.
చలి ,యెముకలు కొరుకుతున్నది . చినుకులూ ,గాలీ తోడయ్యాయి . వణుకు తో శేఖరం కిటికీలు మూద్దామనుకుంటే వేళ్లు బిగుసుకుంటున్నాయి . వాతావరణం నిశ్శబ్దం గా ప్రశాంతం గా వుంది . చినుకుల చప్పుడు ,రివ్వున వీచే గాలి !రాత్రి పదకొండు అయ్యింది . కిటికిలొనించి తొంగి చూస్తున్న శేఖరానికి స్ట్రీట్ లైట్ కింద క్రింద వణుకుతూ నించున్న జంట కనిపించింది శేఖర్ .ఆ జంటనే చూస్తున్నాడు . అంత చినుకుల్లోనూ నవ్వుకుంటూ యేదో మాట్లడుకుంటున్నారు . వయసులో వున్న కొత్తగా పెళ్లయిన దంపతుల్లాగా వున్నారు . ఇంతలో వనజ వచ్చి " ఏమండీ , దంపతులెవరో వానలో తడుస్తూ మన గేటు దగ్గర నిలబడ్డారు ,కడుపుతో ఉన్నట్టుంది కూడా ,మన వరండాలోకి రమ్మందాం " అన్నది . వాళ్ల్లనే చూస్తున్న శేఖర్ " సరే " అన్నట్టు భార్యను చూసాడు .
ముందు వరండాలో కూర్చున్నారు ఆ భార్యా భర్తలు . సన్నని వెలుతురులో భర్త మీద వాలిపోతూ పకపకా నవ్వుతున్నది . వాళ్లకు మరోలోకం అక్కర్లేనంతగా నవ్వుకుంటూన్నారు . శేఖర్ తన గదిలోనించే వాళ్ళను గమనిస్తున్నాడు . దిగువ మధ్య తరగతి వాళ్ల లాగా వున్నారు . మళ్ళీ పకపకా నవ్వుతూ తలుపుతుంటే వాలుజడలోని మల్లెలుగాయి . మరొక్కసారి పరీక్షగా చూసాడు శేఖర్ . ఆ నవ్వూ ,ఆ మల్లెలూ అతన్ని వులిక్కిపడేలా చేసాయి . మనసులో కలవరం ! ఆమె నిలబడి చీర కుచ్చెళ్లు గట్టిగా పిండుకుంటున్నది ,అతను రుమాలుతో ఆమె తల తుడుస్తున్నాడు . మళ్లీ కిలకిలా నవ్వు . దీపం వెలుగులో ఆమె ముఖం స్పష్టం గా కనపడింది .చటుక్కున ఆమె కిటికీ వైపు తిరిగింది . శేఖర్ ఠక్కున వెనక్కి జరిగాడు .
శేఖర్ కి మనసంతా అలజడి . వసంత ------- జ్ఞాపకాల పుటల్లో ఎక్కడో నలిగిపోయిన పేజీ ! వసంత యిలా యెదురవుతుందని కల్లో కూడా వూహించలేదు . తీయని అనుభూతులు మనసు జ్ఞప్తి చేసిన మధుర ఘడియలు ,హృదయాన్ని మీటుతూ ముందు వచ్చి నిలబడ్డాయి .
-------------------------------------------------------------------------------------------------------------------------
,
శేఖర్ డిగ్రీ చదువుతున్న రోజులు అవి . ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ,మెస్ లో భోజనం చేసేవాడు చదువు లో .మంచి మార్కులు తెచ్చుకుంటూ పరీక్షల్లో నెగ్గుతూ వుండేవాడు . ఒకరోజు గదిలోనించి బయటకు వస్తుంటే వసంత కనిపించింది . వాలుజడ ,సన్నగా పొడుగ్గా అందం గా వుంది . ఇద్దరూ ఒకళ్లనొకళ్ళు చూసుకున్నారు . ఆలా అప్పుడప్పుడూ చూపులు కలుస్తూ వుండేవి . వసంత ప్రక్కపోర్షన్ లో అద్దెకుండే బడిపంతులు రామారావుగారమ్మాయి. క్రమం గా శేఖర్ కు వసంతంటే యేదో ఆకర్షణ మొదలయ్యింది . వసంత మాత్రం పలికేదే కాదు . చూసేది ,వయ్యారంగా జడ వూపుకుంటూ వెళ్లేది . వసంత మాటా ,మనసూ ,నడవడికా శేఖర్ కి నచ్చాయి . పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు . ఒకరోజు ఒంటరిగా కనిపించిన వసంతకు తన అభిప్రాయం చెప్పాడు .
" మా నాన్నా ,అమ్మలతో మాట్లాడండి "అంటూ ఒక వాలుచూపు చూస్తూ వెళ్లిపోయింది .వసంతకు తనంటే యిష్టమని గ్రహించాడు . శేఖర్ వసంత తండ్రితో "నా డిగ్రీ చదువు అవగానే మా యింట్లో వాళ్లను ఒప్పించి వసంతను పెళ్లి చేసుకుంటాను " అని చెప్ప్పాడు . వసంత తల్లితండ్రులకు శేఖర్ ప్రవర్తన నచ్చి పెళ్లికి ఒప్పుకున్నారు .
వసంతా ,శేఖర్ కలుసుకోవడం ,వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవడం అప్పుడప్పుడూ ఒళ్లో తల వాల్చి పడుకోవడాలు మొదలయ్యాయి .
శేఖర్ సెలవుల్లో యింటికి బయల్దేరాడు . వసంతకు ఫోన్లు చేస్తాననీ ,తల్లితండ్రులను ఒప్పిస్తాననీ హామీ యిచ్చాడు . వసంత కన్నీళ్లతో వీడ్కోలు యిచ్చింది . ఇల్లుచేరిన శేఖర్ కి సమస్య మేనరికం తో మొదలయ్యింది .రంగమ్మత్త కూతురు వనజను చేసుకొమ్మని అమ్మా నాన్నల ఒత్తిడి మొదలయ్యింది . వనజను చేసుకుంటే ఆ యింటికి అల్లుడూ ,కొడుకూ శేఖరమే ,సంపదలకు అధికారి శేఖరమే అవుతాడనీ ,పైగా వుద్యోగం కూడా యిప్పిస్తారనీ తండ్రి వాదన ! శేఖర్ వసంత విషయం చెప్పాడు . అయినా వాళ్లు వినలేదు . శేఖర్ ప్యాసైయ్యాడు . ఉద్యోగాల వేట మొదలయ్యింది . కానీ దేనికీ పిలుపు రావడం లేదు . నిరాశ మొదలయ్యింది . వసంతకు ఫోన్లు చేస్తున్నాడు ,ధైర్యం చెప్తున్నాడు . వుద్యోగం దొరికితేకానీ తనేం చెయ్యలేడు . విసుగు మొదలయ్యింది . శేఖరం నిస్సహాయత చూస్తున్న తండ్రి మరొకసారి మేనరికం వనజాతో పెళ్ళీ ,అందువల్ల వచ్చే సిరిసంపదలూ కొడుకుతో చెప్పారు . ఆలోచించుకొమ్మని హెచ్చరించారు .
శేఖర్ ఆలోచించడం మొదలు పెట్టాడు . తండ్రి మాటల్లో ఆర్ధిక సత్యాలు ,అర్ధాలు వెతుక్కున్నాడు . ఆశయాలు గాలిలో మబ్బుల్లాగా యెగిరిపోయాయి . వసంతతో పెళ్లి ,చాలీచాలని డబ్బుతో చిన్న సందుల్లో పేదింట్లో కాపురం కళ్లముందు రీళ్లలాగా తిరిగాయి . తన సుఖం ఆలోచించుకున్నాడు . వనజతో పెళ్లికి ఒప్పుకున్నాడు . వసంతను జ్ఞాపకాలపుటల్లో ఒకపేజీగా మడిచేసాడు .
వసంత ఆలోచనలలోనించి బయటకు వచ్చాడు శేఖర్ . వసంతను పలుకరించాలనిపించింది . ఎన్నో చెప్పాలనిపించింది కానీ ఆమె ముఖంలో తృప్తి ,నిండుతనం ,,అమాయకమైన నవ్వూ శేఖరాన్ని ఆగమన్నాయి . వసంతను మర్చిపోలేదన్నమాట శేఖర్ మనసు హెచ్చరించింది . వసంత మర్చిపోయింది . శేఖర్ కి గుండెల్లో ముళ్ల్లు గుచ్చుకున్నట్టయ్యింది .
తెల్లవారుతుండగా వాన తగ్గింది ఆ దంపతులు కిలకిలా నవ్వుకుంటూ గేటు తెరచి బయటకు వెళ్లిపోయారు . శేఖర్ చూస్తూనే వున్నాడు . ఏదో అశాంతి ,అలజడి ! "అమూల్యమైన వజ్రాన్ని చేతులారా వదులుకున్న అభాగ్యుణ్ణి "అనుకుంటూ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు . సంపద వుంది ,హోదా వుంది ,కానీ యేదో కనిపించని హృదయాన్ని ముక్కలు చేసే వెలితి వుంది . శేఖర్ వెలుగు వెతుక్కుంటున్నాడు . .
.
.
.
. .