భాగ్యలక్ష్మి ధుమధుమ లాడుతూ మా ఇంటికి వచ్చి " అలగా మూకకి అద్దెకి ఇచ్చారు, ఆ భాష చూడండి" అంది. కారిడార్ అంత సామాను కలగా పులగంగా యాస తో మాట్లాడుతున్న ఆడా మగ. నాకు నిజమే అనిపించింది. మా అపార్ట్మెంటులో అందరూ చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు. మధ్య తరగతికి, ఎగువ మధ్య తరగతికి చెందినవారున్నూ. సో ఆవిడ అలా అనడంలో నాకైతే ఏమి తప్పు అనిపించలేదు. విషయంలోకి వెళితే, మేము రెండవ ఫ్లోర్ లో ఉంటాము. ఫ్లోరుకి నాలూగు ఇళ్ళు. నాలుగు ఇళ్ళ ల్లో, మెట్ల వేపు ఫ్లాట్ లో కొత్తగా అద్దెకి ఒక జంట తమ మూడేళ్ళ పాప తో దిగ బోతున్నారు. మంచి రోజని ప్రొద్దుటే వచ్చి ఇల్లు శుభ్రం చేసుకుని, గడపలకి పసుపు రాసి, మామిడి కొమ్మలు తగిలించి పాలు పొంగించి పూజ చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఇంట్లో దిగేవారితో పాటు పది మందికి పైగా ఆడా మగ లు, గ్యాస్ సిలిండరు, స్టవ్, ఇంకా కొంత సామానుతో కారిడార్ అంతా పెట్టారు. మావారు ఆఫీస్ కి బయలుదేరుతూ, పిల్లలు కాలేజికి వెళ్తూ తెగ విసుక్కున్నారు పరిచిన సామాన్లు చూసి. పనిమనిషి ద్వారా తెలిసిందేంటంటే, అద్దెకి వచ్చింది మా వీధి చివర టిఫిన్ కొట్టు అప్పారావు కి తమ్ముడు, సాఫ్టువేర్ ఇంజనీర్ అని. యథాలాపంగా వింటున్న నేను "ఔనా" అని నా ఆశ్చర్యాన్ని ప్రకటించాను. అయినా అతని బంధువుల భాష కంపరమనిపించింది. వింత ఏంటంటే మా పనిమనిషి కూడా వారి భాషని ఏవగించుకోవటం. రెండు రోజుల తర్వాత వాళ్ళు పూర్తి సామానుతో ఫ్లాట్ లో అడుగు పెట్టారు. సాగి పోయిన చెవి తమ్మెలు, ముక్కుకి బేసరి, కాళ్ళకి చేతులకి మందపాటి వెండి కడియాలు, సగం పండిన జుట్టు, నేత చీర కుడి పమిట తో అతడి తల్లి కాబోలు పాపని ఎత్తుకుని కారిడార్లో తిరుగుతూ తినిపిస్తోంది. చిన్న పిల్ల సగం తిని సగం ఉమ్మేస్తోంది. శుభ్రం చెయ్యలేదు. సాయంత్రం మా కనకం (పనిమనిషి) నా మాట కొట్టెయ్య లేక క్లీన్ చేసింది. రెండు రోజులు చూసి నేను పిల్లకి తినిపించాక శుభ్రం చెయ్యమని కొంచెం గట్టిగా చెప్పాను. కాని "అప్పలమ్మ" (మా పిల్లలు పెట్టిన పేరు ఆవిడకి) ఏమీ అనుకోకుండా నవ్వుతూ క్లీన్ చేసేసింది. మిగిలిన రెండు ఇళ్ళ వాళ్ళు కూడా ఆవిడని ఏదో ఒకటి తప్పు పట్టడం చూసాను. మా మూడు ఇళ్ళ వాళ్ళం కలిసినప్పుడు ఆదే టాపిక్ మా మధ్య.. పగలు అవసరమైతే తప్ప తలుపు మూసే ఉంచుతున్నా. కారణం ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది, టి.వి గట్టిగా పెడుతుంది. ఆవిడ, ఆవిడ చుట్టాలని చూస్తే చాలు 'అలగా జనం' అనుకుంటూ తలుపు వేసేసే దాన్ని. మా బాబు, పా, శ్రీవారు అందరు ఇంక ఆవిడ భాషని అనుకరించడం, నవ్వుకోవడం. నేను కూడా అప్పుడప్పుడూ వాళ్ళతో జత కలిపేదాన్ని. ఆ రోజు సాయంత్రం నుండి ఒకటే వాన. కరెంటు లేదు. టైమ్ 7.30. చీకటిగా ఉంది. పిల్లలు, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. మనసంతా పిచ్చి ఆలోచనలు. టెన్షన్ తో ఏమి తోచటం లేదు. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగాను. ఇంతలో ఆయన, పిల్లలు వచ్చారు. హమ్మయ్య అనుకుని ఆయనకి కాఫీ వేడి చేయడానికి కిచెన్ లోకి వెళ్ళానో లేదో మా చిన్న అమ్మాయి కేక కి హాల్లోకి పరుగు తీసా. భయంతో నా నోట్లోంచి పెద్ద కేక రావటం నాకే తెలియ లేదు.. ఆయన ఒక చేత్తో గుండె రాసుకొంటూ ఒరిగి పోయారు. నాకు కర్తవ్యం బోధ పడలేదు. నా కేక విని ఎదుటి ఫ్లాట్ లోని అతను, ముసలావిడ పరుగెత్తుకు వచ్చారు. నా మెదడు పని చెయ్యటం మానేసింది. ఎప్పుడు ఎలా చేసాడో అతను, ఆంబులెన్స్ వచ్చిన శబ్దం వినపడింది. మా అబ్బాయి అతను కలిసి ఆయన్ని ఆంబులెన్స్ లోకి చేర్చారు. నేను ఎక్కాను. కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించటం, ఆంజియోప్లాస్టీ చేసి స్టెంటు వేయటం అన్నీ చకచకా జరిగి పోయాయి. భగవంతుని దయ వల్ల ఆయన కి గండం గడిచింది. వారం ఎలా గడిచిందో తెలియలేదు. ఇల్లు, పిల్లలు అన్నీ పక్కన పెట్టి అలా ఆయన పక్కనే హాస్పిటల్లో ఉండి పోయాను. డాక్టరు గారు పక్క రోజు ఇంటికి తీసుకెళ్ళచ్చన్నారు. ఇంతలో అతను, ముసలావిడ వచ్చారు. వారితో తెచ్చిన పెద్ద సంచీ లోంచి కారేజి తీసి ఆయనకి నాకు భోజనం పెట్టింది ఆవిడ. ఎంతో జాగ్రత్తగా నూనె, ఉప్పు తగ్గించి, కారం లేకండా రుచిగా ఉంది భోజనం. పక్క రోజు అతను టాక్సీలో మమల్ని ఇంటికి తీసుకు వచ్చాడు. హాస్పిటల్ బిల్లు గురించి అడుగుతే 'ఇంటికి వెళ్ళాక' అని అన్నాడు. అపార్ట్మెంటు గేటు దగ్గర దిగంగానే, ముసలావిడ కొబ్బరికాయ, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి కాళ్ళు కడిగింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి మరచి పోయిన నేను ఆమె వేపు కృతజ్ఞతతో చూసాను. అందరం ఇంట్లోకి వచ్చాము. మా పిల్లలు ఆవిడని చూసి "మామ్మా నీ రాగి సంకటి, ఉల్లిపాయ పులుసు సూపర్, సాయంత్రం పుణుకులు చెయ్యాలిసిందే" అంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆవిడ " అలగే లేండ్రా, సందె కాడ సేస్తన్లేయ్య, అరకండి, నాన్న కి పడుకోనీండి. సొరూపా! (మా అమ్మాయి స్వరూప) రాయే తల్లీ,నూని రాసి గట్టిగా జడ కడతాను" అంటూ పిలిచింది. మా అబ్బాయి ఆ చిన్న పిల్లతో ఆడటం, నాకు అంతా ఏదో మాయ లాగా ఉంది. ఆ తర్వాత మా పిల్లలు చెప్పటం మొదలెట్టారు. ఆ రోజు మావారి తో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు, ఆవిడ ఏడుస్తున్న మా అమ్మాయికి తోడుగా ఉందట. రోజు మాకు, పిల్లలకి కారేజీలు, మా అమ్మాయికి జడ వేయడం అంతా ఆవిడ, కొడుకు, కోడలేట. నా ఇల్లు కూడా అంతా ఆవిడే సర్ది నీట్ గా ఉంచిందిట. సాయంత్రం అతన్ని పిలిచి బిల్లు విషయం కనుక్కో మని అన్నారు ఈయన. అతను ఇచ్చిన బిల్లు చూస్తే మూడు లక్షల చిల్లర అయింది. చెక్ ఇచ్చి "థ్యాంక్స్" చెప్పాను మనస్ఫూర్తిగా. ఇంతలో ఆవిడ వేరుశనగ చిక్కీలు పిల్లలకి ఇవ్వమని ఇచ్చింది. అప్పుడు చూసాను ఆమె చేతికి, కాళ్ళకి ఆ బరువైన వెండి కడియాలు గాని, చెవి కమ్మలు, ముక్కున బేసరి గాని లేవు. నా కళ్ళలోని ప్రశ్నని అర్థం చేసుకున్నది కాబోలు.." ఆస్పత్రి కి కట్టడానికి మా పోరడి కాడి డబ్బు సాల్లేదె యమ్మ, అందుకని నా సొమ్ములు తాకట్టెట్టి ఇచ్చినానె తల్లె" అంది. నాకు, మా వారికి నోట మాట రాలేదు. సిగ్గు తో మా తలలు వంగిపోయాయి. నేను కళ్ళ నీరు కారుతుండ గా ఆమెకు చేతులు జోడించాను. గొంతులో ఏదో అడ్డుకున్నట్లు మాట రాలేదు. "ఏడకే తల్లి, మనిషి పానం కన్నా ఎక్కవ కాదమ్మ" అంది నా వీపు మీద చేత్తో రాస్తూ. ఇప్పుడు మేమంతా ఒక కుటుంబంలా ఉంటాము. ఆవిడని పెద్దీ అని (పెద్దమ్మ) పిలవటం మొదలెట్టాము.