“ఇక లేవండి”అన్నాడు డాక్టర్.
కందర్పమూర్తి లేచి ఆభావంగా డాక్టర్ వైపు చూశాడు. అతని కళ్ళలో కొంచం కూడా జీవం లేదు. గాజు కళ్ళలా ఉన్నాయి.
నిద్రలో నడుస్తున్నవాడిలా అనుసరించాడు కందర్పమూర్తి. డాక్టర్ తన కుర్చిలో కూర్చున్నాడు. కందర్పమూర్తి యాంత్రికంగా వెళ్ళి తన భార్య వక్కను కూర్చున్నాడు.
“ఏమైన తెలిసిందా డాక్టర్”అడిగింది విమల. ఆమె కందర్పమూర్తి భార్య.
“అన్ని పరీక్షలు చేశాను. నాకేం అంతుబట్టటం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎలాంటి సమస్యలు లేవు. “
“మరి ఆయన ప్రవర్తనకు కారణం ఏమిటంటారు?”
“ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. నాకు కొంత టైం ఇవ్వు. ఈ లోగా నేను కొన్ని మందులు రాసిఇస్తాను. క్రమం తప్పకుండ వాడండి. కొంచం గుణం కనిపించవచ్చు”.
“అలాగే”అంది విమల.
“ఇలా ఎన్నిరోజులనుంచి ప్రవర్తిస్తున్నారు”మందులు రాస్తూ అడిగాడు డాక్టర్.
“దాదాపు నెలరోజులనుంచి. ఆ రోజు నాకు బాగా గుర్తుఉంది. మాములుగా కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళాను. అప్పటికే ఆయన లేచి కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ రోజు కూడా లేచారు. కాని బొమ్మలా మంచం మీద కూర్చున్నారు. తీక్షణంగా శూన్యంలోకి చూస్తున్నారు.
“కాఫీ తీసుకోండి”అన్నాను.
“ఆయన ఏం మాట్లాడలేదు. కనీసం నా వైపు చూడలేదు.
“ఏమండి మిమ్మల్నే కాఫీ తీసుకోండి”అని కొంచం గట్టిగా చెప్పాను.
అప్పుడు కూడా ఆయనలో కదలికలేదు. దీక్షగా ఎదురుగా చూస్తున్నారు. అక్కడ ఏం ఉందా అని నేను తిరిగి చూశాను. గోడ తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయనకు ప్రత్యేకంగా గోడలో ఏం కనిపిస్తుందా అని ఆశ్చర్యపోయాను.
“అతికష్టం మీద నా ఆశ్చర్యం అణుచుకుంటు మళ్ళి కాఫీ తీసుకోమని చెప్పాను. అయిన ఏం లాభం లేకుండ పోయింది. నా వైపు నిర్లిప్తంగా చూశారు.
నాకు విసుగువచ్చి కాఫీ అయన పక్కన పెట్టి వెళ్ళిపోయాను. తరువాత నా పనిలో పూర్తిగా మునిగిపోయాను. గంట తరువాత పనులు అన్ని పూర్తిచేసుకుని మళ్ళి వచ్చాను. అప్పుడు కూడా కాఫీ తాగలేదు. చల్లారిపోయింది.
“ఇంకా కాఫీ తాగలేదా” విస్సుగ్గా అడిగాను.
ఆయన నా వైపు అదోలా చూశాడు. ఆ చూపులలో కొంచం కూడా జీవం లేదు. ఒక మమ్మీ చూస్తున్నట్టుగా ఉంది. నాకు చాల భయం వేసింది. ఏం చెయ్యాలో తోచలేదు. నాలుగు రోజులు గడిచాయి. ఆయిన ప్రవర్తనలో కొంచం కూడా మార్పులేదు. ఎప్పుడు బొమ్మలా కూర్చుంటాడు. ఒక ఉలుకులేదు పలుకులేదు. కాఫీ తీసుకువస్తే తాగుతారు. భోజనం తీసుకువస్తే తింటాడు. అంతే నోరు తెరిచి ఏది అడగరు. అన్ని నేనే చెప్పాలి. స్నానం చెయ్యమని చెప్పాలి. అన్నం తినమని చెప్పలి.బట్టలు సెలక్ట్ చేసి ఇవ్వాలి. ఒక విషయానికి స్పందన ఉండదు. నాకు మతిపోయినంత పని అయింది.”
వారం రోజులుఅయ్యేసరికి నాకు పిచ్చెత్తినట్టుగా అయింది. ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాను. ఆయన పరీక్ష చేసి “ఇది ఏదో మానసీక వ్యాధిలా ఉంది. కొన్ని మందులు రాసి ఇస్తాను. అవి వాడండి”అని కొన్ని మందులు రాసీ ఇచ్చాడు. వాటిని క్రమం తప్పకుండ వాడాను. రాత్రి మేలుకోని ఆయనను లేపి మరి ఇచ్చాను. పదిరోజులు గడిచిన ఏం లాభం కనిపించలేదు. మనిషిలో కొంచం కూడా మార్పు రాలేదు. మళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన కూడా ఏవో మందులు రాసిఇచ్చాడు. కొంచం కూడా గుణం కనిపించలేదు.”
“ఇక చేసేది ఏం లేక నా స్నేహితురాలు ఒకమే మీ గురించి చెప్పింది. డాక్టర్ ఎలాగైన మా వారిని మాములు మనిషిని చెయ్యండి. మీకుఎంత ఫీజు అయిన ఇచ్చుకుంటాను”అని పూర్తిచేసింది విమల.
డాక్టర్ ఆమె వైపు ఇబ్బందిగా చూసి “కొన్ని టనిక్స్ రాస్తాను. అవి వాడి చూడండి. నయం కనిపించకపోతే ట్రీట్ మెంట్ మారుద్దాం”అన్నాడు.
డాక్టర్ ఇచ్చిన మందు చీటిని భర్తను తీసుకుని ఇంటికి చేరుకుంది. కందర్పమూర్తి హాలులో ఉన్న టీవిని ఆన్ చేశాడు. తరువాత రిమోట్ తో ఏవో చానల్స్ మార్చిమార్చి పెట్టాడు. చివరకు ఒక చానల్ దగ్గరకు వచ్చి ఆగాడు. అప్పుడు టైం తొమ్మిది గంటలు కావస్తోంది. అంతకుమందు ఆ టైంలో ఆ చానల్ లో ఒక సీరియల్ వచ్చేది. అది ప్రతిరోజు చూడటం అతనికి అలవాటు. విమలకు సీరియల్స్ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఆమెకు డిస్కవరి చానల్ హిస్టరీ చానల్ చూడటం అలవాటు. అందుకే భర్త టీవి ముందు ఉన్నంతవరకు అటు వైపు రాదు. అతను వెళ్ళిన తరువాత ఒక గంటసేపు చూస్తుంది. తరువాత పడుకుంటుంది.
ఇది చాల సంవత్సరాలనుంచి రొటిన్ గా జరుగుతోంది.
భోజనం చేసిన తరువాత ఇద్దరు బెడ్ రూంలోకి వెళ్ళారు. కందర్పమూర్తి వెంటనే పడుకున్నాడు. విమలకు మాత్రం నిద్రరావటం లేదు. భర్త గురించి ఆలోచిస్తోంది. ఆలోచించి ఆలోచించి బాగా అలసిపోయి నిద్రపోయింది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. ఎందుకో కళ్ళు తెరిచి చూసింది. పక్కన కందర్పమూర్తి లేడు. కంగారుగా హాలులోకి వెళ్ళి చూసింది. సోఫాల్ కూర్చుని ఉన్నాడు కందర్పమూర్తి. టీవి వైపు ఆదే పనిగా చూస్తున్నాడు. టీవి ఆఫ్ లో ఉంది. నిశ్చలంగా ఉన్న స్క్రీన్ మీద అతను ఏం చూస్తున్నాడో ఆమెకు అర్ధంకాలేదు.
యధాప్రకారం కందర్పమూర్తి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. విమల భోజనం చేసి హాలులో కూర్చుంది. అప్రయత్నంగా టీవి వైపు చూసింది. జరిగిన దంతా మొదటినుంచి అంతా బేరీజు వేసుకుంది. భర్త ధైనందిత జీవితం పూర్తిగాగుర్తుచేసుకుంది. అప్పుడే ఆమె బుర్రలో ఫ్లాష్ లైటు వెలిగింది. దాంతో ఉత్సాహంగా లేచి గబగబ తయారయింది. ఇంటికి తాళం వేసి ఆటోలో ఒక చానల్ ఆఫీసు చేరుకుంది.నేరుగా ప్రోగ్రాం డైరక్టర్ ను వెళ్ళి కలుసుకుంది.
“నా పేరు విమల. మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను”అంది విమల.
“అడగండి”అన్నాడు ప్రోగ్రాం డైరక్టర్.
“నెలరోజులకు ముందు మీ చానల్ లో మౌనం అనే సీరియల్ ప్రసారం ప్రసారం అయ్యేది. ఇప్పుడు రావటం లేదు. కారణం ఏమిటి?
“అదా మాకు రచయితకు డబ్బు విషయంలో కొంచం తేడావచ్చింది. అందుకే తరువాత ఎపిసోడ్స్ అతను రాయలేదు. దాంతో సీరియల్ ఆపవలసివచ్చింది.”
“ఆ రచయిత అడ్రస్సు ఇస్తారా””
“ఇస్తాను “అని తన అసిస్టెంట్ ను పిలిచి చెప్పాడు. అసిస్టెంట్ ఇచ్చిన అడ్రస్సు తీసుకుని ఆటోలో రచయిత ఇంటికి బయలుదేరింది. వరాండాలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి యాబై సంవత్సరాలు ఉంటాయి. ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఏదో రాసుకుంటున్నాడు.
విమల తను వచ్చిన పని చెప్పింది
“ఆ సీరియల్ రాసింది నేనే అండి”అన్నాడు అతను.
“ఉన్నట్టుండి నెలరోజులకు ముందు ఆ సీరియల్ ఆపేశారు కారణం ఏమిటి”? అడిగింది విమల.
“అప్పటికే మూడు వందల ఎపిసోడ్లు అయ్యాయి. ఇంకా వంద రాయమన్నారు. నా వల్ల కాదన్నాను. ఎంత డబ్బయిన ఇస్తామని చెప్పారు. నా వల్ల కాదని చెప్పాను. ఏ రచయితకైన ఒక రచన మీద కొన్నిరోజులు మాత్రమే ప్రేమ ఉంటుంది. తరువాత దాని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఇంకేదన కొత్త కధ కాని నవల కాని రాయాలనిపిస్తుంది. నేను దానికి అతీతుడను కాను. అప్పుటికే నాకు ఆ సీరియల్ మీద బాగా విసుగు వచ్చేసింది. శ్రద్ధ బాగా తగ్గిపోయింది. బుర్ర కూడ స్తబ్దుగా అయింది. ఆ సీరియల్ ను ఇంకా పొడిగించే శక్తి నాలో తగ్గిపోయింది. అందుకే ముగింపు ఎపిసోడ్లు రెండు రాశాను. మేనేజ్ మెంట్ దానికి ఒప్పుకోలేదు. అందుకే వచ్చేశాను. అంతకుమించి వేరే కారణం ఏం లేదు”అన్నాడు రచయిత.
“ఆ ముగింపు ఎపిసోడ్ కాపీ మీ దగ్గర ఉందా”అడిగింది విమల.
“ఉంది. మీకు కావాలా”అడిగాడు.
“అవును”అంది విమల.
అతను ఎందుకు ఏమిటి అని కారణం అడగలేదు. లోపలికి వెళ్ళి నాలుగు కాగితాలు తీసుకువచ్చి ఇచ్చాడు. పేజి పైన మౌనం అని టేటిల్ రాసుంది.
“ఈ కాగితాల కోసం ఇంత దూరం వచ్చారా”ఆశ్చర్యంగా అడిగాడు అతను.
విమల దాచకుండ జరిగిన దంతా చెప్పింది.
“మీ సీరియల్ అర్ధాంతరంగా ముగిసిపోవటంతో నా భర్త తట్టుకోలేకపోయాడు.దాదాపు పిచ్చివాడైపోయాడు”అంది.
“ఈ పరిస్ధితి చాల మందికి వచ్చింది. ప్రసారం చేసిన ఎపిసోడ్ లో హీరో హిరోయిన్ పెళ్ళిచేసుకోవాలని అనుకుంటారు. అనుకోకుండ హీరియిన్ ముందు ప్రేమించిన వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి హీరోయిన్ భయపడుతుంది. అంతవరకు వచ్చింది. ఆ తరువాత ప్రసారం ఆపేశారు. తరువాత ముగింపు ఎపిసోడ్స్ మీ దగ్గర ఉన్నాయి. మీ భర్తకు చదివి వినిపించండి. ఆయన తప్పకుండ మాములు మనిషి అవుతాడు”అన్నాడు రచయిత నవ్వతూ.
అతనికి ద్యాంక్స్ చెప్పి విమల కాగితాలుతీసుకుని ఇంటికి చేరుకుంది. అప్పటికి భర్త రాలేదు. పది నిమిషాల తరువాత వచ్చాడు. యధాప్రకారం కాఫీ టిఫిన్ తీసుకున్నాడు. వెళ్ళి టీవి ముందు కూర్చున్నాడు. విమల పనులు ముగించుకుని వచ్చి భర్త దగ్గరకు కూర్చుంది. ఆమె చేతిలో కాగితాలు ఉన్నాయి.
మెల్లగా చదవటం మొదలుపెట్టింది. పది పంక్తులు చదివేసరికి కందర్పమూర్తిలో చలనం వచ్చింది. మొహంలో కళ వచ్చింది. ఆమె చదువుతున్న కొద్ది అతనిలో మార్పు రాసాగింది. పూర్తిగా చదివేసరికి అతను మాములు మనిషి అయ్యాడు. గుండెలనుంచి ఏదో భారం దిగిపోయినట్టు ఫీలయ్యాడు. ఒక్కసారిగాచేతులు పైకి ఎత్తి హుర్రే అని గట్టిగా అరిచాడు.
ఆ తరువాత కందర్పమూర్తి పూర్తిగా మాములు మనిషై పోయాడు. ఆ తరువాత అతన్ని టీవి సీరియల్స్ న చూడనివ్వలేదు. డిస్కవరి చానల్స్ హిస్టర్ చానల్స్ అలవాటు చేసింది. ఇప్పుడు వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అతను. విమల రచయితకు కాల్ చేసి ద్యాంక్స్ చెప్పింది. అతను విజయగర్వంతో నవ్వి కాల్ కట్ చేశాడు.
సమాప్తం.