నిద్రకుపక్రమించక ముందు వేడివేడి బోర్నవీటా తాగుతూ కమ్ముకున్న కమ్మని వాసనకు కాళ్ళూపుకుంటూ టి.వి లో వార్తలు వింటున్న చలపతికి ఫోను మోగడం పానకంలో పుడకలా అనిపించినా ఫోనందుకోక తప్పలేదు. వంటఇంటికి ఆ రోజుకివ్వాల్సిన ఫినిషింగ్ టచ్ ఇస్తోంది చలపతి శ్రీమతి. 'తనకు పిల్లలు రాత్రి పది దాటాక కాని చెయ్యరు. వాళ్లు ఆ టైమ్ కే ట్యూనయ్యారు మరి. అదీ శని, ఆదివారాల లోనే! మిగతా రోజులలో పిల్లలు తలపునకు వచ్చినప్పుడు ఫోనులో రికార్డు చేసుకున్న వాళ్ల మాటలు వింటూ తృప్తి పడటమే!'
"హలో సార్ వింటున్నారా... వచ్చే సోమవారమే."
'ఏ పెళ్లో, గృహ ప్రవేశమో', అనుకున్నాడు మొదట.
'పి.జి. పరీక్ష!' తన పేరు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా! ఎక్కడి డిల్లీ! ఎక్కడి ఆంద్ర!'
"మీరు తయారుగా ఉంటారని పరీక్ష జరిగే తేదీ ముందే చెప్పాను. ఇవాళే వెళ్లింది పానెల్ వున్న ఫైలు,"
ఏ విషయమైనా సరే ఆలస్యం అమృతం విషం అనుకునే ప్రొఫెసర్ గోపాలం కడుపులో దాచుకోలేక చలపతికి చూచాయగా తెలియచేసాడు. తాను నార్త్ వెళ్లినప్పుడు సైట్ సీయింగ్ ఏర్పాటు చేసిన ఆ జ్ఞాపకాలింకా పదిలంగానే ఉన్నాయి గోపాలానికి.
చలపతికి పిలిచి ఉద్యోగమిచ్చింది అక్కడి విశ్వవిద్యాలయం. 'వేరే రాష్ట్రంలో భాష తెలియక ఇమడటం కష్టం కొన్నాళ్లు ఆగండి', అని భార్య చెప్పినా ససేమిరా అంటూ ఉద్యోగంలో చేరిపోయాడు చలపతి. కొత్తలో కాస్త కష్టపడ్డా తరువాత మెల్లగా అలవాటుపడిపోయింది శ్రీమతి చలపతి.
"ఎవరు ఫోనులో?" అంటూ ఆతృతగా వంటగది నుంచి వచ్చిన భార్యను 'కాసేపు సస్పెన్స్' అంటూ వూరించి మరీ చెప్పాడు, హైద్రాబాద్ కు వెళ్లాల్సి వుంటుందని.
"ఎందుకు?" ఆమెకర్ధం కాలేదు.
"నువ్వు వస్తున్నావు. ఇక రెడీ కావాలి."
"సంబరం అప్పుడే మొదలు మీకు, స్నేహితులందరినీ కలవాలని." నవ్వింది చలపతి శ్రీమతి.
టు అండ్ ఫ్రో రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ఏ గెస్ట్ హౌసో ఉంటుంది. ఫుడ్డుకు నో ప్రాబ్లం. ఆర్ధిక అంచనాల తాలూకు ప్రణాళిక వేసుకున్నాక దిగుల లేకుండా నిదురపట్టేసింది చలపతికి.
హైదరాబాదులో ముత్యాలు ఎక్కడ కొనాలి. గద్వాల్ చీరలు ఏ రంగు తీసుకోవాలి, ఇంకా సైట్ సీయింగ్ లో ఎన్నో చూడాలి లాంటి కమ్మని ఆలోచనలతో చక్కగానిద్ర పట్టింది చలపతి శ్రీమతికి.
ఇంతా చేస్తే విశ్వవిద్యాలయం నుండి అఫిషియల్ కన్ఫర్ మేషన్ లెటరు రాలేదు.' అయినా తన వెర్రిగాని గోపాలం అంత కాన్ఫిడెన్షయల్ గా, నమ్మకంగా చెప్పాక కూడా సందేహపడటం దండగ. ఖర్చులేని పనికి సందేహాలెక్కువ అన్నట్లు,' తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. అప్పటికీ సందేహం జీడిపాకంలా పీకుతుంటే గోపాలానికి ఫోను చేసాడు.
"సీనియర్ ప్రొఫెసరు మీఎరు, మిమ్మల్ని కాక ఎవరిని పిలుస్తారు, ఇంకేం ఆలోచించక తయారుగా వుండండి." గోపాలం వూపిన పచ్చజండాతో మరింత ఊపుతో గబగబా
నాలుగు బట్టలు, కావలసిన సరంజామాతో సిద్ధమైపోయాడు చలపతి. ఆయన శ్రీమతి సర్దుకున్న బ్యాగు నేను రెడీ అన్నట్లుగా ఉంది.
హైద్రాబాద్ చేరగానే శ్రీమతి చలపతి ముఖం ఆనందంతో వెలుగుతోంది. చలపతికి సంబరంగా వుంది కాని చూపు మాత్రం రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదేమిటా అన్న విసుగు కలుగుతోంది.
"అదేమిటి అలా నిలుచుండిపోయారు. ముందు బ్యాగులు దించండి." చలపతి శ్రీమతి హెచ్చరించింది.
'సరే పోర్టరు పని మొదలు', అనుకుంటూ బ్యాగులు దించి అటు ఇటు చూడసాగాడు. ఇరవై నిమిషాలైనా ఎవరు లేరు. గోపాలానికి ఫోను చేద్దామంటే క్లాసుకెళ్ళివుంటాడేమోననే సందేహం.
"ఎక్కడికో ఒకచోటికి వెళ్దాం పదండి. ఫ్లాట్ ఫారం వీడి వెళ్తున్నారందరు మనతోపాటు ప్రయాణం చేసిన వాళ్లు. మనకివేం పాట్లు పదండి."
"పదండి పదండి అంటావు ఎక్కడికి పోదాం హుసేన్ సాగర్ లోకా." నవ్వాడు చలపతి.
చలపతి భార్యకు నవ్వురాలేదు ఏడవలేక నవ్వుతున్నాడని ఆమెకర్ధమయింది.
నాంపల్లి స్టేషను బయటకు వచ్చి ఆటోను పిలిచాడు. క్యూలో నిలబడుతున్నాయి ఆటోలు. గబగబా ఎక్కమని తొందర చేస్తున్నారు వెనుక వచ్చేవాళ్లు.
ఎక్కి కూచున్నాక,
"ఏదైనా తక్కువ రేంజి హోటల్ కు పదవోయ్". అన్నాడు చలపతి.
"అయితే రాయల్ ప్యాలస్ కు తీసుకెళ్తా. అరవై అవుతుంది."
"అరవైయా!" కనుబొమ్మలు పైకి లేచాయి చలపతికి.
"అవున్సార్, పెట్రోలు మండుతోంది."
"పెట్రోలు కొంటున్నావా? గ్యాస్ బండిలా వుందే?"
"భలేవారు సార్ గ్యాస్ వూరికే వస్తుందా?"
"మరి డబ్బులు వస్తాయా? మీటరు వెయ్యి."
"జామ్ అయింది పని చెయ్యదు."
సంచులు భుజాన వేసుకున్న చలపతిని ఒకరిద్దరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
'మాకు తెలిసిన హైదరాబాదేలే', అన్నట్టు వారివంక ఓచూపు విసిరి,
"సరే పద తప్పుతుందా," అంటూ అయిష్టంగానే ఆటోలో ఎక్కాడు. భార్య కిక్కురుమనకుండా సర్దుకుని కూర్చుంది.
తాను మాత్రం ఆటోను సంబరంగా పరుగులు తీయించాడు ఆటోవాలా.
'హైద్రాబాదు చాలా మారిపోయింది.' మీది మీది కొస్తున్న వాహనాలు యమభటులేమోనన్న భ్రాంతి కలిగిస్తున్నాయి చలపతికి. జారిపడతాయేమోనని బ్యాగులను
పొదువుకుని కూర్చున్నాడు.
'ఇంకా ఎంతసేపు?' చలపతికి అసహనం పెరుగుతోంది. వాహనాలు నడుస్తున్నాయి. నిజంగానే నడుస్తున్నాయి. పరుగులు తీయడంలేదు. పరుగులు పెట్టడానికి రోడ్లు ఖాళీగా లేవు. రోడ్ షోకొచ్చినట్లు రహదారులన్నిటా వాహనాలే! నానో నుండి బి.యం.డబ్ల్యు దాకా, స్కూటీ నుండి పల్సర్ దాకా! ఇక ఆటోలైతే బస్సులతో పోటీ పడాలని వాటిని అధిగమించాలని మనిషి నడవగలిగేంత స్థలంలోనే పరుగులు తీయాలని చూస్తున్నాయి.
హైద్రాబాదేమో గాని ఈ ఆటో ప్రయాణంలో ప్రమాదంబారిన పడకుండా వుంటే కొండకొస్తానని తిరుమలేశునికి మొక్కుకున్నాడు చలపతి.
హోటలు ముందాగింది ఆటో.
పేరు రాయల్ ఫ్యాలెస్! నిజమే ఏ రాజుకాలంనాటిదో అన్నట్లుంది. భవనం పాతదే కాని లోపల సౌకర్యాలు బాగున్నాయి. వేడినీళ్ళ స్నానం, వేడిగా కాఫీ, టిఫిను పడ్డాకగాని మాట పెగల్లేదిద్దరికీ.
"సరే నేను గోపాలంకు ఫోను చేసి పరీక్ష టైం కనుక్కుంటాను. ఈలోపల నువ్వు తయారవు. నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేసి వెళ్తాను."
"చార్మినార్! ముందు చార్మినార్ దగ్గర పనులైపోతే తరువాత అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి.
"సరే, సరే లిస్టు పెరుగుతోంది." నవ్వాడు చలపతి.
గోపాలం ఫోను బిజీ అని రెండు సార్లు పలికాక గోపాలం లైన్లోకొచ్చాడు.
"సార్, బాగున్నారా. సారీసార్. ఇక్కడే లోకల్ గా రిటైరైన ప్రొఫెసర్ సరేనన్నట్లుంది. క్లాస్ లో బిజీగా వుండి కొంచెం లేటయింది ఫోను లిఫ్ట్ చెయ్యడం. ఎలా వున్నారు? అక్కడ చలి ఎలా వుంది సార్?"
"అక్కడేమోగాని ఇక్కడ చెమటలు పడుతున్నాయి."
చలపతి మాట తీరు మారడంతో గోపాలానికి చిన్నగా సందేహం తొలచసాగింది.
కొంపతీసి వచ్చేసాడా ఏమిటి గురుడు!
"ఏమంటున్నారూ."... మాట సాగదీసాడు.
"అదేమిటి అంతా తయారుగా వుండమన్నావు. మీ పేరే సెలెక్ట్ అవుతుందని చెవిన సెల్లు పెట్టుకుని మరీ చెప్పావు. ఇప్పుడేమిటి మా మిసస్ తో కూడా వచ్చేసాక..."
'కెవ్వు!' కేక!
గోపాలం హెడ్డు దగ్గరికి పరిగెట్టాడు తరుణోపాయం దేవా అనుకుంటూ.
"నువ్వు తొందరపడ్డావు. లోకల్ గా ఎవరైనా వున్నారా అని చూసాక వారంగీకరించకపోతే అప్పుడు వేరే చోటనుండి పిలుస్తాము, ఫండ్స్ చూసుకోవాలండీ... సరే ఇప్పుడేం చేస్తారు?"
పెళ్ళప్పుడు పడ్డ అక్షింతలైనా మెల్లమెల్లగా దులుపుకుంటాం. ఇక తనపై పడ్డ అక్షింతలను పడినవి పడినట్లు దులుపుకున్నాడు గోపాలం.
"ఏదో మీరే చేయాలి సార్, ఎలాగో అడ్జస్ట్ చెయ్యండి సార్." పై పై నవ్వుకు ఏడుపు మిళితం చేసాడు గోపాలం.
"సరే చూద్దాంలే. ఎనీథింగ్ మోర్?" కదలకుండా నిలబడిన గోపాలాన్నడిగాడు హెడ్డు.
"మీరు పర్మిషనిస్తే చలపతిగారిని కలిసి సారీ చెప్పి వస్తాను. మళ్ళీ ఎప్పుడైనా పిలవాలంటే బాగుండదు."
అసహనంగా ఉన్న చలపతికి 'సారీ... సారీ...' అని సారీలు ఓ పుంజీడు చెప్పాడు. చివరకు పిలవని పిలుపు ప్రహసనమైంది.
"ఏదో విధంగా టికెట్ల డబ్బు అందేలా చూస్తాను. మీరు, మేడం షాపింగ్, సైట్ సీయింగ్ పూర్తి చేసుకుంటే సరిపోతుంది. రేపు నా స్టూడెంట్ ఎగ్జామ్ పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను."
'చార్మినార్ లో ముత్యాలు తీసుకుని గాజుల షాపులలో గాజుల బేరం ముగిసేసరికి మధ్యాహ్నం దాటింది. మళ్లీ ఆటో... ఆటో... అంటూ పిలవడం, చార్జీలను చూస్తే ఆ ఖర్చుతో విజయవాడకు వెళ్లి దుర్గమ్మను చూసి రావచ్చనిపించింది.
భోజనం, అలవాటుపడ్డ రోటీలే తిన్నా భారీగానే పడుతోంది బిల్లు. ఏమిటీ అనవసర ఖర్చు? ఇప్పుడీ ముత్యాలు కొనకపోతేనేం, ఏమైనా పెళ్లా? పేరంటమా? తనసలే పిలవని పేరంటానికి వచ్చినట్లుంది.' చలపతికి విసుగ్గా వుంది. షాపింగ్ దారి షాపింగ్ దే. పూసల దండలు, చమ్కీలు అన్నీ కొన్నాక చీరల మాట పలికే ధైర్యం చాలలేదు చలపతి భార్యకు.
"సరే ఇంతదూరం వచ్చి గద్వాల చీరలు కొనలేకపోయాం అనే బాధ ఎందుకు పోదాం పద నువ్వన్న చోట్లన్నీ తిరిగేద్దాం."
చలపతి మామూలు మూడ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అసహనం అడపాదడపా తొంగి చూస్తూనే వుంది.
ఒక రోజంతా షాపింగ్! మరుసటి రోజు క్యాబ్ తీసుకుని సాలార్ జంగ్ మ్యూజియమ్, గోల్కొండ, సాయంత్రం శిల్పారామం!
"ఇక ఏమీ చూడలేను. కాళ్లు గుంజుతున్నాయి." అంది చలపతి భార్య.
'హమ్మయ్య!' అనుకున్నాడు చలపతి. కాసేపు వందలు మార్చేపని తప్పిందనుకున్నాడు, మనసు అయ్యో అనుకున్నా.
'పనిలేని ఖర్చు, పనికి మాలిన ఖర్చంటారు.' అదే జరుగుతోందనుకున్నాడు.
'తయారుగావుండమన్నాడు. అంటే అంతా సిద్ధమనే కదా! మరేమిటి ఈ పిలవని పేరంటానికి వచ్చి జేబుకు చిల్లు పెట్టుకుని! దర్జాగా వుంటుందని టుటైర్ ఎ.సి. టికెట్లు కొని ఛ... ఛ హాయిగా సీపర్లో వచ్చుండాల్సింది. ఏడుపు ఒకటే తక్కువ', అనుకున్నాడు చలపతి.
వేడి వేడి జిలేబీ పొట్లంతో వచ్చాడు గోపాలం. వూపుకుని తింటూ తింటూ మధ్య మధ్యలో గోపాలంపై వేడిగాలిని ఊపుతున్నాడు చలపతి.
"వదిలెయ్యండి, అన్నయ్యగారు మాత్రం ఏం చేస్తారు. మీరే తొందరపడ్డారు." నవ్వింది చలపతి శ్రీమతి. మరొక సమయంలో అయితే ఆమె పళ్ల మెరుపు చూసి నీ పళ్లు ముత్యాలోయ్ అని మురిసేవాడు. ఇప్పుడు చార్మినార్ దగ్గర కొన్న ముత్యాలు ఆమె పళ్లలోకాదు తన కళ్లలో నుండి దొర్లినట్లుంది చలపతికి.
"కనీసం సెకండ్ క్లాస్ టికెట్లకయినా సరిపోయేలా ప్రయత్నిస్తాను... సారీ సార్, అనుకోలేదు ఇలా అవుతుందని." గుటకలు మింగుతున్నాడు గోపాలం.
"సరేలే దానిదేముంది, మా శ్రీమతికి హైద్రాబాద్ షాపింగ్ పని జరిగిందిగా." నవ్వేసాడు చలపతి.
'హమ్మయ్య!' నవ్వందించిన రిలీఫ్ అందరిలోను.
***