నన్ను ప్రొమోషన్ మీద నంద్యాల లో ఉన్న మా బ్యాంకు బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా పెళ్లి అవలే దు కాబ్బటి, ఉండడానికి ఒక రూమ్
చూడమని మా బ్రాంచి క్యాషియర్ రామానుజం కి చెప్పాను. అతను బ్యాంకు కి దగ్గరలోనే ఒక మేడ మీద రూమ్ ఫిక్స్ చేస్తే హోటల్ నుంచి
అక్కడికి మారిపోయాను.
చేరిన నాడు సాయంత్రం బ్యాంకు నుంచి వచ్చి స్నానము చేసి రూమ్ కి ఉన్నకిటికీ లోంచి బయటకి చూస్తే ఎదురుగా ఒక కాంపౌండ్ వాల్ మధ్య
ఉన్న చక్కని ఇల్లు కనపడింది. ఇల్లు బాగుంది అనుకుంటూ వెనక్కి తిరిగి టీవీ దగ్గరకి వెళ్ల బోతోంటే, ఇంట్లోంచి వీల్ చైర్ తోసుకుంటూ ఒక
ముసలాయన గెట్ దాకా వచ్చి, చేతి కర్ర తోటే ఇంటి గేటు తెరచి రోడ్డుమీదకి నడుపుకుంటూ వచ్చాడు.
నేను ఉంటున్న వీధి ఒక 'క్యు దో సాచ్' (cul de sac ). మా సందు లోంచి బయటికి వెళ్లాలంటే ఒక వైపే వెళ్ళాలి. అంటే నేను బయటికి వస్తే,
ఎడమవైపు, ఎదురింటాయిన కుడివైపు వెళ్ళాలి ఆయన గేటు కర్రతో మూసి , వీల్ చైర్ కుడివైపు తిప్ప గానే, అప్పటి దాకా వీధి మూల
ఉన్నాయనుకుంటా, రెండు కుక్కలు తోక ఆడించుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాయి. అవి రాగానే, అయన తయా రుగానే ఉన్నట్టుంది, ఒళ్ళో
ఉన్న చిన్న బాగ్ లోంచి బిస్కట్లు తీసి రెండింటికీ వేశాడు. అవి పెంపుడు కుక్కలు లాగా లేవు. వీధిలో తిరిగేవే.
మా సందు మెయిన్ రోడ్డుకు కలిసే ఇంకో సందు లో కలుస్తుంది. ఆయన మెల్లిగా ఆ అసందు వైపు తోసుకుంటూ వెళ్ళాడు. అలా సందు చివర దాకా
వెళ్లి, మెయిన్ రోడ్డుకు వెళ్లే సందు మొగ లో ఒక పక్కగా చైర్ ఆపుకుని అక్కడే కాసేపు కూర్చోవడం మర్నాడు బ్యాంకు నుంచి వస్తూ చూశాను. మా
వీధి కుక్కలకే కాకుండా, అక్కడ కూర్చుండగా ఏ కుక్కలు వచ్చిన బిస్కట్లు వేస్తూ ఉండడం చాలా మాట్లు చూశాను. ఒక రోజు ఆగి నన్ను నేను
పరిచయం చేసుకున్నాను. "మీ ఎదిరింటి మేడ మీదకి కొత్త గా వచ్చానండి. నా పేరు మోహన్ రావు " అని చెప్పాను
ఆయన తన పేరు చెప్పాడు . అప్పుడు అయన పేరు ఆనందరావు అని తెలిసింది
ఎందుకో ఆయనతో కాసేపు మాట్లాడాలనిపించి, అయన పక్కనే ఉన్న చిన్న కల్వర్ట్ దిమ్మ మీద కూర్చున్నాను.
రోడ్డు ఒక వార గా ఒక ఆవు అక్కడ కొద్దిగా ఉన్న గడ్డి ని తినడా నికి ప్రయత్నిస్తోంది. ఇంతలో ఒక తోపుడు బండి తో అరటిపళ్ళు అమ్ముతూ ఒకతను
వచ్చాడు
ఆనందరావు గారు పళ్ళు అమ్మే అతనితో పళ్ళ ధర అడిగి , ఆవు కి ఒక అత్థం పెట్టమన్నాడు. వాడు కొంచం పాడయిన అత్థం తీసి ఆవు వైపు
విసిరాడు. ఆనందరావు గారికి చాలా కోపం వచ్చింది. ఇంచుమించు చేతిలో కర్రతో వాడిని కొట్టినంత పని చేశాడు చెత్త పళ్ళు ఆవుకి పెడతావా ?
మంచి పళ్ళు తీయి అని చెప్పి. అతను తీసిన అత్తాన్ని, ఆవుకి పెట్టమని నాతో అన్నారు. అత్తాన్ని తీసుకుని నేను ఆవుకి పెట్టాను. వాడు విసిరిన
అత్థం కూడా దులిపి దానికి పెట్టమన్నారు ఆయన. పళ్ళు అతనికి డబ్బు ఇచ్చి పంపేశాడు
" ఇలా రోడ్లమీద వదిలేసి, రాత్రి పాలు పిండుకుంటారు వాళ్ళు " అన్నాను ఆవు స్వంత దారుని దృష్టి లో పెట్టుకుని
" పరవాలేదండి, ఆవు అరటి పళ్ళు ఎంత ఆనందంగా తిందో చూశారా ? దానికి తన యజమాని వేరు నేను వేరు అన్న భేదం తెలియదు .
ఆనందం అన్నది ఒకటే. అది ఆనందంగా ఉన్నప్పుడు మనకి కూడా ఆనందం. ఇంటర్నెట్ లాగే ఇది గాడ్ నెట్ ? అలా ఆనందించే అవకాశం
దాని యజమాని మనకి ఇచ్చారు అనుకోవచ్చు కదా ? " అన్నారు నవ్వుతూ
అయన ఆలోచన ధోరణి నన్ను ఆశ్చర్య పరిచింది
ఇంతలో వేరే కుక్కలు ఏవో దగ్గరగా వస్తే వాటికి బిస్కట్లు వేశారు.
" అంటే ఏదయినా పుణ్యం ఆశించి చేస్తున్నారా ? " అడిగాను సందేహం వచ్చి
" ఆశించి కాదండి. కానీ ఏ కర్మ కయినా ఫలితం ఉండితీరుతుంది. మనం ఆశించినా, ఆశించక పోయినా " అన్నారు ఆనందరావు
"అయితే ఫలానా ఫలితం కావాలని చేయటం లేదన్న మాట." అన్నాను ఆయన వివరిస్తారేమోనని. నేను సరిగ్గానే ఊహించాను
" అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేస్తూ ఉండేది.
నేను సైట్ ఇంజినీర్ గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో
పనిచేసే వాడిని. పని సందర్భంగా చాలా ఊళ్లు తిరిగే వాడిని. ఎక్కడ ఉన్నా, అక్కడ వీధిలో ఉన్న మూగ జీవులకి ఇలాగె చేస్తూ ఉంవాడిని. ఒక
మాటు మంగళూరు కు దగ్గరగా ఒక ఇరిగేషన్ కాంట్రాక్ట్ వచ్చింది. మంగళూరు నుంచి ఒక ఏభై కిలోమీటర్లు దూరం లో ఉండేది సైట్. మంగళూరు
నుంచే వారానికి మూడు మాట్లు కారులో సైట్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్లే వాడిని. లోకల్ గా కుళ్లాయప్ప అనే అతన్ని డ్రైవర్ గ పెట్టుకున్నాను. ఎప్పుడూ వాడు, నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకునే వెళ్ళేవాళ్ళం. ఒక రోజు బయలుదేర బోతోంటే ఎదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కారు ఎక్కి నేను బెల్ట్
పెట్టుకోలేదు. ఫోన్ మాట్లాడి ఎదో ఆలోచిస్తూ ఉంటె కారు కుదుపుకి నిద్ర లోకి జారిపోయాను. పెద్ద శబ్దంతో నాకు మెళకువ రావడం , నేను
కారులోంచి ఎగిరి బయట రోడ్డు పక్కకి దొర్లిపోయి తల ఒక రాయికి కొట్టుకోవడం దాకా గుర్తు. ఆ తరవాత ఎప్పుడో కళ్ళు ఒక మాటు తెరిచాను . ఒకాయన నాముఖం లోకి చూస్తున్నాడు. పెద్ద కళ్ళు, గెడ్డం తో ఉన్నాడు " మూగా జీవాలకు పెడుతూ ఉండడం వల్ల బ్రతికి పోయావు రా అబ్బాయి. వాళ్ళు
వస్తున్నారు లే ఫరవాలేదు " అన్నాడు. అంతే వినపడింది. మళ్ళీ నా కళ్ళు మూతలు పడిపోయాయి.
మెలకువ వచ్చేసరికి మంగళూరు హాస్పిటల్ లో ఉన్నాను. ఎవరో స్టూడెంట్స్ పిక్నిక్ నుంచి వస్తూ, ఏక్సిడెంట్ చూసి అంబులెన్సుకి ఫోన్ చేసి,
పోలీసులకి కూడా చెప్పారట. నేను,డ్రైవర్ కూడా, లారీ కొట్టి వెళ్ళిపోయినా చిన్నదెబ్బలతోటే బయట పడ్డాం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం!
అలా నాముఖం లోకి చూసి తెలుగు లో మాట్లాడి వెళ్ళిపోయినది ఎవరు? అని నాకు అంతు పట్ట లేదు.
పోలీసు వాళ్ళు అన్నారు ఆ ఏక్సిడెంట్ లో మేము ప్రాణాలతో బయట పడటం పెద్ద ఆశ్చర్య మన్నారు.
" అంటే మీరు మీ ఇంటిదగ్గర తిరిగే మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్లే ఏక్సిడెంట్ నుంచి రక్షింపబడ్డారన్న మాట" అన్నాను ఆశ్చర్య పోతూ
" అలా అని అయన ఎవరో అన్నాడు . జరిగిన దాన్ని బట్టి, నేను ఎప్పుడూ చూడని అయన అన్న మాటలబట్టి అందులో ఏమన్నా నిజం ఉందేమో
తెలియదు. ఆ సంఘటన నా శ్రద్ధని ఇంకా పెంచింది " అన్నారు ఆనంద రావు గారు
" అది ఎప్పుడో జరిగి పోయింది. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తే మళ్ళీ దూర ప్రయాణాలు కార్ల లో చేసే లా లేరు. అయినా ఇంకా వీటికి పెడుతూనే
ఉన్నారే ! " అన్నాను. అలా అనడం లో ఔచిత్యం లేదని అనిపిస్తున్నా.
అయన చిన్న గా నవ్వి " చేసిన దానికి ఫలితం నాకే రావాలని ఎక్కడ ఉంది? పెద్ద పెద్ద ప్రమాదాలలో అదృష్టంగా తప్పుకున్నవాళ్ళు ఎంతమంది
లేరు ? ఇక ముందు కూడా అలా ఎవరయినా తప్పుకోవచ్చు కదా ? గాడ్ నెట్ లో ఏదయినా జరగవచ్చు !" అన్నారు.
ఆయనకీ నమస్కరించి వచ్చేశాను.
మర్నాడు బ్యాంకు నుంచి ఇంటికి వస్తూ బిస్కట్లు కొనుక్కు వచ్చాను
సమాప్తం
.