యురేకా - శింగరాజు శ్రీనివాసరావు

Yureka

అతనిలో కసి క్షణక్షణానికి పెరిగిపోసాగింది. బైకుమీద పెట్టుకుని తనతోపాటు తెచ్చిన గోనెసంచిని విప్పాడు. చేతిలోనున్న కత్తిని పైకెత్తాడు. ఎందుకో మనసు రాలేదు. మరలా గోనెసంచి తాడుతో గట్టిగా కట్టాడు. సంచిని కిందకు విసిరి కాలితో తనివితీరా తన్నాడు. అయినా ఆవేశం చల్లారలేదు. సంచిని చేతిలోకి తీసుకుని చాకలి బట్టను బాదినట్టు అక్కడేవున్న బండకేసి బాదాడు. సంచినుంచి రక్తం చిమ్మింది. కళ్ళు తిరిగినట్లుగా అనిపించేసరికి, ఆలోచనలతో తల దిమ్మెక్కడం వలన అలా అనిపించిందేమో అనుకున్నాడు. వచ్చిన పని ముగించాలనుకుని, తను తెచ్చిన గోనెసంచిని పక్కనేవున్న పాడుబడ్డ దిగుడుబావిలోకి వదిలేశాడు. వాటర్ బాటిల్ లోని నీటితో చేతిమీద రక్తపు మరకలని కడిగేసుకున్నాడు. చుట్టూ చూశాడు. అంతా నిర్మానుష్యం. తృప్తిగా నిట్టూర్చాడు. ఎక్కడో కనుకొలుకులలో చిన్న నీటితెర మెరిసింది. రెప్పను కొట్టి దాన్ని లోపలే అణచివేశాడు. ఇంతలో ఫోను మ్రోగింది. ఇన్నాళ్ళూ తన రక్తాన్ని మరిగించిన వ్యక్తి, తన స్నేహితుడి నుండి వచ్చిన కాల్ అది. 'ఇక్కడి కథ ముగిసింది. ఇక నీ కథే మిగిలివుందని' చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పాలనిపించలేదు. 'చెప్పడమెందుకు, ఏకంగా చేసిచూపితే పోలేదా' అనుకుని ఫోనుకు సమాధానం ఇవ్వలేదు. ఫోనురింగు ఆగిపోయింది. బైకు స్టార్ట్ చేసి వెనుదిరిగాడు. గోనెసంచి క్రమంగా నీటిపైకి తేలడానికి సిద్ధమయింది. ********* " హలో.. పోలీస్ స్టేషనా అండీ. నేను ముకుందను. సంతపేట నుంచి మాట్లాడుతున్నాను సర్" "చెప్పండి మేడమ్" "ఈరోజు ఉదయం నుంచి మా పాప కనిపించడం లేదు సార్. మావారు నైట్ డ్యూటి నుంచి ఇంకా రాలేదు సర్. ఆయనకు కూడ ఫోనుచేసి చెప్పాను. నాకు చాలా భయంగా వుంది సర్. మా పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. ఒక్కసారి రాగలరా సర్" ఎంతో ప్రాధేయపూర్వకంగా అడిగిన ఆమె మాటను త్రోసిపుచ్చలేకపోయాడు సి.ఐ. మధు. " కరెక్ట్ అడ్రస్ చెప్పండి" అని ఆమె చెప్పిన అడ్రసు నోట్ చేసుకుని బయలుదేరాడు. ***** "మీరు చివరిసారిగా పాపను ఎప్పుడు చూశారు?" అడిగాడు మధు. "రాత్రి మావారు డ్యూటీకి వెళ్ళగానే, పాప, నేను ఇద్దరం బెడ్రూమ్ లో పడుకున్నాం సర్. తెల్లారిగట్ల లేచి పాపను లేపి బయట వరండాలో సోఫాలో కూర్చోబెట్టి, నేను వంటగదిలో పనిచేసుకుంటున్నాను. ఒక గంట తరువాత వచ్చి చూస్తే పాప కనిపించలేదు. మావారికి ఫోను చేశాను. కానీ ఆయన మొదట లిఫ్ట్ చెయ్యలేదు. వెంటనే ఆయన స్నేహితునికి ఫోనుచేసి విషయం చెప్పాను. ఇంతలోకి మావారు రానే వచ్చారు. మీరు వస్తారో, రారోనని మేమే బయలుదేరి స్టేషనుకు వద్దామనుకుంటున్నాము" ఏడుస్తూ చెప్పింది ముకుంద. "రాత్రి నేను వెళ్ళేటప్పుడు టాటా చెప్పి, ముద్దుకూడ పెట్టింది సర్. ఇంతలోకి ఏమయిందో సర్. ఈ చుట్టుపక్కల అంతా వెదికి వచ్చిందట సార్. కానీ పాప కనిపించలేదు" కంగారు కంగారుగా చెప్పాడు ముకుంద భర్త రామారావు. "పాప వయసెంత" "మూడు సంవత్సరాలు" "అయితే నడక బాగా వచ్చి ఉంటుంది. బహుశా చుట్టుపక్కల ఎవరింటికైనా వెళ్ళి ఉంటుందేమో విచారించక పోయారా" "ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ విచారించి వస్తున్నాను సర్. ఎవరూ పాప రాలేదని చెప్పారు"అంటూ వచ్చాడు ఓ పాతికేళ్ళ కుర్రాడు. "మీరు.." అంటూ ప్రశ్నార్ధకంగా అతని వైపు చూశాడు మధు. "ఇతనే మావారి స్నేహితుడు పవన్. మావారితో పాటే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఇతనికే నేను ఫోను చేసింది" చెప్పింది ముకుంద. "అవును సర్" అన్నాడు రామారావు. "పాప ఫొటో వుంటే ఇవ్వండి. ఒకసారి మీ ఇంటిని చూడొచ్చా" అడిగాడు మధు. "అలాగే సర్" అని రామారావు లోపలికి నడిచాడు. మధు అనుసరించాడు. చాలా సాదాసీదా కుటుంబం అనిపించింది. అన్నీ గదులు తిరిగి వచ్చి బెడ్రూమ్ దగ్గర ఆగాడు. "రామారావు గారు. దాహంగా వుంది, కొంచెం వాటర్ ఇస్తారా. ఈ లోపుగా నేను గది చూస్తుంటాను" అని రామారావుకు చెప్పి బెడ్రూమ్ లోకి అడుగుపెట్టాడు మధు. కావాలనే రామారావును మంచినీళ్ళకని పంపాడు. గదిలోని బెడ్ చుట్టూ పరిశీలనగా చూశాడు, ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని. ఎక్కడా ఏ ఆచూకి దొరకలేదు. బయటకు వస్తూ డస్ట్ బిన్ వైపు యాధాలాపంగా చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. తన జేబులోని కాగితాన్ని తీసి తన చేయి తగలకుండా దాన్ని పేపరులోకి లాగి మడతబెట్టి జేబులో పెట్టుకున్నాడు. "ఇదిగోండి సర్" అంటూ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు రామారావు. "పాప ఫోటో ఇస్తారా" మంచినీళ్ళు తాగి అడిగాడు మధు. "ఇదిగోండి సర్" అని పాప ఫొటో ఇచ్చి "పాపను ఎలాగైనా వెదికి తీసుకురండి సర్. అదిలేకుండా నేను బ్రతకలేను" భోరుమని ఏడుస్తూ మధు కాళ్ళమీదపడి ఏడ్చింది ముకుంద. "బాధపడకమ్మా. నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. రామారావు గారు..మీరు ఒకసారి స్టేషనుకు వచ్చి రిపోర్టు ఇవ్వండి" అని వెళ్ళిపోయాడు మధు. ***** "మీకు పంపిన ఫొటోలు చూశారుగా. ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నారు. వెంటనే అతనిని అరెస్టు చేయండి" అవతల కంఠం కర్కశంగా ఉంది. "ఇంతకూ మీరెవరు?" ఫోను మాట్లాడుతూనే కానిస్టేబులుకు సైగ చేశాడు మధు. అతను సెల్యూట్ చేసి సరేనని వెళ్ళిపోయాడు. "వివరాలు అనవసరం. నెలరోజుల నుంచి పట్టుకోలేక సతమతమవుతున్నారుగా. పాప శవం జాడ తెలుసుకోవడానికే మీకు మూడు రోజులు పట్టింది. నేను చెప్పకపోతే హంతకుడిని కూడ మీరు పట్టుకోలేరు" ఎగతాళిగా నవ్వాడతను. "ఫొటోలో సరిగా కనిపించడం లేదు అతని ముఖం. కొంచెం లైనులో ఉండండి. ఇంకొకసారి చూస్తాను" అంటూ ఫోను కింద పెట్టి అవతలి గదిలోకి వెళ్ళి తన సెల్ లో నుంచి ఎవరికో ఫోనుచేశాడు. అతను చెప్పినది విని మరల ముందుగదిలోకి వచ్చి ఫోను లిఫ్ట్ చేసి అడిగాడు "లాభం లేదు సర్. ముఖం అంత స్పష్టంగా లేదు. పోనీ మీరే అతని పేరు చెప్పండి" "చెప్పను. అతను వేసుకున్న షర్టును గుర్తుపట్టారా? అలాంటి షర్టు ఎవరు వేసుకున్నారో ఆలోచించండి" కొంచెంసేపు ఆలోచించినట్లు నటించాడు మధు. "గుర్తుకు రావడం లేదు" "ఆ మాత్రం అబ్జర్వేషన్ లేనివాడివి, పోలీసు ఎలా అయ్యారు సర్. మరొక్కసారి ఆలోచించండి. మరల ఫోను చేస్తాను" "సార్. సార్. ఆగండి. నెలరోజుల నుంచి కిందా మీదా పడుతున్నాము. కాస్త దయవుంచి అతని వివరాలు చెప్పండి" "చెప్పను. ఒక క్లూ ఇస్తాను. ఆ పాప తల్లికి అతనంటే ప్రాణం. వాళ్ళది విడదీయలేని బంధం. ఇప్పటికే అరగంటసేపు టైం వేస్ట్ చేయించారు నాచేత. బెస్టాఫ్ ల.." అతని మాట పూర్తికాకముందే "అమ్మా..." అనే శబ్ధం అవతలివైపునుంచి వచ్చింది. ఫోను పెట్టేసి "యాహూ..." అని అరచి డాన్సు వేయసాగాడు ఇన్స్పెక్టర్ మధు. అతని పథకం ఫలించింది. ఫోను ఎక్కడినుంచి వస్తున్నదో కనుక్కోమని టెలిఫోను ఆఫీసుకు కానిస్టేబుల్ ను పంపాడు. మరల మధ్యలో ఫోనుచేసి లొకేషన్ తెలియగానే అతనిని వెళ్ళి ఫోను చేస్తున్న వ్యక్తిని అరెస్టుచేసి తీసుకురమ్మన్నాడు. అవతలి ఫోను అర్థాంతరంగా ఆగిపోవడంతో ఆనందం పట్టలేకపోయాడు మధు. 'ఒరేయ్ పవన్ బకరాగా. బెడ్రూములో నువ్వు వాడే బ్రాండు సిగరెట్ పీక చూసినప్పుడే, నీకు, పాప తల్లికి మధ్య వ్యవహారం అర్థమయింది. రామారావుకు సిగిరెట్టు తాగే అలవాటు లేదు. నీకు అలవాటు ఉందని, నీ బ్రాండు పేరు కూడ చెప్పాడు అతను. పాపం రామారావును అమాయకుడిని చేసి, అతని భార్యను లాగేసుకుని, మీ వ్యవహారానికి అడ్డమని, మాటలే సరిగారాని పసిపాపను అంతం చేశావు కదురా రాక్షసుడా. ఆఖరుకు తల్లికి కూడ తెలియకుండా మేనేజ్ చేసి చంపేశావు కదురా. దూరంనుంచి రామారావు ఫొటోలు తీసి, అతడిని కేసులో ఇరికించి, తన కూతురిని తనే హత్య చేశాడని నమ్మించి, అతనికి శిక్షపడేలా చేసి, అతని భార్యను శాశ్వతంగా సొంతం చేసుకోవాలనుకున్నావటరా దుర్మార్గుడా. ఒరేయ్ పవన్ గా, గాలివెధవా, నిన్ను సెల్ లో వేసి నా కసితీరా కుమ్మి వదిలిపెడతాను. పైలోకంలో ఉన్న ఆ పసిబిడ్డ ఆత్మ ఆనందపడేలా చేస్తాను. ఇది నా ఘనవిజయం. నీకు ఉరి. నాకు బహుమతి. యురేకా...... నిజానికిది మా విజయం కాదు. ఆ కామయ్య గారి పుణ్యం' మనసులో తెగ సంబరపడి పోతున్నాడు ఇన్స్పెక్టర్ మధు. ***** "రండి సర్ కామయ్య గారు. మీ వార్తాపత్రికల పఠనానుభవంతోటి, మీ క్రైం నవలల వీర పరిశోధనలలోని మేథస్సుతోటి, ఎటో పోతుందనుకున్న ఈ కేసును ఒక కొలిక్కితెచ్చి, హంతకుడిని పట్టించేలా ఎప్పటికప్పుడు అనేక సలహాలు ఇచ్చి, మా పోలీసుల పరువు కాపాడారు. అందుకే అంటారు 'పెద్దలమాట చద్దియన్నపు మూట' అని. మీకు మేము ఋణపడి వున్నాము" ఎంతో వినయంగా కామయ్య దగ్గరికి వచ్చి మాట్లాడాడు మధు. "నాదేముంది సర్. అంతా మీ కృషి. నేను కేవలం ఇలా జరిగివుండవచ్చు, అలా జరిగివుండవచ్చు అని మాత్రమే చెప్పాను. మన అదృష్టం కొద్దీ ఆ పవన్ అతితెలివితో ఫొటోలు పంపడం, మీకు ఫోనుచేసి గెలకడంతో, సులభంగా దొరికిపోయాడు. అంతే" మనసులో గర్వంగావున్నా, నిగర్విలా ఫోజుకొడుతూ మాట్లాడాడు కామయ్య. "అదంతా మీ గొప్పతనం సర్. మిమ్మల్ని మేము సత్కరించాలనుకుంటున్నాము. వీలుచూసుకుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తాము" "అలాంటివేవీ పెట్టుకోకండి. నాకు ఇష్టం ఉండదు. ఏదో సమాజసేవ. ఒక రాక్షసుడిని పట్టించిన తృప్తి. ఇవి చాలు నాకు" "కుదరదు సర్. మీరు ఒప్పుకోవలసిందే" "అబ్బ వద్దండీ.." "కుదరదండీ" "వద్దండీ..వద్దు...వద్దు...వద్దు" ***** "వద్దండీ...వద్దంటున్నా కదండీ" మూర్ఛరోగిలా మంచం మీద కొట్టుకుంటున్నాడు కామయ్య. "వెధవ సంత. ఏం కల వచ్చి చచ్చిందో ఈయనగారికి. అర్ధరాత్రి మద్దెల దరువని. ఈ గోల ఏమిటో నాకు. అరవై ఏళ్ళ వయసులో ఏమిటి నాకీ ఖర్మ. లేవండి. లేవండి" అని భర్తను దబాదబా బాదింది నాంచారి. వీపు మీద చుర్రుమనడంతో "అబ్బా ఏమయిందే. మంచికల. కొద్దిసేపుంటే సన్మానం కూడ జరిగేది. పూర్తిగాకుండా చెడగొట్టావు గదే" కొట్టిన చోట రుద్దుకుంటూ విసుక్కున్నాడు కామయ్య. "అసలే వయసు పైత్యం. దానికి తోడు రిటైరయిన తరువాత నాలుగు తెలుగు పేపర్లు తెచ్చుకుని పగలంతా అడ్డమైన హత్యావార్తలు, మానభంగాల కథలు చదివి, రాత్రిళ్ళు కలవరింతలతో నా ప్రాణం తోడేస్తున్నారు. రేపటినుంచి మీరు హాలులో పడుకోండి. ఈ చావు నేను చావలేను" "ఒసేయ్ పిచ్చిమొహమా. ఈసారి ఊహ కాదే, వాస్తవకథ నా కలలో దొర్లిందే. వారం క్రితం మన వీధి చివర ఒక పాప తప్పిపోయి, దొరకలేదు కదా. ఆ పాప ఏమయుంటుందో, ఎవరు హత్య చేసి వుంటారో, నా జీనియస్ మెదడుతో ఊహించానే. అదే కలగా రూపు దిద్దుకుంది. నెల తరువాత నా ఊహే నిజమవుతుంది చూడు. అప్పుడు నువ్వు నిజమా అని ముక్కుమీద వేలేసుకుంటావు" సీరియస్ గా ఫోజు పెట్టి గట్టిగా చెప్పాడు కామయ్య. "ఏడ్చినట్టే వుంది. మీ తెలివి తెల్లవార. అది చద్దివార్త. ఆ పిల్ల తప్పిపోలేదు, పాడులేదు. ఆపిల్ల తల్లికి నిద్రలో నడిచే అలవాటుందట. ముందురోజు రాత్రి పాపను తీసుకుని వాళ్ళమ్మగారింటికి వెళ్ళిందట. తెల్లవారగట్లా నిద్రలో లేచి ఈ ఇంటికొచ్చి గేటు తీసుకుని ఆరుబయట మంచం మీద పడుకుందట. మెలకువ వచ్చి చూస్తే ఇల్లు తాళంవేసి ఉంది. పిల్ల పక్కన లేకపోయేసరికి, పిల్ల తప్పిపోయిందని కేకలు పెట్టిందట. అందరూ పోగయి తలా ఒక దిక్కుకుపోయారు. ఆ పిల్లకు నిద్రమత్తు వదిలి ఈలోకం లోకి వచ్చి విషయం అర్థమయ్యేసరికి, పిల్లను తీసుకుని వాళ్ళ వాళ్ళు రానే వచ్చారట. అదీ జరిగింది. ఈ సగం విని, సగం ఊహించే అలవాటు మీకు చస్తే పోదు కదా. ఇకనైనా మారి, సమాజానికి పనికొచ్చే పనిచేయండి. కలల గోల పక్కనబెట్టి లేవండి. మనగోలతో తెల్లవారింది" అని విసుక్కుంటూ లేచింది నాంచారి. 'అయితే అంతా బుస్సేనా... నా కలలోలా జరగలేదా... ఇన్నాళ్ళటి నా వార్తా పఠనశక్తి ఇంతేనా.... పోలీసులు, పరిశోధన, నా సలహాలు అంతా భ్రమేనా. ఆర్కిమెడిస్ లా "యురేకా" అనుకుంటూ మురిసిపోయాను. అంతా "పూతరేకేనా"....వా....' అని తలబాదుకున్నాడు దినపత్రికల వార్తాప్రియుడు, క్రైమ్ కథల వీరాభిమాని కామయ్య. ****** అయిపోయింది*******

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు