ఉత్తరం - తటవర్తి భద్రిరాజు

Vuttaram

చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఆకాశం లో మబ్బులు కూడా ఎక్కువ లేవు. సూర్యుడు మబ్బుల చాటు న ఉన్నాడు. ఎర్రరంగు పులుముకున్న మట్టి రోడ్ రాళ్లు పైకి లేచి ఉంది. వర్షం చినుకులు ఈ రోడ్ పడి ఎవరో కళ్ళాపు చల్లినట్టు గా అనిపిస్తుంది. ఆ మట్టి రోడ్ పై ఒక సైకిల్ వస్తూ ఉంది. దాని వెనకాలే రెండు గొనె సంచులు లాంటి సంచులు. ఆ సైకిల్ నేరుగా ఊళ్ళో ని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆగింది. సైకిల్ దిగి , సంచులను కిందకి తీసి పోస్ట్ ఆఫీస్ లోపలికి తీసుకుని వెళ్ళాడు పోస్టుమాన్ కామేశం. రోజులాగే ఆ పోస్టల్ బ్యాగ్ కట్ చేసి అందులో ఉన్న లెటర్స్ , మనీ ఆర్డర్స్ బయటకి తీసాడు. కామేశం కొత్తగా ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు. బాగా చదువుకున్నాడు. ప్రతీరోజూ ఉదయమే ఉద్యోగానికి వచ్చి, చుట్టు పక్కల ఉన్న మూడు ఊళ్లలో ఉత్తరాలు, మనీ ఆర్డర్స్ డెలివరీ చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్తాడు. బ్యాగ్ లో నుండి తీసిన లెటర్స్ అన్నీ వరుసలో పెట్టుకున్నాడు. ఆ అన్ని లెటర్స్ మీద ఆ రోజు తేదీ తో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ముద్ర ను వేసి డెలివరీ చేయడం కోసం బయలుదేరాడు. ఉత్తరాలు వచ్చిన ఒక్క ఒక్కరికి ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు. పెద్ద వీధిలో రామారావు గారికి వచ్చిన కోర్ట్ నోటీసు డెలివరీ చేసాడు. శెట్టిబలిజపేటలో వీరమ్మ కు కూతురు రాసిన ఉత్తరాన్ని డెలివరీ చేసాడు. రామాలయం పూజరిగారికి నెల నెలా వచ్చే సనాతన సారధి పుస్తకాన్ని కూడా డెలివరీ చేసాడు. అలా డెలివరీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రాళ్లదిబ్బ పక్కనే ఉన్న పూరి గుడిసెలో ఉన్న గంగమ్మ బాబు నా కొడుకు దగ్గర నుండి లెటర్ కానీ వచ్చిందా అని అడిగింది. ప్రతీరోజు కామేశాన్ని గంగమ్మ ఇలానే అడుగుతుంది. గంగమ్మ కొడుకు ఉపాధి కోసం అని దుబాయ్ వెళ్ళాడు. అప్పుడే ఆరు నెలలు అయ్యింది. కొడుకు క్షేమ సమాచారాలతో కూడిన ఉత్తరం వస్తుంది అని రోజూ ఎదురు చూస్తోంది గంగమ్మ. కామేశాన్ని సోమవారం మళ్లీ అడిగింది. మంగళవారం నాడు అడిగింది. బుధవారం కూడా అడిగింది. అలా రోజు అడుగుతూనే ఉంది. రోజూ ఉత్తరం రాలేదు, రాలేదు అని చెప్తూనే ఉన్నాడు కామేశం . ఓరోజు గంగమ్మ ని అడిగాడు. రోజు అడుగుతున్నావు కదా నీకు ఎక్కడ నుండి ఉత్తరం రావాలి అని. గంగమ్మ వివరంగా చెప్పింది. నా కొడుకు ఉద్యోగం కోసం అని దుబాయ్ కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అమ్మా రోజుకో ఉత్తరం రాస్తాను అన్నాడు. నా బిడ్డ అక్కడ ఎలా ఉన్నాడో అంటూ కళ్లు చీరకొంగుతో తుడుచుకుంది. పాపం గంగమ్మ కొడుకు రాసే ఉత్తరం కోసం ఎంతలా ఎదురుచూస్తుంది అనుకున్న కామేశం తరువాత రోజు తానే ఒక ఉత్తరం రాసి కొడుకు రాసాడు అని గంగమ్మ కి ఇచ్చాడు. ఆ ఉత్తరం కామేశం చేతే చదివించుకున్న గంగమ్మ నా కొడుకు ఉత్తరం రాసాడు అని అందరికీ చెప్పుకుంది. నా కొడుకు దుబాయ్ లో ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు అని మురిసి పోయింది. అక్కడ నుండి అప్పుడప్పుడు గంగమ్మ కు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కామేశం రాస్తూనే ఉన్నాడు. గంగమ్మ కు డెలివరీ చేస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరాన్ని చదివి వినిపిస్తూనే ఉన్నాడు. గంగమ్మ కొడుకు ఉత్తరం రాసాడు అని మురిసిపోతూనే ఉంది. ఓరోజు కామేశం రోజు లాగే పోస్టల్ బ్యాగ్ కట్ చేసాడు. అందులో గంగమ్మ కొడుకు ఉన్న దుబాయ్ నుండి ఓ ఉత్తరం వచ్చింది. కామేశం ఉత్తరాలు అన్నీ వరుసలో పెట్టుకుని డెలివరీ చేయడం కోసం బయలుదేరాడు. ముందుగా గంగమ్మ కు ఇద్దామని వెళ్ళాడు. గంగమ్మ ఎక్కడికో బయటకి వెళ్లడం తో వచ్చే వరకు ఉందామని అక్కడే వేచి ఉన్నాడు. గంగమ్మ కొడుకు దగ్గర నుండి వచ్చిన ఉత్తరం కామేశం చేతిలో ఉంది. గంగమ్మ ఎలాగూ తననే చడవమంటుంది కదా అని తెరిచి చూసాడు. దుబాయ్ లో ఉన్న తెలుగు సంఘం వాళ్ళు పంపిన ఉత్తరం అది. దుబాయ్ లో ఓ రోడ్ ప్రమాదం లో గంగమ్మ కొడుకు మరణించాడని ఆ ఉత్తరం సారాంశం. తప్పనిసరి పరిస్థులలో అంతిమ సంస్కారాలు పూర్తి చేసేసామని గంగమ్మ కు వచ్చిన లేఖ చదివిన కామేశం, ఈ ఉత్తరం మాత్రం గంగమ్మ కు ఇవ్వలేదు. ఇస్తే ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకు మరణం తాను తట్టుకోలేదు అని తనకి తెలుసు. ఆ ఉత్తరాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎప్పటిలాగే గంగమ్మ కు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కామేశం రాస్తూనే ఉన్నాడు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు