పారిజాత పరిమళం - తటవర్తి భద్రిరాజు

Parijata parimalam

గవర్నమెంట్ హై స్కూల్ ముందర రెండు పెద్ద రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పై ఎన్నో రకాల పక్షులు వాలి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. స్కూల్ గోడకి రావి చెట్టుకు మధ్యన ఉన్న స్థలం లో ఒకప్పుడు నాగన్న బార్బర్ షాప్ ఉండేది. హైద్రాబాద్ లో ఏదో పెద్ద సెలూన్ లో ఉద్యోగం రావడం తో , షాప్ లో ఉన్న సామాన్లు అమ్మేసి నాగన్న హైద్రాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ప్రదేశం లో కాంతమ్మ దోసెల బండి పెట్టుకుంది. వయసులో ఉన్నప్పుడు వళ్ళు అమ్ముకున్న కాంతం...వయసు అయిపోయాక దోసెలు అమ్ముతుంది. తండ్రి ఎవరో తెలియని కూతురు తో , తనగతం ఎవరికీ తెలియని ఈ ఊరు వచ్చి ఇక్కడ చిన్న దోసెలు బండి పెట్టుకుంది. కాంతం దోసెలు, ఊళ్ళో అందరూ రుచి చూసిన వాళ్ళే....అగ్రహారం లో ఉన్న ఆ నాలుగు కుంటుంబాలు తప్ప. కాంతం నేతి తో వేసే కారం దోస, కొబ్బరి పచ్చడి అంటే ప్రెసిడెంట్ గారి నాన్నకి చాలా ఇష్టం. ఆ దోసెలు రుచి నచ్చేసి ఏకంగా ఖాతానే తెరిచేశాడు కాంతం దగ్గర. మసాలా దోస, బాగా ఉల్లిపాయలు వేసి వేసే ఉల్లి దోస కోసం ఐతే జనం ఉదయం సాయంత్రం కాంతం దగ్గర లైన్ లో నుంచుంటారు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి దోసెలు బండి తో కాంతం బాగానే సంపాదించింది. ఒక ఇల్లు కూడా కొంది. వ్యాపారం పెరిగే కొద్దీ ఇద్దరు పని వాళ్ళను కూడా పెట్టుకుంది. కూతురు పారిజాతం గత ఏడాదే పదవతరగతి పూర్తిచేసుకుంది. కాంతం ఇంక కాలేజీ చదువులు వద్దులే అని చదువు మానిపించేసింది. "హైస్కూల్ లెక్కల మాస్టారు సుబ్బారావు గారు వచ్చి కాంతానికి నచ్చచెప్పారు " పారిజాతాన్ని చదివించమని. కాంతం పారిజాతానికి పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను అంది. పెళ్లి సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పమని తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పింది. రామచంద్రపురం లో సామిల్లు నడిపే రామిరెడ్డి గారి పెద్దబ్బాయి ఓరోజు పారిజాతాన్ని చూసుకోవడానికి వచ్చాడు. కాంతం పెట్టిన దోసెలు తిన్నాడు. పారిజాతాన్ని చూసాడు. ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి నుండి మధుబాబు అనే కుర్రాడు, అమలాపురం నుండి శేఖర్ అనే కుర్రాడు కూడా వచ్చి పారిజాతాన్ని చూసుకున్నారు. ఇంకోరోజు గోపాలం అని ఓ కుర్రాడు వచ్చాడు. పిఠాపురం పక్కనే ఉన్న గొల్లప్రోలు లో, ఎండుమిర్చి వ్యాపారం చేసే ఇతను పారిజాతాన్ని చూసి , కాంతం పెట్టిన దోసెలు తిన్నాడు. ఇతను కూడా ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. గోపాలం వెళ్లిన పదిరోజులకి కాంతానికి ఉత్తరం వచ్చింది. దోసెలు చాలా బావున్నాయి అని. అలా పారిజాతనికి చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ ఎవరూ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పెళ్ళికొడుకలను చూసి చూసి విసిగిపోయింది పారిజాతం. తాను ఎందుకు ఎవరికీ నచ్చడం లేదో తనకే అర్ధం కావడం లేదు. ఊళ్ళోకి కొత్తగా రవి అని ఓ RMP డాక్టర్ వచ్చాడు. కాకినాడలో ఏదో హాస్పిటల్ లో కాంపౌండర్ గా పని చేసి ఇంజక్షన్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే కొన్ని మందుల పేర్లు కూడా. ఊళ్ళోకి వచ్చిన కొద్దిరోజులకే డాక్టర్ గారి చేయి మంచిది అని మంచి పేరు వచ్చింది. ఏవైనా ఎమర్జెన్సీ కేసులు ఉంటే పట్నం తీసుకుని వెళ్లి మంచి వైద్యం చేయిస్తాడు. ఆయన కమీషన్ ఆయనకి వచ్చేచోట. డాక్టర్ గారు ఓరోజు కాంతం దోసెలు తిన్నారు. ఆయన గతం లో కాకినాడ బానుగుడి సెంటర్ లో , రాజమండ్రి దివాన్ సెంటర్ లో కూడా దోసెలు తిన్నారు కానీ అవి ఏవీ కాంతం దోసెలు అంత రుచిగా లేవు. ప్రతీరోజు ఊళ్ళో వైద్యం చేయడం. కాంతం దగ్గర దోసెలు తినడం డాక్టర్ గారికి వ్యాపకం ఐపోయింది. ఓరోజు డాక్టర్ గారు పారిజాతాన్ని చూసారు. అలా మళ్లీ మళ్లీ దోసెలు తింటున్నప్పుడు అల్లా పారిజాతాన్ని చూస్తూనే ఉన్నారు. ఓరోజు కాంతం మినప్పప్పు తేవడానికి రామభద్రం ఆటో లో పట్నానికి వెళ్ళింది. ఆసమయంలో డాక్టర్ గారు పారిజాతనికి తన మనసులో మాట చెప్పారు. "నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి రేపు రాత్రి కి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం" అని ఎవరికీ నచ్చని తాను డాక్టర్ కి నచ్చేటప్పటికీ పారిజాతం ఏమీ ఆలోచించలేకపోయింది. తరువాత రోజు రాత్రి డాక్టర్ గారు చెప్పిన సమయానికి పారిజాతం చెరువు గట్టు మీద బట్టలు బ్యాగ్ తో ఉంది. తరువాత రోజు ఊర్లో పారిజాతం లేచిపోయింది అన్నారు. కాంతం మాత్రం పారిజాతం తప్పిపోయింది అంది. పారిజాతం కోసం కాంతం వెతకని చోటు లేదు. అన్నవరం కొండమీద ఉందేమో అని అక్కడ అంతా వెతికింది. ఏలేశ్వరం లో పారిజాతం కనపడింది అని ఎవరో చెప్తే అక్కడా వెతికింది. వెతికి వెతికి అలిసిపోయిన కాంతం అంతర్వేది వెళ్లి దేవుడికి మొక్కింది. వస్తూ వస్తూ అప్పనపల్లి లో ఆగి కొబ్బరికాయకొట్టి పారిజాతం ఇంటికి వచ్చేలా చూడమని పొర్లుదండాలు పెట్టింది. ఐనా పారిజాతం రాలేదు. ఊళ్ళో కాంతం దోసెలు వేస్తుంది కానీ అవి ఇంతకు ముందు అంత రుచిగా ఉండడం లేదు. పారిజాతం గురించి ప్రతీ రోజూ ఆలోచిస్తూనే ఉంది. పారిజాతాన్ని తీసుకువెళ్లిన డాక్టర్ మండపేట లో ఎవడో బ్రోకర్ కి పారిజాతాన్ని అమ్మేశాడు . అక్కడి నుండి ఏదోలా తప్పించుకున్న పారిజాతం రాజమండ్రి బస్ ఎక్కి కోటిపల్లి బస్టాండ్ దగ్గర దిగి, గోదావరి గట్టు కి నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ గోదావరిని చూస్తూ కూర్చుంది. తన మనసులో బాధ అంతా తీరే దాకా ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. పారిజాతం అలా ఏడవడం చూసిన ఆటో డ్రైవర్ బాషా ఆటో పక్కకు ఆపి దగ్గరకు వెళ్లి "ఎందుకు ఏడుస్తున్నావ్ ?" అని అడిగాడు. పారిజాతం ఏమీ మాట్లాడలేదు. ఏడుస్తూనే ఉంది. కాసేపు చూసిన బాషా రోజ్ మిల్క్ సీసా తీసుకు వచ్చి పారిజాతం పక్కనే పెట్టాడు. కొవ్వూరు లో ఉన్న ఎవరో కస్టమర్ దగ్గరకి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి గుండెల్లో బాధ అంతా దిగిపోయాక గోదారి కేసి చూస్తూ ఉంది. శ్యామలా టాకీస్ లో మధ్యాన్నం మ్యాట్నీ సినిమా కి వెళ్లిన జనం అప్పుడే బయటకి వస్తున్నారు. పారిజాతం కోటిపల్లి బస్ స్టాండ్ కి వచ్చి కాకినాడ వెళ్లే బస్ ఎక్కి , మేడపాడు, వేట్ల పాలెం దాటాక వచ్చే సామర్లకోట బస్టాండ్ దగ్గర దిగింది. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి ఇక్కడనుండి ఆటో లు లేవు. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ మెయిన్ రోడ్ మీద ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ పక్కనే నుంచుంది. అదే రోడ్ లో కారు లో వెళ్తున్న మంత్రసాని రాంబాబు గారి పెద్దబ్బాయి రామ కృష్ణ పారిజాతాన్ని చూసి కారు ఆపాడు. ఇతన్ని ఇంజనీరింగ్ చదివిద్దామని ఉత్తరప్రదేశ్ లో ఎదో కాలేజీ లో చాలా డొనేషన్ కట్టి చేర్చారు మంత్రసాని రాంబాబు గారు. చదవ లేను అని మధ్యలో వదిలేసి వచ్చేసాడు. ప్రస్తుతం వాళ్ళకి ఉన్న ఫ్యాక్టరీ లు , వ్యాపారాలు చూసుకుంటున్నాడు. పారిజాతాన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఊర్లోకి వెళ్ళాలి అని పారిజాతం చెప్తే 'నేను అటే వెళ్తున్నాను రా 'అని కారు ఎక్కించుకున్నాడు. కారు ఎక్కాక ఎక్కడినుండి వస్తున్నావ్ అని మాట కలిపాడు. చాలా సేపటి వరకు పారిజాతం ఏం మాట్లాడలేదు. కాసేపటి తరువాత రాజమండ్రి నుండి అని చెప్పింది. పారిజాతాన్ని జాగ్రత్త గా ఇంటి దగ్గర దింపిన రామకృష్ణ తన దారిలో తాను వెళ్ళిపోయాడు. పారిజాతం ఇంటి తలుపు కొట్టింది. అప్పటికే మంచి నిద్రలో ఉన్న కాంతం తెల్లారి పోయింది ఏమో అప్పుడే పని వాళ్ళు వచ్చేసారు అనుకుంది. తలుపు తీసి చూస్తే పారిజాతం. కాంతం ఆనందానికి అవధులు లేవు. పారిజాతం జరిగింది అంతా కాంతానికి చెప్పింది. అంతా విన్న కాంతం నువ్వు చిన్న పిల్లవి , నా జీవితం లో నేను ఇలాంటివి ఎన్నో చూసాను అంది. ఆ డాక్టర్ గాడిని నేను వదలను నువ్వు బెంగపడకు అని ఓదార్చింది. ఎప్పుడు తిన్నావో ఏంటో అని వేడి వేడి గా అన్నం వండి ఆవకాయ లో నెయ్యి వేసి కలిపి పారిజాతానికి తినిపించింది. తరువాత రోజు పక్కింటి పంకజాక్షి " పారిజాతం వచ్చేసింది ట కదా " అని అడిగితే కాంతం అవును అక్క పెద్దాపురం మరిడమ్మ తీర్ధం లో తప్పుకుని పోయింది ట. దారి తెలుసుకుని రాత్రి ఇంటికి వచ్చేసింది అని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పారిజాతం నెమ్మది నెమ్మది గా జరిగింది అంతా మర్చిపోయి మాములు మనిషి అవుతూ ఉంది. ఊరుచివర ఉన్న రామాలయం పూజారి గారి బావమరిది బండారులంక నుండి కొత్తగా ఊళ్ళో కి వచ్చాడు. ఒకసారి అక్క బావ లని చూసి వెల్దామని. పారిజాతం దోసెలు వేస్తుంటే , ప్రెసిడెంట్ గారు పంపారని నల్లమిల్లి సూరి బాబు వచ్చాడు. "అక్క రాబోయే వినాయక చవితి నవరాత్రులలో , రోజు నాటకాలు వేసే వాళ్ళకి మూడుపూటలా నిన్ను వండి పెట్టమన్నారు ప్రెసిడెంట్ గారు' అన్నాడు. సరే ఐతే ఏర్పాట్లు చేసుకుంటాలే అని చెప్పి, ఉండు వెళ్లిపోకు రెండు దోసెలు తిందిగాని అంది. సరే అక్క అని నల్లమిల్లి సూరిబాబు దోసెలు తిని వెళ్ళిపోయాడు. నవరాత్రుల తొమ్మిది రోజులు ఊర్లో రోజుకో నాటకం వేస్తారు. ఎక్కడి ఎక్కడి నుండో కళాకారులు వచ్చి వాళ్ళ ప్రతిభ కనబరుస్తారు. ఓరోజు ఎక్కడికో వెళ్తూ దోసెలు తిందామని కాంతం హోటల్ దగ్గర కారు ఆపాడు మంత్రసాని రాంబాబు గారి అబ్బాయి రామకృష్ణ. రామకృష్ణ ని చూసి గుర్తుపట్టిన పారిజాతం, ఆరోజు రాత్రి నన్ను ఇంటి దగ్గర దింపింది ఈయనే అని కాంతానికి చెప్పింది. కాంతం రామకృష్ణ ను చూసి ' రా బాబు రా' అమ్మాయి అంతా చెప్పింది. 'మీరు చాలా సహాయం చేసారు మా పాపకి ' అని ఓ స్పెషల్ దోస వేసి రామకృష్ణ కి అందించింది. 'మీరు ఏక్కడ ఉంటారు బాబు' అని అడిగితే , నేను కాకినాడ లో ఉంటాను అని చెప్పాడు రామకృష్ణ. మాటల్లో వాళ్ళకి ఉన్న ఫ్యాక్టరీ ల గురించి చెప్పాడు. ఈ ఊళ్ళో ఉన్న రైస్ మిల్, పిఠాపురం లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ , కాకినాడ లో ఉన్న బట్టల షాప్ లు అన్నీ నేనే చూసుకుంటాను. అమలాపురం దగ్గర పాసర్లపూడి లో కొబ్బరితోటలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని 1995 లో గ్యాస్ లైన్ పగిలి మంటలు అంటుకుని వచ్చిన బ్లో ఔట్ లో కాలిపోయాయి. అని చెప్పాడు. పారిజాతం అవునా అని ఆశ్చర్య పోతూ రామకృష్ణ కేసి చూసింది. రామకృష్ణ మళ్లీ చెప్పడం ప్రారభించాడు. ఆ బ్లో ఔట్ మొత్తం 65 రోజుల పాటు మండుతూనే ఉంది. సుమారు 2 కిలోమీటర్లు వరకు దాని వేడికి అక్కడ పంటలు అన్నీ కాలిపోయాయి. అది మన దేశం లో అతిపెద్ద బ్లో ఔట్ ట. ఇప్పుడు అక్కడ కొబ్బరి నీళ్లు ప్యాకింగ్ చేసి, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ పెట్టాం అని చెప్పాడు. రామకృష్ణ మాటలు విన్న కాంతం పారిజాతాన్ని లోపలికి పిలిచి ' ఈ అబ్బాయితో మనకి లాభసాటి బేరం లా ఉంది'. 'ఎందుకైనా మంచిది కొంచెం చూసీ చూడనట్టు గా మసులుకో ' అతనితో అని చెప్పింది. సరే అమ్మ అని చెప్పి రామకృష్ణ తో కారు దాకా వెళ్లి అప్పుడప్పుడు వస్తూఉండండి అని నవ్వుతూ చెప్పింది. సరే అలాగే నువ్వు ఎప్పుడైనా వస్తే మా ఫ్యాక్టరీ లు అన్నీ చూపిస్తా నీకు అని రామకృష్ణ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. వినాయక నవరాత్రులకి ఊరు అంతా సీరియల్ బుల్బ్ లు తో తోరణాల్లా కట్టారు. రెండు అడుగులు రెండు అడుగులు కు రంగు పేపర్లు చుట్టిన ట్యూబ్ లైట్స్ పెట్టారు. స్కూల్ దగ్గర ఒక స్పీకర్, పెద్ద వీధి వాటర్ ట్యాంక్ దగ్గర ఒక స్పీకర్ పెట్టారు. మైకు చిన్న వీధి కమ్యూనిటీ హల్ల్లో పెట్టారు. కరెంట్ పని చేసే జిల్లెళ్ల బాబ్జి మొత్తం లైటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. బాబ్జి దగ్గర నలుగురు పని వాళ్ళు కూడా ఉన్నారు. బాబ్జి లైటింగ్ పని వీళ్ళకి అప్పచెప్పి గుడిమీద దేవుడి బొమ్మలు లైట్స్ తో ఎలా పెడితే బావుంటుందో అని పూజారి రామస్వామి గారితో మాట్లాడుతున్నాడు. సాయంత్రం వేయాల్సిన చింతామణి నాటకం వాళ్ళు అప్పుడే అంబాసిడర్ వాన్ లో దిగారు. వీళ్ళకి పశువుల హాస్పిటల్ లో ఉన్న కాళీ గదులు ఇచ్చారు. వీళ్ళు అంతా అక్కడే ఉండి రెస్ట్ తీసుకుని సాయంత్రానికి నాటకం వేస్తారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు పలహారలు ఏర్పాట్లు లో బిజీ గా ఉంది కాంతం . నాటకాలు వేయడానికి వచ్చే వాళ్ళకి మంచి మంచి కూరలతో వంటలు చేసి పెడుతూ ఉంది కాంతం. తొమ్మిదో రోజు కన్యాశుల్కం నాటకం వేసే వాళ్ళు వచ్చారు. వాళ్లలో లోకనాధం అని గిరీశం పాత్ర వేసే ఆయన ఉన్నాడు. ఆయనకి గిరీశం పాత్ర బాగా చేస్తాడని మంచి పేరు ఉంది. ఆరోజు మధ్యాన్నం అందరికీ భోజనాలు పెడుతుందటే లోకనాధం కాంతాన్ని చూసాడు. ఒకప్పుడు కాంతం పిఠాపురం లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరకు పాత పరిచయాలు ఉన్నాయి. 'ఓహ్ నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావ్ అనుకున్నాను ఇక్కడ ఉన్నవా ? ఎలా ఉన్నావ్ ' అని అడిగాడు. బానే ఉన్నాను కానీ , నువ్వు ఎలా ఉన్నావ్ ? విశేషాలు ఏంటి అని అడిగింది కాంతం. ' ఏముంటాయి లే ...నీకు తెలిసిందా ఏ మధ్య నే పిఠాపురం కరణం గారు పోయారు' అని అన్నాడు. అవునా అయ్యో అని ఊరుకున్న కాంతం .....లోకనాదానికి కొసరి కొసరి వడ్డించింది. కడుపు నిండా తిన్న లోకనాధం రాత్రికి నాటకం వెయ్యగలనో లేదో అనుకుంటూ ...పశువుల ఆసుపత్రి లో వాళ్ళకి ఇచ్చిన రూమ్ కేసి వెళ్ళిపోయాడు. తరువాత రోజు కాంతం ప్రెసిడెంట్ దగ్గరకి వెళ్ళి , నవరాత్రులు లో భోజనాలు పెట్టిన ఖర్చు అంతా తీసుకుని వచ్చింది. ఆ రోజు ఆకాశం కొంచం మబ్బులు పట్టి ఉంది . ఏ క్షణం ఐనా వర్షం పడచ్చు అన్నట్టు గా చల్ల గాలి వీస్తుంది. అప్పుడే కాంతానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పారిజాతాన్ని పిలిచి రేపు తొందరగా తయారవ్వు. మనం పిఠాపురం వెళ్దాం అంది. ఎందుకో అర్థం కాని పారిజాతం , ఇంకేమీ అడగకుండా అలాగే అని తన గదిలోకి వెళ్ళిపోయింది. తరువాత రోజు ఉదయాన్నే కాంతం , పారిజాతం పిఠాపురం బయలుదేరారు. ఇంట్లొనించి బయటకు వచ్చారే కానీ ఆటో లు ఏమీ లేవు. ఏమైనా వస్తే బావుండును . లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ....ఉదయాన్నే పేపర్ బండిల్స్ తీసుకురావడానికి వెళ్తున్న సిద్ధుల సుబ్బరాజు కనపడ్డాడు. కాంతాన్ని చూసిన సుబ్బరాజు బండి ఆపి , ఈ టైం లో ఆటో లు రావు కానీ నేను సామర్లకోట స్టేషన్ దగ్గర దింపుతాను నా బండి ఎక్కండి అన్నాడు. అలా స్టేషన్ దగ్గర దిగిన కాంతం, పారిజాతం సామర్లకోట స్టేషన్ లో విశాఖ ప్యాసింజర్ ఎక్కి పిఠాపురం లో దిగారు. పిఠాపురం స్టేషన్ బయటకి వచ్చి ఆటో ఎక్కి నేరుగా కరణంగారి ఇంటికి ఆటో మాట్లాడుకున్నారు కాంతం , పారిజాతం. మల్యాల వారి వీధి లో పెద్ద బంగాళా పెంకుటిల్లు కరణం గారిది. ఒకప్పుడు వచ్చే పోయే వారితో కళకళ ఆడుతూ ఉండేది. కరణం గారు చాలా మంచి వ్యక్తి అని పిఠాపురం లో మంచి పేరు సంపాదించాడు. అలాగే ఆస్తులు కూడా . కరణం గారి చేత రకరకాల పనులు చేయించుకునే వారు చాలా మంది. అలా పని చేయించుకున్నందుకు వాళ్ళకి తోచింది ఇచ్చేవారు. అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు కరణం గారి చేత ఓ పని చేయించుకుని కాంతాన్ని కరణం గారికి పరిచయం చేసారు. ఏ దురలవాట్లు లేని కరణం గారు నెమ్మది నెమ్మది గా కాంతం వెనకాలే తిరిగే వారు. ఊళ్ళో వాళ్ళు ఉంచుకున్నారు అనే వారు. కాంతం నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేది. కాంతం మోజులో పడిన కరణం గారు మందుకు కూడా బానిస అయ్యారు. తరువాత తరువాత రోజుల్లో ఆయన చేతిలో మందు బాటిల్ పెడితేనే ఎవరికైనా పనులు చేసిపెట్టేవారు. కొన్నాళ్ళకి తాగుడు ఎక్కువ అయ్యి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లి దింపేవారు. లేదంటే రోజంతా అలా రోడ్ పైనే పడి ఉండేవారు. ఈయన తాగుడు కు , కాంతానికి ఆస్తులు హారతి కర్పూరం లా కరిగిపోతాయేమో అనే భయం తో భార్య సత్యవతి ముందుగానే ఆస్తులు అన్నీ తన పేరు మీద రాయించుకుంది. ఆస్తులు కరణం గారి పేరు మీద లేవని తెలుసుకున్న కాంతం నా దగ్గరకి రావద్దు అని కరణం గారి ని దూరం పెట్టింది. తరువాత కాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది. కాంతం దూరమైన కరణం గారు బెంగతో ఇంకా తాగి తాగి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నారు. అన్నతమ్ములు, భార్య ఎంత చెప్పినా వినకుండా తాగుతూనే ఉండేవారు. ఓరోజు తాగిన మత్తులో ఒరిసా వైపు వెళ్తున్న ఎదో ట్రైన్ ఎక్కేశారు. విశాఖపట్నం వెళ్ళేటప్పటికి మత్తు దిగి మళ్లీ వెనక్కి వచ్చారు. చేతికి డబ్బులు ఇస్తే తాగేస్తున్నాడు అని భార్య సత్యవతి డబ్బులు ఇవ్వడం మానేసింది. దానితో ఆయన మందు కు డబ్బులు కోసం ఎవరిని పడితే వాళ్ళని ఆడిగేవాడు. ఓరోజు కరణం గారు కనకదుర్గ వైన్స్ పక్కన ఉండే టీ కొట్టు రాజుని 200 అడిగితే , కరణం గారు కదా అనే గౌరవం తో 50 రూపాయలు ఇచ్చాడు. రిక్షా తొక్కుకునే వీరయ్య దగ్గరా డబ్బులు తీసుకున్న కరణం గారు నీకు ఎదైనా పని కావాలంటే చేసి పెడతాలే అని వైన్ షాప్ వైపు వెళ్లిపోయారు. అలా అలా మందు తాగి తాగి మత్తులో ఇల్లు, భార్య అన్నతమ్ములు అన్నీ మర్చిపోయి కనకదుర్గ వైన్స్ పేరుఒకటే గుర్తించుకున్నారు. తరువాత కొంత కాలానికి కరణం గారి కిడ్నీ లు పాడైపోయి ఓరోజు రాత్రి రోడ్ పైనే ప్రాణం పోయింది. కాంతం ఎక్కిన ఆటో మల్యాల వారి వీధిలోకి వచ్చి కరణం గారి ఇంటి ముందు ఆగింది . కరణంగారి ఇంటి దగ్గర ఆటో దిగారు కాంతం, పారిజాతం. గేట్ పక్కనే ఉన్న రెండు ఎర్రగులాబీ మొక్కలు మొగ్గలుతో ఉన్నాయి. దానిపక్కనే మందార మొక్క నిండా పువ్వులు ఉన్నాయి. కాంతం పారిజాతం గేట్ తీసుకుని కరణం గారి ఇంటిలోపలికి వెళ్లారు. అప్పడే సంధ్యావందనం పూర్తి చేసుకుని కరణం గారి తమ్ముడు సూర్యనారాయణ గారు బయటకి వచ్చారు. కాంతాన్ని చూసి 'నువ్వా ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ? ' నీ కారణం గా మా కుటుంబం పరువు వీధిన పడింది. అందరిచేత మంచి వాడుగా పేరుతెచ్చుకున్న నా అన్నయ్య మాకు కాకుండా పోయాడు. ఇంకేం మిగిలింది అని ఇక్కడకు వచ్చావ్ ? అని కోపంగా అరుస్తున్నట్టుగా అడిగారు. తల దించుకున్న కాంతం ' అప్పుడు పరిస్థితులు అప్పటవి బాబు గారు' ' అనుకోకుండా అలా అయ్యిపోయింది. నేను దూరం ఐతే ఆయన మారతారు ఏమో అని దూరంగా వెళ్ళిపోయాను. ఇంతకాలం ఆయన జ్ఞాపకాల తోటే బతికేసాను. ఆయన రూపం ఇదిగో నా ఈ కూతురి లో చూసుకుంటున్నాను. అసలే మగతోడు లేనివాళ్ళం. మేము ఎలా బతకాలి బాబుగారు. ఆయన ఉంటే ఇప్పుడు ఆయనతో కలిసి ఏదోలా బతుకుదాం అనుకున్నాం.' కాంతం మాటలు వింటున్న పారిజాతనికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. కరణం గారే తన తండ్రి అని. ఇంతకాలం ఎప్పుడు అమ్మ తనకి ఈ విషయం ఎందుకు చెప్పలేదో అని అనుకుంది. కాంతం మాటలు విన్న సూర్యనారాయణ గారు ' నాకు అవి అన్నీ తెలియదు. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడకు రావద్దు. ఇప్పటికే ఉన్న మా కుటుంబం పరువు రోడ్ మీదకు తీసుకు వచ్చావ్' అని కాంతం కేసి చూసారు ఏమి చెప్తుందా అని. బాబు నా కూతురు పారిజాతం ఇది. నాకు కరణం గారికి పుట్టింది. ఆయనే ఉంటే దీని పెళ్లి బాధ్యత ఆయనే తీసుకునే వారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నాకు రోజులు గడిచేకొద్దీ దీని పెళ్లి ఎలా చేయాలా అనే బెంగ ఎక్కువ అవుతూ ఉంది. చట్ట ప్రకారం రెండో భార్య గా నాకు రావాల్సిన ఆస్తులు ఇప్పించండి బాబు గారు. నేను వెళ్లిపోతాను అంటూ కాంతం మాట్లాడ్డం ఆపింది. 'కాంతం ఇలా ఆస్తులు అడుగుతుంది అని ఊహించని సూర్యనారాయణ గారు... నా అన్నయ్య కి ఒక్క ఆస్తి కూడా లేదు. ఉన్నది కొంచం కూడా వాడి తాగుడుకే అయ్యిపోయింది. నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు' అని అన్నారు. సరే బాబు నేను మీరు చెప్తున్నది నమ్ముతున్నాను. ఈ ఇంటిలో నా కూతురు కు కూడా భాగం ఉంది అని నాకు తెలుసు. నా కూతురు మీ ఇంటి వారసురాలు ...నేను కోర్ట్ ద్వారానే తేల్చుకుంటాను అని కాంతం అంది. ఎటూ తేల్చుకోలేకపోతున్న సూర్యనారాయణ గారు కోర్ట్ కి వెళ్తే ఉన్న పరువు కూడా పోతుంది , అంతే కాదు ఇంకా తన అన్న పేరు మీదే కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్ట్ కి వెళ్తే వాటిని కూడా కాంతానికి ఇవ్వాల్సి రావచ్చు. అని ఆలోచనలో పడ్డారు. ఆయన ఇంకేం మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశారు. కాసేపటికి బయటకి వచ్చి నీకు నాలుగు లక్షలు ఇస్తున్నాను. ఇక మీదట ఎప్పుడూ ఇటు వైపు రావద్దు. నీకూతురు నా అన్నకి పుట్టింది అని ఎవరికీ చెప్పద్దు. అని నాలుగు లక్షలు కాంతం చేతిలో పెట్టారు. నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న కాంతం ఇంకేం మాట్లాడకుండా బాబు గారి కాళ్ళకి దణ్ణం పెట్టవే అని పారిజాతానికి చెప్పింది. పారిజాతం సూర్యనారాయణ కాళ్ళకి దణ్ణం పెట్టడానికి వెళ్తుంటే ఆయన ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగాడు. అలా డబ్బులు తీసుకుని మళ్లీ ఇంటికి బయలుదేరారు కాంతం , పారిజాతం. ' దారిలో పారిజాతం కాంతాన్ని అడిగింది. ఎందుకమ్మా ఇంతకాలం నాకు నాన్న పిఠాపురం కరణం గారే అని చెప్పలేదు' అని. నీ మోహమే పిచ్చిదాన ఆయన నీకు నాన్న ఏంటి? ఎంతో కొంత ఆస్థి వస్తుంది కదా అని ఒక రాయి వేసి చూసా , అది గురిచూసి తగిలింది అంతే. ఇప్పుడు నువ్వు ఆయన కూతురువు కాదు అని చెప్పడానికి కరణం గారు కూడా ఎలాగు లేరు. అసలే పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం అని నాకు తెలుసు. కొంచం బెదిరించాను కోర్టుకు వెళ్తాను అని అంతే అంది కాంతం. కాంతం తెలివితేటలకు పారిజాతం మురిసి పోయింది. ఆరోజు రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చిన కాంతం , పారిజాతం తాళం వేసిన తలుపు గుమ్మానికి ఒక లెటర్ ఉండడం గమనించారు. ఈ ఉత్తరం ఎవరు రాసి ఉంటారు? నాకు ఉత్తరం రాసే వాళ్ళు ఎవరు.? ఎవరికైనా వచ్చింది పొరబూటు గా ఇక్కడ కానీ పెట్టారా ? అసలు ఇందులో ఏముంది ? అంటూ ఉత్తరం తెరిచింది. ఆ ఉత్తరం చూస్తే పోస్ట్ లో వచ్చినట్టు లేదు. ఎవరో రాసి ఇక్కడ పెట్టినట్టు గా ఉంది. ' గౌరవనీయులైన కాంతం గారికి నా పేరు భానుమూర్తి. నేను పట్నం లో ఉన్న మహారాజా కాలేజీ లో లెక్చరర్ ని. మిమ్మల్ని కలవడానికి ఈరోజు వచ్చాను. కానీ మీరు అందుబాటులో లేరు. మీరు వచ్చాకా క్రింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ' అని లెటర్ లో ఉంది. ఇంతకీ ఎవరు ఈ భానుమూర్తి. నన్ను ఎందుకు కాల్ చేయమన్నాడు ? అని ఆలోచనలో పడింది కాంతం. అప్పటికే బాగా అలిసిపోయిన కాంతం , పారిజాతం రేపు కాల్ చేయచ్చు లే అని ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లారు. ఇక ఆ రాత్రికి కొంచం వండుకుని తిని పడుకున్నారు. తరువాత రోజు కాంతం , పారిజాతం గదిలో కూర్చుని నాలుగు లక్షలు ఏమి చేయాలా అని ఆలోచనలో పడ్డారు. చివరికి వాటిని ఊర్లో వడ్డీలకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మధ్యాన్నం మంత్రసాని రామకృష్ణ పారిజాతం దగ్గరకి వచ్చాడు. నీకు కోనసీమ లో ఉన్న మా ఫ్యాక్టరీ చూపిస్తాను. దానితో పాటు కోనసీమ అందాలు అన్నీ చూపిస్తాను రేపు నాతో వస్తావా అని అడిగాడు. పారిజాతం మా అమ్మని అడుగు. అని చెప్పింది. పక్కనే ఉన్న కాంతం ' రావడానికి ఏమీ అభ్యంతరం ఏమీ లేదు బాబు. కానీ అది చిన్న పిల్ల కదా , ఒక్కదాన్ని పంపడానికి కే ఆలోచిస్తున్నాను. ' అంది. మీరు ఇద్దరు రండి మీకు అన్నీ చూపిస్తాను అన్నాడు రామకృష్ణ. అనుకున్నట్టుగానే తరువాత రోజు ఉదయమే మంత్రసాని రామకృష్ణ కారు తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి కోనసీమ బయలుదేరారు. యానాం దాటినదగ్గర నుండి రోడ్ పక్కన ఉండే కొబ్బరి తోటలు , పిల్లకాలువలు, నిండుగా పళ్ళతో ఉన్న పనస చెట్లు , పచ్చని పొలాలు , అక్కడక్కడ అరటి తోటలు, ఇవన్నీ చూస్తుంటే కాంతానికి , పారిజాతనికి భూమి పైనే స్వర్గం ఉన్నట్టు అనిపించింది. వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల ఆగి ఫోటోలు తీసుకున్నారు. లొకేషన్స్ బావున్నాయి అని సంబరపడిపోయారు. ముమ్మిడివరం చేరుకున్నాక టిఫెన్స్ చేద్దాం అని ఆగారు. ఇక్కడ ఏం టిఫెన్స్ బావుంటాయి ? అని అడిగింది కాంతం. హోటల్ సూరిబాబు పొట్టిఇక్కలు అన్నాడు. కాంతానికి అర్ధం కాలేదు. అనుమానం గా మొహం పెట్టి ఏంటి ? అంది. రామకృష్ణ పొట్టిఇక్కలు అన్నాడు. అంటే పనస ఆకులను గుండ్రంగా చుట్టి మధ్యన ఇడ్లీ పిండి పెట్టి , ఆవిరి మీద ఉడికిస్తారు. వాటిని అల్లం తో చేసిన పచ్చడి తో తింటే భలే ఉంటుంది ' అని చెప్పాడు. సరే అవే రుచి చూద్దాం అని పారిజాతం అంటే, అందరూ సరే అన్నారు. పొట్టిఇక్కలు తిని బయలుదేరుతుంటే పక్కనే ఒక మొక్క కనపడింది. ఎప్పుడూ ఆ మొక్కని చూడని పారిజాతం ఇదేం మొక్క అని అడిగింది. రామకృష్ణ 'అది కంద మొక్క. ఇక్కడ మట్టి మంచిది . ఏమొక్కలు వేసినా ఇట్టే బతికేస్తాయి' అన్నాడు. మళ్లీ అందరూ పాసర్లపూడి కి బయలుదేరారు. పాసర్లపూడి దగ్గరలోఉండగా పారిజాతం కొబ్బరి బొండాలు తాగుతా అంది. కోనసీమ వచ్చికొబ్బరి నీళ్లు తాగకపోతే ఎలా ? తప్పకుండా తాగుదాం. మా ఫ్యాక్టరీ లో అన్నాడు రామకృష్ణ. కొంత సేపు ప్రయాణం తర్వాత పాసర్లపూడి లో ఉన్న రామకృష్ణ ఫ్యాక్టరీ లోకి వెళ్లారు అందరూ. ఇక్కడ కొబ్బరి నీళ్ల ను ప్లాస్టిక్ సీసాల్లోకి ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కొబ్బరి తోట లు తో పచ్చగా ఉండేది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టారు. ఫ్యాక్టరీ లో కి వెళ్ళగానే కాంతానికి, పారిజాతానికి లేత కొబ్బరి నీళ్లు తెప్పించాడు రామకృష్ణ. కాసేపు కూర్చుని కాంతం, పారిజాతం మాట్లాడుకుంటుంటే రామకృష్ణ ఇప్పుడే వస్తాను అని ఎక్కడికో వెళ్ళాడు. కాంతం , పారిజాతం మాట్లాడుకుంటుంటే దూరం నుండి ఒక వ్యక్తి పారిజాతం కేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు. పారిజాతం అతన్ని గమనించింది. కానీ ఎందుకు అలా చూస్తున్నాడు అన్నది పారిజాతానికి అర్ధం కాలేదు. అతను అలా చూడడం పారిజాతానికి కొంచం ఇబ్బంది గానే ఉంది. తల్లికి అతని గురించి చెప్పుదామా అని అనుకుంది. కానీ ఈలోపే రామకృష్ణ వచ్చేసాడు. మీరు ఇద్దరూ ఫ్యాక్టరీ చూడండి. అని మురుగన్ అని గట్టిగా పిలిచాడు. కొంచంసేపటి క్రితం పారిజాతం కేసి చూసిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. మురుగా వీళ్లకి ఫ్యాక్టరీ అంతా బాగా చూపించు. నేను ఇప్పుడే బయటకి వెళ్లి వస్తాను అని రామకృష్ణ మళ్లీ బయటకి వెళ్ళిపోయాడు. రామకృష్ణ చెప్పిన మురుగన్ పారిజాతం కేసి చూస్తూ రండి అన్నాడు. కాంతం, పారిజాతం అతని వెంట ఫ్యాక్టరీ చూడడానికి వెళ్లారు. ముందుగా పెద్ద గోడౌన్ లాంటి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడకు బయట నుండి కొబ్బరి కాయలు లారీ లలో వస్తాయి. ఇక్కడ నిల్వ చేస్తాం. అని చెప్పి, పెద్ద హాల్ లా ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏవో యంత్రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కొబ్బరి నీళ్లను , కొబ్బరి కాయలు లో నుండి ఎలా తీస్తారు. ఎలా ప్యాకింగ్ చేస్తారు అన్నీ వివరించాడు. మధ్య మధ్యలో పారిజాతం కేసి చూస్తూ ఉన్నాడు. అతను మాట్లాడే టప్పుడు కూడా కాంతం కేసి చూడ కుండా పారిజాతం కేసే చూస్తున్నాడు. అప్పుడే కాంతం, పారిజాతం ఊహించని సంఘటన జరిగింది. మురుగన్' పారిజాతనికి ఎదురు గా వచ్చి మిమ్మల్ని ఒకటి అడగచ్ఛా' అని అడిగాడు. ' ఆ ఏంటి అడగండి ? ' అనుమానం తో కూడిన భయం తో అంది పారిజాతం. 'మీకు అభ్యతరం లేకపోతే మిమ్మల్ని చెల్లి అని పిలవచ్చా !! ' అన్నాడు మురుగన్. 'అదేంటి ఆ మాత్రం దానికి అభ్యతరం ఏం ఉంటుంది బాబు ' అంది కాంతం. 'ఐనా నాలాంటి అందమైన అమ్మాయి కనపడితే వెనక తిరిగే అబ్బాయిల ను చూసాను. కానీ మీరు ఏంటి ఇలా చెల్లి అంటాను అంటారు ? ' అని అడిగింది పారిజాతం. ' మీకు కడలూరు తెలుసా ? అని అడిగాడు మురుగన్. కాంతం ,పారిజాతం చెప్పే సమాధానం కోసం చూడకుండా మళ్లీ చెప్పడం ప్రారభించాడు. కడలూరు తమిళనాడు లో ఉంది. మాది ఆ ఊరే. నేను ఈ ఫ్యాక్టరీ లో టెక్నిషన్ గా పని చేస్తున్నాను. మా అమ్మానాన్న కడలూరు లొనే ఉంటారు. మాది ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం. నేను చెల్లి అమ్మ నాన్న . ఒక చిన్న ఇల్లు. ఇంటి బయటకి వచ్చిచూస్తే కనపడే సముద్రం. రాత్రిళ్లు వినపడే ఆ సాగర గోష . సెలవుల్లో ఆ సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెలు లో గడిపిన క్షణాలు అన్నీ ఎన్నో మధుర జ్ఞాపకాలు. నాన్న స్కూల్ టీచర్ గా పని చేసేవారు. ఎంతో సంతోషం గా ఉన్న మా జీవితాలలో అనుకోని విషాదం మా చెల్లి మాకు దూరమవ్వడం. ఆరోజు డిసెంబర్ 26 ,2004 . ఒక్కసారిగా సముద్రానికి కోపం వచ్చినట్టు కెరటాలు ఎగిసిపడ్డాయి. దానినే సునామి అన్నారు. ఈ సునామి లో 8000 మంది చనిపోయారు. కొంత మంది కనపడకుండా పోయారు. వారిలో నా చెల్లి కూడా ఉంది. దేవుడి దయవలన అమ్మ నాన్న కు ఏం కాలేదు. నాకు ఎంతో ఇష్టమైన చెల్లి అలా దూరం అయ్యింది. చెల్లి కూడా నీలాగే ఉండేది. అందుకే నిన్ను చూడగానే చెల్లి ని చూసినట్టు అనిపించింది. అందుకే నిన్ను అలా అడిగాను. అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. మురుగన్ మాటలు విన్న కాంతం, పారిజాతం బాగా ఎమోషనల్ అయ్యారు. కాంతం ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అని కళ్లు తుడుచుకుంది. కాంతం మురుగన్ కేసి చూసి...ఈరోజు నుండి పారిజాతం నీ చెల్లి బాబు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ చెల్లి ని చూడడానికి రావచ్చు. ఎటువంటి అభ్యతరం లేదు. అని చెప్పింది. కాంతం మాటలు విన్న మురుగన్ చాలా సంతోషించాడు. తర్వాత ఇంకా తన చిన్నతనం గురించి , కుటుంబం గురించి చెప్తూ మిగిలిన ఫ్యాక్టరీ అంతా చూపించాడు. ఆ కొద్ధి సమయం లొనే కాంతం, పారిజాతం మురుగన్ కి బాగా దగ్గరయ్యారు. ఆ మాటల్లో కాంతం తన మనసులో మాట బయట పెట్టింది. 'బాబు మా పారిజాతాన్ని , మీ ఓనర్ రామకృష్ణ కు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అబ్బాయి ఎలాంటి వాడు. ' అని అడిగింది. కాంతం మాట విన్న మురుగన్ అయోమయం గా మొహం పెట్టాడు. అదేంటి రామకృష్ణ గారికి ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు కూడా కదా అన్నాడు. మురుగన్ మాటలు విన్న కాంతం ' అప్పటి వరకు ఎప్పుడు రామకృష్ణ ను ఈ విషయం అడగకపోవడం మా తప్పే. మేమే పొరబాటు బడి ఆశలు పెంచుకున్నాం. ' ఐనా పెళ్లి అయ్యిపోతే రామకృష్ణ ఎందుకు మరి మా పంకజానికి దగ్గరగా ఉంటున్నాడు. కలవడానికి ఎక్కువగా వస్తున్నాడు. 'ఐనా కారు అద్దాలే పూర్తిగా దింపి మనుషులతో మాట్లాడని వాళ్ళు , చలువ కళ్లు అద్దాలు తీసి మా లాంటి పేద వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటేనే ఏదో దురుద్దేశ్యం ఉందని గ్రహించకపోవడం మా తప్పే ' అని కాంతం బాధ పడింది. కాంతం మాటలు విన్న మురుగన్ 'బాధపడకండి. మీకు తెలియదు కదా రామకృష్ణ గారి చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు మోసపోయారు.' దేవుడు దయవలన మీరు ముందుగానే తెలుసుకోగలిగారు. ఇప్పటికైనా జాగ్రత్త గా అతనికి దూరం గా ఉండండి' . అన్నాడు. కాంతం దూరంగా ఉండడం కాదు. ఇలాంటి వాడికి బుద్ది వచ్చేలా చేస్తాను. కాంతం అంటే ఏంటో చూపిస్తాను అని శపథం చేసింది. అంటే ఏం చేస్తావ్ అమ్మ ? అని అడిగింది పారిజాతం. 'అన్నీ చెప్తా. ప్రస్తుతానికి ఐతే నువ్వుఎప్పటిలాగే అతని తో ఉండు' అని చెప్పింది కాంతం. మురుగన్ , చెల్లి నేను ఈ విషయం మీకు చెప్పినట్టు రామకృష్ణ గారికి తెలియకూడదు. తెలిసింది అంటే నా ఉద్యోగం పోతుంది. నేను , నా కుటుంబం రోడ్ న పడతాం.అన్నాడు. వెంటనే కాంతం ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉంటుంది నాది హామీ అని మురుగన్ కి చెప్పింది. ఈ లోపు రామకృష్ణ వచ్చాడు. ఫ్యాక్టరీ అంతా చూపించావా అని మురుగన్ ని అడిగాడు. చూపించాను సర్ అన్నాడు మురుగన్. 'సరే ఇంక బయలుదేరదాం ' అని కాంతానికి , పారిజాతనికి చెప్పాడు రామకృష్ణ. వాళ్ళు కారు బయలుదేరగానే మురుగన్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసాడు. మన ప్లాన్ అనుకున్నట్టుగానే జరిగింది. .... భానుమూర్తి కాల్ చేయమని చెప్పిన విషయం కాంతం మర్చిపోయింది. ఆరోజు భానుమూర్తి కాంతం ఇంటికి వచ్చి లెటర్ పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు సామర్లకోట బ్రిడ్జి దాటి కాకినాడ వైపు వెళ్తున్నప్పుడు వెనకనుండి లారీ ఢీకొంది. ఆ ప్రమాదం రాత్రిపూట జరగడం తో వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లేవారు ఎవరూ లేకపోయారు. పెట్రోల్ పోలీసులు వచ్చి ఆసుపత్రి లో చేర్పించేటప్పటికి చాలా రక్తం పోయింది. డాక్టర్లు కృషి వలన ప్రాణం నిలబడింది. కానీ భానుమూర్తి కోమాలో ఉన్నాడు. అసలు భానుమూర్తి కాంతం దగ్గరకి ఎందుకు వచ్చాడు ? * * * *** *** రామకృష్ణ ఫ్యాక్టరీ నుండి తిరిగి బయలుదేరిన కాంతం , పారిజాతం రామకృష్ణ తో మాట్లాడుతున్నారు కానీ ఆ మాటలు ఇంతకు ముందు లా మనసులోనుండి రావడం లేదు. పారిజాతం అమ్మ మీద ఉన్న ప్రేమతో , భయం తో కాంతం చెప్పినట్టు గా చేస్తూ ఉంది. కానీ పారిజాతం మనసులో ఉన్నది ఎవరు అనేది కాంతం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. చిన్నతనం నుండి మగతోడు లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన తల్లి అంటే పారిజాతనికి ప్రాణం. తల్లి చెప్పేది తప్పేనా , ఒప్పేనా తల్లి మాట వినాలి అని పారిజాతం ఎప్పుడో నిర్ణయయించుకుంది. అందుకే తన మనసులో ఉన్న మాట కూడా ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయలేదు. **** **** *** ఊర్లోకి అక్క బావలను చూడడానికి బండారు లంక నుండి వచ్చిన రామాలయం పూజారి గారి బావమరిది భాస్కరం తిరిగి బండారులంక వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ రామాలయం పూజరిగారు ' ఇక్కడే ఉండు, నీకు ఒక గుడి ఇప్పిస్తాను , నాకు సహాయం గా ఉంటావు అని అనడం తో ఇక్కడే ఉండిపోయాడు. ప్రస్తుతం తన బావగారు ఐన రామాలయం పూజరిగారికి సహాయం గా ఉంటున్నాడు. బండారు లంక లో ఒంటరిగా ఉంటున్న భాస్కరం తన అక్క బావ మాట కాదు అనలేకపోయాడు. ప్రతీ రోజు గుళ్లో పూజ చేయడానికి అవసరమైన పూజా ద్రవ్యాలు తీసుకురావడం, పూజ అయ్యిపోయాక కొంత మంది భక్తులకి ప్రసాదాలు ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వడం వంటి వాటిలో సహాయం గా ఉంటున్నాడు. స్వతహాగా భాస్కరం మంచి మాటకారి అవ్వడం తో తక్కువ కాలం లొనే ఊళ్ళో మంచి పరిచియాలే ఏర్పడ్డాయి. వారం వారం రామాలయం లో పూజ చేయించుకునే కాంతానికి భాస్కరం అప్పుడప్పుడు తీసుకెళ్లి ప్రసాదం ఇచ్చేవాడు. అలాంటి సందర్భాలలో భాస్కరం తో పరిచయం పెంచుకున్న పారిజాతం అతని పై ఉన్న ఇష్టాన్ని తన మనసులో ఉంచుకుంది. భాస్కరాన్ని ఇష్టపడినా తనతో ఏడు అడుగులు నడవడం అసాధ్యమని తనకి తెలుసు. తనతల్లి మనసులో ఎప్పుడూ తనని ఒక ఉన్నతమైన కుటుంబానికి పంపాలనే ఉంటుంది. అంతే కాదు తన మనసులో మాట తనకి తెలిసినా పరిస్థులు ఎలా ఉంటాయో తాను ఊహించుకోగలదు. *********** పాసర్లపూడి నుండి వచ్చిన తర్వాత రోజు కాంతం భానుమూర్తి కి ఫోన్ చేద్దామని , ఆ లెటర్ కోసం వెతికింది. ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. కానీ భానుమూర్తి కి ప్రమాదం జరిగింది అని ప్రస్తుతం కోమాలో ఉన్నాడని ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు చెప్పారు. కాంతానికి భానుమూర్తి ఎందుకు కాల్ చేయమన్నాడు అనేది ఒక జవాబు దొరకని ప్రశ్న గా మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు కాలమే సమాధానమే చెప్పాలి. రామకృష్ణ ఓరోజు తన పుట్టినరోజు ఉంది పార్టీ కి రమ్మని ఆహ్వానించాడు పారిజాతాన్ని, కాంతాన్ని . కాంతం రాలేము అని చెప్పుదామా అనుకుంది. కానీ రామకృష్ణ మనసులో ఏముందో తెలిసుకోవాలి, అంతే కాదు ఈ పార్టీ కి రామకృష్ణ కుటుంబ సభ్యులు వస్తే తన భార్య ను కూడా చూడచ్చు.... అని ' వస్తాము' అని చెప్పింది. రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు వాళ్ల మామిడితోటలో ఏర్పాటు చేశారు. మామిడి తోట చాలా పెద్దది. మామిడితోట చుట్టూరా పెద్ద ప్రహరీ గోడ ఉంది. తోటలోకి వచ్చే ఎంట్రెన్స్ లో పెద్ద గేట్లు ఉన్నాయి. పక్కనే వాచ్ మేన్ నుంచుని 24 గంటలు ఈ తోటకు కాపలా కాస్తూ ఉంటాడు. లోపల రామకృష్ణ గెస్ట్ హౌస్ కూడా ఉంది. వారంతాలలో రామకృష్ణ ఇక్కడకు స్నేహితలతో వచ్చి మందు పార్టీ చేసుకుంటూ ఉంటాడు. పార్టీ కి చాలా వైభవం గా ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీ కి రామకృష్ణ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. పాసర్లపూడి ఫ్యాక్టరీ లో పనిచేసే కింతమంది స్టాఫ్ కూడా వచ్చారు. వారిలో మురుగన్ కూడా ఉన్నాడు. కాంతాన్ని, పారిజాతాన్ని రామకృష్ణ ఆ పార్టీ లో చాలా ప్రత్యేకంగా చూసుకున్నాడు. కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. కాంతం కళ్ళు మాత్రం రామకృష్ణ భార్య ఎక్కడ అని వెతుకుతూనే ఉన్నాయి. రామకృష్ణ భార్య గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి ? ఈ పార్టీ కి భార్య ను తీసుకురాలేదా ? కనీసం తన పిల్లలు ను ఐనా తీసుకుని రావాలి కదా అని తన మనసులోనే అనుకుంది. రామకృష్ణ అమ్మ నాన్న అందరూ వచ్చారు కదా మరి భార్య ఎక్కడ ఉంది ? అని ఆలోచిస్తూనే ఉంది. పార్టీ జరుగుతున్న సందర్భం లొనే ఆ తోట లో కుడివైపున ఉన్న గెస్ట్ హౌస్ హాల్ లో మురుగన్ ఒకపక్కగా నుంచున్నాడు. సోఫా లో కూర్చుని ఉన్న ఆమె మురుగన్ తో మాట్లాడుతుంది....... పార్టీ అంతా అయ్యిపోయింది కానీ కాంతం సందేహాలు తీరలేదు. పైగా కొత్త సందేహాలు కాంతం మనసులో పుట్టాయి. పాసర్లపూడి లో చెల్లి చెల్లి అని పిలిచిన మురుగన్ పార్టీ లో కాంతాన్ని, పారిజాతాన్ని పలకరించకుండా తప్పించుకు తిరిగాడు. అంతే కాదు కాంతం మురుగన్ దగ్గర ఉండి తమని చూసుకుంటాడాని అనుకుంది. అవకాశం దొరికితే రామకృష్ణ భార్య గురించి మురుగన్ ని అడగాలని కూడా అనుకుంది. కానీ మురుగన్ ఆ అవకాశం ఇవ్వకుండా బిజీ బిజీ గా ఉన్నట్టు తప్పించుకు తిరిగాడు. మురుగన్ ఎందుకు ఇలా చేసాడు అనేది కాంతానికి అర్ధం కాలేదు. పారిజాతం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన లోకం లో తాను ఉంది. కేవలం తల్లి చెప్పింది కాబట్టి మాత్రమే ఈ పార్టీ కి వచ్చింది. పార్టీ అయ్యిపోయాకా రామకృష్ణ కారు డ్రైవర్ ని పిలిచాడు. కాంతాన్ని పారిజాతాన్ని ఇంటిదగ్గర దింపమని చెప్పాడు. ****** పారిజాతం ఈ మధ్యకాలం లో ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంది. మనసు బాగోలేదు ఏమో , ప్రశాంత త కోసం అనుకుంది కాంతం. కానీ పారిజాతం పూజరిగారి బావమరిది భాస్కరం కోసమే గుడికి వెళ్తుంది అని తెలుసు కోలేకపోయింది. ఊళ్ళోకి ఏదో సినిమా షూటింగ్ కోసం చెన్నై నుండి కొంతమంది వచ్చారు. వీరిలో నల్లగా పొట్టిగా ఉన్న వేణు అనే ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు. ఎవరితో ఐనా ఇట్టే కలిసిపోగల వేణు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. సినిమా వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాల కోసం కాంతం దగ్గరకి వచ్చాడు వేణు. అరవం మిక్స్ అయిన తెలుగు లో మాట్లాడే ఇతను కాంతాన్ని ఇక్కడ షూటింగ్ ఉన్నన్ని రోజులు మూడుపుటలా వండి పెట్టమని అడ్వాన్స్ ఇచ్చాడు. ***. *****. *****. ***** రామకృష్ణ ఈ మధ్యన పారిజాతం దగ్గరకి రావడం తగ్గించాడు. కారణం ఏమయ్యి ఉంటుంది. అనుకున్న కాంతానికి ఆ రోజే సమాధానం దొరికింది. రామకృష్ణ కారు డ్రైవర్ సాయంత్రం కాంతం హోటల్ కి వచ్చాడు. అతన్ని చూసి గుర్తుపట్టిన కాంతం. మీ రామకృష్ణ సార్ రావడం లేదు ఏమిటి ? అని అడిగింది మీకు తెలియదా మా సార్ కి పెళ్లి కదా ! పెళ్లి పనుల్లో బిజీబిజీ గా ఉన్నారు అన్నాడు. రామకృష్ణ కు పెళ్లా అంటే మురుగన్ గాడు అంతా అబద్ధం చెప్పాడు అన్నమాట. ఈ మురుగన్ గాడి మాటలు వినడం వలన బంగారు కోడి పుంజు లాంటి రామకృష్ణ నా చేతుల్లో నుండి జారిపోయాడు. కోట్ల రూపాయల ఆస్తి వదులుకోవాల్సి వచ్చింది. మురుగన్ కి అబద్ధం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ? అని ఆలోచించసాగింది. ******* రామకృష్ణ తల్లి సావిత్రమ్మ. వ్యాపార వ్యహారాలు, కుటుంబ వ్యవహారాలు పేరుకే మంత్రసాని రాంబాబు (రామకృష్ణ తండ్రి) గారి పేరు మీద జరుగుతాయి. కానీ వాస్తవానికి అన్నీ నడిపించేది సావిత్రమ్మ గారే. ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, వాటి లాభనష్టాలు ఎంత అనే అంశాలు అన్నీ సావిత్రమ్మ గారి నాలుకమీద ఉంటాయి. అకౌంట్స్ బుక్స్ వాసన చూసి తేడాలు ఎక్కడ ఉన్నాయో చెప్పేసేటంతటి సమర్థురాలు. ఏదైనా ఆమె అనుకున్నది అంటే అది అయ్యి తీరాలి. లేదంటే ఎంతకైనా తెగిస్తుంది. అందుకే సావిత్రమ్మ గారి ని 'లేడీ డాన్ ' అని పిలుస్తూ ఉంటారు ఆమె గురించి తెలిసిన వాళ్లంతా . రామకృష్ణ ఈ మధ్యకాలం లో పారిజాతనికి దగ్గర అవుతున్నాడు అని వేగుల ద్వారా మొదట తెలుసుకున్నది సావిత్రమ్మ గారే. రామకృష్ణ కు ఎప్పుడో నచ్చచెప్పింది పారిజాతానికి దూరం గా ఉండమని. కానీ రామకృష్ణ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. తరువాత పారిజాతాన్ని, కాంతాన్ని తీసుకుని పాసర్లపూడి వెళుతున్నాడు అని తెలిసినప్పుడు మురుగన్ ద్వారా కధ నడిపించింది సావిత్రమ్మ గారే. రామకృష్ణ పుట్టినరోజు నాడు గెస్ట్ హౌస్ లో మురుగన్ తో మాట్లాడింది కూడా సావిత్రమ్మ గారే. ******* పుట్టినరోజు పార్టీ తరువాత రోజు మంత్రసాని రాంబాబు గారు (రామకృష్ణ తండ్రి) తన గదిలో కూర్చుని రామకృష్ణ ను పిలిచారు. 'కృష్ణ ప్రస్తుతం పరిస్థులు అన్నీ నీకు తెలుసు. నీ పెళ్ళికోసం నేను మీ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నీకు తెలుసు. అలాగే శ్రీవల్లి , వాళ్ల కుటుంబం కూడా నిన్నే నమ్ముకుంది అన్న విషయం నీకు తెలుసు. కానీ నువ్వు మా మాట కాదని ఎవరినో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు అని మాకు తెలిసింది. ఇప్పటికైనా నీ పద్దతి మార్చుకో' అని మందలించారు. ******* భానుమూర్తి ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కోలుకుని స్పృహ లోకి వస్తాడా అని , ఆయన కుటుంబ సభ్యులు , కాంతం కూడా ఎదురు చూస్తున్నారు. ***** ప్రొడక్షన్ మేనేజర్ వేణు ఊర్లో షూటింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. రోజూ అక్క అక్క అంటూ కాంతం దగ్గరకి వచ్చి సినిమా వాళ్ల గురించి కబుర్లు చెప్తున్నాడు. ఓరోజు ఈ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ వేణు కాంతానికి ఎప్పుడూ లేని ఒక కొత్త ఆశను పుట్టించాడు. ' అక్క నువ్వు పారిజాతాన్ని సినిమాల్లోకి తీసుకు వచ్చావ్ అంటే నీకు డబ్బే డబ్బే.' నీ జీవితం మొత్తం సెట్ అయ్యిపోతుంది. నాకు సినిమా రంగం లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు , పారిజాతం కలిసి చెన్నై వచ్చేయండి. అంతా నేను చూసుకుంటాను అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ వేణు. కాంతానికి ఎక్కడో కొంచం ఆశ కలిగింది. కూతురును సినిమాల్లోకి తీసుకు వెళ్తే తప్పేముంది. ఆ సినిమా హీరోయిన్లు కన్నా నా కూతురు అందం గానే ఉంటుంది. సరే తమ్ముడు ఆలోచించి రేపు చెప్తాను అని వేణు కి చెప్పింది. ******* ***** సావిత్రమ్మ గారు చెప్పిన మాట రామకృష్ణ పట్టించుకోకపోవడం తో కాంతానికి వార్నింగ్ ఇవ్వమని తన తమ్ముడు కు చెప్పారు సావిత్రమ్మ గారు. ఆరోజు కాంతానికి వార్నింగ్ ఇద్దామని వచ్చిన సావిత్రమ్మ గారి తమ్ముడు భానుమూర్తి కాంతం లేకపోయేసరికి కాల్ చేయమని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ ప్రమాదం జరగపోతే భానుమూర్తి కాంతానికి వార్నింగ్ ఇచ్చేవాడే రామకృష్ణకు దూరం గా ఉండమని. కానీ ఆ ప్రమాదం వలన ఇప్పుడు ఇంకా కోమా లోనే ఉన్నాడు భానుమూర్తి. *** **** **** **** సావిత్రమ్మ గారికి తన తమ్ముడు కూతురు , మేనకోడలు ఐన శ్రీవల్లి ని రామకృష్ణ కు ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటినుండో కోరిక. రామకృష్ణ కు మేనమామ భానుమూర్తి ని చూపించి ప్రతీ రోజు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మొత్తానికి పెళ్లికి ఒప్పించారు. శ్రీవల్లి రామకృష్ణ ల పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ****** ***** కాంతం సినిమా ప్రొడక్షన్ మేనేజర్ వేణు కి చెన్నై వస్తామని చెప్పేసింది. నువ్వే దగ్గర ఉండి మాకు అన్ని చూసుకోవాలి అని చెప్పింది. ' నీకు ఎందుకు అక్క నేను ఉన్నాను కదా..! రేపు మా సినిమా షూటింగ్ అయిపోతుంది. వారం రోజులు ఆగి నువ్వు పారిజాతం చెన్నై మెయిల్ ఎక్కి వచ్చేయండి. నువ్వు వచ్చేటప్పటికి నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని రెడీ గా ఉంచుతాను. ' అన్నాడు. సరే అన్న కాంతం ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి , అక్కడ ఏర్పాట్లు చేయడానికి వేణుకు కొంత డబ్బు ఇచ్చింది. ఊళ్ళో వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరికీ త్వరగా తిరిగి ఇచ్చేయమని చాలా అవసరం ఉంది అని చెప్పింది. ******** ****** కాంతం, పారిజాతం లగేజీ మొత్తం సర్దేసుకున్నారు. ఉన్న కొన్ని సామానులు ఒక గదిలో వేసి తాళం వేసేశారు. తరువాత రోజు ఉదయం 5గంటలకే రైలు. తెల్లారింది. కాంతం కోటి ఆశలతో చెన్నై లో తన భవిష్యత్ పరీక్షించు కోవడానికి మేలుకుంది. పారిజాతం కనపడలేదు. ముందు రోజు రాత్రే పూజరిగారి బావమరిది భాస్కరం తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇల్లంతా వెతికింది కాంతం. ఊళ్ళో వాళ్లకు తెలిస్తే మళ్లి లేచిపోయింది అంటారు. తనకు తెలుసు. అందుకే తెల్లవారే లోగా పారిజాతాన్ని తీసుకు రావాలి అనుకుంది. తనకు తెలుసు పారిజాతం కచ్చితంగా రామకృష్ణ తోనే వెళ్ళిపోయింది అనుకుంది. రామకృష్ణ ఇంటికి బయలుదేరింది. అక్కడ రామకృష్ణ పెళ్లి చేసుకుంటున్నాడు. కల్యాణ మండపం లో శ్రీవల్లి రామకృష్ణ ఉన్నారు. కాంతాన్ని అస్సలు అర్ధం కాలేదు. తనకుతూరు ఎక్కడికి వెళ్లిందో....ఎవరితో వెళ్లిందో ...! ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక ఉత్తరం కనిపించింది. అది పారిజాతం రాసిన లేఖ. ' అమ్మా నా గురించి వెతకద్దు. నేను అంటే నీకు ఇష్టమని తెలుసు. కానీ నా మనసు నువ్వు ఎప్పుడూ తెలుసుకోలేదు. ఎంతసేపు డబ్బుకు విలువ ఇచ్చావే కానీ నా మనసు ఏంటి ? నా మనసులో ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉంటే ఆ చెన్నై లో ఎవరికో ఒకరికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తావ్. అందుకే నేను నాకు నచ్చిన వాడితో వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించు. లేఖ చదివిన కాంతానికి తాను చేసిన తప్పు తెలిసింది. ఎప్పుడూ తనకు అన్నీ ఇస్తున్నాను, తనకు భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాను అనుకున్నానే కానీ , తన మనసు తెలుసుకోలేకపోయాను అని కుమిలి కుమిలి ఏడిచింది. ***** పారిజాతం ఎప్పటికైనా తిరిగి రాకపోతుందా అని కాంతం ఎదురు చూస్తూ ఉంది. మళ్లీ దోసెలు వేస్తూనే ఉంది. *****సమాప్తం****

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు