అడవి వరం దగ్గరగా ఉన్న చిట్టడవిలో మృగరాజు మంచి తనం వల్ల శాకాహారులు , మాంసాహారులు , చిన్న జంతువులు పక్షులు అనురాగ ఆప్యాయతలు సుఖ శాంతులతో కలిసి మెలిసి ఉంటున్నాయి. ఈ మద్య అడవిలోని అన్ని జంతువులు, పక్షులు, కీటకాలు ,దంత వ్యాధులతో బాధ పడుతున్నందున ఎర్రకోతి 'తిమ్మరాజు ', మృగరాజు అబ్యర్ధన మేరకు అడవి వరంలో జంతువుల వైద్యుడి దగ్గర పళ్ల వ్యాధుల గురించి తర్ఫీదు పొంది చిట్టడవికి తిరిగి వచ్చి" డెంటల్ క్లినిక్" ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. మాంసాహారులైన నక్కలు ,తోడేళ్లు,చిరుతలు, ఎలుగుబంట్లు , అడవి పిల్లులు ,నాగ సర్పాలు, కొండ చిలువలు, ఉడుములు శాకాహారులు లేళ్లు, కుందేళ్లు, జిరాఫీ ,అడవి గుర్రాలు, ముళ్ల పందులు అలాగే కొంగలు కాకులు గెద్దలు నెమళ్లు ,పావురాలు రామచిలుకలు ఇలా అడవిలోని అన్ని వన్య ప్రాణులు ప్రారంభోత్సవ వేడుకకు హాజరయాయి. డెంటల్ సర్జన్ తిమ్మరాజు అందర్నీ పలకరించి చక్కటి తేనె, చెరకురసం , చిలగడ దుంపలు, అరటిపళ్లు, మామిడి తాండ్ర, పనసపళ్ల హల్వా , తాటిముంజలు, వెదురు బియ్యం బెల్లంతో తియ్యటి పులావ్ ,సీతాఫలం సపోటా నేరడు రేగు పళ్ల రసాల షర్బత్ , పాల జున్ను , తాటి తేగలు, కేరట్ ముల్లంగి పైనాపిల్ సలాడ్లు , విప్ప పువ్వు మద్యం ఇలా అందరికీ శాకాహార విందు ఏర్పాటు చేసి , తన ఉపన్యాసంలో అందరికీ అభినందనలు తెలుపుతు "నోట్లో దంత వ్యాధుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు వారి దైనందిన విధులలో ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని దృష్టిలో ఉంచుకుని తను ఈ దంత వ్యాధుల వైద్యశాల ఏర్పాటు చేసినట్టు, ఎవరికి నోట్లోని పళ్ల సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదిస్తే తగిన చికిత్స చేసి నివారణ చేస్తానని , ఫీజు కూడా సరైన రీతిలోనే తీసుకుంటానని" మాట ఇచ్చాడు. ఇన్నాళ్లు అడవిలో ఎవరెన్ని విధాల దంత సమస్యలతో బాధ పడుతుప్పటికీ దైర్యంగా తిమ్మరాజు ముందుకు వచ్చి తర్ఫీదు పొంది అడవిలో సేవ చేస్తున్నందుకు విందు వేడుకకు వచ్చిన జంతువులన్నీ అభినందించాయి. మృగరాజు అభినందనలు నక్క చేత పంపించాడు. పెద్ద పులులు , ఖడ్గ మృగాలు ,ఏనుగులు , చింపంజీలు, అడవి దున్నలు వంటి పెద్ద జంతువులు స్థలాభావం చేత ప్రత్యక్షంగా హాజరు కాలేక తమ అభినందన సమాచారం పంపించాయి. వెదురు బొంగులు, తాటి ఆకులు, అడవి తీగలతో చక్కటి కుటీరం కట్టి అన్నిటికీ దంత చికిత్సకు అనుకూలంగా ఏర్పాటు చేసాడు డాక్టర్ తిమ్మరాజు. కొన్ని దంత వ్యాధులకు రకరకాల పసర్లు , చెట్ల వేర్లు , పలిదం పుడకలు , ఆయుర్వేద తైలంతో పుక్కిలింతలు , చెడు వాసన రాకుండా సుగంధ ఆకులతో నమిలించడం , బాధ పెడుతున్న దంతాలను పీకడం చేస్తు కొద్ది రోజుల్లోనే అడవిలోని అన్ని రకాల పక్షి కీటకాలకు వైద్యం చేస్తూ మంచి దంత వైద్యుడిగా పేరు సంపాదించుకున్నాడు డాక్టర్ తిమ్మరాజు. ఒకరోజు ఉదయాన్నే మృగరాజు సలహాదారు నక్క పరుగెత్తుకు వచ్చి "రాజావారు రాత్రి నుంచి దంత సమస్యతో నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నారని , వెంటనే మీరు వచ్చి తగిన వైద్యం చెయ్యాలని" కోరాడు. వెంటనే డాక్టర్ తిమ్మరాజు కావల్సిన సరంజామా వస్తువులతో బయలుదేరి గుహకి చేరుకున్నాడు. మృగరాజు నిద్ర లేక నీర్సంగా కనబడుతున్నారు. డాక్టర్ తిమ్మరాజు సింహరాజును గుహనుంచి బయటకు రప్పించి వెలుగులో నోటిలోని దంతాల్ని పరీశీలించాడు. దంతాల కింది వరసలో ఒకచోట ఏదో ముల్లు విరిగి అక్కడ దవడ వాచి కనబడింది. ఎలుగుబంటి మామ ఆప్యాయంగా వండి తెచ్చిన పులశ చేప మషాల కూర తిన్నప్పటి నుంచి రాజా వారికి దవడ బాధ ప్రారంభమైనట్టు మంత్రి నక్క వివరంగా చెప్పాడు డాక్టరుకు. వెంటనే తిమ్మరాజు కరక్కాయ దాల్చిన చెక్క పొడుంతో తమలపాకు తైలంతో వేడి చేసి కొద్ది సేపు దవడ వాపు దగ్గర ఉంచి నొప్పి తగ్గిన తర్వాత తను వెంట తెచ్చిన పటకారుతో ఆ ముల్లును పైకి లాగి పడేసాడు. మరికొద్ది సేపటికి మృగరాజు దంత నొప్పి తగ్గి మాట్లాడ గలుగుతున్నాడు. తర్వాత డాక్టర్ తిమ్మరాజు వేడివేడి ఏనుగు పాలు తాగించగానే సింహరాజు బాగా కోలుకున్నాడు. తన దంత బాధను వెంటనే తగ్గించినందుకు ఎంతో ఆనందించి అభినందించి వన జంతువుల సమక్షంలో "వైద్యరత్న" బిరుదుతో సన్మానించాడు మృగరాజు. అప్పటి నుండి " డాక్టర్ తిమ్మరాజు " పేరు అడవిలో మారుమోగింది. * * *