నామాసామి హితవు - చెన్నూరి సుదర్శన్

Namala saami hitavu

అదొక చిన్న పల్లెటూరు. పల్లెను ఆనుకొని చిన్న అడవి ఉంది. అందులో క్రూరమృగాలు లేవు గాని.. కోతులకు నిలయం. మొదట్లో కోతుల బెడద ఉండేది కాదు. కాని ప్రజలు వంటచెరకు కోసం చెట్లను నరికినా కొద్దీ.. కోతుల బెడద అధికం కాసాగింది. రాను, రానూ.. కోతిచేష్టలతో పల్లె ప్రజలు విసిగి పోయారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అవి అదను చూసి ఇంట్లో దూరి తినుబండారాలను ఎత్తుకు పోయేవి.

“అలా దొంగతనంగా తెచ్చుకొని తినడం మహాపాపం. దేవుడు క్షమించడు” అని నామాలసామి అనే కోతి హితవు పలికేది.

నామాలసామి వయసులో పెద్ద. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్న అనుభవశాలి. దాని నుదుట నామాలు ఉండడం.. అంతా దానిని నామాలసామి అని పిలుస్తాయి. దాని సలహాలను వానరములన్నీ పాటిస్తాయి. కాని ఇప్పుడు తరం మారింది. నేటి యువతరపు వానరములు నామాలసామి మాటలను పెడచెవిన పెడుతున్నాయి. చాదస్తకపు నామాలసామి అని ముద్ర వేసి వెక్కిరిస్తున్నాయి.

“వివిధ రకాల ఆహార పదార్థాలు దొంగిలించుకుని తింటే మహా అద్భుతంగా ఉంటుంది.. ఆ రుచే వేరు. మన అడవిలో ఏం పాడయ్యింది? ఎప్పుడూ ఒకే రకమైన పండ్లు. తినీ, తినీ మొహమెత్తింది” అంటూ నామాలసామిని ఈసడించుకోసాగాయి.

“దేవుడు ఎవరికి కావాల్సిన పదార్థాలను వారికి విశ్వంలో అమర్చి పెట్టాడు. మనల్ని అడవిలో, మానవులను గ్రామాలలో నివసించుమన్నాడు. మీరేమో దేవుని నిర్ణయాన్ని దిక్కరించి పల్లెలో తిరుగుతున్నారు. పైగా దొంగతనాలు చేస్తూ.. మన జాతికి చెడ్డ పేరు తెస్తున్నారు. అది మన వంశాన్ని అంతరింప జేస్తుంది. అడవిని ధ్వంసం చెయ్యొద్దని ప్రజలను వేడుకుందాం. గాని మీరు దొంగతనాలు మానండి” అంటూ నామాలసామి చెప్పే హితవులు ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు’ నిర్లక్ష్యంగా నేటి తరం వానరాలు మసలుకోసాగాయి.

ఇంతలో తన కూతురు రామకము ఏడ్చుకుంటూ రావడం గమనించింది నామాలసామి.

“ఏం జరిగిందమ్మా” అని బుజ్జగిస్తూ.. అడిగింది.

“లోహిత్ కనిపించడం లేదు” అంటూ నామాలసామిని హత్తుకుని ఏడువసాగింది.

నామాలసామి ఊరడిస్తూ.. “ఎక్కడికి పోతుందిలే.. మహా అంటే ఊళ్ళోకి వెళ్లి ఏదైనా తెచ్చుకొని తింటుంది. ఎంత చెప్పినా లోహిత్ మారడం లేదు”

“ఈమధ్య లోహిత్ ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. నేను పొద్దున కర్రతో రెండు దెబ్బలు వేశాను. దాంతో కోపంగా పారిపోయింది. నాకెందుకో భయంగా ఉంది. వెతుకుమని చెప్పడానికి వచ్చాను. చిన్నది లావణ్య పాల కోసం ఏడుస్తోంది నేను మన స్థావరానికి వెళ్తాను. నువ్వు లోహిత్ ను వెదకి నచ్చజెప్పి తీసుకొని రా..” అంటూ రామకము వెళ్ళిపోయింది.

నామాలసామికి దూరపు చూపు ఎక్కువ. లోహిత్ తిరిగే చెట్లు చేమలన్నీ తెలుసు. ఎలాగైనా లోహితుని జాడ తెలుసుకోవాలని బయలుదేరింది.

దారిలోఒక చెట్టు కింద దాదాపు పదేండ్ల ప్రాయపు పిల్లవాడు బిక్కమొహమేసి కూర్చోవడం కనబడింది. నెమ్మదిగా వెనుక నుండి వెళ్లి..

“బాబూ..! ఎవరు నువ్వు? అడవి లోకి రాగూడదని తెలియదా! ఎందుకు వచ్చావు? నీ పేరేంటి?” అని ప్రశ్నల వర్షం కురిపించింది.

కోతి మాట్లాడుతూ ఉండడం పిల్లవాడు ఆశర్యపోయాడు. అది తననేమీ చేయదనే భరోసా కలుగగానే..

“నా పేరు పవన్ కుమార్. ఇంట్లో నుండి పారిపోయి వచ్చాను” అంటూ బుంగ మూతి పెట్టాడు.

“ఎందుకు పవన్.. ఎవరేమన్నారు?” అంటూ ఆరా తీసింది.

“పొద్దున్నే ఒక కోతి వచ్చి మా ఇంట్లో నుండి దోమల నివారణ కోసం తెచ్చిన కొత్త మందు డబ్బాను ఎత్తుకొని వెళ్ళింది. అప్పుడు నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను.. భయమేసింది. నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నచ్చ చెపుతూ.. అడ్డుకున్నా వదలలేదు. అలిగి పారిపోయి వచ్చాను” అంటూ తన బాధను చెప్పుకున్నాడు.

“చాలా తప్పు చేశావు పవన్. పెద్ద వాళ్ళు నీ మంచి కోసమే రెండు దెబ్బలు కొట్టినా.. తరువాత బాధ పడ్తారు. నీ తప్పేమీ లేదని నిరూపించుకోవాలి. కాని ఇలా ఇంట్లో నుండి పారిపోయి రావద్దు. మీ అమ్మగారు ఎంతగా ఏడుస్తున్నారో..!” అంటూ చెబుతుంటే.. కళ్ళు పెద్దవిగా చేసుకొని ఆలోచనలో మునిగి పోయాడు పవన్.

నామాలసామి మదిలో.. అది మా లోహిత్ కావచ్చేమో! అనే అనుమానం రేకెత్తింది. ఒకవేళ అదే నిజమైతే పొరబాటున ఆ డబ్బాలోనిది శీతల పానీయమని తాగితే ఆ దరిదాపుల్లోనే స్పృహ తప్పిపోయి ఉంటుందని..

“బాబూ పవన్.. మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంట్లో నుండి డబ్బా ఎత్తుకొని వెళ్ళింది మా లోహిత్ అని అనుమానంగా ఉంది. అది ఉదయం నుండి కనబడ్డం లేడు” అంటూ విషయం చెప్పింది.

పవన్ ఇల్లు ఏప్రాంతంలో ఉందో చెబుతూ.. నామాలస్వామిని తీసుకుని వెళ్ళాడు. నామాలసామి అనుమానం నిజమయ్యింది. ఒక పొద ప్రక్కన దోమల మందు డబ్బా ఉంది. మరో ప్రక్క లోహిత్ అచేతనంగా పడి ఉంది. అది రామకము స్థావరానికి దగ్గరలోనే కావడం.. వెంటనే నామాలసామి పరుగెత్తి రామకానికి లోహితుని జాడ చెప్పి తనకు తెలిసిన వనమూలికల కోసం పరుగెత్తింది.

రామకము మెరుపు వేగంతో లోహిత్ ఉన్న పొద వైపు పరుగు తీసింది. రామకము కదుపు కింద నుండి నడుము భాగాన్ని లావణ్య గట్టిగా పట్టుకొని.. భయం భయంగా చూస్తోంది. ఈ హడావుడికి వానర స్నేహితులంతా నామాలస్వామి, రామకము వెనుకాల పరుగు తీశాయి.

లోహిత్ ను చూడగానే రామకము ముద్దులు పెట్టింది. దానిలో చలనం లేక పోయే సరికి గుండెలు బాదుకుంటూ ఏడువసాగింది. లావణ్య బిక్కు, బిక్కుమంటూ లోహిత్ ను చేత్తో తడుతూ లేపడానికి ప్రయత్నిస్తోంది. వాతావరణమంతా హృదయ విదారకంగా మారింది.

ఇంతలో నామాలసామి వనమూలికలు తెచ్చింది. వాటిని రెండు చేతులతో నలిచి రసాన్ని లోహిత్ ముక్కులో రెండు చుక్కలు వేసింది. లోహిత్ అరచేతులు , అరికాళ్లు నలుస్తూ.. కన్నీరు పెట్టుకోసాగింది. రెండు నిముషాలలో లోహిత్ కు మెలకువ వచ్చింది. నిద్రనుండి లేచినట్టు లేచి అందరినీ పిచ్చి చూపులు చూడసాగింది.

రామకము ఆనందానికి పట్టపగ్గాలు లేవు. లావణ్య ఆనందంతో నృత్యం చేయసాగింది. వానర స్నేహితులంతా చప్పట్ల వర్షం కురిపించారు. ఆదృశ్యం చూస్తూ.. పవన్ చలించి పోయాడు.

నామాలసామి అందరి వంకా ఒక సారి తేరిపారగా చూసి.. “నా ఆత్మీయుల్లారా.. చూశారా నేటి సంఘటన. మా లోహిత్ శీతలపానీయమనుకొని దోమల మందు డబ్బాను దొంగతనంగా తెచ్చి కొద్దిగా తాగగానే స్పృహ తప్పి ఈ పొదల్లో పడిపోయింది. ఆ సమయంలో పవన్ రావడం.. విషయం తెలియడం.. నా అనుమానం నిజం కావడం.. మా అదృష్టం బాగుండి లోహిత్ మాకు దక్కింది. ఏమాత్రం ఆలస్యమైనా.. ” అంటూ ఉండగా నామాలస్వామి గొంతు జీర పోయింది.. కళ్ళు చెమర్చాయి. లిప్త కాలం తరువాత కళ్ళు తుడ్చుకుంటూ.. గొంతు సవరించుకొని తిరిగి చెప్పసాగింది. “నేను పదే, పదే మీ మంచి కోసమే చెబుతున్నాను. దొంగతనం మానండి. ఈ రోజు లోహిత్ మూలాన పవన్ వాళ్ళ నాన్న గారితో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇంట్లో నుండి పారిపోయి వచ్చాడు. అలా మనకు తెలియకుండా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. మన సుఖం కోసం మరొకరిని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. మనకు పాపం చుట్టుకుంటుంది. మనం మన అడవిలోనే పండ్లు ఫలాలు తింటూ ప్రశాంతమైన జీవనం కొనసాగిద్దాం” అంటూ రెండు చేతులెత్తి మొక్కింది.

వానరలంతా నామాలసామి హితవుకు మద్దతుగా ప్రమాణం చేశాయి.

పవన్ కు తన తప్పు తెలిసి వచ్చింది. తమ బిడ్డ కనబడక పొతే రామకము, నామాలసామి పడే బాధను.. బిడ్డ కనబడగానే వారి సంతోషాన్ని కళ్ళారా చూశాడు. తమ పిల్లలంటే మనుషులకైన.. జంతువులకైనా ప్రేమ ఒక్కటే.. తన గురించి అమ్మా, నాన్న ఎంతగా బాధ పడ్తున్నారో! అని మదిలోకి రాగానే..

“నామాలసామి.. నీ హితవు నేను గూడా పాటిస్తాను. నేను మా ఇంటికి వెళ్తాను” అని ఇంటి వైపు పరుగు తీశాడు పవన్.

అతని వెనుకాలే చూస్తూ.. సంబర పడిపోయింది నామాలసామి. *

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు