అక్కడ నిన్నటి దాకా అంపశయ్య మీద ఉన్న ప్రజాస్వామ్యం ఒక్కసారిగా ఊపిరి కోల్పోయింది. మతఛాందసం నరనరాల జీర్ణించుకుపోయిన ముష్కరమూకలు ఆఫ్ఘనును హస్తగతం చేసుకున్నాయి. ఏ క్షణం వారి దారుణానికి బలి కావలసి వస్తుందోనని గడప గడప భయంతో బిక్కుబిక్కుమంటున్నది. ఎవరూ ధైర్యం చేసి బయటకు రాలేక పోతున్నారు. వస్తే ఎక్కడ కాల్చివేస్తారోనని భయం. వాళ్ళకు భయపడి ఇక్కడే ఉండిపోతే భవిష్యత్తు అంధకారమై పోతుందనే భావన. అందుకే తెగించి దొంగచాటుగా బయటకు వచ్చి విమానాశ్రయాలను చేరుకుంటున్నారు చాలామంది. ప్రవాసులుగా అక్కడే ఉండిపోతే ఎన్ని విపత్కర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో, వారి ఊహలకు అందడం లేదు. అందుకే అర్థరాత్రి వేళ చప్పుడు కాకుండా బయలుదేరి విమానాశ్రయం చేరుకుంటున్నారు. ఆక్రమించుకున్న దేశాన్ని ఎలా పరిపాలించాలో అర్థంకాక తలమునకలవుతున్న మూకలు, వాళ్ళ హడావుడిలో వారు ఉండిపోయి, కాస్త పట్టు సడలించాయి. అదే అదనుగా విదేశాలు విమానాల సంఖ్యను పెంచాయి. మరీ కట్టుదిట్టం చేస్తే పరిస్థితులు ఎలా పరిణమిస్తాయోనని భయపడి, తమ దేశంలో స్థిరపడిన వారిని తిరిగి వెళ్ళడానికి అనుమతించింది ముష్కరమూక. కానీ ఎవరైనా తమ దేశస్థులు కనుక వేరే దేశం వెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం శిక్షలు దారుణంగా ఉంటాయని ప్రకటించింది. విమానాశ్రయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎదురు తిరిగిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తున్నది. ******* రిత్విక్, షాలిమా ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న సమయంలో భారతదేశం నుంచి ఉద్యోగరీత్యా వచ్చిన రిత్విక్ కు షాలిమా పరిచయమవడం, అది ప్రేమగా మారి ఒకటికావడం జరిగింది. వాళ్ళకు రెండు సంవత్సరాల పాప కూడ ఉన్నది. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మతం మార్చుకున్న వారన్నా, కులాంతర వివాహాలు చేసుకున్న వారన్నా విపరీతమైన ద్వేషం. అటువంటి వారిని నిలువునా కాల్చివేసినా ఆశ్చర్యం లేదు. "షాలిమా ఇప్పుడేమి చేయాలి. బయటకు వెళ్ళి ఎలాగోలా విమానాన్ని పట్టుకుని వేరే దేశం పారిపోదామంటే, ఎక్కడ ఎవరు ఆపి గుర్తింపుకార్డు చూసి నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తారో, లేక జైలులో పెట్టి హింసిస్తారో అర్థంకావడం లేదు. ఈ పరిస్థితులలో మనం బయటపడేదెలా?" "రిత్విక్ భయపడుతూ కూర్చుంటే మనం ఏదీ సాధించలేము. ఎలాగోలా బయటపడే మార్గం ఆలోచించాలి. నువ్వు భారతీయుడివి కాబట్టి నిన్ను అడ్డగించకపోవచ్చు. కానీ నన్ను మాత్రం పోనివ్వరు. కనీసం మన బిడ్డకైనా అనుమతి ఇస్తే, మీరిద్దరూ వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటాను. పరిస్థితులు అనుకూలిస్తే నేను కూడ అక్కడికి వస్తాను. లేకుంటే ఇక్కడే రాలిపోతాను" కళ్ళు చెమర్చాయి షాలిమాకు. "నో షాలిమా. నిన్ను ఇలా వదిలేసి నేను ఒక్కడినే వెళ్ళగలనా. నావల్ల కాదు. ఏదయితే అదవుతుంది. వెళితే ఇద్దరమూ వెళదాం, లేకుంటే లేదు" ఆవేశంగా అన్నాడు రిత్విక్. "రిత్విక్ ఆలోచించు. మన గురించి కాదు. ఇప్పుడే కళ్ళు తెరుస్తున్న పసిదాని గురించి. ఈ దేశంలో పాప పెరిగితే, షరియా చట్టం కింద తను ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుందో ఆలోచించు. అందుకే రిత్విక్ పాపను ఎలాగైనా దేశం దాటించు. నన్ను గూర్చి ఆలోచించకు. నాకోసం పాప బ్రతుకును అంధకారం చేయకు" రిత్విక్ ను పట్టుకుని విలపించసాగింది షాలిమా. "నావల్లకాదు షాలిమా. నిన్ను వదలి నేను వెళ్ళలేను. బ్రతుకైనా, చావైనా నీతోనే" ఉద్వేగంగా చెప్పాడు రిత్విక్. నిస్సహాయంగా చూసింది షాలిమా. ****** వెలుపల పరిస్థితి తెలుసుకుందామని రిత్విక్ ఒక్కడే బయటకు వెళ్ళాడు. వెలుపల అంతా సైన్యం పహరా కాస్తున్నది. ఎలాగోలా వాళ్ళను తప్పించుకుంటూ విమానాశ్రయం చేరాడు. అక్కడ వివరాలు సేకరించాడు. ఆఫ్ఘన్ పౌరులు కానివారిని మాత్రమే వారివారి దేశాలకు వెళ్ళే అవకాశాన్ని పదిరోజుల పాటు కల్పించారట. విమానాశ్రయానికి సరిహద్దు గోడకు ఆవలి వైపు అమెరికా సైన్యం ప్రత్యేక విమానాలలో బయలుదేరి వారి దేశానికి తరలిపోతున్నది. వారికి కూడ గడువు విధించి తరలిపోయేలా చేస్తున్నది ముష్కర సంతతి. అక్కడ కనిపించిన దృశ్యం రిత్విక్ గుండెను కలచివేసింది. పొత్తిళ్ళలోని పసికందులను గోడమీద ముళ్ళ కంచె మీదుగా అవతల పడేలా విసిరేస్తున్నారు కొందరు. ఎందుకలా చేస్తున్నారో అర్థంకాలేదు. ఈ తతంగం చూసిన కాపలా సైన్యం అప్రమత్తమై గాలిలో తుపాకులు పేల్చింది. అంతే అందరూ చెల్లాచెదురై వీధుల వెంట పరుగెత్తసాగారు. రిత్విక్ కూడ క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తేవారితో కలిసిపోయాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఆగి, తన వెనుక పరిగెత్తుతున్న వ్యక్తిని ఆపి అక్కడివారి భాషలో అడిగాడు. "ఎందుకు అందరూ అలా పిల్లలను ఆవలి వైపుకు విసిరేస్తున్నారు" "అన్నా ఈ దేశాన్ని ఈ రాక్షసుల నుంచి కాపాడడానికి వచ్చిన సైనికులు వారు. వారు వీళ్ళంత దుర్మార్గులు కారు. పైగా మేము విసిరేసినది ఈ దేశంలో పుట్టిన ఆడసంతతిని. వాళ్ళు ఇక్కడ పెరిగితే షరియా చట్టం వారికి వర్తింపచేసి మన కళ్ళముందే చిత్రహింసలకు గురిచేస్తారు. అది భరించేశక్తి లేకనే వీరంతా ఆడపిల్లలను ఇతర దేశ సైనికులకు అప్పగిస్తున్నారు. పిల్ల ఎక్కడో ఒకచోట బ్రతికి ఉంటుందనే నమ్మకంతో తల్లిప్రేమను చంపుకుని అలాచేశారు. ఇప్పుడు ఇది వాళ్ళ కంటపడింది. ఇక ఆ అవకాశం కూడ లేకపోవచ్చు" అతని కళ్ళవెంట కన్నీరు ధారకట్టింది. బహుశా అతని బిడ్డను కూడ వాళ్ళకు ఇచ్చేశాడేమో అనుకున్నాడు రిత్విక్. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఇప్పుడెలా? ఈ రక్కసుల నుండి బిడ్డను రక్షించుకునేదెలా? ఆలోచనలతో అతని మెదడు చితికి పోతున్నది. ******* డేగల కళ్ళను తెలివిగా తప్పించుకుంటూ అర్థరాత్రి వేళకు విమానాశ్రయం చేరుకున్నారు రిత్విక్, షాలిమా. విమానాశ్రయం వెలుపల తప్ప, లోపల ఎక్కడా ముష్కర సైనికుల జాడ పెద్దగా కనిపించలేదు. ఎలాగైనా తనిఖీని తప్పించుకుని లోనికి పోగలిగితే చాలు. పరిసరాలన్నిటినీ పరిశీలించాడు రిత్విక్. నిన్న తను చూసిన సరిహద్దు గోడవైపు దృష్టి సారించాడు. ఒకరిద్దరు సైనికులు మాత్రం తచ్చాడుతున్నారు. షాలిమాను అక్కడే ఉంచి అటువైపు దారి ఉందేమోనని చూడడానికి వెళ్ళాడు. అతని ఆశ ఫలించింది. ఆ గోడ పక్కనుంచి రన్ వేకి వెళ్ళడానికి సన్నని దారి ఉంది. ఎవరికంట పడకుండా నక్కినక్కి వెళ్ళి ఒక స్తంభం వెనుక దాక్కుని, షాలిమాకు రమ్మని సైగచేశాడు. అతడి కదలికలనే గమనిస్తున్న షాలిమా అతని సైగను చూసి, ఎత్తుకున్న బిడ్డను మెల్లగా తోడు తెచ్చుకున్న రంధ్రాలున్న బుట్టలో పెట్టి, వంటికి బురఖా ధరించి, వడివడిగా అతనివైపుకు వెళ్ళింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండడంతో ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. పచారీలు కొడుతున్న సైనికుడు అటువైపుకు వెళ్ళగానే షాలిమాతో కలసి రిత్విక్ ఆ సందులోకి ప్రవేశించి వేగంగా ముందుకు నడిచారు. ఇంకొక్క పది అంగలలో రన్ వేను చేరుతారు అనుకున్న సమయంలో ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు తుపాకీ ధరించిన సైనికుడు. గుండె జారిపోయింది ఇద్దరికీ. తుపాకీ గురిపెట్టి ఆగమన్నాడతను. నిలబడిపోయారిద్దరు. అతని భాషలో అడిగాడతను. "ఇటువైపు రాకూడదని బోర్డు చూడలేదా. ఎందుకొచ్చారు ఇటు. మర్యాదగా వెళ్ళిపోండి" హూంకరించాడతను. " భయ్యా. నీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళనివ్వు" అతని భాషలోనే సమాధానం చెప్పింది. ఆమె భాషను పసిగట్టి అడిగాడతను. "నువ్వు ఈ దేశపు అమ్మాయివే కదూ నిజం చెప్పు" నిలదీశాడు. "అవును. కానీ నా భర్త భారతీయుడు. నేను నీ దేశపు ఆడపిల్లను. నా భర్తతో నన్ను వెళ్ళనివ్వు" " కుదరదు. మర్యాదగా వెనక్కు వెళ్ళిపోండి" "భయ్యా దయచూపు. నీకాళ్ళు మొక్కుతాను" అని అతని కాళ్ళమీద పడింది. ఆమె కన్నీటితో అతను వేసుకున్న బూట్ల తడిసిపోయాయి. ఎక్కడో మారుమూల దాగివున్న మానవత్వం అతడిని చలింపచేసింది. ఎక్కువసేపు ఈ తతంగం కొనసాగితే ఎవరో ఒకరు చూస్తారని, వాళ్ళతో పాటు తనకూ దండన తప్పదనీ అతనికి తెలుసు. కాళ్ళు వెనుకకు లాగేసుకున్నాడు. " లే. వెళ్ళిపోండి లోపలకు. బురఖా తీసివేసి అక్కడ విమానం ఎక్కబోతున్న గుంపులో కలిసిపోండి. త్వరగా వెళ్ళండి" అని పక్కకు తప్పుకున్నాడా సైనికుడు. అంతే మెరుపు వేగంతో బుట్ట చేతబట్టుకుని కదిలాడు రిత్విక్. "భయ్యా నీ మేలు జన్మలో మరువలేను" అంటూ అంతే వేగంతో భర్తను అనుసరిస్తూనే బురఖాను తీసివేసింది షాలిమా. కళ్ళు మూసి తెరిచేలోగా గుంపులో కలిసిపోయారిద్దరూ. అక్కడి నుంచి వెనుతిరిగి చూశాడు రిత్విక్. ఎవరో ఇద్దరు సైనికులు వచ్చి, తమను విడిచిపెట్టిన సైనికుడి చేతులు కట్టేసి నెట్టుకు పోతున్న దృశ్యం లీలగా కనిపించింది. షాలిమాకు చూపించాడు. అతను తమకు సహాయం చేసిన విషయాన్ని ఎవరో గమనించారు. ఈ గుంపులో తమను గుర్తించలేక అతడిని బంధించి తీసుకుపోతున్నారు. అతనికి ఎటువంటి శిక్షను అమలుచేస్తారో ఆమె ఊహకు కూడ అందడం లేదు. తమకోసం అతను బలయిపోతున్నాడు అనే తలపు ఆమె హృదయాన్ని నిలువునా దహించివేస్తుంటే, బిడ్డ మీద మమకారం ఆమెను విమానం ఎక్కించింది. ఆమెకు తెలియని విషయం ఒకటే. వారిని విడిచిపెట్టినది ఆఫ్ఘన్ దేశీయుడు కాదు. ముష్కర మూకలు దేశభక్తులని నమ్మి, వారి పైన సానుభూతితో, వారితో చేతులు కలిపిన బంగ్లాదేశ్ పౌరుడు. చేరిన తరువాత తెలిసింది. వారిది దేశభక్తి కాదు, ఉన్మాదమని. తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. నిజానికి అతను కరిగిపోయింది షాలిమా కన్నీటికి కాదు, బుట్టలోని పసికందును చూసి. షాలిమా అతనిని ప్రాధేయపడేటప్పుడే అతని కళ్ళు బుట్ట రంధ్రంలో నుంచి పాపను గమనించాయి. పాప వేసుకున్న గౌను ముక్క బుట్ట రంధ్రం నుంచి బయటకు వచ్చింది. ఆ పాప ఇక్కడ పెరిగితే షరియా చట్టం పేరుతో ఎంతటి హింసకు గురవుతుందో అతనికి అవగతమయింది. పాలుగారే పసిబిడ్డ రూపం మనసులో మెదిలింది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాడు. తను ఏమై పోయినా ఫర్వాలేదు. ఒక ఆడకూతురిని రక్షించానన్న తృప్తి చాలనుకున్నాడు. అందుకే తెగించి ఆ పాపను ఆఫ్ఘన్ దేశాన్ని దాటేలా చేశాడు. ఇప్పుడతని మనసు తేలికపడింది. చావునైనా సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధపడి ముందుకు కదిలాడతను. *****************