బ్రహ్మముడి - వి యస్ శాస్త్రి ఆకెళ్ళ

Brahma mudi

"సూరిబాబు ఉన్నాడా? " వెంకటేశంగారు కచేరీ నుండి వస్తూనే, సుందరమ్మని అడిగిన ప్రశ్న. "ఆఁ వాడూ ఇప్పుడే వచ్చేడు" కట్టెల పొయ్య మీద వంటచేస్తూ, తల తిప్పి చూడకుండానే సుందరమ్మ సమాధానం. "మన లక్ష్మికి సంబంధం వచ్చింది. వాళ్లు మా అన్నకుతురి పెళ్లిలో లక్ష్మిని చూసేరుట. కట్న కానుకలు వద్దన్నారు. సందడిలో సందడిగా మన పెద్దోడికి కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుందిగా. ఇవ్వటం - తెచ్చుకోవటం." అంటూ లాల్చీ విప్పుకుని చిలక్కొయ్యకి తగిలించేరు వెంకటేశంగారు. "వాడికా? అప్పుడేనా? వీడు చేసే కోమటిగిరీకి పిల్లనెవరిస్తారు?" తరిగిన కూరని బాణాలిలో వేస్తూ అంది సుందరమ్మ. "ఎల్లకాలం ఇలానే వుంటాడా ఏంటి చెప్పు? వచ్చే అమ్మాయి మంచిదైతే ఎదుగుదల రాదా? నీకూ ఆరోగ్యం బాగుండటం లేదు. కాస్త చేదోడు వాదోడుగా వుంటుంది కదా." పంచె లోంచి లుంగీ లోకి మారుతూ వెంకటేశంగారు ఆమెని ఒప్పించే పనిలోపడ్డారు. "దివాణంలో పని వత్తిడి కూడా ఎక్కువగా వుందిగా? రాజావార్ని కాస్త జీతం పెంచమని అడగొచ్చుగా?" సుందరమ్మ లో గొంతులో అడుగుతూ, ప్రక్కనున్న పీట చెక్క చూపుతూ వెంకటేశంగారిని కూర్చోమని సంజ్ఞ చేసిందామె. "దివానుగారికి చెప్పేను, చూస్తామన్నారు. రాజా వారి కంటే, దివానుగారు సౌమ్యుడు. ఆయనకు పిల్లా పాపలు, సంసార ఝంఝాటాలు ఉన్నాయిగా. ఈ వారంలో చెబుతాడేమో?" అంటూ సుందరమ్మ అందించిన కాఫీ తాగుతూ అన్నారు వెంకటేశంగారు. "పెళ్లీ పేరంటం అంటే రాజావారు ఆమాత్రం ఆదుకోరా" వంట ముగిసిందన్న దానికి గుర్తుగా పొయ్యిలో కట్టెలని బయటికి లాగి నీళ్లు చల్లుతూ, స్వగతంలో అనుకున్నట్లు అంది సుందరమ్మ. "సూరిబాబు రాగానే ఈ రెండు విషయాలూ చెప్పి, ఏమన్నాడో మళ్లీ నాకు చెప్పు." అని వెంకటేశంగారు సంధ్యా దీపం వెలిగించేందుకు స్నానానికి బయలుదేరేరు. * * * సుందరమ్మ - వెంకటేశంగార్లకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆవూరి రాజుగారి కచేరిలో దివానుకి సహాయకుడిగా వెంకటేశానికి సేవకా వృత్తి. అంతంత మాత్రం సంపాదన. పెద్దవాడు సూరిబాబు ఎస్సెల్సి పాసయి, పైచదువుల పరిస్తితి లేనందున - తండ్రికి వేడి నీళ్లకి చన్నీళ్లులా షావుకారు దగ్గర గుమస్తాగిరీ చేస్తున్నాడు. మిగతా పిల్లల హైస్కూలు చదువుల కర్చులు సూరిబాబే ఇస్తాడు. వెంకటేశంగారంటే పిల్లలకి భయంతో పాటు, భక్తి కూడా. ఏ విషయమైనా తల్లి సమాచార కేంద్రం. ఆవిడ ద్వారానే విషయసేకరణ జరుగుతుంది. పనులు చెప్పాలన్నా సుందరమ్మ ఆజమాయిషీతోనే జరుగుతాయి. పిల్లలకి తల్లితో అనుబంధం ఎక్కువ వుండటం వల్ల, వాదనలు-ఎదురు చెప్పడాలూ లేవు. రాత్రి భోజనాలు దగ్గర "మన సుబ్బికి సంబంధం వచ్చిందిరా సూరి - నాన్నగారు నీతో చెప్పమన్నారు. నువ్వే బిలాస్ పూరు వెళ్లి, వాళ్లని పెళ్లి చూపులకి పిలవాలి." నెమ్మదిగా లో స్వరంలో చెప్పింది సుందరమ్మ. "అన్నకి శలవు దొరక్కపోతే, నేనెళ్తానమ్మా" చిన్నవాడు రామక్రిష్ణ అన్నాడు. "ఇలాంటి విషయాలకి అన్నే వెళ్లాలి. నువ్వు వెళ్తే బాగుండదు. అయినా వాడితో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోకి రాకు చిన్నా" సున్నితంగా రామక్రిష్ణని వారించింది సుందరమ్మ. "బిలాస్ పూరు వెళ్లి, వాళ్లని చూపులకి రమ్మని చెప్పు. ఆరాత్రే ఏదో ఒక రైలు పట్టుకుని కలకత్తా వెళ్లు. నాన్నగారి పిన్ని కూతురుంది. వాళ్లింటిలో దిగి, ఓ సారి పలకరించి - అక్కడే నాన్నగారి స్నేహితుడున్నాడు. వాళ్లింటికి వెళ్లి ఆయన్ని పలకరించు. గంట-గంటన్నర కంటే ఎక్కువ వాళ్లింట్లో ఉండొద్దు. వాళ్లకి అమ్మాయుంది, చూడు. నీకు నచ్చితే మాట్లాడదాం. అక్కడ మీ షావుకారు పన్లేమయినా వుంటే చూసుకుని వచ్చేయి. బిలాస్ పూరు, కలకత్తా వారితోనీ కాస్త జాగ్రత్తా మాట్లాడు. సంబంధాలు కలుపుకోవాలి కదా! " సుందరమ్మ నిదానంగా మాట్లాడి, సూరిబాబుని కార్యోన్ముఖుడిని చేసింది. "అలాగేనమ్మా, నాన్నగారు ఎలా చెబితే అలానే" భోజనం ముగించి సూరిబాబు బయటికెళ్లిపోయేడు. "అన్నయ్య అన్నిపన్లు ఒక్కడే చేయగలడా? నేనూ సహాయంగా వెళ్తానమ్మా. నాకూ పరీక్షలయ్యి ఖాళీగా వున్నాను కదా. నాన్నగారితో చెప్పు, పని విజయవంతంగా చేసుకొస్తాం." సుందరమ్మని కాకా పట్టటం మొదలెట్టేడు రామక్రిష్ణ. "నాన్నగారు ఏదంటే అదే. ఆయనతో చెబుతాను, సరేనంటే సరే - లేకపోతే లేదు. తరువాత పేచీ పెడితే ఊరుకోను" అంది సుందరమ్మ. మర్నాడు ఉదయం రెండు ఉత్తరాలు, చెల్లికి రాసిన పరిచయ పత్రంకూడా సూరిబాబు చేతిలో పెట్టి "నువ్వు, తమ్ముడూ జాగ్రత్తగా వెళ్లి పనులు పూర్తి చేసుకుని రండి. బిలాస్ పూరు వాళ్లకి - వచ్చేముందు ఎప్పుడొచ్చేదీ ఉత్తరం వ్రాయమను. వాళ్లేమన్నదీ నాకు నువ్వు కూడా కార్డు వ్రాయి. తమ్ముడిని జాగ్రత్త. కర్చులకి అమ్మకి డబ్బులిచ్చేను." అంటూ వెంకటేశంగారు కచేరీకి బయలుదేరేరు. వెంకటేశంగారు మాట్లాడుతున్నప్పుడు వినే వారు ఊఁ కొట్టటమే. సందేహం కానీ, సంధిగ్దత కానీ వుండకుండా సవివరంగా చెబుతారు. బహుశా రాజుగారి దివాణం అనుభవమేమో. షావుకారు శలవు విషయం తెలుసుకుని, తన పన్లు కూడా సూరిబాబుకి పురమాయించేడు. మొత్తం కర్చు తనే భరిస్తానంటూ. మర్నాడే సూరిబాబూ, రామక్రిష్ణలు బిలాస్ పూరుకి రైలెక్కేరు. పెళ్లికొడుకే స్వయంగా వచ్చి, దింపుకున్నాడు. వెంకటేశంగారు రాసిన ఉత్తరం కూడా అందిందని చెప్పేడు. అబ్బాయి రైల్వే ఉద్యోగి. రైల్వే వాళ్లిచ్చిన ఇల్లు. పొందికగా అమర్చుకున్న సామాన్లు. సూరిబాబు, రామక్రిష్ణలకి వారి ఇల్లు, వాతావరణం, నచ్చింది. ముఖ్యంగా అబ్బాయి తల్లీ తండ్రి ఎంతో చనువుగా ఆప్యాయంగా మాట్లాడటం. అబ్బాయి తమ్ముడూ, చెల్లి కలివిడిగా వుండటం. విషయ వివరణలు అయ్యి వాళ్లిచ్చిన కాఫీ తాగి, ఉండమని బలవంతం చేసినా పన్లున్నాయని చెప్పి బయలుదేరేరు, సూరిబాబు-రామక్రిష్ణలు. "అన్నా! ఈ సంబంధం బాగుంది. మంచి వాళ్లలా వున్నారు. భగవంతుడి దయవలన కుదిరితే మన లచ్చి సుఖపడుతుంది." కలకత్తా వెళ్లే రైలు ఎక్కుతూ రామక్రిష్ణ అన్నాడు. * * * రైలు కలకత్తా చేరగానే, ఓ నడివయసు ఆయన సూరిబాబునీ, రామక్రిష్ణనీ ఎగాదిగా చూస్తూ "మీరు వెంకటేశం బావ కొడుకులు కదా! మా సుందరక్క ఎలా వుంది? మా పెద్దన్నయ్యకి శలవు దొరకలేదు. లేకుంటే మిమ్మల్ని దింపుకుందికి వచ్చేవాడు." అంటూ ప్రశ్నల వర్షం కురిపించి "అన్నట్లు చెప్పటం మరిచాను, నా పేరు శంకరం. రైల్వేలో టైపిస్టు ఉద్యోగం, వారం శలవు మీద వచ్చేను." కలకత్తా వాళ్ల ఇల్లు కూడా సూరిబాబు, రామక్రిష్ణలకీ నచ్చేసింది. శంకరం వాళ్లూ ముగ్గురు అన్నదమ్ములూ నలుగురు అక్కచెల్లెళ్లూ. అక్క చెల్లేళ్లకి పెళ్లిళ్లయి కాపురాలు చేసుకుంటున్నారు, దూర దూరంగా పట్టణాలలో. అన్నదమ్ములుది మాత్రం ఉమ్మడి కుటుంబం. శంకరం ఆఖరి వాడు. పెద్దాయన నరసింహం, రెండో ఆయన గణేశం. పెద్దాయన్ని చూడగానే రామక్రిష్ణ చిన్నగా "పెద్ద మామయ్య అచ్చు కొట్టినట్టు - అమ్మలానే వున్నాడురా అన్నా" అన్నాడు సూరిబాబుతో. పెద్దాయనకి ముగ్గురు కొడుకులూ, ముగ్గురు కూతుర్లు. రెండో ఆయనకి ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ. మూడో ఆయనకి ఇద్దరు కొడుకులే. పెద్ద పిల్లడి వయసు సూరిబాబు వయసే అయినా, ఆఖరి పిల్లడి వయసు రెండేళ్లుంటాయి. ఆ ఇల్లు ఓ చిన్న బడిలా వుంది. విచిత్రం ఏంటంటే పిల్లలు దెబ్బలాడుకోవటం, ఎడుపులూ, మొరలూ లేవు. ఇద్దరేసి ఇద్దరేసి పిల్లలు జట్టు జట్లుగా ఆడుకుంటున్నారు. "ఇవ్వాళ రేపూ మంచిది కాదు. అదీకాక మీ నాన్నగారి మిత్రుడు కూడా ఊర్లో లేడు. రాగానే వాళ్లింటికి తీసుకెళతా. ఇది మీ స్వంత ఇల్లనుకోండి. మొహమాటం వద్దు" అంటూ నరసింహం ఆఫీసుకెళ్లిపోయేడు. నరసింహం పెద్దకొడుకు రామం, రెండో కొడుకు జానకీ బయటికెళ్తూ, సూరిబాబుని కలకత్తా చూపిస్తాం అంటూ తీసుకెళ్లిపోయేరు. పిల్లలు స్కూళ్లకి వెళ్లిపోయేరు. రెండో ఆయన గణేశం, వీళ్లు రాకుండానే ఆఫీసుకెళ్లిపోయేడు. మిగిలింది శంకరం, రామక్రిష్ణ. "నువ్వు నాకు మేనల్లుడివి. పద డాబామీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుందాం" అంటూ రామక్రిష్ణని డాబా మీదకి తీసుకుపోయేడు శంకరం. రామక్రిష్ణ ఏదో చెబుదామని "మామగారూ" అని మొదలెట్టగానే, శంకరం మాటని తుంచేస్తూ "ఇదిగో ఇలా గారు తగిలించి నన్ను దూరం చేయకు. నేను నిన్ను అల్లుడూ అంటా, నువ్వు నన్ను మామా అని పిలువు చాలు" అంటూ డాబా పిట్టగోడ మీద కూర్చుని, రామక్రిష్ణకి కూర్చోమన్నట్టు సంజ్ఞ చేసేడు. "ఏమైనా మా సుందరక్క అదృష్టవంతురాలు. చాలా మంచిది కూడా. మీ నాన్నగారి పెద్దనాన్న కూతురి పెళ్లిలో, మీ నాన్నగారిని చూసి నచ్చేసుకుంది. "నేను బాగున్నానా" అని అడిగింది. మీ నాన్నగారు "మా పెద్దనాన్నని - పెద్దమ్మని అడిగి చెబుతానన్నారు" అంతే పెళ్లి అయిపోయి మేమంతా వెనక్కి వచ్చేసినా, అది రాలేదు. మీ నాన్నగారి పెద్దనాన్న వాళ్లింట్లో ఉండిపోయింది. పాపం వాళ్లే పెళ్లి చేసేరు. అందరం బాగున్నాం. అంతకు మించి ఏం కావాలి చెప్పు" అంటూ రామక్రిష్ణ ముందు గతాన్ని తవ్వి శంకరం పోశాడు. కొన్ని కొన్ని జీవిత యదార్ధ సంఘటనలని బయటి వారు మెచ్చుకోలుగా పిల్లల ముందు చెబితే, దాని ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా వుంటుంది. రామక్రిష్ణ విషయంలో అదే జరిగింది. తండ్రి మీద, ఆయన కట్టడి మీదా రామక్రిష్ణకి గౌరవం రెట్టింపయింది. అమ్మా-నాన్నగార్ల గురించి ఎంత గొప్పగా చెబుతున్నారని. రెండు రోజులు ఎలా సందడిగా గడిచేయో ఆశ్చర్యం. "షావుకారు వెంటనే రమ్మని కబురు చేసేడు. మళ్లీ వస్తాం." అంటూ సూరిబాబూ, రామక్రిష్ణ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని బయలు దేరేరు. షావుకారు పన్లు ఆ రెండు రోజుల్లోనే సూరిబాబు చక్కబెట్టేశాడు. రైల్వే స్టేషను దగ్గర రిక్షా ఆగుతుంటే "అదేంటిరా ఇక్కడ ఆపించేవు. నాన్నగారి స్నేహితుడుని కలవకుండా వెళితే నాన్నగారు ఏమంటారో" సూరిబాబు సందేహంగా రామక్రిష్ణని అడిగేడు. "అన్నా, నరసింహం మావయ్య రెండో కూతురు వుంది కదా. బాగుందా? అంటే నచ్చిందా?" రామక్రిష్ణ సూరిబాబు కళ్లల్లోకి చూస్తూ అడిగేడు. "బాగుందనుకో, కానీ .... " అంటూ సూరిబాబు సందిగ్ధంగా జవాబిచ్చేడు. "ఈ అమ్మాయి నచ్చితే అమ్మా నాన్నగార్లకి చెప్పేద్దాం. నిన్న శంకరం మావయ్య చెప్పేడు. పెద్దమ్మాయికి మేనరికం వుంది, రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని. కుదిరితే ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తారుట. లచ్చి సంబంధం విషయం తేలే లోగానే, నాన్నగారితో నరసింహం మావయ్యకి ఉత్తరం రాయిద్దాం." అన్నాడు రామక్రిష్ణ. సూరిబాబు తమ్ముడి ఆలోచనకి ఆశ్చర్యపోయేడు, వీడికిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా? అని. అదే విషయాన్ని రామక్రిష్ణతో అంటే "ఆడపిల్లలని ఎంపిక చేయటం నాకు నచ్చదురా అన్నా, ఆడపిల్ల అంగడిలో సరుకు కాదు కదా. ఈ అమ్మాయి నీకూ ఇష్టపడిందని - నాన్నగారి స్నేహితుడి ఇంటికి వద్దన్నాను. ఆయనని ఇబ్బంది పెట్టటమెందుకు." అని రామక్రిష్ణ రైలెక్కేడు సూరిబాబుతో పాటు. సుందరమ్మ - వెంకటేశం గారూ ఇద్దరు కొడుకులనీ మెచ్చుకున్నారు "ఒక దగ్గరకి పంపితే మరో దగ్గర జతపడటం నిజంగా 'బ్రహ్మ ముడే' అని అనుకుంటూ."

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు