"అమ్మా ! ఈ అమ్మాయే నీ కోడలు. పేరు నవనీత. మమ్మల్ని ఆశీర్వదించు" అంటూ పెళ్లి బట్టలతో, మెడలో పూలదండలు వేసుకుని గుమ్మం ముందు నిలబడిన ఏకైక సంతానం విశాల్ ని చూసి మాటరాక విస్తుపోయింది శాంతమ్మ.... కాసేపటికి తేరుకుని, "ఎవర్నడిగి చేసుకున్నావురా ? ఏం నేను చచ్చేననుకున్నావా! ఆశీర్వాదాలూ లేవు, అంటుగుడ్డలు లేవు. ముందు లోపలికి తగలడండి. ఎవరైనా చూస్తే నామర్దా కూడానూ. ఇంతకీ ఎవరీ పిల్ల? నువ్వెలా దాని బుట్టలో పడ్డావురా దరిద్రుడా?" లోపలికి రాగానే కొడుకు మీద కణకణలాడుతూన్న అగ్ని శిఖలా మండిపోయింది, తన పేరుకు ఏమాత్రం న్యాయం చేయకుండా శాంతమ్మ. "అమ్మా! ఈమె అనాధ. వాళ్ల ఆశ్రమం తరపున నేను పనిచేస్తున్న స్కూలుకు ఏవో సేవా కార్యక్రమాలు చేయడానికి తరచూ వస్తూ ఉంటుంది. మొదటి సారి ఆమెను చూసినపుడే..." "చూపులు కలిసాయి. ఆ శుభవేళ ఇప్పుడు వచ్చింది అనే కదా నువ్వు చెప్పి తగలడేది? అయినా ఈ అనాధ పీనుగ ఎలా దాపురించిందిరా మన కర్మానికి?" గొంతు చించుకొని అరుస్తోంది శాంతమ్మ. "అత్తయ్యా! మాటలు సరిగ్గా రానివ్వండి. నేను అనాధ కావచ్చు కానీ అభిమానం లేని దానిని మాత్రం కాదు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్లిపోతా!" ఎదురు దాడి చేసింది నవనీత. "బయటకు నువ్వు ఎందుకులే అమ్మా! ఎలాగైనా కొన్నాళ్లకు నన్నే పంపేస్తావుగా బయటకు. సరేకానీ, అత్తయ్యా అని పిలవకు. నీ నోట్లోంచి ఆ పిలుపు వింటేనే నా ఒంటి మీద తేళ్లు జెర్రిలు పాకుతున్నట్టు ఉంది" ఏమాత్రం తగ్గకుండా రెచ్చి పోయింది శాంతమ్మ. ఏదో సమాధానం చెప్పబోతున్న నవనీత నోరు నొక్కి, జరగబోయే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆదిలోనే అదుపు చేసి, ఆమెను తన గదిలోకి తీసుకుని వెళ్లాడు విశాల్. ***** ***** ***** ***** "చూడు నీతా! అమ్మ నువ్వు అనుకున్నంత గయ్యాళి ఏమీ కాదు. నా చిన్నతనంలోనే నాన్న చనిపోతే పాపం, అన్నీ తానే అయ్యి పెంచింది. తనకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నానని ఉక్రోషం, అంతే!" భార్యను అనునయిస్తూ చెప్పాడు గదిలోకి వచ్చిన విశాల్. "ఛ..ఛ..నేను అత్తయ్య గారిని తప్పుపట్టడం లేదు. నిన్ను అనే అధికారం ఆవిడకు ఉంది. ఎటొచ్చీ నన్ను చిన్నబుచ్చడంతో కోపం వచ్చి ఏదో రెండు మాటలు అనేసాను అంతే ! అయినా , ఇది ముమ్మాటికీ నీ తప్పే. అందుకే ఈ పెళ్లి విషయం ముందు మీ అమ్మగారికి చెప్పమని నీతో ఎన్ని సార్లు చెప్పాను?" సూటిగా అడిగింది నవనీత. "చెప్పవచ్చు. కానీ మా అమ్మకు మంగమ్మ అని ఓ అక్కగారు ఉంది. ఆవిడను సంప్రదించకుండా మా అమ్మ ఏ పనీ చేయదు. ఆవిడ చెప్పిన పనికిరాని వెధవ వాక్కు కూడా అమ్మకు పరమ వేద వాక్కు కింద లెక్క. మన విషయం ముందుగా చెపితే తప్పకుండా ఇద్దరూ కలసి అడ్డుపుల్ల వేస్తారు. అందుకే చెప్పలేదు" భార్యను దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు విశాల్. "మీ పెద్దమ్మ గారు ఎక్కడ ఉంటారు? అయితే ఆవిడకు కూడా మన పెళ్లి విషయం చెబితే మంచిదేమో?" అమాయకంగా అంది నవనీత. "ఆవిడకు సంతానం లేదు. ఇక, భర్త ఈవిడ చిన్నతనంలోనే మరణించాడు. ఆ ప్రస్ట్రేషన్ వల్లనే కామోసు, ఎవరైనా పచ్చగా ఉంటే ఈవిడకు గిట్టదు. బంధువుల ఇళ్లల్లో ఓ నెల రోజులు చొప్పున ఉండి వెళ్తూ ఉంటుంది" పెద్దమ్మ సంగతులు అన్నీ పూస గుచ్చినట్లు చెప్పాడు విశాల్. "అయ్యో పాపం ఆవిడ కూడా నాకు లాగే అనాధ అన్నమాట. సరేకానీ మరి వీళ్ళ మనసు మార్చడం ఎలా?" ఆందోళనగా అడిగింది నవనీత. "కంగారు పడకు. చూద్దాం ! కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు" అంటూ ఆ సంభాషణలకు ముగింపు వాక్యం పలికాడు విశాల్. ***** ***** ***** ***** ఎడమొహం పెడమొహంగానే ఆరు నెలలు గడచిపోయాయి. ఆ దంపతులు అనుకున్నట్లుగా కాగల కార్యం తీర్చడానికి గంధర్వులు రాలేదు కానీ, ఓ రోజు విశాల్ వాళ్ళ పెద్దమ్మ మంగమ్మ వచ్చింది, ఉరుములు పిడుగులు లేని తుఫానులా! "ఏమేవ్ శాంతా! ఈ కార్తీక మాసం నెల పొడుగునా మీ వీధిలో ఉన్న గుడిలో సాయంత్రం పూట దీపోత్సవం చేస్తారుగా! అందుకే ఈ నెల అంతా ఇక్కడే ఉండిపోదామని వచ్చానే. ఔనూ, మన విస్సిగాడు ఎవరో రోడ్డున పోయే దానిని పెళ్లి చేసుకున్నాడటగా? నువ్వు చెప్పకపోయినా, నాకు మన మేనత్త మనవరాలు ద్వారా తెలిసిందిలే. అయినా, అదేం పొయ్యకాలమే వాడికి?" గుమ్మంలోనే అష్టోత్తరం మొదలెట్టింది మంగమ్మ. "ఔనే అక్కా! ఇదేమైనా శుభవార్తా ? అందరికీ చెప్పడానికి ? అందుకే నోరు కట్టేసుకున్నాను. మరి, ఆ నంగనాచి ఎం మాయ చేసిందో, దాని వలలో వీడు ఎలా పడ్డాడో తెలియకుండా ఉంది. ఇన్నాళ్లూ నేను పెంచిన విషయం కూడా మరిచిపోయాడు, ఈ సన్నాసి" పైకి కంటనీరు పెట్టుకుంటూ, ఈ సమయంలో తనకి ఒక తోడు దొరికింది అని మనసులో ఆనందపడుతూ చెప్పింది శాంతమ్మ. "ఇదిగో చూడండి అత్తయ్యలూ! ఇద్దరూ మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. నేనూ ఈ ఇంటి సభ్యురాలునన్న విషయం మరచి పోకండి. మీ అబ్బాయి విశాలే నన్ను కావాలని చేసుకున్నాడు కానీ నేనేమీ దేహీ అంటూ అతని వెంట పడలేదు" మాటలు విసిరేసి తమ గదిలోకి వెళ్లి తలుపు బిడాయించుకుంది నవనీత. "శాంతా! చూసావే దాని పొగరు? మనం పెద్దవాళ్లం అని మర్యాద కూడా లేకుండా! అంతే కాదు, మొగుడ్ని చూడు ఎలా పేరు పెట్టి పిలుస్తోందో? పెద్ద ఆరిందలా! ఇలాంటి దిక్కుమొక్కు లేనివాళ్లకు ఒకేసారి సంపద వస్తే ఇలాగే ఉంటారు. కంగారు పడకు ఈ నెల అంతా ఉంటా కదా ! దాని పొగరు అణిచిన తర్వాతే వెళ్తా!" అక్క చెప్పిన ఈ మాటలతో ధైర్యం వచ్చేసింది శాంతమ్మకు. ***** ***** ***** ***** ఓ పది రోజులు చాలా భారంగా గడిచాయి. ఆ రోజు సాయంత్రం, ఆఫీసులో ఉన్న విశాల్ కు హాస్పిటల్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. "ఒరే విస్సూ! నేనురా పెద్దమ్మను. ఇందాకా గుడిలో జరిగిన తోపులాటలో నేను, మీ అమ్మ వెలుగుతున్న నూనెదీపాల మీద పడి పోయాము. నాకు పెద్దగా కాలలేదు కానీ, పాపం మీ అమ్మకు మటుకు రెండు కళ్ళూ కాలిపోయాయిట. నేనుండగా దానికి ఎటువంటి లోటూ రానీయను కానీ, నువ్వు మటుకు అర్జెంటుగా రావాలిరా!" అంటూ వివరాలు చెప్పి ఫోన్ పెట్టేసింది మంగమ్మ. హాస్పిటల్ కు చేరుకున్న విశాల్ తో, "మీ అమ్మగారి రెండు కనుగుడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ప్రాధమిక చికిత్స అందించాం. అయితే ఎవరైనా దాతలు ముందుకు వస్తే, ఎడమకన్నుకి మాత్రం చూపు వచ్చే అవకాశం కనపడుతోంది" చెప్పారు అక్కడి వైద్యులు ఈ మాటలు విని, హతాశుడైపొయిన విశాల్ వద్దకు వచ్చి, "ఒరే విస్సూ! నువ్వు ఏమీ అనుకోకపోతే..." అంటూ ఏదో చెప్పింది మంగమ్మ. "సరే పెద్దమ్మా ! మరి నీ ఇష్టం. మరోసారి ఆలోచించుకో " అంటూ అక్కడ నుంచి కదిలాడు విశాల్. ***** ***** ***** ***** పదిహేను రోజుల తర్వాత, ఆ రోజు శాంతమ్మ కళ్లకు వేసిన కట్టు విప్పుతున్నారు డాక్టర్లు. "చూడమ్మా ! మీ కుడి కన్ను పూర్తిగా చెడిపోయింది. కానీ మీ ఎడమకన్నుకు మీ బంధువు ఒకరు దానం చేయడం వలన చూపు వచ్చింది " అన్నారు డాక్టర్. "ఔనమ్మా! పాపం పెద్దమ్మ నీకు తన ఎడమకన్ను దానం చేసింది. ఈ విషయం నీకు చెప్పవద్దు అని కూడా చెప్పింది" తల్లి వద్దకు వచ్చి, నెమ్మదిగా చెప్పాడు విశాల్. " సరే ! ఇప్పుడు కట్లు విప్పుతున్నా! నెమ్మదిగా తెరచి ఏం కనపడుతోందో చెప్పండి" అన్నారు డాక్టర్ కట్టు విప్పతూ. "ఒరే, విశాలూ! నాకు చూపు రాగానే ముందుగా పెద్దమ్మను చూడాలిరా. దానిని నా ముందుకు రమ్మనరా?" ధీనంగా అడిగింది శాంతమ్మ. "అమ్మా! నీ ఆపరేషన్ ఆయన రెండో రోజునే పెద్దమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇక్కడ ఉంటే అది మిగతా వారికి సోకుతుంది అని, డాక్టర్లు వెంటనే వేరే ఆసుపత్రికి తరలించారు. రేపో ఎల్లుండో తనూ వచ్చేస్తుంది. సరే! డాక్టరు గారు చెప్పినట్లు నెమ్మదిగా కళ్ళు తెరచి ఏం కనపడుతోందో చెప్పు" "హమ్మయ్య, ఈ ఎడమకన్ను బాగా కనపడుతోంది. అదిగో దేవుళ్లందరూ ఉన్న ఫొటో, అలాగే డాక్టర్లు, నువ్వు ఇలా అందరూ కనబడుతున్నారు" ఓ కంటితో చూస్తూ ఆనందంగా చెప్పింది శాంతమ్మ. ***** ***** ***** ***** "ఏరా ? మీ ఆవిడకు తీరుబడి దొరకలేదా? నన్ను చూడ్డానికి రానేలేదు? "ఆటోలో ఇంటికి వెళ్తూ కొడుకును అడిగింది శాంతమ్మ. "తనే రానందమ్మా! ఎందుకంటే తనని చూడగానే మళ్లీ నువ్వు ఎక్కడ ఉద్రేకానికి లోనయ్యి, అనవసరంగా ఆరోగ్యం పాడుచేసుకుంటావోనని " సమాధాన పరిచాడు తల్లిని. "మంచి పని చేసింది. మహాతల్లి గుమ్మంలోకి అడుగు పెట్టింది. ఆరు నెలల తిరక్కుండా నా రెండు కళ్లూ పోగొట్టింది. ఇప్పుడు ఈ శేషజీవితం ఈ ఒక్క కంటితో లాగించాలి" ఉక్రోషంతో చెప్పింది. ***** ***** ***** ***** ఇంటికి చేరిన తరువాత మంచంమీద సేదతీరుతూ, "ఒరే ! వెంటనే మా అక్కను చూడాలి. ఆ ఆసుపత్రికి తీసుకుని వెళ్లరా?" కొడుకును ప్రాధేయపడింది శాంతమ్మ. "రేపు పెద్దమ్మ వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజుకూ ఓపిక పట్టు. ఇదిగో, నీతా! అమ్మను తీసుకుని వచ్చాను. కొంచెం వేడిపాలు తీసుకురా! తాగుతుంది" భార్యకు పురమాయించాడు విశాల్. "అత్తయ్యా! బాగున్నారా?" అంటూ పాలగ్లాసుతో వచ్చింది నవనీత. "ఆ ! చూస్తున్నావుగా, ఇలా ఉన్నాను" అంది మొహం పక్కకు పెట్టుకుని శాంతమ్మ. "ఏమిటి అమ్మా! నీ కోపం. తను ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు. మన వంశాకురాన్ని మోస్తోంది. ఓ సారి చూస్తే నీ సొమ్మేంపోయింది?" తల్లిని బతిమాలాడు. కొడుకు మాట విని, కాదనలేక మొహం తిప్పిన శాంతమ్మ, "దీని కంటికి ఏం మాయరోగం వచ్చింది? ఎడమకంటికి అలా గుడ్డ తగిలించుకుంది?" ఆశ్చర్యంతో కూడిన అనుమానంతో అడిగింది శాంతమ్మ. "అమ్మా! నీకు ఓ విషయం చెప్పాలి. నీకు నేత్రదానం చేసింది పెద్దమ్మ కాదు, నీ కోడలు నవనీత. ఎందుకంటే, ఆ సంఘటన జరిగిన రాత్రే పెద్దమ్మ నన్ను పక్కకు పిలిచి, 'విస్సూ, మీ అమ్మను నేను ఈ స్థితిలో చూడలేనురా! నేను వెళ్లి పోతున్నా. ఈ విషయం మీ అమ్మకు చెప్పకు' అని చెప్పి వెళ్లిపోయింది. అప్పుడు నీ కోడలు వచ్చి డాక్టర్లు, నేను ఎంత వద్దు అని వారించినా వినకుండా తన ఎడమకన్ను నీకు అమర్చేలా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి, నేత్రదానం చేసింది " అసలు విషయం చెప్పాడు విశాల్. "ఔనా ? నమ్మలేకపొతున్నా " అంటూ ఆశ్చర్యపోతూ కోడలిని దగ్గరకు రమ్మని, అనుమానంతో ఆమె కంటికి ఉన్న గుడ్డ తీసి చూసి, ఆ స్థానంలో ఉన్న గాజు కన్ను చూసి, ఆశ్చర్యంతో నోట మాట రాక, "ఎందుకమ్మ అలా చేసావు?" ఆర్ధ్రతతో, కంటనీరు కారుస్తూ అడిగింది శాంతమ్మ, కోడల్ని. "ఏమీ లేదమ్మా! నీకు పూర్తిగా చూపు పోతే నీకు సంభందించిన అన్ని పనులు ఇంక తనే చెయ్యాలని ముందు చూపుతో అలా చేసింది" నవ్వుతూ చెప్పాడు విశాల్. "ఏడిసావులే, తిక్క పీనుగా! అలా అయితే కొంచెం ఖర్చు అయినా ఏదో ఐ బేంక్ నుంచి తెప్పించి పెడతారు కానీ ఇలా దానం చేస్తారా? ఏం జరిగిందో నువ్వయినా చెప్పమ్మా!" అనుమానంగా కోడల్ని అడిగింది. "సరే అమ్మా ! ఇప్పుడు నిజం చెబుతున్నా విను. తను అనాధననీ, చిన్నతనం నుంచి ఎవరో ధర్మాత్ములు దానం చేసిన డబ్బులతో పెరిగాననీ, కానీ అత్తయ్య గారు ఎంతో దర్జాగా బతికారనీ, మనం ఇంత మంది ఉండగా ఆవిడకు ఎవరో నేత్రదానం చేయడమేంటనీ నవనీత ఈ నిర్ణయం తీసుకుందమ్మా!" బాధగా చెప్పాడు విశాల్. "అదే కాదు అత్తయ్యా! పుట్టబోయే మీ మనవడిని ఆడించడాలంటే మీకు చూపు లేకపోతే ఎలా?" అంటూ అత్తగారి పక్కన కూర్చుంది నవనీత. "మీ పేర్లకు తగ్గట్టుగా వాడి హృదయం విశాలం. నీ మనసు నవనీతం. నా తల్లే! చెప్పుడు మాటలు విని నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానే తల్లీ! క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను. నా కళ్ళు తెరిపించావు. నాకు చూపు రప్పించావు. ఈ రోజు నుంచి నీ కన్నుతో నిన్ను నా కన్న కూతురుగా చూసుకుంటా!" అంటూ కోడలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది శాంతమ్మ. పాతపాటలంటే చెవికోసుకునే పక్క వాటా సుబ్బారావు గారి టేప్ రికార్డర్ లోంచి "నాలుగు కళ్లూ రెండయినాయి రెండు మనసులు ఒకటయినాయి" అనే పాట వినబడుతుండగా, "ఈ రోజు నుంచి మీ అత్తాకోడళ్లిద్దరూ నాకు రెండు కళ్ళు" అంటూ కుడివైపు ఉన్న తల్లిమీద , ఎడమవైపు ఉన్న భార్య మీద రెండు చేతులూ వేసి వారి మధ్య కూర్చున్నాడు విశాల్, కళ్లలోంచి వస్తున్న ఆనందబాష్పాలు ఏకధాటిగా కారుతుండగా! ***** **శుభం** *****