మంచి మనసు - శ్యామ్ కుమార్. చాగల్

Manchi manasu

ప్యాలస్ బార్ కౌంటర్ ముందు కూర్చొని డబ్బులు లెక్క చూసుకుంటున్నాడు విజయ్ . పార్కింగ్ లో సైకిల్ ఆపి ఖంగారుగా కౌటర్ దగ్గరగా వచ్చి విజయ్ ఎదురుగా నించున్నాడు రవి. డబ్బులు లెక్క పెట్టడం ఆపి " ఏమిటయ్యింది ..అలా వున్నావు?" ప్రశ్నించాడు విజయ్. " ఇదుగో ఇప్పుడే రాణి వుత్తరం వచ్చింది..చూడు " అని చొక్కా జేబులోనుంచి ఇన్లాండ్ లెటర్ తీసి విజయ్ ఎదురుగా కౌంటర్ టేబుల్ పైన పెట్టాడు రవి. " ఏముందందు లో చెప్పునీకు రాణి రాసిన వుత్తరం నేను చూడను కానీ..", " అన్నాడు విజయ్ రవిని చూసి. జేబు రుమాలు తీసి ముఖం , నుదురు మీద నుండి కారుతున్న చెమటను తుడుచుకున్టూ " వాళ్ల నాన్న గారు వేరే పెళ్లి సంబంధాలు తేవటం వేగిరం చేసాడట .. నన్ను త్వరగా వరంగల్ రమ్మని రాసింది." అన్నాడు ,రవి వెళ్ళటం అత్యవసరం అన్న భావం ధ్వనిస్తూ. " అయితే వెళ్లి రారా , విషయం ఏన్టో కనుక్కుని వచ్చేయి " అనునయంగా అన్నాడు విజయ్. " నువ్వూకూడారా రా, ఇద్దరం కలిసి వెళదాం " అన్నాడు రవి. " మళ్ళీ ఇద్దరం ఎందుకు , డబల్ ఖర్చు. .. ఇదుగో, నిన్ననే జీతం ఇచ్చారు,, నా దగ్గర..వంద రూపాయలున్నాయి అవి తీసుకుని వెళ్ళిరా " అంటూ పర్సు లో నుండి డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టాడు విజయ్. " నేనూ కొంత తెస్తాను ,,అక్కడికి వెళ్ళాక రాణి కూడా ఇస్తుందిలే,, ..కాని ఇద్దరం కలిసే వెళదాం " అన్నాడు రవి . "సరే అయితే ...రేప్పొద్దున్నే బస్సు కు వెళదాం " ప్రయాణం ఖరారు చేస్తూ అన్నాడు విజయ్. మరుసటి ఉదయాన్నే మొదటి బస్సు లో బయలు దేరారు స్నేహితులిద్దరూ. రాణి , రవి ఇద్దరూ డిగ్రీ కాలేజీ లో చదువుకుంటున్న సమయం లో ప్రేమలో పడ్డారు. రాణి ప్రస్తుతం యూనివర్సిటీ లో ఫిజిక్స్ పి హెచ్ డి చేస్తూ వుంది. రవి, విజయ్ ఇంకా ఉద్యోగాన్వేషణలో నే వున్నారు . ఇంట్లో ఖర్చులకు చేదోడు గా విజయ్ మాత్రం బార్ లో అయిదు వందల జీతానికి మేనేజర్ గా వుద్యోగం చేస్తున్నాడు. రాణి , రవి ప్రేమాయణం గురించి రాణి నాన్నగారికి అసలు ఏ మాత్రం తెలీదు. బస్సు దిగి యూనివర్సిటీకి వెళ్ళటానికి ఆటో మాట్లాడుకుని అరగంట లో ఫిజిక్స్ ల్యాబ్ దగ్గర దిగారు. చెరొక బ్యాగ్ భుజాలకు తగిలిన్చుకుని దగ్గరలో వున్న చెట్టు కింద కూచుండిపోయారు.. కొద్దిసేపటిలో రాణి తన మోపెడ్ పార్కింగ్ లో పెట్టి చుట్టూ చూసి రవి , విజయ్ లను చూసి చేయి ఊపి నడుచుకున్టూవచ్చింది. లేత పసు పు రంగు కాటన్ చీర కట్టుకుని , నాజూకు గా నడుస్తూ వస్తున్న రాణి ని చూసి రవి మనసు ఉప్పొంగి పోయింది. దగ్గర గా వచ్చి నుంచుని "హలో ఎంత సేపయ్యింది వచ్చి " అని పలకరించింది రాణి. పెళ్లి సంబంధాల విషయం లో రాణి చాలా ఇబ్బందిలో , పెళ్లి ఉత్తరం లో రాసిన విధంగా ఉంటుందని అనుకున్నారు కానీ ఎక్కడా రాణి మొహం లో అటువంటిది ఏమి లేకుండా ప్రశాంతంగా వుంది. రవి పక్కన కూర్చుంటూ" ఇంతకూ టిఫిన్ ఎక్కడ చేసారు" అనిఅడిగింది రాణి. " బస్సు స్టాండ్ ఎదురుగా వున్నా కాంటీన్ లో " సమాధానం చెప్పాడు రవి. "ఏంటి అంతా క్షేమమేనా?" నవ్వుతూ ప్రశ్నించాడు విజయ్. "అంతా ఓకే" అంది రాణి చిరు నవ్వుతో. " మరేంటి ఉత్తరం లో ఏదో సమస్య అన్నావు మీ నాన్నతో ?" అన్నాడు రవి అసహనంగా. " అదా ...ఏమి లేదులే. ..మా అన్నయ్య ఎవడో సర్జన్ పెళ్ళికొడుకుని తెచ్చాడులే " అంది ముసిముసి గానవ్వుతూ " మరెమైంది .. " ప్రస్నార్ధకంగా మొహం పెట్టి అడిగాడు రవి. " నే చెప్పేశా ఇపుడుడప్పుడే నేను పెళ్లి చేసుకోను అని" మళ్లీ చిలిపిగా నవ్వింది రాణి రవి కేసి చూసి.. " ఒరేయ్ మీరు మాట్లాడుతూ వుండండి నేనలా ఆ చెట్టుకింద కాస్త కునుకు తీస్తాను " అనివాల్లకి ఏకాన్తం కల్పిస్తూ దూరంగా వున్న చెట్టుకేసి వెళ్ళిపోయాడు విజయ్. సాయం కాలం రాణి కి వీడ్కోలు చెప్పి హోటల్ రూమ్ తీసుకుని నిద్ర తీశారు స్నేహితులిద్దరూ. ఉదయం లేచి న తర్వాత " మరేంట్రా తిరుగు ప్రయాణం అవుదామా, ఈ రోజు హోటల్ రూమ్ ఖాళి చెయ్యాలి, ఇంకా డబ్బులు సరిపోవు లేదంటే " అన్నాడు విజయ్ హెచ్చరిక గా. " పర్వాలేదు..ఈ రోజు మనం పాకాల చెరువుకు వెళ్తున్నాం , బస్సు స్టాండ్ లో రాణి పది గంటలకల్లా ఉంటుంది,, తన దగ్గర తీసుకుందాములే". భరోసా గా అన్నాడు రవి. " చూసుకో మరి జాగ్రత్త!,,అయినా నేను కూడా వచ్చి ఏం చెయ్యాలిరా , మీరిద్దరూ వెళ్ళండి"అన్నాడువిజయ్ " నాకేం తెలీదురా అవన్నీ, రాణి ఊరుకోదు ...నువ్ రాకుంటే , మేమిద్దరం వెళ్తే బోరు. ..నోరు మూసుకుని పదా" అంటూ బాత్రూం లోకి వెళ్ళాడు రవి. ఇద్దరూ కలిసి హోటల్ గది బిల్ కట్టి , చేతిలో బ్యాగ్స్ తీసుకుని బస్సు స్టాండ్ చేరుకున్నారు. అక్కడ చేతిలో పెద్ద సంచి తో రాణి నిలబడి , స్నేహితులిద్దరిని చూసి నవ్వి " ఇంకో అర గంటలో బస్సు వుంది. మళ్ళీ సాయంకాలం ఒకటే బస్సు రిటర్న్ రావటానికి " అంది రవి, విజయ్ ల వంక చూసి. కాసేపటి పాకాల వెళ్లే బస్సు రాగానే ఎక్కి కూర్చున్నారు. సెలవు దినం కాక పోవటం మూలాన బస్సులోఆరోజు ఎక్కువ జనాలు లేరు. అనుకున్న సమయానికే బస్సు బయలు దేరింది. కండక్టర్ వచ్చి ''ఎన్ని టికెట్స్ , ఎక్కడి వరకూ" అని రవిని చూసి అడిగాడు. " మూడు..పాకాల " అని రాణి వేపు చూసాడు రవి. రాణి కిటికీ లో నుండి బయటకు చూస్తూ వుంది. మళ్ళీ అడిగాడు కండక్టర్. రవి ఈ మారు విజయ్ వేపు చూసి " తీసుకోరా " అన్నాడు. ఇక చేసేది ఏమి లేక తన దగ్గర మిగిలి వున్న కొన్ని డబ్బుల తో టికెట్ తీసుకున్నాడు విజయ్. రాణి ని తీసుకోమని అడగ లేక పోయారిద్దరూ. అసలు ఎప్పుడూ ఖర్చు పెట్టేరాణి ఈసారి ఎందుకు తీసుకోలేదో స్నేహితులిద్దరికీ అర్థ కాలేదు. టౌన్ దాటిన తర్వాత బస్సు వేగం పుంజుకుంది. గంట గడిచినాక అడవి దారి మొదలయింది. చుట్టూ పెద్ద చెట్లతో దట్టమైన అడవి లో నుంచి , కంకర అంతా కొట్టుకు పోయిన రహదారి మీద బస్సు చాలా వేగంగా వెళుతూ వుంది. దారిలో ఎక్కడా ఊర్లు కనపడటం లేదు. ఆఖరి మజిలీ పాకాల అడవిలో ఆగింది బస్సు. ముగ్గురూ దిగి చుట్టూ చూసారు. బస్సు వెనక్కు తిప్పుకుని వచ్చిన దారిన దుమ్ము రేపుకుంటూ వెళ్లి పోయింది. కొద్ది దూరం లో చిన్న గుడిసె లో టీ , బ్రెడ్ అమ్ముతూ వున్నారు. అక్కడికి అడుగులు వేసి అందరూ కలిసి చిన్న గాజు గ్లాసులో టీ త్రాగారు. టీ వాసన రుచి చూడగానే " అబ్బో అంతా కట్టెల పొగ వాసన " ముక్కు విరుస్తూ ,అందిరాణి టీ తాగాక రాణి , టీ డబ్బులు ఇవ్వ లేదు. రవి ని చూసి నవ్వి, విజయ్ తన పాకెట్ లో నుండి మిగిలిన చిల్లర టీ కొట్టు వాడికిచ్చి ,అందరూ కలిసి ఆ దట్ట మైన అడవిలో చెట్ల మధ్యన కనిపిస్తూ వున్న కాలి బాట వెంబడి నడవటం మొదలు పెట్టారు. రాణి పట్టుకున్న బ్యాగ్ అందుకున్నాడు విజయ్. " అబ్బో చాలా బరువుంది , ఏం తెచ్చావిందులో" బ్యాగ్ బరువుని అంచనా వేస్తూ అడిగాడు విజయ్. "చీకట్లో లేచి అన్నీ వండాను "అందిరాణి " మనకు మధ్యాన్న భోజన పథకం " అని నవ్వాడు రవి రాణి కేసి వెక్కిరింతగా. " అవును, మరి ఈ అడవిలో తిండి ఎలా?. ....అందుకే చీకట్లో లేచి అన్నీ వండాను " సమాధానమిచ్చింది రాణి. కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ కనపడింది పాకాల చెరువు. అడవి మధ్యలో పెద్ద జలాశయం. నిండు గా వుండి అలుగు పారుతూ వుంది. ఎప్పటిలాగే ఒక పక్క మెత్తటి పచ్చ ని గడ్డిప్రదేశం చూసుకుని మేను వాల్చాడు,విజయ్ రవి ,రాణి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు చాలా సేపు. "వీడెంటి ఇలా పడుకుండి పోయాడు " అన్నాడు రవి దూరంగా గడ్డిలో పడుకున్న విజయ్ ను చూసి. " విజయ్ ఇంక నువ్ లేవ వచ్చు మా మాటలు అయిపోయాయి " ముసి ముసి గా నవ్వుతూ అంది రాణి. విజయ్ లేచి వచ్చి వళ్ళు విరుచుకుని " ఏరా కాసేపు ఈత కొడదామా " అడిగాడు రవి ని . "ఊఁ ,....పద " అని చెరువు వేపు వెళ్లి ఈతలు మొదలు పెట్టారు స్నేహితులిద్దరూ. రెండు గంటలు గడిచిన తరువాత ఒడ్డున అక్కడే కూర్చొని రాణి తెచ్చిన టిఫిన్ డబ్బా లు విప్పారు. దాన్నిండా ..వడలు, పులిహోర , పెరుగన్నం,పూరీలు వున్నాయి. ప్రకృతిని ఆరాధిస్తూ అడవి గాలిని పీలుస్తూ, విస్తరాకుల్లో భోజనం చేశారు ముగ్గురూ. క్లిక్ త్రీ కెమెరా తో ఫోటోలు తీసుకుని మెల్లిగా బస్సు స్టాండ్ వేపు నడక సాగించారు. బస్సు స్టాండ్ అనబడే మట్టి మైదానం దగ్గరకు చేరుకొని, అక్కడ వున్న గుడిసె హోటల్ వేపు చూసి టీ తాగాలన్పించింది విజయ్ కు. కాని అంతలోనే తన జేబులు ఖాళి అన్న విషయం గుర్తుకు వచ్చి మాట మార్చి " రాణీ టీ తాగిస్తావా ? "అన్నాడు కాస్తనిరుత్సాహంగా . విజయ్ దగ్గర డబ్బులు పూర్తిగా అయిపోయి న విషయం గ్రహించి నవ్వ సాగాడు రవి " ఏంటి ?ఎందుకా నవ్వు ? తాగిస్తాను పదండి! " ఇద్దరి నవ్వు చూస్తూ అంది రాణి అసలు విషయం అర్థం కాక. టీ తాగుతూ తిరుగు ప్రయాణానికి బస్సు టికెట్స్ డబ్బుల గురించి ఆలోచించసాగాడు విజయ్. రాణి ఇస్తుందిలే అని ధీమాగా వున్నాడు రవి. ఇవేవి తెలియని రాణి మాత్రం రవి ప్రేమ ను ఆనందిస్తూ టీ తాగ సాగింది. ఇక ఉండబట్టలేక " రాణి ....ఏది ఎన్ని డబ్బులున్నాయి నీ దగ్గర ,నీ పర్స్ ఇటివ్వు" అంటూ విజయ్ చొరవగా రాణి పర్స్ తీసుకుని , జిప్ లాగి లోన చూసాడు.. పది రూపాయలనోట్లు మూడు మాత్రమే వున్నాయి. " ఏంటీ ఇంతేనా ఇక లేవా?" అన్నాడు కాస్త ఖంగారుగా రాణి కేసి చూస్తూ. " అంతే ఇంకేమి తేలేదు " అంది మామూలుగా. రవి ,- రాణితమ భవిష్యత్ గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. విజయ్ కు ఏమి అర్థం కావట్లేదు. బస్సు టికెట్స్ కు ఎవరి వద్దా డబ్బులు లేవని తెలిసి పోయింది విజయ్ కు. ప్రేమ వ్యవహారం లో మునిగిపోయిన రవి, రాణి లకుఇది తెలియటం లేదు. లాస్ట్ బస్సు వచ్చే సమయం దగ్గర పడుతూ వుంది. ఆ తర్వాత బస్సులు లేవు. ఏం చేయాలో అర్థం కావటం లేదు విజయ్ కు. రవి లేచి వచ్చి విజయ్ భుజంమీద చేయి వేసి మెల్లిగా అన్నాడు " ఒరేయ్ నువ్వు -,రాణి ఆ వున్న డబ్బులతో వెళ్ళి పొండి , నేనెలాగో ఒక లాగ ఈ అడవి లో నుండి బయట పడతాను" అన్నాడు. "ఏడిచావు" అంటూ విజయ్ దూరంగా కనపడుతున్న ఫారెస్ట్ ఆఫీస్ వేపు అడుగులు వేసాడు. ఎవరైనా ఆఫీసర్స్ , రేంజ్ సూపర్ వైజర్స్ దొరికితే బావుండు,, వాళ్లకు ఈ ఇబ్బంది విషయం చెప్పి , సహాయం అడగవచ్చు అనుకుంటూ అటవీ శాఖా కార్యాలయం బోర్డు దాటుకుని ఏపుగా పెరిగిన వృక్షాల మధ్య నున్న చిన్న రేకుల ఆఫీస్ లోకి వెళ్ళాడు విజయ్. లోపల అంత ఖాళీగా వుంది. ఎవరూ లేరు. అంత కలయ తిరిగి బయటకు వచ్చి నిలబడ్డాడు. వాచీ లో సమయ చూసుకున్నాడు. బస్సు రావటానికి ఎంతో సేపు పట్టదు అనుకున్నాడు. రాణి సమయానికి ఇంటికి వెళ్లకుంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఏం చెపుతుంది?. ఈ అడవి ఎలా దాటటం , ఎలాగబ్బా అని ఆలోచించ సాగాడు విఅజయ్. దూరం నుంచి ఖాఖీ బట్టలు వేసుకుని ఒక వ్యక్తి రావటం చూసాడు. అతను మధ్యవయస్కుడు. కాస్త గడ్డం పెరిగి , పాత దుస్తులు వేసుకున్నాడు. బహుశా చిరు ఉద్యోగి అనుకున్నాడు విజయ్ . అతను దగ్గరగా వచ్చి " ఎవరు సార్ మీరు, ఎం కావాలి?" అని ప్రశ్నించాడు విజయ ను తేరిపారా చూసి. " ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరూ? , ఆయన్ని కలవాలి" అన్నాడు ధైర్యంగా. " సార్ ఇక్కడ వుండరు , రేంజ్ ఆఫీసర్స్ , బీట్ కానిస్టేబుల్లు వుంటారు.." సమాధానమిచ్చాడు ఖాకి దుస్తుల వ్యక్తి . " పర్వాలేదు ... రేంజ్ ఆఫీసర్ ఎక్కడ? " అడిగాడు విజయ్ " వాళ్లంతా టౌన్ కు వెళ్ళిపోతారు సార్ , రాత్రికి ఇక్కడ ఎవరూ వుండరు....మీ పని చెప్పండి ..దేని గురించి వచ్చారు.?" ఇక తప్పేట్టు లేదని మొదలు పెట్టాడు విజయ్" చిన్న సమస్య వచ్చింది బాబు.. అన్నట్టు నీ పేరేంటి ?" "నా పేరు అంజయ్య ... నేనిక్కడ వాచ్ మ్యాన్ ని ..... చెప్పండి సార్" అన్నాడు " ఆఁ ...అంజయ్య మేము ...హన్మకొండ నుండి వచ్చాము .. ముగ్గురు స్నేహితు లము... అయితే ,చిన్న పొరబాటు జరిగింది . తిరిగి వెళ్ళటానికి బస్సు టికెట్స్ కు సరిపడా డబ్బులు లేవు.. మీ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే కలిసి వాళ్ళ దగ్గర కాస్త తీసుకుని వెళ్లి తర్వాత మనీ ఆర్డర్ చేద్దామని " అని చెప్పి ఆగి అంజయ్య వేపు చూసాడు. అది విని చిన్న చిరు నవ్వు నవ్వి " వాళ్లంతా పెద్ద వాళ్ళు సార్ ,, వాళ్లేమిస్తారు.. వాళ్ళ గురించి మాట్లాడటం దండగ సార్. ఉన్నోడు ..కష్టాలు అర్థం చేసుకోడు. "అన్నాడు,అంజయ్య కాస్త చిరాకు కలిగింది విజయ్ కు . మొదలే బస్సు టైం అవుతోంది పైగా వీడి సుభాషితాలు అనుకున్నాడు. అంతలో మళ్ళీ " ఇంతకీ మీకెంత అవసరం సార్? " అన్నాడు,అంజయ్య ఏదో ఒకటి చెప్పాలి .. ఇన్ని మాట్లాడిన తర్వాత అనుకుని " ఒక వంద కావాలి అంజయ్య " అన్నాడు నిరుత్సాహంగా విజయ్. అంజయ్య మరేమి మాట్లాడ లేదు. ప్యాంట్ జేబులో చేయి పెట్టి ఒక పాత చిరిగిన పర్సు బయటకు తీసి అందులో నుండి పది రూపాయల నోట్లు వేళ్ళతో పట్టుకుని చేయి ముందుకు సాచి " ఇవి తీసుకుని వెళ్ళండి సార్,, పైగా వెంట ఆడవాళ్లు వున్నారు కదా. ఈ బస్సు పోయిందంటే మీకు ఈ అడవిలో ఏమీ దొరకదు. పైగా క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. " ఆశ్చర్యంతో మాట రాలేదు విజయ్ కు. ఇంత బీదవాడు ,పైగా నేనెవరో తెలీదు ..ఎలా ఇస్తున్నాడు అని మనసులో అనుకుని " అరెరే! అంజయ్య !!... చాలా చాలా థాంక్స్ ..నీ అడ్రస్ ఇవ్వు.. రేపు మనీ ఆర్డర్ చేస్తాను " అన్నాడు అంజయ్య రెండు చేతులు పట్టుకుని. " అడ్రస్ ఎందుకు సార్ ,, నేనిక్కడే వుంటాను ..అదిగో అల్లా చూడండి దూరంగా వున్న గుడిసె నాదే...మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇచేద్దురు గాని" అని నవ్వాడు. ఇంకాస్త ఆశ్చర్యంలో మునిగి పోయాడు విజయ్. లోకం లో ఇంకా మంచి వాళ్ళు వున్నారు అనుకున్నాడు. మంచి తనానికి ,,..చదువు..డబ్బు.. హోదా లు ముఖ్యంకాదు . మంచి మనసు కావాలి అనుకుని అంజయ్య భుజాలు రెండూ ఆప్యాయంగా నొక్కి " తప్పకుండా అంజయ్య . నీ మేలు నేనెప్పటికీ మరువను" అన్నాడు విజయ్ కళ్ళలో వస్తున్న నీరును అదుపు చేసుకుంటూ. " సార్ అదుగో ..మీ బస్సు వచ్చేస్తుంది, వెళ్ళండి త్వరగా "అన్నాడు అంజయ్య నిర్మలంగా నవ్వుతూ దూరంగా అడవి దారిలో చెట్ల మధ్య నుండి వస్తున్న ఎర్ర బస్సు ను చూసి. విజయ్ కూడా చూసాడు, దుమ్ము రేపుకుంటూ ,గతుకుల దారి గుండా ,ఎగిరెగిరి పడుతూ వుంది మేము వెల్లబోయేబస్సు " అంజయ్య థాంక్యూ ,కలుస్తాను , మళ్ళీ వస్తాను తొందరలో" అంటూ రాణి, రవి దగ్గరకు పరుగెత్తాడు. "పదండి ...బస్సు అదుగో వచ్చేస్తోంది." అంటున్న విజయ్ ను చూసి " ఒరేయ్ మీరు వెళ్ళండి , నేను తర్వాతవస్తాను." అన్నాడు రవి. " పర్వ లేదు డబ్బులు సర్దుబాటు అయ్యాయి పదండి " అని అడుగులు వేసాడు విజయ్ బస్సు వేపు. బస్సు ఎక్కి కూచుని "ఎక్కడివి డబ్బులు ?" ప్రశ్నించాడు రవి . కిటికీ నుండి అక్కడ నిలుచున్నవాచ్ మ్యాన్ ను చూపించి " అదుగో అతను సహాయం చేసాడు " " పాపం ...చాల పేదవాడిలా వున్నాడు ,అతడి వద్ద తీసుకొన్నావు " జాలి తో అన్నాడు రవి. " తప్ప లేదు " అని వెనక్కి చూసాడు . అప్పటికే బస్సు కదిలింది . అంజయ్యవేపు చెయ్యి ఊపాడు విజయ్ . బస్సు వెనక రేగుతున్న దుమ్ములో కనుమరుగయ్యాడు అంజయ్య, కానీ బస్సు కనపడనంత వరకూ చెయ్యి ఊపుతూనే ఉండటం చూసాడు విజయ్ . రవి, -రాణి ప్రేమ కబుర్లలో మునిగి పోయారు. ముగ్గురికి టికెట్ లు తీసుకుని, వెనక్కి సీటులో వొరిగి కళ్ళు మూసుకున్నాడు విజయ్ . అతనిమనసు నిండా అంజయ్య నిర్మల మైన రూపమే కదులుతూవుంది. ***

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు