రాకరాక చాలారోజులతర్వాత మిత్రుడి ఇంటికి వచ్చాడు చంద్రం . మిత్రుడు వీర్రాజు పక్కకాలనీలోనే ఉంటాడు . అయినా వాళ్లిద్దరూ కలుసుకునేది బహు తక్కువ. వీర్రాజు కారుకొనుక్కున్నాడని తెలిసి చూడ్డానికికని వచ్చ్హాడు చంద్రం . తీరా ఇంటికి వచ్చాక ఎందుకు వచ్చానా .. అనుకున్నాడు మనస్సులో . కారణం వీర్రాజు కూతురు -పిల్లలూ వరంగల్ నుంచి రావడంతో అందరి హడావుడితో ఇల్లు కళకళ లాడుతోంది . కుశల ప్రశ్నలు అయ్యాక ఒక కప్పు కాఫీ తాగి ,’’ వీరూ .. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానురా . నువ్వు పిల్లలతో ఆనందంగా గడుపు ‘’ అన్నాడు చంద్రం కుర్చీలోంచి లేవబోతూ . ‘’ భలేవాడివేలేరోయ్ .. అప్పుడేవెళ్లిపోవడమేనా .. అసలు నీకు ఫోన్ చేసి రమ్మని నేనే అడుగుదామనుకున్నా. నీతో పని వుంది కాస్సేపు వుండు ‘’ అన్నాడు . ‘’ అంత పని ఏమి వచ్చిందిరా ఇంత అర్జన్టుగా ?’’ అన్నాడు చిత్రంగా చూస్తూ చంద్రం . ‘’ నేను కారుకొన్నట్టు చెప్పాను కదా !అది కాస్త ఇబ్బంది పెడుతోంది . నువ్వు నాకు కాస్త జఠరావాలి తోసుకెళ్లడానికి ‘’ అన్నాడు . వీర్రాజు వంక ఇబ్బందిగా చూసాడు చంద్రం . అప్పుడే అక్కడికి వచ్చిన వీర్రాజు అల్లుడు సురేష్ కలగజేసుకుని ‘’ నేనుకూడా రానా మామయ్యా ?మీ ఇద్దరికీ కష్టం అవుతుందేమో !’’ అన్నాడు ‘’ ఆబ్బె ,, నువ్వెందుకు అల్లుడూ .. మన చంద్రం అంకుల్ ఉన్నాడుగా ఇద్దరం మేనేజ్ చేసేస్తాం . ఇంట్లో విశ్రాంతి తీసుకో ‘’ అని అల్లుడికి ఒక ఉచిత సలహా పారేసాడు . చంద్రం గుండెల్లో రాయిపడింది ,యెంత దూరం కారు నేటిస్తాడోనని . ఇద్దరూ సర్దుకుని కారును మెల్లగా తోయడం మొదలు పెట్టారు . కారుకద లడం మొదలయింది . వీర్రాజు మెల్లగా ‘’ తస్సాదియ్యా .. తస్సాదియ్యా .. తమాషైన బండి .. ‘’ అన్నపాట అందుకున్నాడు . చంద్రం కూడా పాటలో తన స్వరం కలిపాడు . అల్లుడు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు . మిత్రులిద్దరూ కారును తోసుకుంటూ మెల్లగా సందు మలుపు తిరిగారు . చంద్రం ఏదో అడిగేలోగా వీర్రాజు ‘’ ఇక్కడ ఆపేద్దాం .. ‘’ అని కారు ఆపి డోర్ తీసి డ్రైవర్ సీట్లో కూర్చుని చంద్రాన్ని లోపలికి ఆహ్వానించాడు వీర్రాజు మళ్ళీ ఏమిచేయబోతున్నాడో నని మనసులో అనుకుంటూనే కారు ఎక్కి డోర్ వేసాడు . వీర్రాజు కారు స్టార్ట్ చేసాడు . చక్కగా స్టార్ట్ అయిందది . ఇదేమిటి ?అన్నట్టు చూసాడు చంద్రం . ‘’ ఒరేయ్ .. ఎన్నాళ్ళనుంచో నా లో వున్నకోర్కె ఈ కారుకొని తీర్చుకుందామనుకున్నానా .. ఇలా కొన్నానో లేదో .. కూతురికి -అల్లుడికీ ఉప్పు అందించేసింది మీ చెల్లాయ్ ! అంతే నెలరోజుల్లో ఇద్దరూ వాలిపోయారు ఇక్కడికి . కారు అడగడానికి అమ్మాయి విశ్వప్రయత్నం చేస్తున్నది ,అల్లుడు ఎప్పుడెప్పుడా అని లొట్టలు వేస్తున్నాడు . అందుకే ప్రస్తుతానికి ఈ రిపేర్ నాటకం ఆడుతున్న రెండురోజులనుంచి కారుతీయడం లేదు , మీ చెల్లాయ్ కి కూడా పాడయిందని చెప్పాలే ‘’ అన్నాడు . నవ్వుతూ . ‘’ ఆ .. ఓర్నీ .. !!’’ అన్నాడు చంద్రంకూడా నవ్వుతూ . కాస్సేపు అటుఇటు తిరిగి ,మరో స్నేహితుడి ఇంట్లో కారుపెట్టి ,ఇద్దరు ఆటోలో ఇంటికి తిరిగివచ్చి హాల్లో కూర్చున్నారు . వీళ్ళు ఆటుపోగానే వీర్రాజు అల్లుడు ,వీళ్ళ వ్యవహారం పసిగట్టిన విషయం మిత్రులిద్దరికీ తెలీదు . అల్లుడు తనలో తాను నవ్వుకోవడం చూసిన వీర్రాజుకు విషయం అర్ధం కాలేదు . చంద్రం మనస్సులో తెగనవ్వుకున్నాడు. * **