చీకటి తెరలు తొలగి వెలుగు పరుచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. అరుంధతి గుడిసె తలుపు దగ్గరగా పెట్టి, బయలు దేరింది.
గుడి దగ్గర చేరుకొంటున్నా భక్తులను చూసి, వడి వడిగా గోదావరి రేవుకు చేరుకొంది. నిండు గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఎంత చిత్రం ! సరిగ్గా వారం రోజుల క్రితం, ఎంత ఉరకలేసిందో, ఈ గోదారమ్మ, గట్టుకి రావడానికి ఎవరికీ గుండెలు సరిపోలేదు. సాగుతున్న ఆలోచనలతోనే, చీపురు తీసుకుని చకచకా రేవు మెట్లు శుభ్రపరిచి, తనతో తెచ్చిన ప్లాస్టిక్ షీట్లుని పరుచుకొంటూ, నిలబెట్టిన గడకర్రలకి వున్న మేకులకి వాటిని తగిలిస్తూ, క్షణాలలో చిన్న గదిలా తయారు చేసింది. గోదావరిలో స్నానాలు చేసిన మహిళలు, దుస్తులు మార్చుకోవడానికి ఆ గదిని వాడుకొంటారు. అరుంధతి అక్కడే బయట నిలబడి, ఆ మహిళల నుండి డబ్బులు వసూలు చేసుకుంటుంది.
అప్పటికే స్నానాల కోసం జనాలు రావడం మొదలయ్యింది. మగవారు ఎక్కువగా వున్నారు. పదేళ్ళ కూతురు, తల్లి స్నానాలు చేస్తుంటే, అరుంధతి వారి కేసి చూస్తోంది. ఆ పిల్ల ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నీటిలో మునకలు వేస్తుంటే, తల్లి ఆమెని "ఇక చాలు.. చాలు..పైకీ రా..దర్శనానికి ఆలస్యమవుతోంది." అంటూ, పైకి రానని మారాము చేస్తున్న ఆ పిల్లని, బలవంతంగా రెక్క పట్టుకుని పైకీ లాక్కొని వస్తోంది.
"అమ్మా ! ఇలా రండి. ఈ లోపల కెళ్ళి బట్టలు మార్చుకోండి" అంటూ అరుంధతి, వారికి ఎదురెళ్లింది.
బట్టలు మార్చికొని, తడి బట్టలు చెత్తో పట్టుకుని వస్తున్న ఆ తల్లిని చూస్తూ," అమ్మా ! పైసలు ఇవ్వండి. పది రూపాయలు.." అరుంధతి అడిగింది.
ఒక్క నిమిషం అరుంధతి కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ, "పైసలు... ఇవ్వాలా...ఉచితమనుకొన్నా.." అంటూ నసగ సాగింది ఆమె. వెంటనే " పైసలు తేలేదామ్మా.! ఇప్పుడెలా ?" అంటూ ఆ పిల్ల కళ్లు చక్రాల్లా త్రిప్పుతూ తల్లి కేసి చూసింది. "ఫర్వాలేదులే అమ్మా! తర్వాత వచ్చి ఇవ్వండి", అంటూ అరుంధతి ముందుకు సాగిపోతుంటే, "ఆంటీ ! నేను మళ్లీ వచ్చి ఇస్తాను, ప్లీస్… సరేనా.." అంటూ గట్టిగా అరిచింది.
అరుంధతి తల త్రిప్పి ఆ పిల్ల కేసి చూసి చిన్నగా నవ్వింది. ఎందుకంటే, అరుంధతికి, మళ్ళీ మళ్ళీ వినే మాట అదే.
****
"ముందు దర్శనం చేసుకొని, తరువాత హోటల్ కెళ్ళి తిందాం, నడు, గబ గబా నడు" అంటూ, క్యూ లో నిలబడింది ఆ తల్లి. "మరి గోదారమ్మాయికి డబ్బులివ్వాలిగా, నేను ఇచ్చి రానా?"అడిగింది ఆ కూతురు అమాయకంగా తల్లి కేసి చూస్తూ. "గుడిలో మాట్లాడకూడదు.కళ్లు మూసుకుని భగవంతుడ్ని తలుచుకొంటూ మనస్సులో ఆయనని ప్రార్ధించుకోవాలి" అంది తల్లి. వెంటనే ఆ చిన్నారి,"మరి కళ్లు మూసుకొంటే, ఏమీ కనబడదు కదా ! భగవంతుడు ఎలా కనిపిస్తాడు?" ప్రశ్నించింది ఆ పిల్ల. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "చెప్పింది విను. వెర్రి ప్రశ్నలు వేసి విసిగించకు." తల్లి కోపంగా వుందని గ్రహించి, ఆ పిల్ల కళ్లు మూసుకొంది.
క్యూలో భక్త్తులుముందుకు కదులు తున్నారు. కళ్లు మూసుకుని ఆ పిల్ల అలాగే నిలబడిపోయింది. విషయం గ్రహించి, "అలా కళ్లు మూసుకుని నిలుచుంటే ఎలా? చూడు వాళ్లంతా ఎంత దూరం వెళ్లిపోయారో...నడు.. నడు" అని తల్లి విసుక్కొంది. కొంత దూరం నడిచే సరికి. పిల్లకి మరో సందేహం వచ్చి, తల్లి చీర చెంగుని లాగుతూ,"కళ్లు ముసుకొన్నా, భగవంతుడు నాకు కనిపించలేదే, దేవుడు ఎలా వుంటాడు?"అని అడిగింది.
తల్లికి ఒక్క క్షణం ఏమి చెప్పాలో తెలియలేదు. గుడి మంటపంలో కనిపించే గణపతి విగ్రహం చూపిస్తూ, అదే భగవంతుడని చెప్పింది. "నాకు తెలుసు. ఆయన భగవంతుడు కాదు. వినాయక స్వామి" అంది. తల్లి విననినట్టు నటించి,"పద ముందుకు నడు చిట్టితల్లీ !"అంది కాస్త నవ్వుతూ. " కళ్లు మూసుకొంటే, నీకు కనిపించాడా భగవంతుడు?"అడిగింది ఆ పిల్ల తల్లిని. "అవును, చిట్టితల్లీ,"సమాధానం చెప్పక పోతే పిల్ల ఊరుకోదు అని మనసులో అనుకొంది తల్లి.
పిల్లకి భగవంతుని చూడాలని కాంక్ష తీవ్రంగా వుంది. తల్లికి కూడా ఆ విషయం అర్ధమయ్యి," నీక్కూడా తప్పకుండా కనిపిస్తాడు. మళ్ళీ కనులు మూసుకో' "అంది. తల్లి మాటలు ఆ పసి పిల్లలో విశ్వాసాన్ని నింపాయి. హుషారుగా "అలాగే అమ్మా ! కనులు మూసుకొని భగవంతుడుని చూస్తాను" అంది సంతోషంగా. ఒక నిమిషం తర్వాత కళ్లు తెరిచి గట్టిగా అరిచింది. తల్లి ఆశ్చర్య పోతూ, ఎందుకమ్మా ! అరిచావు, భగవంతుడు నీకు..నీకు కనిపించాడా?"అడిగింది.
"అవునమ్మా ! గణపతి దేవుడు కాదమ్మా ! నాకు కనిపించింది ఆ ఆంటీ, అదే గోదావరి దగ్గర పొద్దున్న పైసడిగిందే ఆ అంటీ. చేతులు జాపి జాలిగా అడుగుతోంది పైసలు. నువ్వు ఇక్కడే వుండు, ఇప్పుడే నేను వెళ్లి ఈ పది రూపాయలిచ్చి వస్తా" అంటూ తుర్రుమంటూ, ఆ గజేంద్రుడ్ని రక్షించడానికి వైకుంఠం నుండి విష్ణువులా పరుగు తీసింది గోదావరి గట్టుకి.
*****