భాగవత కథలు 1 - విధాతకు శ్రీహరి సాక్షాత్కారం - కందుల నాగేశ్వరరావు

Bhagavatha Kathalu-1

పూర్వం ప్రళయసమయంలో విశ్వమంతటా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని సముద్రమధ్యంలో పవ్వళించాడు. ఈ విధంగా యోగమాయకు కూడా దూరంగా వెయ్యి యుగాలు సమస్త లోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందాడు. ఆపైన కాలమూ, శక్తీ చక్కగా పరివర్తన చెందేక సృష్టికార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నారు. తన కడుపులో దాచుకొని వున్న సకలలోకాలను తిరిగి సృష్టించాలని మనస్సులో భావించాడు. అప్పుడు నారాయణుడిని నాభిలోనుండి ఒక పద్మం జన్మించింది. ఆ కమలంలో నారాయణుడు తన అంశాన్నిప్రవేశ పెట్టాడు. అప్పుడు ఆ పద్మంలోనుండి చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు తనకు స్థానమైన పద్మానికి మూల మేమిటో తెలుసుకోవాలని అనుకొన్నాడు. పద్మం పైభాగాన నిలబడి, తన నాలుగు మొహాలతో, నాలుగు దిక్కులు వెదికి చూసాడు. చుట్టూ అంతా నీరు. ఆ నీటి మధ్యలో తామర పువ్వుపై తాను. ఎంత ఆలోచించినా తను ఎవరు, తన పుట్టుకకు కారణం ఏమిటో తెలియక ఆశ్చర్య చకితుడైనాడు. ఆ తామరతూడు మొదలు తెలుసుకోవడానికి పద్మనాళం వెంట లోపలికి ప్రవేశించాడు. బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు వెదికినా భగవంతుని మాయవల్ల, ఆ పద్మానికి మొదలెక్కడ వుందనేది తెలుసుకోలేక పోయాడు. చివరకు విసిగివేసారి వచ్చి ఆ పద్మంలోనే మరల ఆసీనుడైనాడు. ఆ సమయంలో నీటినడుమ నుండి “త ప” అనే రెండు అక్షరాల శబ్ధం వినబడింది. ఆ మాట రెండుసార్లు ‘తప తప’ మని ఉచ్చరింబడింది. బ్రహ్మదేవుడు ఆ శబ్ధం ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకొన్నాడు. ఎవరూ కనపడలేదు. తనను తపస్సు చేయమని హెచ్చరించటానికే ఆశబ్ధం వచ్చిందని గ్రహించాడు. ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆ దారుణ తపస్సుకు లోకాలన్నీ తపించి పోయాయి. అయినప్పటికీ అతడు విష్ణువును చూడలేకపోయాడు. అప్పుడు చతుర్ముఖుడు ఆ పద్మపీఠంపై కూర్చుండి, గాలిని బంధించి, ఏకాగ్రభావంతో మరల నూరేండ్లు తపస్సు చేసాడు. ధ్యానాన్ని తన హృదయంలో నిలిపాడు. అప్పుడు తన హృదయంలోనే పరమాత్మ రూపం ధర్శించాడు. తనకు కనిపించిన వానినే తన తండ్రిగా గ్రహించాడు. అప్పుడు ఆశ్రీహరి ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. శ్రీహరి మాయవల్ల ఒక్క క్షణంలోనే అన్ని లోకాల కంటె అత్యున్నతమైన వైకుంఠపురాన్ని, దాని వైభవాన్ని బ్రహ్మదేవుడు సందర్శించాడు. శ్రీమహాలక్ష్మి ఆయన వక్షస్థలంలోనే నివసిస్తున్నది. అక్కడ మేడలు, గోపురాలు, మండపాలు, దివ్యమణికాంతులతో దేదీప్యమానంగా ఉన్నాయి. అలాంటి పరమపదంలో ఎల్లవేళలా జ్ఞానం, సంపదా, కీర్తి, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడూ, లక్ష్మీవల్లభుడూ, సర్వాంతర్యామి అయిన నారాయణుణ్ణి బ్రహ్మ చూచాడు. ఆయన హృదయపద్మం అమితానందంతో వికసించింది. ఆ పరమపురుషుని పాదపద్మాలకు బ్రహ్మ తన నాలుగు తలలు తగిలేటట్లు ప్రణామాలు చేశాడు. అలా వైభవోపేతంగా ప్రకాశించే విష్ణుదేవుని చతుర్ముఖ బ్రహ్మ చూచాడు. ఆయన బొడ్డునుంచి పుట్టిన కమలాన్నీ, జలాన్ని, అగ్నినీ, ఆకాశాన్నీ, మహాజగత్తును సృష్టించాలనే దృష్టినీ చూచాడు. ఆ హరియందు తన హృదయాన్ని కేంద్రీకరించాడు. తన పుట్టుకకు కారణం తెలిసింది. ప్రజాసృష్టికి సుముఖుడైనాడు. ఆ పరాత్పరుణ్ణి బ్రహ్మ ఈ విధంగా స్తుతించాడు. “తండ్రీ సాటిలేని నీ మనోహర రూపం నాకు సాక్షాత్కరించింది. నాలో వివేకం వికసించింది. నీ నాభికమలం నుండి జన్మించిన నేను నీ రూపాన్ని తెలుసుకున్నాను. నీవు ఈ దివ్యరూపంతో నాకు దర్శనమిచ్చావు. నీమీద భక్తిప్రపత్తుల వల్ల పరిశుద్ధమైన వారి హృదయాలలో నీవుంటావు. నీ యందే మనస్సు లగ్నం చేసి, నీ పాదాలను నిరంతరం ఆరాధించే భక్తుణ్ణి నీవు ఆదుకొంటావు. నిన్ను ఆశ్రయించినట్లయితే మోక్షం లభిస్తుంది. ఇహ పరాలకు నీవే అధీశ్వరుడవు. ఓ లక్ష్మీవల్లభా! అఖండ విజ్ఞానానికి ఆశ్రయమైన నీకు నమస్కరిస్తున్నాను. తన బొడ్డు నుండి జన్మించిన బ్రహ్మ తనకు నమస్కరించేసరికి శ్రీహరికి దయ పొంగిపొరలింది. మందహాసంచేస్తూ కుమారా, నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మ “తండ్రీ! కల్పాంతంలో తామరపువ్వు నందు నేను పుట్టాను. నీ అత్యంత సుందర ఆకారం చూడగోరి చాలా సంవత్సరాలు తపస్సు చేసాను. నాకు ఇప్పుడు దర్శనం ఇచ్చావు. నీకు తెలియని విషయం ఏమీలేదు. నేను నీ యాజ్ఞానుసారం జగత్తును సృష్టిస్తుంటాను. ఆ పని చేసేటపుడు నేను బ్రహ్మను కదా అన్న దురభిమానంతో నా మనస్సులో అహంకారం కలుగకుండా నన్ను అనుగ్రహించు. నీవు ఏ విజ్ఞానబలంతో ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నావో అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నా మనస్సులో సృష్టించాలనే కోరిక మిక్కుటముగా నున్నది. అది చేయడానికి తగిన నైపుణ్యం కూడా నాకు అనుగ్రహించి నన్ను కృతార్థుణ్ణి కావించు” అని బ్రహ్మదేవుడు తల వంచి నమస్కరించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడి కోర్కె తీర్చాలని నిశ్చయించుకొని ఇలా అన్నాడు. “కుమారా! వీపై అనుగ్రహము కలిగి వైకుంఠ లోకమంతా నీకు చూపాను. నీ తపస్సుకు మెచ్చాను. తపస్సు అనే వృక్షానికి ఫలం నేనే. ఆ తపస్సు వలననే నేను లోకాల సృష్టి స్థితి లయాలు కావిస్తూ ఉంటాను. ఇది గ్రహించి నీవు తపస్సు చేశావు. అందువలన నీ కర్మలూ, మోహమూ తొలగిపోయాయి. ఓయీ! పద్మసంభవా! నీవు జ్ఞానమూ, భక్తీ, సాక్షాత్కారమూ అనే మూడు విషయాలను నీ మనస్సులో గట్టిగా నిల్పుకో! సృష్టిలో నేను తప్ప వేరే పదార్థమంటూ ఉండదు. సృష్టికాలంలో జనించిన జగత్తంతా నా స్వరూపమే అని గ్రహించుకో. కల్పానికీ ప్రళయానికీ మధ్యకాలంలో తుది మొదలు లేనివాడనై, నిండైన నిత్యమహిమతో కూడి నేను పరమాత్ముడిపై ఉంటాను. నీ విందాక నన్ను జగత్తును నిర్మించడానికి హేతువైన మాయావిధానాన్ని గురించి అడిగావు. లేని వస్తువు ఉన్నట్లు తోచి విచారించి చూస్తే లేదని స్పష్టమవుతుంది. ఇది దేని మహిమ వలన జరుగుతున్నదో, అదే నా మాయా విశేషమని గుర్తుంచుకో. మాయా ప్రభావం వలన లేని వస్తువు కనిపించడం, ఉన్న వస్తువు కనపడకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పరబ్రహ్మ స్వరూపం అన్ని దేశాలలో, అన్ని కాలాలలో ఇలాగే ఉంటుంది కాని మార్పు చెందదు. నేను ఇప్పుడు చెప్పినదే తత్వస్వరూపమైన అర్థమని గ్రహించు. అలా చేస్తే జగత్తును నిర్మాణం చేసేటప్పుడు మోహం నిన్నంటదు. నీవు చేయవలసిన పని మానకు. ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించు. అప్పుడు అంతటా అన్ని లోకాల్లో ప్రకాశించే నన్ను నీవు చూడగలుగుతావు. నాలో దాగి వున్న ప్రాణి సమూహాలన్నీ నీకు కనిపిస్తాయి. అహంకారమే మూలతత్త్వంగా గ్రహించి నీవు సృష్టి చెయ్యి.” ఈ విధంగా భగవంతుడైన పరమేశ్వరుడు, బ్రహ్మకు సృష్టికార్యం నిర్వర్తించడానికి ఆనతిచ్చాడు. అనంతరం తన వైకుంఠలోకంతో సహా అంతర్ధానం చెందాడు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు