
శుభకార్యం జరిగిన ఇంటి మృత్యువు విలయతాండవం చేసింది..ప్రస్తుతం అక్కడ,సంతోషాలకు,తావు లేనేలేదు, ఆత్మఘోషలతో స్మశాన వైరాగ్యం తప్ప. నలుగురు జీవితాలతో విధి ఆడిన చదరంగంలో బలైపోయింది ఆ నలుగురే. ఆత్మీయతలు పంచుకున్న ఆ నలుగురు ఎక్కడా?అని ఎవ్వరైనా ప్రశ్నిస్తే ?కాలమే సమాధానం చెప్పాలేమో? విధి ఆడిన చదరంగంలో నిర్ధాక్షణ్యంగా అశువులు బాసిన ఆ నలుగురిలో ఎవ్వరి ఆశీస్సులు ఫలించాయో ఊపిరి పోసుకుందో పసితనం. తనకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. జోల పాడనేలేదు,ఊయల ఊపనలేదు, చందమామను చూపిస్తూ! గోరుముద్దలు తినిపించనేలేదు. ఎవ్వరున్నారని!తనను లాలించేందుకు. తను ఇప్పుడు లోకం దృష్టిలో!ఒక అనాధ. **** "అమ్మా! మావయ్యని బస్సు ఎక్కించి , నేను అటునుండి ఆఫీసుకు వెళ్తాను",చెప్పి తన మేమమాతో కలిసి ఆటోలో బయలుదేరాడు రాఘవ. "ఒరేయ్!రాఘవా?ఎందుకో కాస్త నలతగా ఉంటుంది ,ఈ మధ్యకాలంలో. ఒకసారి చెకప్ చేయించుకోవాలి అనిపిస్తుంది" "హాస్పిటల్ దగ్గర దింపమని చెప్పు,"అంటున్న మేనమామ మాటలకు,"అలాగే మామయ్యా, నేనే దగ్గర ఉండి చెకప్ చేయించిన తరువాతే బస్సు ఎక్కిస్తా , ఒంటరిగా మీకు శ్రమ అవుతుంది." "పదండి "అనేసి, హాస్పిటల్లో పూర్తి చెకప్ చేయించిన రాఘవకు, గుండెలు పగిలే రిపోర్ట్ చేతికి అందింది. తన మేనమామకు కరోనా నిర్దారణ కావడంతో ,తాను ఆఫీసుకు కానీ,ఇంటికి కానీ వెళ్ళడం సముచితం కాదని,ఇంటికి ఫోన్ చేసి విషయం తెలియచేసి,తను క్వారంటైంలో చేరిపోయాడు రాఘవ. అదే రోజు రాత్రి ,రాఘవ తల్లిగారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ,తనని హైద్రాబాదు లోని ప్రముఖ హాస్పిటల్లో చేర్పించారు రాఘవ నాన్నగారు. ఆమెకు కూడా కరోనా నిర్దారణ కావడంతో , ముందు జాగ్రత్తగా! రాఘవ నాన్న గారిని, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న వైజాగ్ లోని ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ***** నెలలు నిండిన రాఘవ భార్య ఒంటరిగా ఇంటిలో మిగిలింది. ఒకే ఇంటిలోని ముగ్గురికి కరోనా నిర్దారణ కావడంతో!,కనీసం తనని పలకరించేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితుల్లో, పురిటి నెప్పులు మొదలవ్వడంతో , తనే అంబులెన్స్ కు ఫోన్ చేసుకుని , ప్రసవానికి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి చాలా రిస్క్ చేయవలసి వచ్చింది రాఘవ భార్యకు. ఇక్కడ కూడా విధి చదరంగం ఆడి గెలిచింది..అనేక తప్పదు. రాఘవ భార్యకు కూడా కరోనా నిర్దారణ కావడంతో.తను డాక్టర్సచ పర్యవేక్షణలోనే ఉండిపోయింది. అక్కడ రాఘవ తన కుటుంబానికి దూరంగా ఉంటూ,తన వారిని కాపాడుకొగలిగాను అనుకుంటు ,మృత్యువు కౌగిట్లోకి జారుకున్నాడు. మరో ప్రక్కన రాఘవ తల్లిదండ్రులు కూడా అదే పరిస్తితిలో తన వలన మరొకరికి ఇబ్బంది కలగలేదు అనుకుంటూ. అదే సంతోషం అనుకుంటా,ఒకరికి తెలియకుండా మరొకరు ఒక్కరోజు వ్యవధిలోనే మృత్యువుకు నైవేద్యంగా మారిపోయారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తన కోడలు మరణించింది, అనే విషయం రాఘవ తల్లిదండ్రులకు తెలిసే అవకాశమే లేదు. వారు ప్రాణాలతో లేరు కనుక. అలాగే తన భార్య చనిపోయింది అనే విషయం రాఘవకి తెలియదు. రాఘవ భార్యకు తన అత్తామామ తన భర్త చనిపోయారు అనే విషయం తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. తను కూడా విధి ఆడిన చదరంగంలో ఓడిపోయి ఉంది కనుక. మృత్యువు కబళించింది కనుక. కానీ!అందరి దీవెనల్తో ఊపిరి నిలుపుకున్న పాప మాత్రం అనాధగా మిగిలింది.అదృష్టం తనకు ఎటువంటి అనారోగ్య సమస్య అందుకోలేదు. తను కుటుంబాన్ని కాటేసింది ఎవ్వరో? అనే చూపుల్తో ప్రశ్నిస్తుంది బోసి నువ్వులతో, ఒక్కరి అజాగ్రత్త ఒక కుటుంబాన్ని సమూలంగా తూడ్చిపెట్టింది.