సాయంత్రం, ఒక రోజు గుడిలో ప్రవచనం విని వచ్చిన రామశాస్త్రిగారు నిశ్శబ్దంగా ఉంటే -- పడుకుంటున్నప్పుడు మరి ఉండబట్టలేక, ఆయన భార్య ‘కనకమహాలక్ష్మి’ –
“ఏంటండీ, మనం గుడి నుంచి వచ్చినప్పటినుంచి ఉలుకు పలుకు లేక నిశ్శబ్దంగా ఉంటున్నారేమిటి?”
"ప్రవచనంలో శర్మగారు చెప్పిన ముఖ్య విషయం గురించి ఆలోచిస్తున్నాను”
“ఏమిటది? "
“ఈ కలియుగంలో ‘అశ్వమేధ యాగం’ చేయడానికి లేదు. కానీ, ఎవరేనా ‘అనాధప్రేత సంస్కారం’ చేసినా లేక చేయించినా ‘అశ్వమేధ యాగం’ చేసినంత ఫలితాన్ని వారి ‘పుణ్యం’ ఖాతాలో జమచేస్తాడు భగవంతుడు, అని చెప్పేరు కదా.”
“అవును. కానీ, ఇప్పుడు మీరేమిటి ఆలోచిస్తున్నారు.”
“విదేశాల్లో పిల్లల చదువులు ఉద్యోగాలు వలన, ఇక్కడ ఉన్న చాలామంది వయసు మళ్ళిన వాళ్లకి, ఆఖరి రోజులు గడ్డుగా గడవడమే కాక, చనిపోతే ప్రేతసంస్కారం గగనమైపోతున్నది. అలాంటప్పుడు నాకు చేతనైన సహాయం చేయగలిగితే, నలుగురికి మంచి జరగడమే కాక, నాకొచ్చిన పుణ్యంలో అర్ధాంగివి కాబట్టి, నీకు కూడా సగం వస్తుంది”
“ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యం చాలు. ఇప్పుడు మీరు అనాధ ప్రేతాలెక్కడున్నాయని వెతుకుతారా ఏమిటి? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకోండి. రేపుదయం ఎనిమిదింటికి సత్యనారాయణవ్రతం చేయించడానికి వెళ్లాలన్నారు కదా." అని, ఆవిడ నిద్రకుపక్రమించేరు.
కానీ, శాస్త్రిగారు ఆలోచిస్తూ, ఏ రెండు గంటలకో కొలిక్కి వచ్చిన నిర్ణయంతో, నిద్రలోకి జారుకున్నారు.
ముందుగా ---
ఉన్న ఊళ్ళో మరియు చుట్టుపట్ల ఉన్న నాలుగైదు ఊళ్లలో అపరకర్మలు చేసేవారిని, తనకు ఎప్పుడు కావలిస్తే అప్పడు అందుబాటులో ఉండేటట్టు చేసుకున్నారు.
తరువాత ---
ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో, నాలుగు రోజులు కష్టపడి తయారు చేసిన వెబ్సైటు మరియు సామజిక మాధ్యమాల్లో –
“చనిపోయినవారెవరికైనా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేకపోయినచో,
అక్కడున్నవారెవరైనా నన్ను సంప్రదించండి. ప్రేత సంస్కారం అంత్యక్రియలు
శాస్త్రీయంగా ఉచితంగా జరిపించబడును.”
– అని -- తన పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వివరాలు -- పెట్టేరు.
-2-
అది తెలుసుకున్న జనం --- ముఖ్యంగా, విదేశాలలో ఉన్నవారి --- దగ్గరనించి, శాస్త్రిగారికి అనేకమైన ఈ-మెయిల్స్ రావడం ఆరంభం అయ్యాయి.
వాటన్నిటి సారాంశం –
‘మా తల్లి/తండ్రి ఒక్కరే ఉంటున్నారు, మేము విదేశంలో ఉండి రాలేక పోతున్నాము. వారి
అంత్యక్రియలు శాస్త్ర ప్రకారం జరిపించండి. అన్యధా భావించక, ఆ ఖర్చులు మమ్మల్ని
భరించడానికి అంగీకరించండి’ --- అని వేడుకొనేవే.
కానీ -- శాస్త్రిగారు వారెవరి దగ్గర డబ్బులు తీసుకుందికి అంగీకరించ లేదు.
అలా, శాస్త్రిగారు ఈ ఏడాదిలో నలభై పైన అనాధప్రేత సంస్కారాలు ఉచితంగా చేయించేరు.
పదిరోజుల తరువాత, మరో ఊరిలో సత్యనారాయణవ్రతం చేయించడానికి, ఉదయం ఏడో గంటకి శాస్త్రిగారు బయలుదేరి వెళ్ళేరు.
వ్రతం చేయించి బయటకి వచ్చి స్కూటీ తీస్తూంటే, శాస్త్రిగారి మొబైల్ కి ఆఊరిలోనే ఉన్న రామేశం మాస్టారినించి పిలుపొచ్చింది. వెళ్లి చూస్తే, ఎనభై పడిలో ఉన్న ఆయన మంచంమీంచి లేవలేక, గంట క్రితం పోయిన భార్య శవాన్ని చూస్తూ కూర్చొని ఉన్నారు.
శాస్త్రిగారు జరగవలసిన కార్యక్రమం జరిపించి, మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత, ఇంటికి బయలుదేరేరు.
ముందురోజున ఎగువన కురిసిన వర్షాలకు, దారిలో ఉన్న వాగు పొంగి పొర్లుతూ బ్రిడ్జి మీదనించి వరదనీరు వడిగా ప్రవహిస్తూంది. ఆపరిస్థితిలో బ్రిడ్జి దాటడానికి ఆయనకి ధైర్యం రాలేదు.
సత్యనారాయణవ్రతం చేయించిన తరువాత ప్రసాదం శాస్త్రానికి కాస్త నోట్లో వేసుకొని, మిగతాది ఇంటికి వెళ్లి భార్యతో కలిసి తినాలని స్కూటీలోనే ఉంచేరు. కడుపులో ఆకలి నకనకలాడిస్తున్నా, శాస్త్రిగారికి ఆ ప్రసాదం తినడానికి మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే, అక్కడ భార్య తన కోసం ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది.
‘తొందరలో క్షేమంగా ఇల్లు చేరేటట్లు చేయి భగవంతుడా’ అంటూ శాస్త్రిగారు మనసులో సత్యనారాయణ స్వామికి చేసిన ప్రార్ధనతో, మరో అరగంటకి బ్రిడ్జి మీద వరదనీటి ప్రవాహం మందగించింది. సత్యనారాయణస్వామికి మనసులోనే కృతఙ్ఞతలు సమర్పించుకొని, మరో ఐదు నిమిషాలు ఆగి, వరదనీటి ప్రవాహం పూర్తిగా తగ్గిందన్న భరోసా కలగగానే, ఇంటిదారి పట్టిన శాస్త్రిగారు నాలుగుగంటలు అవుతుండగా ఇంట్లోకి ప్రవేశించేరు.
నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో భార్య కోసం వెతుకుతున్న శాస్త్రిగారికి, పూజగదిలో దేముడి ఎదుట కళ్ళు మూసుకొని కూర్చిని ఉన్న ఆవిడ కనిపించేరు.
-3-
“కనకం నేనొచ్చేసా” అన్న శాస్త్రిగారి మాట వినిపించగానే -- తుళ్ళిపడి, కళ్ళనిండా నీళ్లతో, ఆయన వచ్చేసేరన్న ఆనందంతో, నోటి వెంట మాటరాక, ఎన్నాళ్ళనించో ఎదురు చూస్తున్నట్టు, ఆయన్నే చూస్తూ ఉండిపోయారు ఆవిడ.
"నేను వచ్చేవరకూ అలా దీనంగా కూర్చోవడమెందుకు. వెళ్లినవాడిని రాకుండా పోతానా.”
“ఇంత ఆలస్యమైతే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ‘ఆలస్యంగానేనా, నా భర్త క్షేమంగా ఇంటికి చేరేటట్టు చేయి స్వామి’ అని సత్యనారాయణస్వామిని వేడుకుంటూ ఇలాగే కూర్చున్నాను. నా మొర విన్న స్వామి, మిమ్మల్ని క్షేమంగా నాదగ్గరకి చేర్చేడు. రేపు ఎటువంటి పని పెట్టుకోకండి. మనం సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవాలి” అన్న భార్య మాటలతో శాస్త్రిగారికి - ఆవిడకి తనయందున్న ప్రేమతో - భోజనం చేయకుండానే కడుపు సగం నిండిపోయింది.
ఆవిడకైతే, -- భర్త క్షేమంగా ఇంటికి చేరుకున్నారు -- అన్న ఆనందంతో, కడుపు పూర్తిగా నిండిపోయింది.
ఆ రోజు సాయంత్రం విశ్రాంతిగా కూర్చున్నప్పుడు -- శాస్త్రిగారు,
"కనకం, ఈరోజు నేను వెళ్ళింది సత్యనారాయణస్వామి వ్రతం చేయించడానికి. పైగా, అనుకోకుండా, అక్కడ ఒక అనాధప్రేత సంస్కారం చేయించడమైంది. దైవ కార్యం, దైవం హర్షించే కార్యం చేసుకొని వచ్చే నన్ను, నాతో బాటూ నిన్ను, భగవంతుడు కాకపోతే ఎవరు కాపాడతారు. అలా కాపాడకపొతే, దైవం మీద జనానికి నమ్మకం పోయి నాస్తికులుగా మారిపోరూ?
“ఔనండీ, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.”
“అందుకే, భగవంతుడు తనను నమ్ముకున్న వాడి గురించి ఏమంటాడు తెలుసా"
"ఏమంటాడండి."
"వాడు, నా కొరకు రక్షింపవలయువాడు" అని -- పోతనగారు భాగవతంలో వ్రాసేరు.
**********