చెక్ - chitra venkatesh

Cheque

ఒక చెక్ నా జీవితాన్ని మార్చివేసింది. ఈ మాట నేను చెప్పితే ఎవరు నమ్మరు. తెలికగా కొట్టిపారేస్తారు. కొంతమంది ఇది కధ కాదు కదా అని ఎగతాలి చేస్తారు. మరికొంత మంది ఇంకా కొంచం ముందుకు వెళ్ళి ఇది ఏ సినిమాలో జరిగింది అని నవ్వుతారు. వాళ్ళందరికి నేన ఒక్కటే జవాబు చెప్పుతున్నాను. ఇది కధ కాదు. సినిమాలో జరగలేదు. నిజజీవితంలో జరిగింది. అది నా జీవితంలో జరిగింది.

దాన్ని నేను ఒక అద్భతమైన విషయంగా పరిగణిస్తున్నాను.. ఇంగ్లీష్ లో ఒక మాట తరుచు చెప్తారు. Some true tales are stranger than fiction.ఈ మాటలు నా విషయంలో నిజమయ్యాయి. సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఈ సంఘటన జరిగింది. దాదాపు అయిదు సంవత్సరాలనుంచి నేను బాల్ బేరింగ్స్ వ్యాపారం చేస్తున్నాను. సిటి శివార్లలో నాకు చిన్న ఫ్యాక్టరీ ఉంది.

అందులో పది మంది పనిచేస్తున్నారు. ముందు చిన్నగా నా వ్యాపారాన్నిమొదలుపెట్టాను. కష్టపడి అభివృద్ధిచేశాను. మార్కెట్టులో నా కంటే పెద్దపెద్ద కంపెనీలు చాలు ఉన్నాయి. వాటినితట్టుకుని నిలబడటం మాములు విషయం కాదు. అయిన నేను భయపడలేదు. ఎకనామిక్స్ లో ఒక ధీరీ ఉంది. [profit is the reward for risk taking and uncertainity bearing] ఈ వాక్యాలను నేను పూర్తిగా నమ్ముతాను. దాన్ని నా వ్యాపారానికి అన్వయించుకున్నాను.

అందుకే మార్కెట్టులో ఉన్న బాల్ బేరింగ్స్ కంటే నా సరుకును తక్కువ రేటు పెట్టాను. కాని నాణ్యత విషయంలో మాత్రం నేను అశ్రద్ధ చెయ్యలేదు. లాభం తక్కువైన నాణ్యమైన సరుకును తక్కువ రేటుకు అందించాను. కస్టమర్స్ నా సరుకును గుర్తించారు. నాణ్యత గ్రహించారు. అందువల్ల నా వ్యాపారం తొందరగా అభివృద్ధి చెందింది. క్రమం క్రమంగా అయిదు సంవత్సరాలలో నా వ్యాపారం అంచెలు అంచెలుగా పైకి చేరుకుంది. చిన్న ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీగా మారిపోయింది. దేశంలో నెంబర్ వన్ బాల్ బేరింగ్స్ తయారుచేసే కంపెనిగా పేరు తెచ్చుకుంది. అంతటితో ఆగిపోయిఉంటే బాగుండేది. కాని మనిషి ఆశజీవి. ఎంత ఎదిగిన ఇంకా ఎదగాలని చూస్తాడు. అందరిలోకి నెంబర్ వన్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికి నేను అతీతుడను కాను.

అందుకే కొరియన్ కంపెనితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను. ఆ అగ్రిమెంట్ ప్రకారం కొరియన్ కంపెనికి చెందిన సాంకేతిక నిపుణులు నా టెక్నిషియన్స్ కు తర్పీదు ఇస్తారు. అంతవరకు వాళ్ళు నా కంపెనిలోనే ఉంటారు. వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచెయ్యాలి. బాల్ బేరింగ్స్ తయారుచెయ్యటంలో కొరియన్ కంపెని ప్రపంచంలో నెంబర్ వన్. మా కంపెని తయారుచేసిన సరుకును వాళ్ళకు వాళ్ళ రేటు ప్రకారం అమ్మాలి.

మూడు నెలలపాటు వాళ్ళు నా వాళ్ళకు ట్రయినింగ్ ఇచ్చారు. తరువాత వెళ్ళిపోయారు. రాత్రి పగలు అందరం కష్టపడి సరుకును సిద్దం చేశాం. మంచి నాణ్యమైన సరుకును తయారుచేశాం. మా మేనేజర్ వాటిని తీసుకుని హార్బర్ చేరుకున్నాడు. జలసూర్య అనే ఓడలో వాటిని లోడ్ చేశారు. అది కోరియా వెళ్ళే షిప్. అంతా సక్రమంగా ముగిసిన తరువాత ఇంటికి చేరుకున్నాను. రెండు రోజులపాటు హాయిగా కంటినిండ నిద్రపోయాను. నా పనివాళ్ళు కూడా నాతో పాటు సమానంగా కష్టపడ్డారు. అందుకే వాళ్ళకు కూడా సెలవు ఇచ్చాను. నాలుగు రోజులు గడిచాయి. ఓడగురించి వార్తలు వస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉందని ఓడ సాఫీగా ప్రయాణం చేస్తుందని హార్బర్ అధికారులు చెప్పారు.

అయిదవ రోజు గడిచింది. ఇంకోరెండురోజులలో ఓడ కొరియన్ హార్బర్ చేరుకుంటుంది. సరుకు చేరుకున్న వెంటనే కొరియన్ కంపెని నుంచి నాకు మెసెజ్ వస్తుంది. తరువాత డబ్బు నా అకౌంటులో జమచేస్తారు. ఆ శుభవార్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రాత్రి పిడుగులాంటి వార్త తెలిసింది. సరుకుతో వెళుతున్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. అనుకోకుండ వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. సముద్రంలో తుఫాను చెలరేగింది. ఓడను కాపాడుకోవటానికి ఓడ సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. కాని ఏం లాభం లేకుండ పోయింది. తుఫాను తాకిడికి ఓడ చిన్నబిన్నం అయింది. ఓడతో పాటు సిబ్బంది సరుకు నీళ్ళపాలైంది.

నిర్ఘాంతపోయాను. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఉన్నడబ్బంతా వ్యాపారంలో పెట్టాను. బ్యాంకులో అంతగా డబ్బు లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను పూర్తిగా మునిగిపోయాను. ఇల్లు కారు తప్ప నా దగ్గర ఏం లేదు. బాధతో ఒక రోజు పార్కుకు వెళ్ళాను. సిమెంట్ బెంచి మీద ఒక పెద్దవ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. వెళ్ళి అతని పక్కన కూర్చున్నాను. అతనే ముందు పలకరించాడు. నా గురించి అడిగాడు.

ఆప్యాయంగా పలకరించటంతో అసలు విషయం చెప్పాను. ఆయన ఒక్క క్షణం నా వైపు తేరిపార చూశాడు. తరువాత జేబులోంచి చెక్ బుక్ తీసి ఒక చెక్ రాసి ఇచ్చాడు. అందులో కోటిరుపాయలు ఉంది. ఆశ్చర్యంగా చూశాను.

“నీలో చురుకుదనం తెలివితేటలు కనిపిస్తున్నాయి. అందుకే సహయం చేస్తున్నాను. నువ్వు తప్పకుండ పైకి వస్తావు. ఈ డబ్బుతో మళ్ళి వ్యాపారం పెట్టు. ఇది అప్పుగా అనుకో. సరిగ్గా సంవత్సరం తరువాత నా డబ్బు తిరిగి ఇవ్వాలి. వడ్డిఅవసరం లేదు”అన్నాడు.

ఆయనకు ద్యాంక్స్ చెప్పి చెక్ తీసుకుని ఇంటికి చేరుకున్నాను. వెంటనే ఆ చెక్ ను మార్చుకోలేదు. డ్రాయర్ లో పెట్టాను. ఆయన మంచిమనస్సుతో సహయం చేసి ఉండవచ్చు. కాని ఆ డబ్బును వెంటనే ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేదు. దాన్ని ఒక సెక్యురిటిగా పెట్టుకున్నాను. ఇప్పుడు నాలో మళ్ళి ఆత్మవిశ్వాసం వచ్చింది. మళ్ళి పైకి రాగలనని నమ్మకం కుదిరింది. ముఖ్యంగా నా లో ధైర్యం వచ్చింది. అదే రోజు అగర్వాల్ ను కలుసుకున్నాను. ఆయన పెద్ద బిజినెస్ మాగ్నట్. చాల మంచివాడు. నేనంటే చాల ఇష్టం.

అందుకే అప్పు అడగగానే ఇరవైలక్షలు ఇచ్చాడు. దాన్ని పెట్టుబడిగా పెట్టాను. ఫ్యాక్టరీని మళ్ళి తెరిచాను. నా గురించి నా సరుకు గురించి కస్టమర్స్ కు బాగా తెలుసు. వెంటనే స్పందించారు. నాకు తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. మెల్లగా అమ్మకాలు పెరిగాయి. అరునెలలు తిరిగేసరికి వ్యాపారం ఊపు అందుకుంది. అగర్వాల్ అప్పు మెల్లగా తీర్చేశాను. కాని డ్రాయర్ లో ఉన్న చెక్ ను మాత్రం నేను తియ్యలేదు. దాన్ని చాల పవిత్రంగా బావిస్తున్నాను నేను.

సంవత్సరం గడిచేసరికి నేను పూర్తిగా నిలదొక్కుకున్నాను. తరువాత చెక్ తీసుకుని పార్క్ కు చేరుకున్నాను. ఇది గతం. ప్రస్తుతానికి వస్తే నేను వెళ్ళేసరికి ఆ పెద్దమనిషి అదే బెంచి మీద కూర్చుని ఉన్నాడు. పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు అతను.

నేను దగ్గరకు వెళ్ళి ఆ చెక్ తీసి ఆ పెద్దాయనకు ఇచ్చాను. ఆ మనిషి అదోరకంగా చూశాడు. అమ్మాయి మాత్రం ఏమిటండి అది అని అడిగింది.

జరిగినదంతా చెప్పాను.

ఆమె నా వైపు జాలిగా చూసి అంది.

“ఈయన మా నాన్నగారు. పేరు ఆశోకవర్మ. ఒకప్పుడు పెద్ద వ్యాపారస్ధుడు. కష్టాలలో ఉన్న వాళ్ళంటే చాల జాలి. అందుకే అడిగినవాళ్ళందరికి సహయం చేశాడు. కాని ఒక్కరు కూడా తిరిగి డబ్బు ఇవ్వలేదు. దాంతో మానసీకంగా కృంగిపోయాడు. దాదాపు పిచ్చివాడయ్యాడు. కాని సహయం చేసే గుణం మాత్రం మరిచిపోలేదు. ఎవరు కష్టాలలో ఉన్న జాలిపడి చెక్ రాసి ఇస్తాడు. నిజానికి మా బ్యాంకులో అంత డబ్బు లేదు. నేనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ గా ఒక కంపెనిలో పనిచేస్తున్నాను”.

నేను విస్తూబోయి ఆయన వైపు చూశాను. ఆయన నా వైపు నవ్వుతూ చూశాడు. ఆయన కళ్ళు స్వచ్చంగా కల్మషం లేకుండ కనిపించాయి. జాలితో నా మనస్సు నిండిపోయింది.

“మీకు అభ్యంతరం లేకపోతే ఈ చెక్ నేను ఉంచుకోవచ్చా”అన్నాను,

“ఉత్త చెక్ ను ఏం చేసుకుంటారు”ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

“ఇది మీకు మాములు చెక్ కావచ్చు. కాని నాకు మాత్రం చాల అముల్యమైంది. ఈ చెక్ వల్ల పోయిన నా అత్మనిశ్వాసం తిరిగివచ్చింది. ధైర్యం ఇచ్చింది. ముఖ్యంగా నేను సాధించగలనని నమ్మకం ఏర్పరిచింది. మీ నాన్నగారు ఎంతో మంచి మనస్సుతో ఇచ్చారు. అందుకే మళ్ళి వ్యాపారంలో నిలదొక్కుకోగలిగాను”అన్నాను.

“అలాగే తీసుకోండి”అంది ఆ అమ్మాయి.

నేను సంతోషంతో వెనక్కి తిరిగాను.

ఇదండి చెక్ కధ.

సమాప్తం.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు