ఆదిమధ్యాంతరహితుడైన ఆ శ్రీహరి కాల ప్రభావము వల్ల ఉద్రేకంపొందిన ప్రకృతిలో తన శక్తిని నిక్షేపించి విడివిడిగాఉన్న ఇరువదిఏడు తత్వాలలో ఏకకాలంలో తాను ప్రవేశించి వానికి ఏకత్వం కలిగించాడు. అవి పంచ భూతాలు; పంచతన్మాత్రలు; జ్ఞానేంద్రియాలు; కర్మేంద్రియాలు; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంత:కరణ చతుష్టయం; కాలం, ప్రకృతి, మహత్తు – అనే ఇరవదిఏడు తత్వాలు. విష్ణుదేవుని కళాంశలతో ఈ తత్వాలు ఒకదానితో మరొకటి కలిసి, పరిపక్వమై ఈ జగత్తంతా నిండిన విరాట్ స్వరూపం అవతరించింది. హిరణ్మయమైన ఆ విరాట్ స్వరూపం ధరించిన పరమాత్మ సమస్త జీవులతో నిండినవాడయ్యాడు. ఆ విరాట్ పురుషుడు మొదటి జలాలతో ఏర్పడ్డ బ్రహ్మాండం అనే గర్భరూపంతో వేయి సంవత్సరాలు ఉన్నాడు. అటువంటి విరాట్పురుషుని శిరస్సునుండి స్వర్గమూ, పాదాలనుండి భూమీ, నాభినుండి ఆకాశమూ కలిగాయి. సత్త్వగుణం అధికంగా ఉండటంచేత ఆ దేవతలు స్వర్గాన్ని పొందారు. రజోగుణంవల్ల మనుష్యులూ, గోవులూ మొదలైన జీవులు భూమిని పొందాయి. తామసగుణంవల్ల భూతాదులైన రుద్ర పారిషదులు భూమికి, ఆకాశానికీ మధ్యగల ప్రదేశాన్ని పొందారు. శ్రీహరి మొట్టమొదటి అవతారమైన ఆ విరాట్పురుషుని గర్భం నుండి భూతమయమైన ఈ సమస్త ప్రపంచం పుట్టింది. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటె పైన సత్యలోకం ఒకటుంది. ఈ సత్యలోకం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నివాసం. మనకు వేయి మహాయుగాలు గడిస్తే అందుండే బ్రహ్మకు ఒక్క దినం అవుతుంది. డబ్బై ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. అటువంటి పదునాలుగు మన్వంతరాలు మనకు గడిస్తే బ్రహ్మకు ఒక్క దినం. బ్రహ్మకి పగలు అయినప్పుడు లోకాలు అవిర్భవిస్తాయి. అలాగే రాత్రి అయినప్పుడు బ్రహ్మ నిద్రపోతే లోకాలకు ప్రళయం వస్తుంది. మూడులోకాలూ కటిక చీకటితో కప్పబడి పోతాయి. సముద్ర జలాలు మూడు జగాలను ముంచివేస్తాయి. ఆ మహా సముద్ర మధ్యంలో శేషపాన్పుపై శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు. లోకాలన్నీ మరల ఆయన ఉదరంలోనికి చేరిపోతాయి. ఈ విధంగా కాలగమనంతో అహోరాత్రాలు గడిచి పోతుంటాయి. మానవుల ఆయుప్రమాణం నూరు సంవత్సరాలు. అలానే బ్రహ్మ దేవుని ఆయు ప్రమాణం కూడా నూరు సంవత్సరాలు. నూరు సంవత్సరాల మొదటి సగాన్ని ‘పద్మకల్పం’ అని రెండవ సగాన్ని ‘వరాహ కల్పం’ అని అంటారు. కాలస్వరూపుడై ప్రకాశించే శ్రీమన్నారాయణుడు ఆది, అంతము లేని మహాపురుషుడు. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టిస్తాను’ అని సంకల్పించగానే ఆయనలో అహంకారపూరితమైన దేహాభిమానంగల ‘మోహం’ పుట్టింది. దాని నుండి ‘మహామోహం’ ఉద్భవించింది. కోరికలకు విఘ్నం కలుగగా ‘అంధతామిస్రం’ అనే గ్రుడ్డితనం ఏర్పడింది. శరీర మోహం వలన, శరీర నాశన భయంవల్ల ‘తామిశ్రం’ అనే మృత్యు భీతి ఏర్పడింది. వీటన్నిటి వలన మనస్సుకు ‘చిత్త విభ్రమం’ అనే సంచలనం ఏర్పడింది. ఈ అయిదింటికి కలిపి ‘అవిధ్యాపంచకం’ అని పేరు. అవిధ్యాపంచకంతో కలిసిన భూతకోటిని పుట్టించడం తాను చేసిన పాపకార్యమని తలచిన బ్రహ్మ మనస్సులో పశ్చాత్తాపం చెందాడు. భగవంతుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మదేవుడు శ్రీహరిని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించాడు. ఆ పరమాత్మను మనస్సులో మరొక్కసారి ధ్యానించి సృష్టి కార్యానికి పూనుకున్నాడు. భగవధ్యానమనే అమృతం వలన ఆయన మనస్సు పావనమయింది. పవిత్రుడైన బ్రహ్మదేవుడు తన దివ్యదృష్టితో బ్రహ్మచారులు, పరమపావనులు, గుణవంతులు, పూజనీయులు అయిన సనకుడు, సనందులు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు మునులను సృష్టించాడు. వారు సృష్టికార్యాన్ని చేయటానికి సుముఖత చూపించకుండా తమ ముక్తిమార్గాన్ని వెదుక్కుంటూ తపోవనానికి వెళ్ళిపోయారు. సనకసనందాదులు ప్రత్యుత్పత్తికి నిరాకరించడంతో బ్రహ్మ ఎంత ఆగ్రహాన్ని నిగ్రహించుకొన్నా, ఆయన నుదుట నుండి క్రోధస్వరూపుడైన ‘నీలలోహితుడు’ ఉద్భవించాడు. అతను జన్మిస్తూనే పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. అందువలన ఆయనకు ‘రుద్రుడు’ అని నామకరణం జరిగింది. బ్రహ్మదేవుడు పునసృష్టి చేయమని ఆదేశింపగా రుద్రుడు బలంలోనూ, ఆకారంలోనూ, స్వభావంలోనూ తనతో సమానులైన వారిని సృష్టించాడు. ఈ విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాల దృష్టికి సమస్తలోకాలు మండిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించడం ఆపమని రుద్రగణాలను ఆజ్ఞాపించాడు. తపోవనానికి వెళ్ళి తపస్సు చేసి ఆ శ్రీమన్నారాయణుని దర్శించి తరింపమని పంపివేశాడు. అనంతరం బ్రహ్మ మరల సృష్టి కార్యాన్ని కొనసాగించేడు. ఈసారి మానవలోకానికి అగ్రగణ్యులైనవారు, సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణమైనవారు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు అయిన పదకొండు మంది కొడుకులు ఉదయించారు. బ్రహ్మ బొటన వ్రేలు నుండి దక్షుడు, తొడ నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులస్త్యుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగీరసుడు, ప్రాణం నుండి వసిష్టుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి ఆత్రి ఆవిర్భవించారు. ఇంకా బ్రహ్మదేవుడి కుడి వైపు స్తనం నుండి ధర్మం జన్మించింది. వెన్ను నుండి మృత్యువూ, అధర్మమూ జనించాయి. ఆత్మ నుండి మన్మథుడు పుట్టాడు. బ్రహ్మదేవుని కనుబొమ్మల నుండి క్రోధం జనించింది. పెదవుల నుండి లోభం పుట్టింది. పురుషాంగం నుండి సముద్రాలు, నీడ నుండి కర్ధముడు ఉదయించారు. ముఖము నుండి సరస్వతి ప్రభవించింది. అంత బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడైనాడు. మన్మథుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేధించాయి. కన్నకూతురనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. అది చూసి మరీచి మొదలైన మహర్షులు ‘వావివరసలు మరచి కన్నబిడ్డను కామించడమేమిటని’ బ్రహ్మను ప్రశ్నించారు. అప్పుడు బ్రహ్మ సిగ్గుతో తలవంచుకొన్నాడు. వెంటనే తన శరీరాన్ని త్యజించాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే ఆ దిక్కులలోనుంచి చీకటీ, మంచూ ఉద్భవించాయి. అటు పిమ్మట బ్రహ్మ ధైర్యం వదలక మరొక దేహాన్ని ధరించాడు. అప్పుడు ఆయన ముఖంనుండి పరమ ప్రబోధకాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. అతని హృదయం లోని ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. బ్రహ్మదేవుడు మరల ఆలోచించాడు. ఈ విధంగా ఒక్క ఋషులను సృష్టించడం వల్ల సృష్టిని త్వరితగతిలో వృద్ధి చేయడం కష్టం అని గ్రహించాడు. ఆయన తన మొదటి శరీరాన్ని వదలుకొన్నాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరొక్క దేహాన్ని ధరించాడు. దైవాన్ని ధ్యానించాడు. వెంటనే బ్రహ్మ దేహం రెండు భాగాలయింది. అందొకటి పురుష రూపంలో ‘స్వాయంభువ’ మనువుగా, మరొక్కటి ‘శతరూప’ అనే అంగనగా రూపొందాయి. ఆది మిధునమైన ఆ స్వాయంభువ మనువు శతరూ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు పుట్టారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికీ, దేవహూతిని కర్దమ ప్రజాపతికీ, ప్రసూతిని దక్షప్రజాపతికీ ఇచ్చి వివాహం చేసారు. స్వాయంభువ-శతరూప దంపతుల సంతతితో ఈ జగత్తంతా నిండింది.