
అవంతి రాజ్య రాజథానిలో శివయ్య అనే వ్యక్తి తన భార్యతో కాశీ యాత్రకు వెళుతూ, రంగయ్య అనే వ్యాపారి వద్ద తన భార్య నగలు, ధనం దాచిపెట్టి వెళ్ళాడు. సంవత్సర కాలం అనంతరం తిరిగి వచ్చి తనభార్య నగలు ,ధనం తిరిగి ఇవ్వమనగా, 'నువ్వు నావద్ద ధనం దాయడమేమిటి ఎవరైనా వింటే నవ్వి పోతారు పో ' అన్నాడు రంగయ్య. తను మోసపోయానని గ్రహించిన శివయ్య రాజుగారి సభకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించాడు. శివయ్య తనకు బాగా తెలిసిన నిజాయితీ పరుడు కావడంతో,రంగయ్యను రాజు గారి సభకు పిలిపించాడు న్యాయాధికారి.
" శివయ్య కాశీ వెళుతూ తన భార్య నగలు, తను దాచుకున్న ధనం నీవద్ద దాచి వెళ్ళాడట నిజమేనా రంగయ్యా " అన్నాడు న్యాయాధికారి .
" శివయ్య నావద్ద ఎటువంటి ధనం దాయలేదు అసలు ఇతను ఎన్నడు మాయింటికే రాలేదు " అన్నాడు రంగయ్య .
" శివయ్య నువ్వు రంగయ్య వాళ్ళఇంటికి వెళ్ళినట్లు, అతని వద్ద నగలు ధనము దాచినట్లు ఏదైనా సాక్ష్యం ఉందా " అన్నాడు న్యాయాధికారి.
" అయ్య మనుషులైతే లేరండి, ఆరోజు దీపావళి పండుగ కనుక రంగయ్య గారి ఇంట్లో పప్పు పూర్ణాలు నాకు తినడానికి పెట్టారండి, పప్పు పూర్ణాలే సాక్ష్యం " అన్నాడు శివయ్య.
రాజ సభలోని వారంతా ఘోల్లున నవ్వారు. " సరే శివయ్య నీకు పప్పు పూర్ణాలు ఎవరు తెచ్చి పెట్టారు " అన్నాడు న్యాయాధికారి. " రంగయ్యగారి
పదేళ్ళ కుమారుడు " అన్నాడు శివయ్య. పదేళ్ళ వయుసున్న రంగయ్య రాజసభకు పిలిపించి " అబ్బాయి ఈ శివయ్య ఎప్పుడైనా మీఇంటికి వచ్చాడా " అన్నాడు న్యాయమూర్తి. " ఓ ఈయన మాయింటికి వచ్చినప్పుడు నేను పెట్టిన పప్పు పూర్ణాలు తిని, నాకాలులో ఉన్న ముల్లును నొప్పి తెలియకుండా తీసాడు నాకు బాగా గుర్తు " అన్నాడు ఆబాలుడు." శివయ్య నువ్వు తిన్న పప్పు పూర్ణాలే నేడు నీకు సాక్ష్యం అయ్యాయి. రంగయ్య గారు పెద్ద మనిషి అంటే మనసు కూడా పెద్దదిగా ఉండాలి. శివయ్య సొత్తు అతనికి తిరిగి ఇస్తూ ,వంద వరహాలు అపరాధంగా శివయ్య కు చెల్లించాలి " అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. సభలో కరతాళ ధ్వనులు మారు మోగాయి.