బాలు , మేనత్త రాజ్యలక్ష్మి పై గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపుల్లో కొన్ని తిట్లు కూడా ఉన్నాయి. అతనికి మేనత్త అంటే చాలా ఇష్టం. కానీ తాగడానికి డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రమే మేనత్త ను బాగా తిడతాడు. అరుస్తాడు. అప్పుడప్పుడు కొడతాడు కూడా. రాజ్యలక్ష్మి గారి వయసు సుమారు 60 ఏళ్ళు. వచ్చిన వయసు కు సంకేతం గా నెరిసిన జుట్టు తప్ప, చూడడానికి 60 ఏళ్ళు అంటే ఎవ్వరూ నమ్మరు. ఓపిక ఉన్నంత కాలం ఓ స్కూల్ లో టీచర్ గా పని చేసి, పదవీ విరమణ వయసు వచ్చాక తప్పక స్కూల్ కి దూరంగా ఉంటున్నారు. సాయంత్రం పూట చుట్టు పక్కల పిల్లలకు ప్రైవేట్స్ చెప్తూ ఉంటారు. ఈ మధ్యనే ఎడమ వైపు చెవి కొంచం వినబడడం లేదు. అదికూడా గత నెలలో శివరాత్రి నాడు తాగడానికి డబ్బులు ఇవ్వక పోతే, తన ముద్దుల మేనల్లుడు బాలు ఆ చెంప మీద కొట్టినప్పడి నుండే. రాజ్యలక్ష్మి గారికి ఈ తిట్లు, అరుపులు అలవాటే. గడిచిన 10 ఏళ్ల నుండి. ఎవరైనా 'ఆ బాలు ను ఎందుకే చేరతీసి వాడి చేత తిట్లు తింటావ్ అంటే ' నవ్వుతూనే చిన్న పిల్లాడు కదా ఐనా అది నా భాద్యతే అంటారు. ఆ కళ్ళ వెనుక ఉన్న బాధను కనపడనీయకుండా. రాజ్యలక్ష్మి గారు డిగ్రీ చదువుతున్నప్పుడు అన్నయ్య కు వివాహం ఐయింది. కొన్నేళ్లకు రాజ్యలక్ష్మి గారికి ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులు ఇక పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉండగా ఓ అనుకోని ఘోరం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదం లో అన్నయ్య వదిన మరణించారు. అప్పటికే అన్నయ్యకు నలుగురు ఆడపిల్లలు , ఒక కొడుకు. రాజ్యలక్ష్మి గారు 5గురు పిల్లలను తన పిల్లలు గానే అనుకున్నారు. ఆ బాధ్యత మొత్తం తన భుజాల పై వేసుకున్నారు. ఇక తన ఆలోచనల లోకి పెళ్లి అనే మాట రాకుండా పిల్లలను పెంచారు. అందరినీ బాగా చదివించారు. నలుగురు ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. వాళ్ళకి మంచి చెడ్డ చూసి, అన్నీ తానై నడిపించారు. తన జీవితం లో సమయాన్ని , ప్రతీ క్షణం పిల్లలపై నే ఖర్చుపెట్టారు. మేనల్లుడు బాలు ను తను చదువుకుంటాను అనుకున్న చదువు చెప్పించారు. చిన్నప్పటి నుండి ఎంతో చలాకీగా ఉండేవాడు బాలు. చదువులోనే కాకుండా ఆటల్లోనూ ప్రతిభ చూపించే వాడు. మరోపక్క అద్భుతమైన కవితలు రాసేవాడు. సామాజిక సమస్యలపై తన కలం ఎక్కుపెట్టి మంచి మంచి రచనలు చేసేవాడు. మేనత్త అంటే విపరీతమైన ఇష్టం తో ఉండేవాడు. రాజ్యలక్ష్మి గారు ఆడపిల్లల పెళ్లిళ్లు ఐపోయాకా కొంచం ఊపిరి తీసుకున్నారు. చదువు పూర్తి అయిన కొన్నిరోజులకి బాలు కి మంచి ఉద్యోగం వచ్చింది. కానీ ఉన్న ఊరికి దూరంగా ఒరిసా లోని భువనేశ్వర్ లో. అక్కడే చిన్న రూమ్ తీసుకుని బాలు ఉండేవాడు. కొన్నిరోజుల తర్వాత మేనత్త ను తీసుకు వెళ్లి కొద్ది రోజులు ఉంచుకున్నాడు. త్వరలొనే మన ఇంటికి వచ్చేస్తా మనం ఇద్దరం అక్కడే ఉండవచ్చు అని చెప్పాడు. ఇక మేనల్లుడు చేతికి అందివచ్చాడు ఇక సేద తీరచ్చు అని సంతోష పడేవారు రాజ్యలక్ష్మి గారు. జీవితం అంతా తన కోసం ఏమాత్రం ఆలోచించుకోని రాజ్యలక్ష్మి గారు , ఇక మేనల్లుడు కు కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అనుకున్నారు. ఒరిసాలో ఉన్న బాలు అక్కడే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. తననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. తనతో తన భవిష్యత్ జీవితాన్ని ఊహించుకున్నాడు. అనుకున్నవి అన్నీ ఐతే జీవితం ఎందుకు అవుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో బాలు తో పెళ్లికి ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేసేసారు. దానితో బాలు గుండె పగిలింది. తనని మర్చిపోలేక వేదన పడ్డాడు. ఉద్యోగం మానేశాడు. తన ఆలోచనలు రాకుండా ఉండడానికి మందు అలవాటు చేసుకున్నాడు. మేనత్త దగ్గరకి వచ్చేసాడు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు. గంటలు గంటలు గది లొనే తనలో తానే మాట్లాడుకునేవాడు. ఆ వేదన ను మర్చి పోవడానికి అలవాటు చేసుకున్న మందు వ్యసనం గా మారింది. ఒక్క రోజు మందు లేకపోయినా ఉండలేని పరిస్ధితి వచ్చేసింది. తన భుజాలపై రాజ్యలక్ష్మి గారి బాధ్యత తీసుకుంటాడు అనుకున్న బాలు , ఇప్పుడు మత్తు లో మరో భుజం ఆసరా లేకపోతే నడవలేకపోతున్నాడు. ఇలా ఉన్న మేనల్లుడు ను కంటికి రెప్పలా కాపడుకుంటున్నారు రాజ్యలక్ష్మి గారు. ఈ కధ కు అంతులేదు....రాజ్యలక్ష్మి గారి ప్రేమ లాగే.