సిస్టర్ నివేదిత - బి వి లత

Sister Nivedita
ఉదయం నుంచి ఎంతో హడావుడిగా ఉంది ఆసుపత్రి అంతా. ఎటు చూసినా కాళ్ళు తెగి, చేతులు తెగి, కళ్ళుపోగొట్టుకొని, తలలు పగిలి, ఎటు చూసినా రక్తం, రక్తం. బాధతో చేసే ఆర్తనాదాలతో బాధాకరంగా ఉంది. అది ఒక మిలటరీ ఆసుపత్రి. అక్కడి డాక్టర్లు నర్సులు వీలైనంతమంది ప్రాణాలను రక్షించటానికి, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వారిలో సిస్టర్ నివేదిత ఒకరు. రెండు రోజులనుంచి ఆమె ఆసుపత్రిలోనే ఉంది. రక్తాలు తుడిచి కట్లు కట్టి మందులు వేసి వారికి వీలైనంత సుఖంగా ఉండే ఏర్పాటు చేస్తూ, అంతటా తనే అయి తిరుగుతోంది. వాళ్ళ కష్టాలు విచారిస్తూ వాళ్ళ అడ్రస్సులు కనుక్కొని వాటికి కార్డులు రాయించి పంపిస్తోంది.
గత నాలుగు రోజులనుంచి ఆ ప్రాతమంతా తుపాకుల మోతలతో దద్దరిల్లిపోతోంది. ఏ మూలనుంచి ఏ బాంబు వచ్చి పడుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు ఆ ఊరి జనమంతా. కావలసిన సరుకులన్నీ ఎవరికి తోచినంత వారు వారి ఇళ్ళలో చేర్చి ఉంచుకున్నారు. అదివారికి బాగా అలవాటై పోయింది. ఆ ఊరు మన దాయాది దేశానికి మనకు సరిహద్దులో ఉండటం వలన అడపాతడపా పోరు నడుస్తూ ఉంటుంది. చాలాసార్లు అమాయకులైన ఊరి జనం మీద కూడా దాడి జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో సిస్టర్ వివేదిత వారికి సేవలు చేస్తూ ఆదుకుంటుంటుంది. ఎందుకంటే ఆ ఊరికి ఇంకొక ఆసుపత్రి లేదు. మిలటరీ ఆసుపత్రిలో యుద్ద సమయంలో వారికి ప్రవేశం ఉండదు. నివేదిత మిలటరీలో రిటైరయిన నర్సు అవటంవలన ఆమె వారందరికీ సేవ చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది.
నివేదిత ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించింది. ఆమె తండ్రి ఒక స్కూల్ టీచరు. ఆమె చిన్న వయసులో, తండ్రి చెప్పే కధలను వింటూ పెరిగింది. అలా విన్న కధలలో ఆమెను ఎక్కువ ప్రభావితం చేసిన కధ ఫ్లోరెంస్ నైటింగేల్ది. ఆమె తను పెద్దయ్యాక ఫ్లోరెంస్ నైటింగేల్ అవుతానని అందరికీ చెబుతుండేది. అలాగే ఆమె శ్రధగా చదువుకోని డిగ్రీ తరువాత మిలటరీలో చేరి నర్సు ట్రయినింగ్ పూర్తి చేసుకొని, దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలలోను పని చేసింది. ఆమెకు ఒక అలవాటు ఉండేది. ఆమె పని చేసే ప్రదేశంలో యుద్ధం జరిగితే చీకటి పడే వేళ ఒక దీపం ఇద్దరు మనుషులను తీసుకుని యుద్ధ భూమంతా కలయ తిరిగేది. ఎక్కడైనా ఎవరయినా కదలలేని స్థితిలో సాయంకోసం ఎదురు చూస్తున్నారేమోనన్న ఆలోచనతో. ఆమెకు ఆ సైనికులంటే ఎంతో గౌరవం. వారంతా దేశం నలుమూలలనుంచి, వారి వారి కుటుంబాలకు దూరంగా, విపరీతమైన కాల ప్రభావాలకు లోనవుతూ, ఎంతో శ్రధగా దేశ రక్షణ కోసం, వారి వారి పనులను నిర్వహిస్తూ ఉంటారు. వారికి మంచి భోజన వసతి కూడా చాలా ప్రదేశాలలో ఉండదు. అంత కష్టపడి వారు యుద్థంలో దెబ్బతిని వికలాంగులైతే, వారి కుటుంబ సభ్యులు కొందరు వారిని త్యజిస్తూ ఉంటారు. ఎంతో మనస్ధైర్యమున్నవాళ్ళే ఆ బాధ నుంచి తట్టుకుని బ్రతుకు సాగిస్తారు. కానీ, ఆ బాధను తట్టుకోలేక చాలామంది మనస్ధిమితం కోల్పోతూ ఉంటారు. కొంతమంది కసి పెంచుకుని క్రిమినల్సుగా మారుతుంటారు. నివేదితకి ఈ విషయమై ఎంతో బాధ. వాళ్ళకు మనసిక ధైర్యం ఇవ్వటానికి ఆమె ఎంతో కృషి చేస్తూ ఉంటుంది.
నివేదితని అందరూ ఇష్ట పడతారు. ఆమె చెప్పే మాటలకు ప్రభావితమై మానసిక ధైర్యం పొందినవారు ఎంతోమంది ఆమెకు జాబులు పంపుతూ వారి కృతగజ్ఞత తెలుపుతూ ఉంటారు.
కొంతమంది పెళ్ళి ప్రపోజల్ కూడా తెచ్చారు. ఒక మిలటరీ డాక్టర్ నివేదిత వెంట వెంటే తిరిగి ఆమె అభిమానం పొంద గలిగాడు. వారిద్దరూ అన్ని కార్యకమాలకూ కలిసి తిరిగేవారు. వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారని అందరూ అనుకునేవారు. ఒకరోజు పార్టీకి అతను, ఊరినుంచి వచ్చిన తన భార్యతో కలిసి వచ్చాడు. అది చూసిన నివేదితకి తన కాళ్ళ క్రింద భూమి పాతాళానికి కృంగినట్లయింది. ఆ రోజు అక్కడనుంచి వెళ్ళిన నివేదిత నెల రోజులు శలవు తీసుకుని ఊళ్ళు తిరగటానికి వెళ్ళి పోయింది. ట్రాన్సఫర్ చేయించుకుని వేరే చోటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి పెళ్ళిగురించి ఆలోచించటం మానేసింది. ఆ ఉద్దేశంతో చూసేవారిని దూరంగా ఉంచటం అలవాటు చేసుకుంది. సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకుంది.
ఒకసారి యుద్ధభూమిలో క్షతగాత్రులకోసం వెతుకుతూ తిరుగుతోంది. ఆ రోజు మంచు విపరీతంగా కురుస్తోంది. ‘ఎవరైనా ఉన్నారా?’ అని అరుస్తూతిరుగుతున్నారు వారు, అంతా చీకటిఅక్కడక్కడా నక్కల ఊళలు తప్ప వేరే శబ్దమేమి లేదు. కర్రతో మంచుని కదిలిస్తూ వెతుకుతున్నారు. ఇంతలో ఒక మూలుగు, ‘ఇదిగో, ఇలా రండి, ఇక్కడేదో వినిపించింది’ అంటూ తన సహచరులను పిలిచి, ‘మేమిక్కడే ఉన్నాం, సహాయం చేస్తాం, మీరెక్కడ? ‘ అంటూ అరిచింది. బాధగా పెద్ద మూలుగు. ‘అదిగో, అక్కడా, ఆ మంచు తొలగించండి, నెమ్మది, నెమ్మదిగా’, జాగ్రత్తగా మంచు తొలగించగా, రెండు శవాల క్రింద ఒక చిన్న కదలిక. బయటకు తీయటం కష్టమే అయింది. అతనికి తొడల వరకు కాళ్ళు లేవు. కుడిచేయి మోచేతి పైన వరకే ఉంది. కాకపోతే, మంచు వలన రక్తం కారటం లేదు. ఆసుపత్రికి వస్తూనే డాక్టర్లకు కబురు చేసి ఆపరేషన్ ధీయటర్కి తరలించి, హీటర్లను ఆన్ చేసి, అతని ఒంటిన బట్టలను తీసేసి, ఆసుపత్రి బట్ట కట్టి,
గాయాలన్నీ కడిగి శుభ్రం చేసి ఉంచింది. అంతా సిద్ధంగా ఉన్న పేషంట్ని చూస్తూ, ‘ఇతను బ్రతకాలంటారా? కన్ను కూడా దెబ్బ తింది’ అన్న డాక్టర్‌కి, ‘ బ్రతికిచాలనే కదా, మన కళ్ళ పడేటట్లు చేశాడు, ఆ దేముడు, మన పని మనం చేద్దాం’. ఆపరేషన్ చేసిన వారం రోజులకు అతను స్పృహలోకి వచ్చాడు.
నెమ్మదినెమ్మదిగా తన స్థితిని అర్ధం చేసుకున్న కల్నల్ మానసిక బాధ తో విలవిలలాడాడు. ఎవ్వరిని దగ్గరకు రానివ్వడు, ఆహారం తీసుకోడు, ఒకొక్కసారి బాధతో పెడ బొబ్బలు పెడతాడు. మిగిలినవారెవరూ అతనికి దగ్గరగా వెళ్ళలేని పరిస్ధితిలో నివేదిత ఓపిగ్గా అతనిని లాలించి, గదిమి, కోపగించి అతని చేత తినిపించి, దారిలోకి తెచ్చేది. అతని రెజిమెంట్ వాళ్ళు వచ్చి, అతను కలనల్ అశోక్ మిత్రా, బెంగాల్ నుంచి వచ్చిన వారు అని ధృవపరచుకొని వెళ్ళారు. అతని కుటుంబానికి వెంటనే కబురంపే ఏర్పాటు చేసింది, నివేదిత, వారికి తన ఇంటి చిరునామా ఇచ్చింది, గాయాలు మానటంతో అతనిని తన నివాసానికి చేర్పించింది. రెండు నెలల తరువాత, అతనిని నిరాకరిస్తూ వాళ్ళ ఇంటినుంచ జాబు వచ్చింది. అతను మిక్కిలి కోపిష్టి అని, సమాజంలో అతను ఇమడలేడని, మిలటరీవారే అతనిని చూసుకోవాలని, ముసలితనంలో ఉన్న అతని తల్లి, అతని ఈ అవస్థ చూసి భరించ లేదని, తెలియ చేశారు. అది దాచేసి కలనల్ కి తన ఇంటిని, అతను, తన చక్రాల కుర్చీలో తిరగటానికి వీలుగా మార్పులు చేయించింది. కల్నల్కి తను మనసు పడి ఏర్పాటు చేయించుకున్న గది కేటాయించింది. ఆ గదికి ఒక వైపు అద్దాల కిటికీలకు అవతల కొండలూ, కోనలుూ కనిపిస్తూ, చలి కాలం మంచు దుప్పటి కప్పుకుని తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. సూర్య కిరణాలు పడ్డప్పుడు పసిడి కొండల్లా మెరిసి పోతాయి. మిగతా రోజులలో ఆకు పచ్చ తివాచీ పరచినట్టు ఉంటుంది. వరండా లో కూర్చుండే ఒక వైపు ప్రక్కనే ఉన్న స్కూల్ పిల్లల ఆటలూ, పాటలు కనిపిస్తూ, వినిపిస్తాయి. ఒక వైపు కొండ కోనలు, స్కూల్‌కి ఇంటికీ నడుమ తోట ఉంటుంది. తోటకు అవతల వైపు వీధి గుమ్మం ఉంటుంది. కలనల్ కుర్చీతో సహా తోటంతా తిరిగగలిగే విధంగా దారి ఏర్పాటు చేయించింది. బటన్ సాయంతో కదిలే చక్రాల కుర్చీ ప్రత్యేకమైన రీతిలో చేయించి తెప్పించింది. అతనికి గవర్నమెంటు నుంచి రావలసిన సహాయమంతా తెప్పించింది. ఒక సహాయకుడిని అతనికి తోడుగా ఉంచాలని పట్టుపట్టి ఏర్పాటు చేయించింది. నెమ్మదిగా కలనల్ పరిస్ధితులతో రాజీ పడ్డారు. ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అందరితో తన జీవితాన్ని పంచుకునే నివేదితను చూసి అబ్బుర పడిపోయేవారు కలనల్. ఏడు వసంతాల వారి స్నేహం, కలనల్ అస్వస్ధతో ఆసుపత్రిలో చేరి, వారం రోజుల అవస్థ తరువాత మరణించటంతో ముగిసిపోయింది. హఠాత్తుగా కలనల్ కి అలా జరగటంతో నివేదిత మనస్సు నిబ్బర పరచుకుని తన దైనందిక జీవితానికి మరలి రావటానికి కొంచం సమయం పట్టింది.
కలనల్ లాంటి వారికోసం ఒక విశ్రామ గృహం ఏర్పాటు చేయమని, దగ్గరలో మిలటరీ ఆసుపత్రి ఉండటం వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని, నివేదిత గవర్నమెంటుకు పెట్టిన అర్జీలు ఫలించి గవర్నమెంటు రిటైరయిన వికలాంగులైన మిలటరీ ఉద్యోగుల కొరకు ఒక గృహం నిర్మించింది. చాలా సంవత్సరాలు నివేదిత ఆ గృహ నిర్వాహకురాలిగా పని చేసింది. ఆమె రిటైర్మెంటు తరువాత కూడా తన ఉచిత సేవలందిస్తూ ఉంటుంది. సాయంత్రాలు గ్రామంలోని పిల్లలకూ, పెద్దలకు తను చదివిన మంచి మంచి కథలు చెపుతూ విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. డెబ్బయిదేళ్ళ ఈ వయసులోకూడా యుద్ధంలో గాయపడిన వారిని వెతికి వెతికి సేవలందిస్తుంది. ఈ రోజు వరకు ఆమె నలుగురు ప్రాణాలను ఆ విధంగా కాపాడ గలిగింది. సాధారణంగా దెబ్బ తగిలిన వెంటనే స్పృహ తప్పిన వారిని మరణించిన వారిగా అపోహ పడే ప్రమాదం ఉంది. అందుకే తాపత్రయ పడేది. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సిస్టర్ నివేదిత అక్కడ వారికి అండగా ఉంటుంది. వారిలో ధైర్యాన్ని నింపి బ్రతుకు మీద ఆశలు చిగురించేలా చేస్తుంది.
ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు ఫ్లోరెంన్సు నైటింగేల్ అనే అత్యున్నత బిరుదుతో సత్కరించింది.
***** *****

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు