది జరిగిన కాసేపటికి..
“ఒంటరిగా తన రూం లో కూర్చొని, అమ్మ తో మరీ అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది” అనుకొంటూ ఉంది స్వాతి.
శారదకి స్వాతి సొంత కూతురు కాదు. సరిగ్గా 13 యేళ్ళ వయసున్నపుడు, ఓ అనాధ ఆశ్రమం నుండి దత్తత తీస్కొని వచ్చింది సం తానం లేని లోటు తీర్చు కోవడానికి మాత్రమే కాదు, తన శక్తి కొలదీ ఒక ఆడపిల్ల ని చదివించి, జీవితాన్ని ప్రేమనీ పంచాలి అనేది ఉద్దేశ్యం.
తలచినవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది..
స్వాతి ని అలా ఆశ్రమం నుండి తెస్కొచ్చిన కొన్ని నెలల తర్వాత, ఓ సారి ట్యూషన్ లో మాష్టారు అసభ్యంగా వ్యవహరించాడు అని చెప్పుకొచ్చింది.. తను పెరిగిన వాతావరణం వల్ల కాస్తంత కఠువుగా చెప్పింది కూడాను..
చదువు అంటే ఇష్టం లేక 70 యేళ్ళ మాష్టారిపై నిందలు వేస్తొంది అనుకొంది శారద. ఆయన శారదకి స్వయాన బాబాయి వరస కూడాను.
తప్పు ఒప్పుకోమని శారద, తన తప్పు లేదు అని స్వాతి కొన్ని రోజులు పాటు సాగింది.. అది జరిగిన కొన్నాళ్ళకి ఆ మాష్టారు మరణించారు, స్వాతి మోపిన నిందలతో చివరి రోజుల్లో ఆయన మనస్తాపానికి గురి అయ్యారు అని చింతిస్తూ, ఆ రోజు నుండి స్వాతి తో మట్లాదటం మానేసింది శారద.
ఏది ఏమైనప్పటీకీ ఆ రోజు నుండి తన చదువులకి అయిన ఖర్చులు అన్నీ భరించినా, తల్లి ప్రేమ ని మాత్రం పంచలేక పోయింది శారద.
ఇదంతా తలరాత అని సరిపెట్టుకొని, ఒకే ఇంట్లో ఇద్దరు తెలీయని వ్యక్తులు లా ఉండేవారు.. ఇక స్వాతి తన కాళ్ళ మీద నిలబడ్డాక, హైదరాబాద్ లోనే ఉంటోంది..
సాయంత్రం జరిగిన ఘటనతో చిన్న నాటి సంగతులు అన్నీ స్వాతి మదిలో మెదులుతూ ఉండగా, ఇంతలో తలుపు తట్టిన శబ్దం..
తలుపు తీసిన స్వాతికి శారద కాస్తంత శాంతం గా కనిపించింది.
గతం అంతా మర్చిపోయి, నీ పెళ్ళి ఘనం గా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీ నుండి సరైన నడవడిక నా భాద్యత.. బహుశా ఇప్పటిదాకా నువ్వు ప్రవర్తించిన తీరు నీ కన్న తల్లి పెంపకం అయ్యి ఉండచ్చు, కానీ సమాజం నన్నే నిందిస్తుంది.. రేపు ఉదయం మొదటి సారి నిన్ను కూతురులా కౌగిలించుకొని, మనసారా ముద్దాడే అవకాశాన్ని ఇవ్వు.. అందరి ముందు నీ తప్పు తెలుసుకొంటావని ఆశిస్తున్నా అని వెళ్ళిపోయింది..
గతం లో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, శారద కూతురిగా అక్కున చేర్చుకొంటా అనే మాట తో స్వాతి మనసు నిండి పొయింది అనే చెప్పాలి..
మరుసటి రోజు, సమయం : ఉదయం 9 గంటలు..
శారద ఎంతో ఉత్కంఠ గా తలుపు తీసింది.. కానీ స్వాతి అక్కడ లేదు కానీ, మంచం మీద మాత్రం ఒక కాగితం తన దృష్టి ని ఆకర్షించింది.. స్వాతి చేతి రాత..
ప్రియమైన శారద గారికి,
మీ కూతురు కాలేని కూతురు స్వాతి అనే నేను మనసువిప్పి పంచుకొనే కొన్ని విషయాలు..
నా జీవితం లో మరణాన్ని ఎన్నో సార్లు చూసాను.. రోడ్డు ప్రమాదం లో నన్ను కన్న తల్లి, తండ్రి మరణించినప్పుడు, మొదటి సారి బతికి ఉన్నా మరణం లా తోచింది..
కొన్నాళ్ళకి మీరు ఆశ్రమం నుండి దత్తత తీస్కోవడం ఒక వరం అనుకొన్నాను.. మీకు దగ్గర అయ్యే కొద్దీ మీ మంచితనానికి నేనెంతో అదృష్టవంతురాలుని అని మురిసిపోయాను..
ఆ తర్వాత ట్యూషన్ మాష్టారి ప్రవర్తన, దానికి మీరు స్పందించిన తీరు చూసి మరోసారి మరణించిన అనుభూతి కలిగింది..
అది చదివిన శారద కి మనసులో ఎదో తెలియని బాధ కలిగింది, నిజా నిజాలు పరిశీలించకుండా తొందర పడ్దానా అన్న సంశయం కలిగింది.
నన్ను మీరు దూరం పెట్టాక, కాలేజి కి వెళ్ళే దారిలో ఆకతాయిల మాటలకు ఇబ్బంది కలిగినా, అది మీకు చెప్పుకోని బాధ పడే అవకాశం లేనందుకు మరోసారి మరణించాను..
ఇలా బస్సులోనో, రోడ్డు మీదో, ఒంటరిగా ఉన్నప్పుడో, నలుగురిలోనో నాకు ఎదురయ్యే పరిస్థితులకి మరణిస్తూ, ఆ మరుక్షణం నాకు నేనే ఒదార్పుని తెచ్చుకొని నిలబడుతూ మళ్ళీ పుడుతుంటాను..
"అర్థం లేని పట్టింపులతో, ఎదిగే కూతురుకి అవసరం అయిన తోడు ఇవ్వలేక పోయను" అనుకొంది శారద మనసులో..
“నా వరకు బతుకు అంటే, జననా నికి మరణానికి మధ్య ఉండేది కాదు, జనన మరణాలతో సాగుతూ ఉండేది.. “
“ఇక నిన్న జరిగిన సంఘటనలో నా లోని పొరపాట్లకు కారణం నా తల్లి పెంపకం అన్నారు, అది విన్నపుడు మరోసారి మరణించాను.. అమ్మ నాతో ఉన్న రోజులు తక్కువే అయినా, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులో పదిలం. ఎప్పుడూ తప్పుకు తలొంచకుండా, నిలదీసే సావిత్రమ్మ గారి ముద్దుల గారాల పట్టీ నేను..ఈ రోజుకీ తప్పు అనిపించిన పని ఏదీ చేయలేదు, చేయని తప్పుకి నిక్కచ్చి గా సమాధానం ఇవ్వడం కూడా అమ్మ పోలికే.. అదే అమ్మ నాకు పంచిన ఆభరణం అని అనుకొంటూ ఉంటాను. “
“ఏ రోజు అయితే ముక్కు మొహం తెలియని అమ్మాయిని అక్కున చేర్చి ఒక జీవితం ఇవ్వాలని అనుకొన్నారో ఆ రోజు నుండి మీరే నా అమ్మ.. అలాంటిది మీరు నా పై ఉన్న అపోహ తొలగి కూతురు గా అంగీకరించే రోజు కోసం ఎదురుచూస్తూ వచ్చాను..“
స్వాతి పంతం లో ఉన్న నిజాయితీ నిగ్రహించింది శారద..
“నిన్నటి మన సంఘటనల తర్వాత అది ఎప్పటికీ జరగదని, ఈ సమాజం ఆ అవకాశాన్ని ఇవ్వదని అనిపించింది.. ఎప్పుడో 10 యేళ్ళ క్రిందటి శివరాం మావయ్య తో జరిగిన సంఘటని కి నా దగ్గర రుజువు ఉండకపోవచ్చు, కానీ నా వంతు సమాధానం గా నా మరణాన్ని మీ ముందు ఉంచుతున్నాను.. “
ఒక్క సారిగా కూలబడిపోయింది శారద.. మసక బారిన కళ్ళు తెరిచే సమయానికి ఇలాంటి వార్త చదవడం భారం గా ఉంది శారదకి.
“ఎన్నో సార్లు మరణాన్ని చూసిన నా కళ్ళకి ఇది ఆఖరి మరణం కానీ చాలా అందమైన మరణం, ఎందుకంటే ఈ మరణం నన్ను మీకు కూతురు గా దగ్గరచేస్తుంది, ఇక మీదట ఇలాంటి అఘాయిత్యాలు అనే మరణాలని చూసే పరిస్థితిని దూరం చేస్తుంది.. నా లాంటి ఆడపిల్లల ఆవేదన అర్థం చేసుకొలేని కన్న వాళ్ళకి ఇదొ కనువిప్పు కూడా అనుకొంటూ సెలవు.. “
ఇట్లు
మీ కూతురు స్వాతి..
హైదరాబాద్ నుండి అమ్మ కి ఇవ్వాలని ఇష్టంగా తెచ్చిన చీరకి ఉరి వేసుకొని తన ఆఖరి మరణం లో ఆనందాన్ని వెతుక్కొన్న స్వాతి జీవితం వెలుగు లోకి రాని ఇలాంటి ఎన్నో అరాచకాలకు నిదర్శనం