ఆమె తిరిగి వస్తే బావుణ్ణు ! - తటవర్తి భద్రిరాజు

Aame tirigivaste baagunnu

మధ్యాన్నం మూడు గంటలకు తిరుపతి నుండి వచ్చిన ప్యాసింజర్ రైలు మేడపాడు స్టేషన్ లో ఆగింది. మేడపాడు చాలా చిన్న స్టేషన్. కొంతమంది ప్రయాణికులు ను దింపి , మరికొంత మంది ని ఎక్కించుకుని ఆ రైలు ఒక పెద్ద కూత పెట్టుకుంటూ సామర్లకోట వైపు పరుగులు తీసింది. రోజూ ఇంచుమించు ఇదే సమయానికి వచ్చే ఈ రైలు లో చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో మేడపాడు చుట్టు పక్కల ఉండే చిన్న చిన్న వ్యాపారులు కూడా ఉంటారు. వారానికి ఒకసారి విజయవాడ వెళ్లి, అక్కడ హోల్ సేల్ గా వస్తువులు కొని ఈ ప్యాసింజర్ రైలు లో తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చిన వస్తువులను సైకిల్ పై పెట్టుకుని దగ్గరలోని గ్రామాలలో అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మే వాటిలో బట్టలు దగ్గర నుండి స్టీల్ సామాను వరకు చాలా రకాలు ఉంటాయి. కొంత మంది వ్యాపారులు ఐతే అమ్మిన వస్తువులకు వాయిదా పద్ధతి లో కొంచం కొంచం డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యాపారం చేసే సీతారామయ్య ఒకప్పుడు మేడపాడు రైల్వే స్టేషన్ లో టిక్కెట్స్ అమ్మే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. చాలా సoవంత్సరాలు ఇలా టికెట్స్ అమ్మి , వచ్చే ఆదాయం సరిపోక ఈ మధ్యనే ఈ రకరకాల వస్తువులు వాయిదా పద్ధతి లో అమ్మే వ్యాపారం ప్రారంభించాడు. సీతా రామయ్య అమ్మే వస్తువులు మంచి నాణ్యత తో ఉండడం తో తక్కువ సమయంలోనే వ్యాపారం లో వృద్ధి సాధించాడు. మంచి మాటకారి ఐన సీతారామయ్య చుట్టూ ఉన్న గ్రామాలలో రోజూ సైకిల్ పై తిరుగుతూ మంచి పరిచయాలు పెంచుకున్నాడు. అన్నయ్య గారు, బావగారు, అక్కయ్య గారు అంటూ వరసలు కలుపుతూ అందరినీ తన మాటలతో ఆకట్టుకుంటూ వస్తువులను అమ్మేసే వాడు. ఆ వస్తువులు అవసరం లేకపోయినా సీతారామయ్య మాటలకు మంత్ర ముగ్దులు ఐన జనం సీతారామయ్య దగ్గర ఆ వస్తువులు కొనేసేవారు. రోజూలానే ఈ ఊరు వచ్చిన సీతారామయ్య ఈరోజు ఊళ్ళో జనం తక్కువగా ఉండడం తో కిళ్లీ కొట్టు దగ్గర ఆగి ఒక మిఠాయి కిళ్లీ తిన్నాడు. ఎప్పుడో అడ్డతీగల అనే ఊరు నుండి వలస వచ్చేసిన కోనలోవ గోవింద్ ఈ కిళ్లీ కొట్టు పెట్టుకున్నాడు. ఊళ్ళో వాళ్లకు కిళ్లీ ల రుచి తెలియని సమయంలో లో ఇక్కడ షాప్ పెట్టి అందరికీ వాటి రుచి చూపించాడు. తమలపాకులతో రకరకాల కిళ్లీ లు చేసే కోనలోవ గోవిందు చాలా బాగా కిళ్లీలు చేస్తాడని చుట్టు పక్కల గ్రామాలలో కూడా మంచి పేరు సంపాదించాడు. చుట్టూ ఉన్న గ్రామాలలో ఎటువంటి చిన్న పంక్షన్స్ ఐనా కిళ్ళీల ఆర్డర్స్ మాత్రం గోవిందు కె వచ్చేవి. గోవింద్ ఇచ్చిన కిళ్లీ తిని గోవింద్ తో మాట కలిపాడు సీతారామయ్య.' ఈరోజు జనం ఎవరూ ఊళ్ళో కనపడడం లేదు ఎక్కడికి వెళ్లారు ? ' అని అడిగాడు. మీకు తెలియదా ! మా ఊరు పాస్టర్ ఏసు పాదం గారు కి బాగోపోతే చూడడానికి కాకినాడ జనరల్ ఆసుపత్రికి వెళ్లారు' అని చెప్పాడు గోవింద్. అవునా ఐనా పాస్టర్ గారికి బాగోపోతే ఊరు ఊరు అంతా చూడడానికి వెళ్లిపోయిందా ? ఆశ్చర్యం తో అడిగాడు సీతారామయ్య. 'అవునండీ బాబూ ! మరి ఆయన మంచితనం అలాంటిది. ' ఎక్కడి నుండో వచ్చేసిన ఆయన ఈ ఊరు కోసం చాలా చేసాడు. అయినా అదంతా పెద్ద కథ అండీ బాబూ 'అన్నాడు గోవింద్. అవునా ! సరే కానీ ఇంతకీ ఏంటి ఆయన కథ అని ఆత్రం గా అడిగాడు సీతారామయ్య. మీరు విసుగు లేకుండా వింటానంటే మొత్తం చెప్తా అని చెప్పడం ప్రారంభించాడు గోవింద్. ***** కంకిపాడు అని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ఊరిలో బస్ కండక్టర్ గా చేసే వారు పరుసురామయ్య గారు. మనిషి మంచోడే కానీ కొంచం పేకాట అలవాటు ఉంది ఆయనకి. బాగా పేకాట ఆడతాడాని ఆయన సర్కిల్స్ లో ఆయనకి మంచి పేరు కూడా ఉంది. పేకాట లో బాగా సంపాదించిన పరుసురామయ్య గారు ' చ్ఛా ఇంక ఈ కండక్టర్ ఉద్యోగం ఏం చేస్తాం అని ' ఉద్యోగం మానేశారు. మంచి ఉద్యోగం ఎందుకు మానేస్తావు అనిఎవరో అడిగితే ' క్రీడలకు ప్రోత్సహం తగ్గిపోతూ ఉంది. వాటిలో పేకాట ఒకటి. అందుకే దానిని ప్రోత్సహిద్దామని ఉద్యోగం మానేశా అని సరదాగా చెప్పేవాడు. ఉన్న డబ్బులు తో పేకాట ఆడుతూ సమయం గడిపేసేవాడు. కొంతకాలం బాగానే డబ్బులు వచ్చినా తర్వాత తర్వాత పేకాట లో డబ్బులు పోగొట్టుకుంటూ...ఎప్పుడో తండ్రి ఇచ్చిన ఇల్లు కూడా అమ్మేశారు పరుసరామయ్యగారు. 'చిన్న తనం లొనే తల్లి తండ్రి పోవడం తో నా పెంపకం సరిగా లేదు' అని అప్పుడప్పుడు మందు తాగిన సందర్భాలలో బాధ పడేవాడు పరుసురామయ్య గారు. ఉదోగ్యం , ఇల్లు పోయాక సంపాదన లేక అప్పులు చేద్దాం అనుకుంటే ఇచ్చేవారు లేక ఏమి చెయ్యాలో తెలియక కంకిపాడు బస్టాండ్ పక్కనే ఉన్న చర్చి దగ్గర ఉన్న బెంచ్ పై కూర్చుని , చర్చి గోడపై ఉన్న సిలువ బొమ్మ ను చూస్తుంటే....అప్పుడే అక్కడకి వచ్చిన పాస్టర్ జీవరత్నం గారు పరుసురామయ్య గారిని ఓదార్చారు. బాధ పడకు నీకు ఆ దేవుడే దారి చూపిస్తాడు అని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి ప్రతీ రోజు ఈ చర్చి కి వచ్చి జీవరత్నం గారిని కలవడం "దేవుడు ఇంకా దారి చూపించలేదు" అని చెప్పడం ఒక దిన చర్య గామార్చుకున్నారు పరుసురామయ్య గారు. పరుసురామయ్య గారిని చూసిన జీవరత్నం గారు 'దేవుడు దారి చూపించలేదు' అని పరుసురామయ్య కి దేవుడు మీద నమ్మకం పోతుంది ఏమో అని భయం వేసి' , నేనే నీకు దారి చూపుతా అని పరుసురామయ్య గారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకు పరుసురామయ్య గారి పేరును ఏసు పాదం గా మార్చి , పాస్టర్ గా శిక్షణ ఇప్పించి ఈ ఊళ్ళో చర్చి పెట్టించారు జీవరత్నం గారు. అలా దేవుడి ని నమ్ముకున్న ఏసు పాదం గారు ఆ తరువాత ఇంకెప్పుడూ పేకాట ఆడలేదు. ఊళ్ళో వాళ్లకు మంచి వాక్యాలు చెప్తూ మత ప్రచారం చేస్తూ స్థిరపడ్డారు. ఆ తరువాత కొంతకాలానికి అమెరికా నుండి వచ్చిన అబ్రహం అనే ఆయన చర్చిలు కట్టడానికి డబ్బులు ఇస్తుంటే ఏసు పాదం గారు రెండు అంతస్తుల మేడ కట్టి పైన చర్చి పెట్టుకుని, కింద ఆయన ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని దేవుని సేవ చేసేవారు. అప్పుడెప్పుడో దుబాయ్ వెళ్లిపోయిన మంగతయారు ఈ మధ్యనే ఊళ్ళో కి వచ్చి ఏసు పాదం గారు మంచి మాటలు విని మతం మారి , పేరు కూడా మరియమ్మ గా మార్చుకుంది. మంచి మంచి పాటలు నేర్చుకుని ప్రతీ శుక్రవారం చర్చి లో పాడేది. మరియమ్మ గానానానికి పరవశించి న దేవుడు, ఏసు పాదం గారి కి కలలో కనపడి దేవుని సేవ చేయడానికి తోడుగా మరియమ్మ ను ఎంచుకోమని ఆదేశించాడు. అలా మరియమ్మ , ఏసు పాదం గారు దేవుని సేవ చేస్తున్న రోజుల్లో దేవుని కృప ఆయన పై ప్రసరించి మరియమ్మ తో ఆయనకి వివాహం అయ్యింది. ఇక అక్కడి నుండి ఏసు రత్నం గారు, మరియమ్మ దేవుని సేవతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలలో ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహాయం చేస్తూ మత ప్రచారం చేస్తూ ఉండేవారు. వీరి సేవలకు మెచ్చిన అబ్రహం గారు ప్రతీ నెల అమెరికా నుండి ఫండ్స్ పంపుతూనే ఉండేవారు. అలా అడిగిన వారికి కాదు అనకుండా అవసరానికి సహాయం చేస్తూ చాలా మంది ని తమ మతం లోకి మార్చారు ఏసు పాదం గారు. ఇప్పుడు ఈ ఊళ్ళో చాలా మంది దేవుని భక్తులే. అలా ఏసు పాదం గారు , మరియమ్మ చుట్టూ ఉన్న గ్రామాలలో ప్రతీ రోజు తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి వారికి ఒక చిన్న పాప పుట్టింది. ఏసు పాదం గారు ఆ మేరీ మాతే తనకి పుట్టింది అని చాలా ఆనంద పడి ఆపాపకు మేరీ అని పేరు పెట్టారు. రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. చుట్టూ ఉన్న గ్రామాలలో దేవుని భక్తులు పెరుగుతూ ఉన్నారు. మేరీ కూడా పెరుగుతూ ఉంది. తన తల్లి తండ్రి దేవుని భక్తులు గా కలిసి ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసుకుని ,తెలిసి తెలియని వయసులో దేవుని పై భక్తి తో పాటు అప్పుడప్పుడు చర్చి కి వచ్చే జార్జి అనే భక్తుడి పై ప్రేమను పెంచుకుంది. సోమవారం ఉపవాస ప్రార్థన లు కోసం వడ్లమూరు వెళ్లిన ఏసు పాదం గారు, మరియమ్మ అక్కడ కొంత మంది ని మతం మార్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మంగళ వారం ఉండూరు లో, బుధవారం తాపేశ్వరం లో, గురువారం కట్టమురు అనే ఊరిలో ప్రత్యేక ప్రార్ధన లు పెడుతూ దేవుని సేవ చేస్తూ ఉండేవారు. ఓ శుక్రవారం ఏసు పాదం గారు , మరియమ్మ జగ్గంపేట లోని కొత్తగా కట్టిన చర్చిలో కూటముల కొసం వెళ్లారు. అదేసమయం లో ఏసు పాదం గారి ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న మేరీ , తాను ప్రేమించిన జార్చి అనే భక్తుడి తో ఎక్కడికో వెళ్ళిపోయింది. 'నాకోసం వేతకొద్దు ' అని ఒక లెటర్ రాసి పెట్టి. లెటర్ చదివి విషయం తెలుసుకున్న ఏసు పాదం గారు భారం దేవుని మీద వేయలేక, ఆయన గుండెల్లో నే పెట్టుకుని చాలా చోట్ల మేరీ కోసం వెతికారు. ఎక్కడికి వెళ్లిందో, ఎప్పుడు వస్తుందో తెలియని మేరీ కోసం దిగులుతో మంచాన పడ్డారు. ఇదిగో ఏసు పాదం గారిని ఈరోజు కాకినాడ జనరల్ ఆసుపత్రి లో చేర్పించారు " అని చెప్పాడు గోవింద్. ఏసు పాదం గారి కథ విన్న సీతారామయ్య గారు అయ్యో దేవుడు ఎంత పని చేసాడు అంటూ నిట్టూరిస్తూ .....పక్క ఊరికి బయలు దేరారు. - సమాప్తం-

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు