స్వాయంభువమనువు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు. ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్ధమ ప్రజాపతికి, ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి వివాహం చేసారు. దేవహూతి కర్ధమప్రజాపతి దంపతులకు కళ అనే కుమార్తె జన్మించింది. ఆమెను మరీచి మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. కళ మరీచిమహర్షుల కుమారుడు కశ్యపమహర్షి. ప్రసూతి-దక్షప్రజాపతి దంపతులు తమ కమార్తెలు పదమూడు మందిని వారి ఇష్ట ప్రకారం కశ్యపునకు ఇచ్చి వివాహం చేసారు. వారు అదితి, దితి, ధను, కష్ట, అరిష్ట, సురస, ఇల, ముని. క్రోధవశ, తామ్ర, సురభి, వినత, కద్రు. కశ్యపమహర్షికి దితి తప్ప మిగతా భార్యలందరి వల్ల సంతానం కలిగింది. ఒకరోజు దితి మనస్సులో సంతానం కావాలనే కోరిక ఉదయించింది. మన్మథుని పుష్పబాణాలు ఆమె హృదయాన్ని కల్లోలం చేశాయి. విరహవేదన భరించలేక భోగవాంచతో తన పతి అయిన కశ్యపప్రజాపతి వద్దకు వెళ్లింది. ఆయన అప్పుడే మహావిష్ణువును ఉద్దేశించి అగ్ని కార్యం నెరవేర్చి సూర్యాస్తమయ సమయంలో హోమశాల ముందర కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన దితి కశ్యపునితో వినయంగా ఇట్లా అంది. “స్వామీ నాతోడి సవతులు అందరు నీ కృపవల్ల గర్భవతులై ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం వ్యాకులమైన మనస్సుతో దుఃఖిస్తున్నాను. నీలాంటి విద్వాంసులకు తెలియనిదేమున్నది. పతి గౌరవం సంపాదించిన సతులకు కోరిన కోరికలు తీరుతాయి. అగ్నిశిఖ ఒకటే అయినప్పటికీ, దీపముతో ముట్టించిన దీపము రెండు దీపములు అయినట్లు, పురుషుడు తన భార్యయందు పుత్రరూపంలో జన్మిస్తాడు. కావున నన్ను కాపాడు. దయాత్ముడైన మా తండ్రి దక్షప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. ఒకనాడు కూతుళ్ళందరినీ పిలిచి మా మనస్సుకు నచ్చిన భర్తలను కోరుకోండి అని అడిగాడు. అప్పుడు మాలో పదమూడు మందిమి నీ పేరు చెప్పి నిన్ను వరించాము కదా. నా కోరిక తీర్చి, నాకు పుత్రబిక్ష పెట్టి నన్నుకాపాడు”. అప్పుడు కశ్యపుడు ఇలా అన్నాడు. “తరుణీమణీ! ఒక్క ముహూర్తకాలం ఆగు. ఇది సంధ్యాసమయం. ఇప్పుడు మన్మథునికి శత్రువైన శివుడు వృషభ వాహనుడై భూతగణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ వేళలో కలయిక నిషేధింపబడినది. మనం ఎందుకు ధర్మాన్ని అతిక్రమించాలి? మా సోదరుడైన ఆ దేవదేవుని మరిదిగదా అని మనస్సులో భావించకు. ఆయన సర్వేశ్వరుడు, పరాత్పరుడు, త్రిలోకపావనుడు, పాపహరుడు. ఎవని ఆజ్ఞకు లోబడి ఈ సమస్త ప్రపంచానికీ రాణి అనదగిన మాయ ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవనిని అందరూ సేవిస్తారో, అటువంటి దేవదేవుని; అలక్ష్యం చేయరాదు.” అని తన ప్రియసతి అయిన దితికి కశ్యప ప్రజాపతి తెలిపాడు. అయినా సరే దితి తన పట్టు వదల లేదు. కశ్యపుడు తన భార్య కోరికను కాదనలేక, ఈశ్వరునకు నమస్కారం చేసి ఏకాంతంగా తన భార్య కోరిక తీర్చాడు. తరువాత దితి కూడని పని చేసినందుకు సిగ్గుతో తల వంచుకొన్నది. పశుపతియైన రుద్రుడు ఏమి చేస్తాడో అనే సంశయంతో కశ్యపుణ్ణి భయంతో చూసింది. తరువాత పశ్చాత్తాపంతో ఈశ్వరుని ఇలా ప్రార్థించింది. “అందరినీ సంరక్షించే ఓ పరమేశ్వరా నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించు. నీవు దయా సముద్రుడవు. కోరికలు కలవారి కోరికలు తీరుస్తావు. కోరికలు లేని వారికి మోక్షాన్ని ఇస్తావు. భక్త సులభుడవూ, భగవంతుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను”. దితి ప్రార్థన వల్ల పరమేశ్వరుడి కరుణతో దితి గర్భం నిలిచింది. దితి సంతానము లేనిది కాబట్టి తన భర్త కరుణతో తనకు గర్భం నిలిచినందులకు మనస్సులో ఎంతగానో సంతోషించింది. కశ్యపప్రజాపతి చేయరాని పని చేసినందుకు మనస్సులో ఎంతో చింతిస్తూ తన కాంతను చూసి ఇలా అన్నాడు. “సతీ! నీవు మోహానికి తట్టుకోలేక, లోకనిందకు జంకకుండా సిగ్గూ భయమూ విడిచి పెట్టి, అకాలంలో వ్యామోహానికి లొంగిపోయావు. అందువలన భూతగణాలచే ప్రేరేపించబడిన ఆ భగవంతుని అనుచరులు నీకు కుమారులై జన్మిస్తారు. మిక్కిలి శక్తి సంపన్నులూ, భయంకరమైన కార్యాలు చేసేవారూ, మహా భలవంతులూ, అతి గర్విష్టులూ అయిన వారిద్దరూ తమ పరాక్రమంతో నిరంతరం సజ్జనులను భాదించుతూ భూమికి భారమవుతారు. చివరకు ఆ శ్రీహరి చేతిలో హతమవుతారు.” ఈ విధంగా తన పతి చెప్పగా విని ఎంతో భయపడింది. చాలా ఆందోళన చెందింది. వెలవెల పోతున్న ముఖంతో భర్తవైపు చూస్తూ ఇలా అన్నది. “స్వామీ! సజ్జనులకు అపకారం చేసే తమోగుణ ప్రవృత్తులైన మదోన్మత్తులకు తప్పకుండా ఆయువూ, సంపదలూ, నశిస్తాయి. శత్రువుల చేతిలో వారికి మృత్యువు తప్పదు. ఇది ముమ్మాటికీ వాస్తవం. మన కుమారులు ఆర్యులకు అపరాధం చేసినందువల్ల ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి బలికాకుండా, భగవంతుడైన శ్రీహరి చేతులలో మరణించడమనేది ఒక మహాభాగ్యం. “ దితి మాటలు విని కశ్యపుడు ఇలా అన్నాడు. “నీవు చేసిన విపరీతకార్యం వల్లనే ఈ దురవస్థ వచ్చింది. నీవు బాధ పడవద్దు. ఆ శ్రీపతి పాదాలను భక్తితో ప్రార్థించు. నీ కొడుకులలో హిరణ్యకశిపుడు అనే వానికి పుట్టే సంతానంలో నుంచి ధర్మబుద్ధి గలవాడూ, శ్రీహరి మీద మిక్కిలి భక్తి భావం కలవాడూ, అయిన ఒక కొడుకు జన్మిస్తాడు. అంతేకాదు. మహాపుణ్యాత్ముడూ, వంశపావనుడూ, బుధజనశ్రేష్ఠుడూ అగుటవల్ల ఆ మహామహుని కీర్తిలతలు బ్రహ్మాండ భాండమంతా వ్యాప్తిస్తాయి. అతడు దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ శ్రీహరి పాద భక్తుడు కావటం వల్ల వంశాని కంతా పరమ పవిత్రుడౌతాడు. భగవద్భక్తులలో అగ్రగణ్యుడూ, సద్గుణాలకు సముద్రం వంటి వాడూ, మహితాత్ముడూ అయిన ఆ మహానుభావుడు ఆ శ్రీహరి సేవామార్గంలోనే జీవితమంతా నడవాలని నిశ్చయించు కొనినవాడై లౌకికమైన వస్తువులను చులకనగా చూస్తుంటాడు. ఇంతేకాదు, శ్రీహరి ధ్యానంలో అత్యంత నిష్ఠ కలవాడై భగవద్భక్తులలో అగ్రగణ్యుడవుతాడు. మనువులతో సమానమైన ఆ మహానుభావుడు ప్రపంచమంతా హరిమయంగా తలుస్తాడు. ఆ నీ మనుమడు మహానీయుడుగా కీర్తి పొందుతాడు.” ఈ విధంగా కశ్యపుని వీర్యంతో నిండిన గర్భం భరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించుతూ దినదినమూ పెరుగుతూ ఉంది. ఆమె తన గర్భాన్ని నూరేళ్ళపాటు ధరించి ఉన్నది. ఆమె గర్భంనుండి అతిరమణీయమైన తేజస్సు వెలువడింది. అది సూర్యచంద్రుల కాంతులను సైతం కప్పివేసింది. అందరూ భయంతో కంపించి పోయారు. దేవతలందరూ బ్రహ్మ సన్నిధికి వెళ్ళి వినయంగా నమస్కరించి ఇలా విన్నవించారు. నీవు చరాచర ప్రపంచానికి అధినాయకుడవు. సృష్టికర్తవు. నీ చరణాలనే శరణుపొందాము. మా కష్టాలను ఒక్కమాటు నీ మనస్సులో స్మరించు. దితిగర్భంలోని పిండం అంతకంతకు అభివృద్ధి చెందుతున్నది, ఇది ఏ వినాశనానికి దారి తీస్తుందో తెలియడం లేదు అని విన్నవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి వారికి ఇలా చెప్పాడు. “/ఓ దేవతలారా! సనకసనందాదులు మీకంటే ముందు జన్మించినవారు. నా మానసపుత్రులు. వారు అరవిందాక్షుని సందర్శించాలనే ఆనందంతో తమ యోగశక్తి వల్ల వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ కావలి కాస్తున్న ఇద్దరు ద్వారపాలకులు ప్రతివచనాలతో వారిని అడ్డగించారు. దీనికి కోపగించిన మహర్షులు వారిని మూడు జన్మలు శ్రీహరికి విరోధులుగా భూలోకంలో జన్మించమని శపించారు. ఆ జయవిజయులే ఇప్పుడు ఈ దితి గర్భంలో పెరుగుతున్నారు”. కశ్యపుని భార్య దితి సకల భువన కంఠకులైన ఇద్దరు కుమారులను కన్నది. అప్పుడు, ఆ సమయంలో భూమి కంపించింది. కులపర్వతాలు వణికాయి. సముద్రాలు కలత చెందాయి. నక్షత్రాలు నేల రాలాయి. ఆకాశం బ్రద్దలైంది. అష్ట దిగ్దజాలు ఊగసాగాయి. దిక్కులనుండా నిప్పురవ్వలు గుప్పున లేచాయి. పుడమి పైన పిడుగులు పడ్డాయి. ఆ రాక్షసవీరులు మహాపర్వతాలవంటి శరీరాలతో, లోకభీకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదముల డబ తాకిడికి భూమి చలించి పోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులూ, మకరకుండలాలు, మొలనూళ్ళూ, కంకణాలూ, ఉంగరాలూ, కిరీటాలూ, కాలి అందెలూ, స్వచ్చమైన కాంతులు వెదజల్లగా వారు సూర్యుడిని మించిన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా ఉన్న సమయంలో కశ్యప ప్రజాపతి తన కుమారులను చూడదలచినవాడై దితి సౌధానికి వచ్చాడు. కుమారులను చూచాడు. వారికి పేర్లు పెట్టాలనుకున్నాడు. కశ్యపప్రజాపతి దితి గర్భమందు తాను మొదట ఉంచిన తేజస్సు వల్ల ఆవిర్భవించి అద్భుతంగా వెలిగేవానికి “హిరణ్యకశిపుడు” అనీ, కాన్పు సమయాన దితిగర్భం నుండి మొట్టమొదట పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి “హిరణ్యాక్షుడు” అనీ నామకరణం చేసాడు. ****************